Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

పశ్చిమాసియాలో కొత్త కుంపటి

* జెరూసలెమ్‌పై ‘ట్రంప’రితనం

‘ఇజ్రాయెల్‌ రాజధానిగా జెరూసలెమ్‌ను అధికారికంగా గుర్తిస్తున్నాం. దీనిపై గత అధ్యక్షులు వాగ్దానాలు చేసినా ఎవరూ అమలు చేయలేదు. ఈ నిర్ణయం ఇజ్రాయెల్‌-పాలస్తీనా సమస్య పరిష్కారానికి కొత్తదారి చూపుతుంది. రెండు దేశాల మధ్య శాంతియుత ఒప్పందానికే అమెరికా కట్టుబడి ఉంది’- అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలివి. శ్వేతసౌధం అధిపతి వ్యాఖ్యలో అనాలోచితం, స్వార్థం ఇమిడి ఉన్నాయి. ఇవి హాస్యాస్పదమైన వ్యాఖ్యలు కూడా. ఇప్పటికే నివురుగప్పిన నిప్పులా ఉన్న పశ్చిమాసియా రాజకీయాల్లో ట్రంప్‌ మాటలు అగ్నికి ఆజ్యం పోశాయి. అధ్యక్షుడి వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఏ ఒక్క దేశమూ ఆయనకు మద్దతుగా మాట్లాడటం లేదు. ఐరాస, అరబ్బు దేశాలను పక్కనపెడితే, అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికాతో అంటకాగే బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాలూ ట్రంప్‌ తీరును తప్పుపట్టడం ఆసక్తికరం.

అగ్రరాజ్య అహంకారం
దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న అంశంపై ఏకపక్షంగా ప్రకటన చేయడం ట్రంప్‌ దూకుడుకు నిలువెత్తు నిదర్శనం. జెరూసలెమ్‌తో సంబంధం గల పాలస్తీనా వాదనను, చారిత్రక పరిస్థితులను, అంతర్జాతీయ సంస్థల అభిప్రాయాన్ని, వివిధ దేశాలను విస్మరించి, లేడికి లేచిందే పరుగులా ట్రంప్‌ చేసిన ప్రకటన సహజంగానే తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. 1948 యుద్ధంలో జెరూసలెమ్‌ పశ్చిమ భాగాన్ని, 1967 యుద్ధంలో నగరంలోని తూర్పు ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్‌ పూర్తి పట్టు సాధించింది. నగరాన్ని తన రాజధానిగా ప్రకటించుకుంది. అంతర్జాతీయంగా అనేక అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ అమెరికా దన్నుతో తన వాదనకే కట్టుబడి ఉంది. నగరంలోని పశ్చిమ ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌, తూర్పు ప్రాంతాన్ని పాలస్తీనా రాజధానిగా ప్రకటించాలన్నది స్థూలంగా ఐరాసతో పాటు ప్రపంచ దేశాల అభిప్రాయం. అరాఫత్‌ హయాం నుంచి పాలస్తీనా కూడా ఇదే కోరుకుంటోంది. 1949లో ఐరాస నియమించిన ఆర్మిస్టిస్‌ కమిషన్‌ సైతం నగరంలోని పశ్చిమ, తూర్పు ప్రాంతాలను స్పష్టంగా విభజించింది. ఈ దిశగా ఇజ్రాయెల్‌ను ఒప్పించేందుకు అంతర్జాతీయంగా కృషి జరుగుతోంది. అందువల్లే అమెరికా సహా ఏ ఒక్క దేశమూ జెరూసలెమ్‌లో తమ రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేయలేదు. ఇజ్రాయెల్‌ ఆర్థిక రాజధానిగా పరిగణించే టెల్‌అవివ్‌ నగరంలోనే అమెరికా సహా 86 దేశాల రాయబార కార్యాలయాలు కొలువై ఉన్నాయి. ఇప్పుడు తమ రాయబార కార్యాలయాలను టెల్‌అవివ్‌ నుంచి జెరూసలెమ్‌కు మార్చాలని ట్రంప్‌ నిర్ణయించారు. ఇజ్రాయెల్‌ చట్టసభలు, ప్రధాని, అధ్యక్షుల నివాసాలు, సుప్రీంకోర్టు, కీలకమైన వివిధ మంత్రిత్వ శాఖల కార్యాలయాలు జెరూసలెమ్‌లోనే ఉన్నాయని, అందువల్లే తమ రాయబార కార్యాలయాన్ని అక్కడకు మార్చాలని నిర్ణయం తీసుకున్నామన్న ట్రంప్‌ వాదనలో పసలేదు. నగరంపై పూర్తిహక్కులు లేవన్న ఉద్దేశంతోనే జెరూసలెమ్‌ పశ్చిమ ప్రాంతంలోనే ఇజ్రాయెల్‌ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేసింది. తూర్పుప్రాంతంలో ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నగరాల్లో ఒకటైన జెరూసలెమ్‌ చారిత్రకంగా ప్రత్యేకమైనది. ఎక్కడా లేని విధంగా క్రిస్టియన్‌, ముస్లిం, యూదు మతాలకు ఇది పుణ్యస్థలం. రమారమి 8.82 లక్షల జనాభాగల నగరంలో యూదులు 62, ముస్లిములు 35, క్రైస్తవులు రెండు, ఇతరులు ఒక శాతం ఉంటారని అంచనా. ఈ వాస్తవాలను ఉద్దేశపూర్వకంగానే విస్మరించి, ట్రంప్‌ ఏకపక్ష ప్రకటన చేయడం ఆయన అనాలోచిత, అహంకారపూరిత వైఖరికి దర్పణం పడుతోంది.

తన నిర్ణయం ఇజ్రాయెల్‌-పాలస్తీనా సమస్య పరిష్కారానికి కొత్తదారి చూపుతుందన్న ట్రంప్‌ వ్యాఖ్య హాస్యాస్పదం. ఇప్పటికే ఉప్పూనిప్పులా ఉన్న ఉభయ దేశాల సంబంధాలు ఆయన ప్రకటనతో పూర్తిగా దెబ్బతింటాయి. పాతగాయాలకు మందు రాయాల్సిందిపోయి, వాటిని మళ్ళీ రేపడం తప్ప మరొకటి కాదు. అంతర్జాతీయ వ్యవహారాలపై ఏ కొద్ది అవగాహన ఉన్నా చేప్పేమాట ఇది. ఇందుకు భిన్నంగా సమస్య పరిష్కారానికి తన నిర్ణయం ఎలా కొత్తదారి చూపుతుందో ట్రంప్‌కే తెలియాలి. రెండు దేశాల మధ్య శాంతియుత ఒప్పందం కుదరడానికి అమెరికా కట్టుబడి ఉందన్న ట్రంప్‌ మాటలు విడ్డూరంగా ఉన్నాయి. ఇజ్రాయెల్‌-పాలస్తీనా వివాద పరిష్కారానికి వాషింగ్టన్‌ ఏనాడూ చిత్తశుద్ధితో వ్యవహరించలేదన్నది చేదునిజం. అదేపనిగా అంతర్జాతీయ వేదికలపై ఇజ్రాయెల్‌ను వెనకేసుకు రావడం అగ్రదేశం అధినేతలకు కొత్తేమీకాదు. ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యదేశంగా ‘పెద్దన్న’ తన ‘వీటో’ హక్కును ఇజ్రాయెల్‌ కోసమే ఎక్కువసార్లు వినియోగించుకుంది. పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించుకున్న తీరు, ఆయా ప్రాంతాల్లోకి యూదుల వలసలను ప్రోత్సహించడం, ఐరాస తీర్మానాలను బేఖాతరు చేస్తున్న తీరుకు సంబంధించి ఇజ్రాయెల్‌పై ఒక్క అమెరికాకు తప్ప అంతర్జాతీయ సమాజానికి అనేక అభ్యంతరాలు ఉన్నాయి. ప్రపంచంలోనే పశ్చిమాసియా అత్యంత సున్నితమైన ప్రాంతం. ఇజ్రాయెల్‌-పాలస్తీనా వివాదం కారణంగా ఎప్పుడూ ఈ ప్రాంతంలో శాంతిభద్రతల పరిస్థితి సమస్యాత్మకంగా ఉంటోంది. ఇజ్రాయెల్‌ దూకుడు కారణంగా తరచూ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతుంటాయి.

పాలస్తీనా మాటేమిటి?
ఇజ్రాయెల్‌ రాజధానిగా జెరూసలెమ్‌ను గుర్తిస్తూ 1995లోనే అమెరికా కాంగ్రెస్‌ తీర్మానం ఆమోదించినప్పటికీ, అధ్యక్షులు ఎవరూ అమలుకు సాహసించలేదు. రిపబ్లికన్‌ పార్టీకే చెందిన నాటి అధ్యక్షులు జార్జి బుష్‌ వంటివారూ ముందడుగు వేయలేదు. ఇతర అధ్యక్షుల కన్నా సాహసోపేతంగా వ్యవహరించాలన్న ఉద్దేశంతోనే ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయం దౌత్యవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇందులో రాజకీయం కూడా ఉంది. అమెరికాలో యూదుల జనాభా ఎక్కువ. ఇజ్రాయెల్‌ కన్నా ఇక్కడే ఎక్కువమంది యూదులు ఉన్నట్లు అంచనా. 2016 ఎన్నికల్లో వీరి ఓట్లపై కన్నేసిన ట్రంప్‌ జెరూసలెమ్‌ గుర్తింపుపై హామీ ఇచ్చారు. తన నిర్ణయం ద్వారా స్వదేశంలో యూదుల అభిమానం, మద్దతును పొందవచ్చన్నది ట్రంప్‌ తాజా వ్యూహంగా చెబుతున్నారు. తన పాలనతో ఇంటాబయటా అనేక విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. పాత విషయాలను పక్కనపెట్టి ఇప్పుడిప్పుడే ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు నెరపుతున్న భారత్‌ వంటి దేశాలకు ట్రంప్‌ నిర్ణయం ఇబ్బందికరమైనదే. పాతికేళ్ల క్రితం నాటి అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ఇజ్రాయెల్‌తో దౌత్యసంబంధాలకు తెరతీశారు. అరబ్బు దేశాల అభ్యంతరాలను తోసిపుచ్చారు. అదే సమయంలో వాటి ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ ఏడాది జులై మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇజ్రాయెల్‌ సందర్శించారు. ఆ దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధాని మోదీనే.. పాలస్తీనాపై సానుకూల అభిప్రాయం గల మరికొన్ని దేశాలూ ఇజ్రాయెల్‌తో సంబంధాలకు ఆసక్తిగా ఉన్నాయి. ట్రంప్‌ నిర్ణయంతో అవి పునరాలోచనలో పడ్డాయి. జెరూసలెమ్‌పై ఇజ్రాయెల్‌ హక్కును ఎవరూ కాదనడం లేదు. అదే సమయంలో పాలస్తీనాకు గల హక్కునూ గుర్తించి అమలు చేయాలని అంతర్జాతీయ సమాజం కోరుతోంది. ఈ బాధ్యతను నిర్వర్తించడంలో, ఇజ్రాయెల్‌ను ఒప్పించడంలో దాని మిత్రదేశంగా, అగ్రరాజ్యంగా అమెరికాపైనే ఎక్కువ బాధ్యత ఉంది. 70వ దశకం చివర్లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీకార్టర్‌ ఈజిప్టు-ఇజ్రాయెల్‌ మధ్య సయోధ్య కుదిర్చారు. 1978 సెప్టెంబరు 17న అమెరికాలోని క్యాంప్‌డేవిడ్‌లో ఈజిప్టు, ఇజ్రాయెల్‌ అధినేతలు అన్వర్‌ సాదత్‌- బెగిన్‌ల మధ్య ఒప్పందం కుదిర్చి, దశాబ్దాల వైరానికి తెరదించారు. దీన్నే క్యాంప్‌డేవిడ్‌ ఒప్పందంగా వ్యవహరిస్తారు. ఇప్పుడు ట్రంప్‌ కూడా ఆ దిశగా అడుగులు వేయకుండా భిన్న వైఖరి అవలంబించడం కొత్త సమస్యను రాజేసింది!

- జి.మారుతీలత
Posted on 13-12-2017