Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

నవ కల్పనలకు అంకుర నగిషీలు

* ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో అపూర్వ దృశ్యం

ప్రపంచ పారిశ్రామికవేత్తల ఎనిమిదో వార్షిక సదస్సు హైదరాబాద్‌ వేదికగా అంగరంగ వైభవంగా జరుగుతోంది. మహిళలకు కీలక ప్రాధాన్యం కట్టబెట్టడం ద్వారా సౌభాగ్యాన్ని అందరిపరం చేయాలన్న నినాదంతో ప్రారంభమైన ఈ సదస్సు- రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్న నారీమణుల భాగస్వామ్యంతో విలక్షణంగా నిలుస్తోంది. ఇంధనం, మౌలిక సౌకర్యాలు; ఆరోగ్య రంగం, జీవశాస్త్రాలు; ఆర్థిక కార్యకలాపాలతో ముడివడిన సాంకేతిక విజ్ఞానం, డిజిటల్‌ ఎకానమీ; మీడియా, వినోద రంగం కీలక అంశాలుగా మొదలైన ఈ సదస్సు నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతోంది. దక్షిణాసియాలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ సదస్సుకు హైదరాబాద్‌ వేదిక కావడం; అమెరికా అధ్యక్షుడి సలహాదారు, ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్‌ చురుకైన భాగస్వామ్యం ప్రత్యేకంగా చెప్పుకోదగిన అంశాలు. సులభతర వాణిజ్య నిర్వహణ సూచీలో భారత్‌ను మెరుగైన స్థానంలో నిలపడం, సృజనాత్మక ఆలోచనలతో ముందుకు వచ్చిన నిజమైన ఔత్సాహికవేత్తలకు సంక్లిష్ట నిబంధనలు అడ్డుపడని వాతావరణం నెలకొల్పడం, అంకుర పరిశ్రమలకు మునుపెన్నడూ లేని స్థాయిలో ప్రోత్సాహం అందించడం వంటివి మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన గణనీయమైన మార్పులు. భారత్‌ను పెట్టుబడులకు కేంద్రస్థలిగా అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఆకర్షించే కీలక అంశాలివి. ఈ సదస్సులో పాల్పంచుకొంటున్నవారిలో 31 శాతం 30 ఏళ్లలోపువారే కావడం, 52 శాతానికిపైగా మహిళా ప్రతినిధులే ఉండటం- ప్రపంచ పారిశ్రామిక స్వరూపం గుణాత్మకంగా పరిణతి చెందుతోందనేందుకు దాఖలా!

సవాళ్లను అధిగమిస్తూ...
వ్యాపార, వాణిజ్య రంగాల్లో భారత్‌కు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇత్తడి, తగరం వంటి లోహాలను కరిగించి వివిధ రకాల వస్తువులు రూపొందించే కళలో భారతీయులు నిష్ణాతులు. రెండు వేల ఏళ్లక్రితం కనిష్కుడి హయాములోనే దేశంలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు జోరుగా నడిచాయి. తరవాతి కాలంలో ఆగ్నేయాసియా, రోమన్‌ సామ్రాజ్యాలతో వ్యాపార సంబంధాలు నెలకొల్పుకొన్నారు. బ్రిటిష్‌ జమానాలో 1905లో ప్రారంభమైన ‘స్వదేశీ ఉద్యమం’ ప్రధాని మోదీ ప్రవచిస్తున్న ‘భారత్‌లో తయారీ’ విధానానికి ఇంచుమించు దగ్గరగా ఉంటుంది. స్వాతంత్య్రానంతరం ప్రభుత్వరంగంలో భారీ పరిశ్రమల స్థాపన మీద అధికంగా శ్రద్ధపెట్టడంతో దేశవ్యాప్తంగా ఔత్సాహికవేత్తల విస్తరణకు తగిన వాతావరణం ఏర్పడలేదు. తప్పొప్పులు తెలిపి, దారి చూపేవారు లేకపోవడం, సాంకేతిక విజ్ఞానం అందుబాటులో ఉండకపోవడం, పెట్టుబడులకు అవసరమైన రుణసాయం లభించకపోవడం వంటివి దేశంలో ఔత్సాహికవేత్తలకు అవరోధాలుగా పరిణమించాయి. ఈ ఏడు దశాబ్దాల్లో మానవ వనరులే కీలక పెట్టుబడిగా భారత్‌ ఎదిగింది. ఔత్సాహికవేత్తలు పెరిగేకొద్దీ దేశ ఆర్థికాభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతుంది, ఉపాధి విస్తరిస్తుంది. జాతీయ ఆదాయం, గ్రామీణాభివృద్ధి, పారిశ్రామికీకరణ, సాంకేతిక పురోగతి, ఎగుమతుల వృద్ధి సాకారమవుతాయి. నూతన వ్యాపారాల వికాసానికి అనువుగా మారుతున్న అంతర్జాతీయ వాణిజ్యం, మేధో ఆధారిత ప్రాజెక్టులను దృష్టిలో పెట్టుకొని మౌలిక సౌకర్యాలను సిద్ధం చేయడం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు.

‘మహిళలను సాధికారత బాట పట్టించడం ద్వారానే సమున్నత భారతావనిని ఆవిష్కరించగలం. మహిళల ఆలోచనశక్తి, విలువలపట్ల వారి నిబద్ధత మహోన్నత కుటుంబ వ్యవస్థకు పాదుగొల్పింది. కుటుంబ వ్యవస్థ పదిలంగా ఉంటేనే సుస్థిర సమాజం, అద్భుతమైన దేశం సాకారమవుతాయి’- గతంలో డాక్టర్‌ అబ్దుల్‌ కలాం చేసిన ఈ వ్యాఖ్యలు ఎంతో విలువైనవి. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారానే సుస్థిరాభివృద్ధి సాధించగలం. అమెరికా, కెనడాల్లో మూడింట ఒకవంతు చిన్నపాటి వ్యాపారాలు నారీమణుల అధీనంలోనే ఉన్నాయి. దక్షిణాసియా దేశాల్లో స్త్రీ శ్రామికశక్తి 40 శాతానికి అటుఇటుగా ఉంది. భారత్‌లో సామాజిక కట్టుబాట్లు మహిళా వికాసాన్ని అడ్డుకుంటున్నాయి. ఆధునిక విద్య అందరికీ అందుబాటులో లేకపోవడం దేశంలో అతిపెద్ద సమస్య. ఫలితంగా వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో వెల్లువెత్తుతున్న నూతన అవకాశాలను ఎలా ఒడిసిపట్టాలో వనితాలోకానికి అంతుపట్టడం లేదు. సానుకూల వాతావరణం సృష్టించి, సరైన ప్రోత్సాహం అందించగలిగితే వాణిజ్య వేదికపై భారతీయ నారి అద్భుతాలు సాధ్యం చేసి చూపగలదన్న విషయం ఇప్పటికే అనేక సందర్భాల్లో రుజువైంది.

అమెరికా, జపాన్‌లలో పాఠశాల స్థాయినుంచే ఔత్సాహికవేత్తలుగా ఎదిగేందుకు తగిన విద్యావిధానం అమలులో ఉంది. దశాబ్దాల నుంచి భవిష్యత్‌ పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా అమెరికాలో అనేక విశ్వవిద్యాలయాలు, కళాశాలలు పుట్టుకొచ్చాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకోసం అమెరికా ప్రత్యేక విద్యావిధానాన్నే అమలు చేస్తోంది. దక్షిణ కొరియా సైతం అదే బాటలో సాగుతోంది. వ్యాపార, వాణిజ్య రంగాల్లో ప్రత్యేక తర్ఫీదు కోసం ఆ దేశ విద్యావిధానంలో వేర్వేరు పాఠ్యప్రణాళికలు రూపొందించారు. సాధారణ విద్యను అభ్యసించే ప్రతి విద్యార్థీ వాణిజ్య పాఠ్యప్రణాళికల్లో ఏదో ఒకదాన్ని ఐచ్ఛికాంశంగా ఎంపిక చేసుకోక తప్పదు. ‘యునెస్కో’ సైతం మాధ్యమిక విద్యాస్థాయి నుంచే ఔత్సాహిక విద్య, నైపుణ్యాలను ప్రోత్సహిస్తోంది. భారత్‌లో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. మనదేశంలో ఇంజినీరింగ్‌ చదువులు విద్యార్థులకు కేవలం సాంకేతిక నైపుణ్యాలను ఒంటపట్టించగలుగుతున్నాయేగాని, వారిని ఔత్సాహికవేత్తలుగా తీర్చిదిద్దడంపై శ్రద్ధపెట్టడం లేదు. సమర్థ పారిశ్రామికవేత్తలుగా ఆవిర్భవించడానికి తగిన నైపుణ్యాలు, ఏదో స్థాయిలో మౌలిక సదుపాయాలు ఉండి కూడా పారిశ్రామికంగా భారత్‌ వెనకే మిగిలిపోవడానికి కారణాలు అనేకం. ఎంతసేపటికీ ఏదో ఒక సంస్థలో ఉద్యోగం సంపాదిస్తే చాలన్న ఆలోచనే తప్ప- వ్యాపార రంగంలో ప్రవేశించి సొంతంగా ఎదగడంతోపాటు పదిమందికి ఉపాధి కల్పించాలన్న వైఖరి భారతీయ యువతలో పాదుకొనడం లేదు. అందుకు మన విద్యావిధానంలోని లోపాలే కారణం. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలు, పారిశ్రామికవేత్తలు, ఉపాధ్యాయులు ఎవరి స్థాయిలో వారు గట్టిగా కృషి సాగించాలి. పాఠశాల దశనుంచే విద్యార్థులకు సృజనాత్మకంగా ఆలోచించడం నేర్పడంతోపాటు- శాస్త్ర విజ్ఞాన ప్రయోగశీలతను ఒంటపట్టించాలి. ఖర్చుకు వెనకాడకుండా నవకల్పనలకు బాటలు పరవాలి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అన్ని దేశాలూ చేస్తోంది ఇదే! కొత్త ఆలోచనలు ఉన్నప్పటికీ, వాటికి ప్రయోగరూపమిచ్చి అవి ఎంతమేరకు విజయం సాధిస్తాయో పరీక్షించుకునే ఆర్థిక వెసులుబాటు భారత్‌లోని యువజనానికి లేదు. దేశంలో ఔత్సాహికులు దెబ్బతింటోంది ఇక్కడే. సృజనాత్మక ఆలోచనలతో ముందుకొచ్చేవారికి తగిన గుర్తింపు, ప్రోత్సాహకాలు ఇచ్చే వ్యవస్థలు ఏర్పడాలి. విద్యా, పారిశ్రామిక రంగాల మధ్య మేలిమి సమన్వయం నెలకొల్పాలి. అప్పుడే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అభ్యసిస్తున్న చదువులకు- క్షేత్రస్థాయిలో పారిశ్రామిక అవసరాలకు మధ్య అగాధం స్పష్టం అవుతుంది. సమస్య స్పష్టమైతేనే పరిష్కారం సాధ్యపడుతుంది. అంకుర పరిశ్రమలు భారతీయ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలనే మార్చేయగల అవకాశముంది. అయితే ఇప్పటికీ అనేక అంకుర పరిశ్రమలు తగిన సదుపాయాలు, వనరులు లేక పుట్టిన కొన్నాళ్లకే మలిగిపోతున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలంటే అంకుర పరిశ్రమలకు, ఇప్పటికే నిలదొక్కుకొన్న పరిశ్రమలకు మధ్య సానుకూల సంబంధాలు నెలకొల్పాలి. మరోవంక పరిశోధన రంగంపై జీడీపీలో కేవలం ఒక శాతం వాటా మాత్రమే భారత ప్రభుత్వం వెచ్చిస్తున్న తీరు- కొత్త ఆలోచనలకు ప్రేరకంగా నిలవలేకపోతోంది. ప్రపంచంలో పరిశోధన రంగంపై ఇంత తక్కువ మొత్తం ఖర్చుచేస్తున్న దేశం మనదే కావడం దురదృష్టం.

సృజనాత్మక బంధం
‘ప్రపంచంలో ఎక్కడ పనిచేస్తున్నవారైనా, ఏ ప్రాంతంలో జన్మించినవారైనా నవీన ఆలోచనలతో ముందుకొచ్చి ఓ కొత్త ఉత్పత్తిని తయారు చేయవచ్చు. దాన్ని ప్రపంచంలో అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చి మరో ‘గూగుల్‌’గా మార్చేయవచ్చు’- గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ వెలిబుచ్చిన ఈ అభిప్రాయం, సృజనశీలురకు యావత్‌ ప్రపంచం చేతులు సాచి ఆహ్వానం పలుకుతోందన్న విషయాన్నే తేటతెల్లం చేస్తోంది. డిజిటల్‌ సాంకేతికత ఆగమనంతో ప్రపంచవ్యాప్తంగా చిన్నస్థాయి వ్యాపారాలకు అవకాశాలు భళ్లున తెరచుకున్నాయి. డిజిటల్‌ మార్కెటింగ్‌ అన్నది చిన్నపాటి పెట్టుబడులతో ప్రారంభమైన సంస్థలకు అత్యద్భుత ప్రచార సాధనం. ఈ ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు నవీన ఆలోచనల కలబోతకు వేదికగా మారింది. భారత ప్రభుత్వం ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు గట్టి ప్రయత్నాలు చేయాలి. దేశంలో కొత్త ఆలోచనలు విప్పారడానికి తగిన వాతావరణం సృష్టించాలి. ప్రధాని స్థాయి వ్యక్తి యువ ఔత్సాహికవేత్తలతో మాట్లాడి వారి భుజం తట్టడమన్నది సామాన్యమైన విషయం కాదు. యువజనానికి అంతకుమించిన స్ఫూర్తి మరొకటి ఉండదు. ఈ సదస్సు వేదికగా భారత్‌, అమెరికాల మధ్య మునుపెన్నడూ లేని స్థాయిలో స్నేహ సుమాలు విరబూశాయి. ఇరు దేశాల నడుమ వాణిజ్య, వ్యాపార, సృజనాత్మక రంగాల్లో బంధం బలపడటానికి ఈ సదస్సు వేదికగా మారింది. అమెరికా, భారత్‌ల మధ్య రక్షణ సంబంధాలు ఇప్పటికే కొత్తపుంతలు తొక్కాయి. అన్ని రంగాల్లోనూ పటిష్ఠ భాగస్వాములుగా ఇరు దేశాలూ ముందుకు సాగుతున్నాయి. పరిశోధన, సృజనాత్మక రంగాలకు ఈ అనుబంధాన్ని విస్తరించడంతోపాటు ఇరు దేశాలూ ఈ విషయంలో వ్యూహాత్మక భాగస్వాములుగా మారి ప్రపంచానికి దారిచూపాలి!

Posted on 05-12-2017