Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

ఎదురులేని పుతిన్‌

* ఏకపక్షంగా రష్యా ఎన్నికలు?

రష్యాలో అధ్యక్ష ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. మార్చి 18న జరగనున్న అధ్యక్ష పదవికి ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో పాటు పలువురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. పుతిన్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండటం విశేషం. కమ్యూనిస్ట్‌ పార్టీకి చెందిన పావెల్‌ గ్రుడిన్‌, లిబరల్‌ డెమొక్రటిక్‌ పార్టీ తరపున వ్లాదిమిర్‌ జిరినోవస్కీలు పుతిన్‌ను ఢీకొంటున్నారు. ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీని ఎన్నికల సంఘం అనర్హుడిగా ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పుతిన్‌కు గట్టిపోటీ ఇవ్వగల నేత ఆయన ఒక్కరే. నావల్నీ ప్రజాదరణ గల నాయకుడు. పాత కేసుల కారణంగా ఆయనపై వేటు వేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటిస్తున్నప్పటికీ, తెరవెనక పుతిన్‌ ఒత్తిడే అందుకు కారణమన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నావల్నీ లేని ఎన్నిక ఏకపక్షమేనని చెప్పవచ్చు.

సుదీర్ఘ ప్రస్థానం
రష్యా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడే కీలకం. ఆయన పదవీ కాలం ఆరేళ్లు. ప్రధాని నామమాత్రం. ఆయనను అధ్యక్షుడు నియమిస్తారు. కార్యనిర్వాహక అధికారాలు అధ్యక్షుడు చేతిలో ఉంటాయి. మార్చి 18న అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థి సగానికి పైగా ఓట్లు సాధించాలి. అలా రానట్లయితే రెండో దఫా ఏప్రిల్‌ ఎనిమిదిన ఎన్నికలు నిర్వహిస్తారు. పుతిన్‌కు తన సొంత పార్టీ అయిన యునైటెడ్‌ రష్యాతో పాటు, జస్ట్‌ రష్యా పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. రాజ్యాంగం ప్రకారం ఏ నాయకుడు వరసగా రెండు పర్యాయాలకు మించి అధ్యక్ష పదవికి పోటీ చేయరాదు. 2000 నుంచి 2008 వరకు రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేసిన పుతిన్‌ ఈ నిబంధనను అధిగమించేందుకు ఆ తరవాత ప్రధాని పదవి చేపట్టారు. 2012లో రాజ్యాంగాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని అధ్యక్ష పదవీకాలాన్ని ఆరేళ్లకు పెంచారు. ఈ మేరకు 2012లో మళ్ళీ అధ్యక్ష పదవి చేపట్టారు. ఇప్పుడు ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష పదవి చేపట్టినట్లయితే 2024 వరకు అధికారంలో కొనసాగుతారు. జోసెఫ్‌ స్టాలిన్‌ తరవాత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన నేతగా చరిత్ర పుటల్లో నిలిచిపోతారు. ఇటీవల ప్రత్యేక పరిస్థితుల్లో వైదొలగిన జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే అనంతరం ప్రపంచంలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్నదీ పుతినే. సుమారు పావు శతాబ్దం పాటు రష్యా రాజకీయాలపై చెరగని ముద్ర వేసినవారవుతారు. సోవియట్‌ విచ్ఛినం అనంతరం బోరిస్‌ ఎల్సిన్‌ నుంచి పగ్గాలు అందుకున్న పుతిన్‌ దేశ రాజకీయాలపై పట్టు సాధించారు. పుతిన్‌ అంటేనే రష్యా, రష్యా అంటేనే పుతిన్‌ అన్న అభిప్రాయాన్ని అటు దేశీయంగా, ఇటు అంతర్జాతీయంగా కలిగించారు. 2000 సంవత్సరం నుంచి పుతిన్‌ ఎదురులేని నేతగా చక్రం తిప్పుతున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో ఆయన మాటకు తిరుగులేదు. ఆయనకు దీటైన నేత స్వపక్షంలో, విపక్షంలో ఎవరూ లేరు. స్టాలిన్‌, కృశ్చెవ్‌, బ్రెజ్నెవ్‌ మాదిరి దిగ్గజ నాయకుడిగా గుర్తింపుపొందారు.

పుతిన్‌ పాలనపై ప్రజలకు కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ ప్రస్తుత ఎన్నికల్లో ఆయన విజయం నల్లేరుపై నడకలాంటిదేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇంటాబయటా అనుకూల పరిస్థితులు, దీటైన ప్రత్యర్థి లేకపోవడం ఆయనకు కలిసివచ్చే అంశాలు. వాస్తవానికి దేశ ఆర్థిక వ్యవస్థ అంత గొప్పగా ఏమీ లేదు. వృద్ధిరేటు పరిస్థితి నిరాశాజనకం. ద్రవ్యోల్బణం దిగిరానంటోంది. ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దేశంలో ఆర్థిక అసమానతలు పెచ్చరిల్లాయి. నిరుద్యోగ సమస్యతో యువత సతమతమవుతోంది. ఆర్థిక వ్యవస్థ ప్రభావవంతంగా లేకపోవడం, పత్రికాస్వేచ్ఛకు అడ్డంకులు, రాజకీయ ప్రత్యర్థుల అణచివేత, ద్వితీయశ్రేణి నాయకులను ఎదగనివ్వకపోవడం వంటి ప్రతికూలాంశాలు ఉన్నప్పటికీ... ఇవేవీ ఆయన గెలుపును అడ్డుకునే స్థితిలో లేవు. అంతర్గత పరిస్థితులు అంత బాగా లేనప్పటికీ, ఏకధ్రువ ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాను ఎదుర్కోవాలంటే, బలమైన నాయకుడు అవసరమన్న ఉద్దేశంతో రష్యా ప్రజలు ఆయనను బలపరుస్తున్నారు. అందుకే ప్రధానిగా పోటీచేసినా, అధ్యక్షుడిగా ఎన్నికల బరిలోకి దిగినా ఎన్నుకుంటూ వచ్చారు. ఒకప్పటి అగ్రరాజ్యమైన రష్యాను అమెరికాకు దీటుగా, అంతర్జాతీయంగా ఇప్పటికీ ఎంతోకొంత ప్రభావవంతమైన దేశంగా నిలబెట్టడంలో పుతిన్‌ పాత్రపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఉంది. ఉక్రెయిన్‌, సిరియా విషయాల్లో ఆయన అనుసరించిన వైఖరి సరైనదేనని భావిస్తున్నారు. 2014లో ఉక్రెయిన్‌ నుంచి క్రిమియాను చేజిక్కించుకోవడంలో ఆయన పాత్రను కొనియాడుతున్నారు. యునైటెడ్‌ రష్యా పార్టీకి చెందిన పుతిన్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండటం విశేషం. ప్రభుత్వపరమైన అసంతృప్తి తనమీద పడకుండా ఉండేందుకే ఈ ఎత్తుగడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

బలహీన ప్రత్యర్థులు
పుతిన్‌ తరవాత ప్రజాదరణ గల నాయకుడు 41 ఏళ్ల అలెక్సీ నావల్నీ. ఆయన ప్రతిపక్ష నాయకుడు. బలమైన నాయకుడు. న్యాయవాది కూడా. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. రాజ్యాంగం ప్రకారం ఒక నాయకుడు ఎన్నికల బరిలోకి దిగాలంటే ఎన్నికల సంఘం ముందు తన పేరు నమోదు చేసుకోవాలి. ఇందుకు 500 మంది ఓటర్ల మద్దతు అవసరం. ఒక్క మాస్కోలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన ఇద్దరు ప్రతినిధుల సమక్షంలో ఆయనకు మద్దతుగా 800 మంది సంతకాలు చేయడం విశేషం. మరో 20 నగరాల్లో పర్యటించి సంతకాలు సేకరిస్తానని నావల్నీ ప్రకటించారు. అయితే నావల్నీకి ఓ కేసులో శిక్ష పడినందువల్ల అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని, తనను బరి నుంచి తప్పించాలన్న ఉద్దేశంతో, పుతిన్‌ ప్రమేయంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు నావల్నీ ధ్వజమెత్తుతున్నారు. ఎన్నికలను బహిష్కరించాలని కూడా తన మద్దతుదారులకు పిలుపిచ్చారు.
దాదాపు నలభై మంది ఎన్నికల బరిలోకి దూకారు. నామినేషన్ల దాఖలుకు పదో తేదీ వరకు గడువు ఉంది. లిబరల్‌ డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన వ్లాదిమర్‌ జిరినోవస్కీ, కమ్యూనిస్ట్‌ పార్టీ అభ్యర్థి పావెల్‌ గ్రుడిన్‌లే పుతిన్‌కు ప్రధాన ప్రత్యర్థులు. జిరినోవస్కీ ఎన్నికల్లో పోటీచేయడం ఇది ఆరోసారి. అందరికీ ఇళ్లు, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం, గతంలో సోవియట్‌ యూనియన్‌ నుంచి విడిపోయిన రిపబ్లిక్కులను విలీనం చేయడం తన ప్రాధాన్యాలుగా ఆయన చెబుతున్నారు. అలెక్సీ నావల్నీ రంగంలో ఉంటే కొంతవరకైనా గట్టిపోటీ ఇచ్చి ఉండేవారు. ఆయన అభ్యర్థిత్వంపై సుప్రీంకోర్టు కూడా ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని సమర్థించడంతో ఎన్నికలు ఏకపక్షంగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల్లో వరస విజయాలతోనే పుతిన్‌ రష్యా చరిత్రలో నిలిచిపోలేరు... ప్రజాబలాన్ని సద్వినియోగం చేసుకుని అంతర్గత పరిస్థితులను చక్కదిద్ది, రష్యాను అగ్రరాజ్యంగా నిలబెట్టినప్పుడే చరిత్ర ఆయనను గుర్తు పెట్టుకుంటుంది!

- గోపరాజు మల్లపరాజు
Posted on 04-01-2018