Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

పెళుసుబారుతున్న రష్యా పునాదులు!

పడిపోతున్న చమురు ధరలు రష్యాను ఆర్థిక మాంద్యంలోకి నెట్టగా, ఉక్రెయిన్‌ సమస్యపై అంతర్జాతీయ సమాజం విధించిన ఆంక్షలు ఈ మాజీ అగ్రరాజ్యాన్ని రాజకీయంగా ఏకాకిని చేస్తున్నాయి. రష్యా బడ్జెట్‌ నిధుల్లో 50శాతం చమురు, సహజవాయు ఎగుమతుల ద్వారానే లభిస్తున్నాయి. 2015లో పీపా చమురు ధర 100డాలర్లు ఉంటే తన జమాఖర్చులను నిభాయించుకోగలనని రష్యా ఆశిస్తున్న తరుణంలో, చమురు ధర ఉన్నపళాన 60 డాలర్లకన్నా దిగువకు పడిపోయింది. మరోవైపు గడచిన ఆరు నెలల్లో డాలర్‌తో రష్యన్‌ రూబుల్‌ మారక విలువ సగానికి పడిపోవడంతో, రూబుల్‌ కుప్పకూలిపోకుండా ఆపడానికి రష్యన్‌ కేంద్ర బ్యాంకు వడ్డీరేట్లను విపరీతంగా పెంచింది. ఫలితంగా రష్యన్‌ కంపెనీలకు రుణభారం కొండలా పెరిగింది. 1998లో మాదిరిగా రష్యా మళ్లీ అప్పులు ఎగవేస్తుందనే భయాలు ముప్పిరిగొంటున్నాయి. అప్పుల ఎగవేత వల్ల రష్యాలో 1999లో ద్రవ్యోల్బణం 85 శాతానికి పెరిగింది. ఆహార ధరలు చుక్కలను తాకడంతో ప్రజలు వీధులకెక్కి నిరసన ప్రదర్శనలు చేశారు. అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్వయంకృతాలే నేడు రష్యాను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయని పాశ్చాత్య పండితులు భాష్యం చెబుతున్నారు. ఉక్రెయిన్‌, క్రిమియా, అంతకుముందు జార్జియా, మోల్దోవాలలో పుతిన్‌ దుస్సాహసాలు పరిస్థితిని ఇంతవరకు తెచ్చాయంటున్నారు. ఉక్రెయిన్‌, జార్జియా, మోల్దోవాలు పాశ్చాత్య ప్రజాస్వామ్య నమూనాను పాటిస్తుండగా- నిరంకుశాధికారానికి కట్టుబడిన రష్యాకు అది నచ్చడం లేదని ప్రచారం చేస్తున్నారు. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)కు పోటీగా పుతిన్‌ నిర్మించాలనుకున్న యూరేసియన్‌ ఎకనామిక్‌ యూనియన్‌ (ఈఈయూ)కు, ఉక్రెయిన్‌ పక్కచూపుల వల్ల పురిట్లోనే సంధి కొట్టేట్లుంది!

జన బలం కొరవడి...

నేడు రష్యా పరిస్థితి చూస్తుంటే బలీయ రాజ్యాలన్నీ ఏదో ఒకనాటికి ముట్టడిలో చిక్కుకోక తప్పదనిపిస్తోంది. 'రష్యా ఇక ఎంతమాత్రం అగ్రరాజ్యం కాదు, అది ఒక ప్రాంతీయ శక్తి' అని ప్రవచించిన అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా- తన మాట నిజం చేయడానికి బాహాటంగా, చాటుగా చేయాల్సిందంతా చేస్తున్నారు. రష్యా ప్రాధాన్యం కుదించాలని ప్రచ్ఛన్న యుద్ధకాలం నుంచే అమెరికా ప్రయత్నిస్తోంది. అమెరికా వ్యూహ సాఫల్యానికి ఉక్రెయినే కీలకం. 1990లలో అప్పటి అమెరికా జాతీయ సలహాదారు జిబిగ్నూ బ్రెజిజిన్‌ స్కీ' ఉక్రెయిన్‌ లేనిదే రష్యా ఒక సామ్రాజ్యంగా చలామణి కాలేదు' అని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌, బెలారస్‌ లు లేకపోతే రష్యా అగ్రరాజ్యంగా నిలవలేదు. ఐరోపా తూర్పు శివారులో 'ఒక మధ్యతరహా శక్తి' హోదాతో సరిపెట్టుకోవలసి వస్తుంది. జార్‌ చక్రవర్తి హయాముతో పాటు సోవియట్‌ యూనియన్‌ కాలంలో కూడా రష్యన్‌ భూభాగం కోటీ డెబ్భై లక్షల చదరపు కిలోమీటర్లమేర విస్తరించింది. అంత విస్తీర్ణంలో నివసిస్తున్న రష్యన్‌ జనాభా కేవలం 14కోట్ల 60లక్షలు. అదే భారతదేశం విషయానికి వస్తే 32 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 127కోట్లమంది నివసిస్తున్నారు. భూమండలంపై ఎనిమిదో వంతు ఆక్రమించిన రష్యన్‌ భూభాగాన్ని కేవలం 14 కోట్ల జనాభాతో నియంత్రించడం సాధ్యం కాదు. దీనికోసం సాటి స్లావ్‌ జాతివారు నివసించే ఉక్రెయిన్‌, బెలారస్‌లను కలుపుకొని వెళ్లడం రష్యాకు ఎంతో అవసరం. రష్యా భూభాగంలో 77 శాతాన్ని ఆక్రమించే సైబీరియాలో కేవలం నాలుగు కోట్లమంది నివసిస్తున్నారు. వీరిలో రష్యన్‌ (స్లావ్‌) జాతివారి సంఖ్య 60లక్షలు మాత్రమే. సోవియట్‌ యూనియన్‌ పతనం తరవాత సైబీరియా నుంచి యువ రష్యన్లు మెరుగైన అవకాశాల కోసం మాస్కోకు తరలడంతో, అక్కడి స్లావ్‌ జాతి జనాభా నానాటికీ తరిగిపోతోంది. మరోవైపు సైబీరియా పొరుగునే ఉన్న చైనా అధిక జనాభాతో సతమతమవుతూ, సైబీరియాతో ఆర్థికంగా దృఢమైన ఆర్థిక బంధాన్ని ఏర్పరచుకొంది. మున్ముందు రాజకీయంగా కూడా అక్కడ పాగా వేస్తుందేమోనని రష్యా ఆందోళన చెందుతోంది. సైబీరియాలో స్లావ్‌ జాతి జనాభాను పెంచి చైనా ప్రాబల్యాన్ని అరికడదామన్నా, దానికి కావాల్సినంత జనబలం రష్యాకు లేదు.

ప్రస్తుతం 14కోట్లకు పైగా ఉన్న రష్యా జనాభా 2025 సంవత్సరానికల్లా 13కోట్ల లోపునకు పడిపోతుందని నిపుణుల అంచనా. రష్యాలో కమ్యూనిస్టు పాలన చివరి 16 సంవత్సరాల్లో, మరణాలకన్నా కోటీ పధ్నాలుగు లక్షల ఎక్కువ జననాలు సంభవించాయి. సోవియట్‌ యూనియన్‌ పతనం అనంతరం తొలి పదహారు సంవత్సరాల్లో మొత్తం జననాలకన్నా కోటీ ఇరవై నాలుగు లక్షల ఎక్కువ మరణాలు సంభవించాయి. ఈ లెక్కన '2020 సంవత్సరం కల్లా మా పాఠశాలల్లో పిల్లలే ఉండరు. వచ్చే దశాబ్దంలోనే మా ఫ్యాక్టరీలకు కార్మికుల కొరత, సైన్యానికి సైనికుల కొరత ఏర్పడుతుంది. 2050 కల్లా మేం ఒక దేశంగా చెప్పుకోవడానికి కావాల్సిన సంఖ్యలో జనం ఉండరు' అని మాస్కోకు చెందిన కుటుంబ వ్యవహారాల నిపుణురాలు స్వెత్లానా బోషెరోవా వాపోయారు. 2050లో రష్యా జనాభా 10కోట్ల 90లక్షలే ఉంటుందని పలు గణాంక నమూనాలు హెచ్చరిస్తున్నాయి. అందుకే నాలుగు కోట్ల డెబ్భై లక్షల పైచిలుకు జనాభా గల ఉక్రెయిన్‌, 94 లక్షల జనాభా గల బెలారస్‌లను వదులుకోవడానికి రష్యా ఏ మాత్రం ఇష్టపడటం లేదు. పశ్చిమం నుంచి తూర్పునకు విస్తరించిన పూర్వ సోవియట్‌ రిపబ్లిక్‌లను యూరేసి యన్‌ ఎకనామిక్‌ యూనియన్‌ (ఈఈయూ) ఛత్రం కింద రష్యా ఏకం చేయాలని తహతహలాడుతోందంటే కారణమిదే! కానీ- అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ లు పశ్చిమ దిక్కున ఉక్రెయిన్‌తో సహా ఒకప్పటి సోవియట్‌ ఉపగ్రహాలైన పోలెండ్‌, హంగరీ తదితర దేశాలను తమ కక్ష్యలోకి తీసుకొంటున్నాయి. తూర్పున మధ్య ఆసియా రిపబ్లిక్‌లను ఆర్థిక బంధంతో చైనా కొంగున కట్టేసుకొంటోంది. వెరసి రష్యా అడకత్తెరలో చిక్కుకుపోయింది!

మొదటినుంచీ రష్యా బలం నాలుగు మూలస్తంభాలపై ఆధారపడి ఉంది. అవి: జనాభా, ఇంధనం, ఆయుధాలు, భౌగోళిక విస్తృతి. వీటిలో జనాభా, ఇంధనం, ఆయుధ శక్తి నానాటికీ తరిగిపోతున్నాయి. జన బలం ఎంతగా హరించుకుపోయిందో చూశాం. అమెరికా, సౌదీ అరేబియా ఇంధన విధానాల వల్ల చమురు ధర విపరీతంగా పడిపోయి, రష్యా ఆర్థిక మాంద్యంలోకి జారిపోయింది. 2012లో రష్యా ఎగుమతుల్లో 70 శాతాన్ని చమురు, సహజవాయువులే ఆక్రమించాయి. జపాన్‌ సైతం ఆర్థిక మాంద్యంలో చిక్కుకోవడం, చైనా అభివృద్ధి రేటు మందగించడం వల్ల చమురు ధర ఇంకా తగ్గిపోవచ్చుననే భయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే రష్యా మరింత గడ్డు స్థితిలో పడుతుంది. దీన్ని నివారించడానికి తన చమురు ఎగుమతులను డాలర్‌ కాక ఇతర కరెన్సీల్లో నిర్వహించాలని రష్యా యోచిస్తోంది. దీనికోసం చైనాతో రూబుల్‌, యువాన్‌ మారక సౌకర్యాన్ని ఏర్పరచుకొంది. ఇప్పటికే కొన్ని రష్యన్‌ కంపెనీలు తమ నగదును హాంకాంగ్‌ డాలర్లలో డిపాజిట్‌ చేస్తున్నాయి. ఏదిఏమైనా చమురు ఎగుమతులు తగ్గి, రూబుల్‌ విలువ పడిపోవడంవల్ల ఏర్పడిన సంక్షోభాన్ని రష్యా ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సి ఉంది.

రష్యా శక్తికి మూడో మూలస్తంభమైన ఆయుధ బలమూ సన్నగిల్లుతోంది. అమెరికన్‌, పాశ్చాత్య ఆయుధాలతో పోలిస్తే రష్యన్‌ ఆయుధాల నాణ్యత తక్కువ. రష్యా నుంచి విడిభాగాలు సకాలంలో అందకపోవడం వల్లనే ఇండియా ఆధునిక ఆయుధాల కోసం ఇజ్రాయెల్‌, అమెరికాల వైపు చూస్తోంది. అయినా పుతిన్‌ ఇటీవలి భారత పర్యటన వల్ల రెండు దేశాల మధ్య రక్షణ సహకారం వూపందుకోనుంది. చైనాకు సైతం రష్యన్‌ ఆయుధాలు పెద్దయెత్తున అందుతున్నా, భారత్‌తో కలసి అత్యాధునిక ఆయుధాల ఉత్పత్తికే రష్యా మొగ్గు చూపవచ్చు.

దూకుడు తగ్గితేనే...

చివరకు రష్యా అమ్ముల పొదిలో మిగిలిన బ్రహ్మాస్త్రం- రియల్‌ ఎస్టేట్‌ ఒక్కటే. రష్యన్‌ సైబీరియాకు పొరుగునే ఉన్న చైనా, జపాన్‌, దక్షిణ కొరియాలు బలీయ ఆర్థిక శక్తులు. వాటితో వాణిజ్యాభివృద్ధి రష్యాను ఆర్థికంగా పై అంచెకు తీసుకెళ్లగలదు. మరోవైపు భూతాపం వల్ల రష్యా సమీపంలోని ఆర్కిటిక్‌ ప్రాంతంలో మంచు కరిగి అక్కడి చమురు, ఖనిజ నిక్షేపాలు తేలిగ్గా అందుబాటులోకి రానున్నాయి. ఈ సువిశాల భూభాగం నుంచి విస్తృత ఆర్థిక ప్రయోజనాలు సాధించడానికి కావాల్సిన జనబలం రష్యాకు లేదు. ఈ లోటును ఉక్రెయిన్‌ జనంతో భర్తీ చేసుకోవాలని వెంపర్లాడటం వల్ల, రష్యాకు ఒరుగుతున్న లాభం కన్నా నష్టమే ఎక్కువ. రష్యాలో జనన రేటును పెంచడంతో పాటు సైబీరియా వంటి నిర్జన ప్రాంతాలకు భారత్‌ వంటి ఆసియా దేశాల నుంచి వలసలను ప్రోత్సహించడం సమస్యకు ఒక పరిష్కారం కాగలదు. ప్రపంచీకరణ యుగంలో పెట్టుబడులు ఒక దేశం నుంచి మరో దేశానికి సులువుగా ప్రవహిస్తున్నాయి. కార్మిక శక్తి కూడా అంతే సులువుగా ప్రవహించడం అవసరం. రష్యాకు సమస్యలు పెరుగుతున్న కొద్దీ పుతిన్‌ మరింత జోరుగా జాతీయవాద తురుపుముక్కను ప్రయోగించవచ్చు. దీనివల్ల కొత్త ప్రచ్ఛన్న యుద్ధం మొదలవుతుందన్న భయాలున్నా, దాన్ని నిర్వహించడానికి కావాల్సిన సత్తా రష్యాకు లేదు. రష్యన్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రెండు లక్షల కోట్ల డాలర్లు కాగా- అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ల ఉమ్మడి జీడీపీ 35లక్షల కోట్ల డాలర్ల పైమాటే. అమెరికా నాయకత్వంలో ఏకధ్రువ ప్రపంచం ఏర్పడరాదనీ బహుళ ధ్రువ ప్రపంచమే మేలని రష్యా, చైనాలు రెండూ భావిస్తున్నప్పటికీ- రెండు దేశాల మధ్య అంతర్లీనంగా అపనమ్మకాలు లేకపోలేదు. ప్రస్తుతానికి మాత్రం రెండు దేశాలూ ఆర్థిక సంబంధాలను బలపరచుకొంటున్నాయి.

చైనాకు సైబీరియా నుంచి 30 ఏళ్లపాటు 40,000కోట్ల డాలర్ల సహజవాయు సరఫరాకు ఒప్పందం కుదిరింది. అత్యాధునిక సుఖోయ్‌-35 ఫైటర్‌ విమానాలను, ఎస్‌-400 క్షిపణులను విక్రయించడానికి రష్యా, చైనాల మధ్య చర్చలు సాగుతున్నాయి. అదేసమయంలో భారత్‌, వియత్నాంలతో సహకారాన్ని పటిష్ఠం చేసుకోవడానికి రష్యా గట్టిగా కృషిచేస్తోంది. అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌లు రష్యాను చేజేతులా చైనా కౌగిట్లోకి నెడితే, తరవాత చేదు ఫలితం అనుభవించవలసి వస్తుంది. పశ్చిమాన ఉక్రెయిన్‌ విషయంలో రష్యాతో పాటు పాశ్చాత్య దేశాలూ దూకుడు తగ్గించడం ఉభయులకీ మేలు చేస్తుంది.

(రచయిత - కైజర్‌ అడపా)
Posted on 05-01-2015