Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

చిచ్చురేపిన ట్రంప్‌ వ్యాఖ్యలు

* భారత్‌ దక్షతకు పరీక్ష

పాకిస్థాన్‌పై విరుచుకుపడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సర్వత్రా కలకలం సృష్టించాయి. గడచిన పదిహేనేళ్ల కాలంలో అమెరికా రెండు లక్షల పదివేల కోట్ల రూపాయలకుపైగా ఆర్థిక సాయం పాకిస్థాన్‌కు అందిస్తే- అబద్ధాలు, నమ్మకద్రోహాన్నే ఆ దేశం తమకు ప్రతిఫలంగా ఇచ్చిందంటూ అగ్రరాజ్యాధీశుడు ట్రంప్‌ వ్యక్తం చేసిన అభిప్రాయం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. పాకిస్థాన్‌కు అమెరికా ఆర్థిక సాయం చేసిందన్నది ఎవరూ తోసిపుచ్చలేని వాస్తవం. అయితే అందుకు ప్రతిగా ఇస్లామాబాద్‌ నాయకత్వం అమెరికాకు ఏమీ ఇవ్వలేదా అన్నది చర్చించాల్సిన అంశం.

అగ్రరాజ్యానికి డాలర్ల రూపంలో పాకిస్థాన్‌ ప్రతిఫలం చెల్లించి ఉండకపోవచ్చు. కానీ- తమ భూభాగాన్ని వ్యూహాత్మక సైనిక స్థావరంగా ఉపయోగించుకోవడానికి అమెరికాకు ఆ దేశం తోడ్పాటు అందించింది. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అంతర్జాతీయ సమాజం రెండు వేర్వేరు కూటములుగా విడిపోయినప్పుడు పాకిస్థాన్‌ పూర్తిగా అమెరికా పక్షాన నిలిచింది. బాగ్దాద్‌ ఒడంబడిక (1955) ప్రకారం ఇరాన్‌, ఇరాక్‌, పాకిస్థాన్‌, టర్కీ, యునైటెడ్‌ కింగ్‌డమ్‌లు ఒక కూటమిగా ఏర్పాటయ్యాయి. పశ్చిమాసియాలో అప్పటి సోవియెట్‌ యూనియన్‌ విస్తరణను అడ్డుకోవడమే లక్ష్యంగా ఆ కూటమి ఏర్పాటైంది. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ కేంద్రంగా కూటమి ఏర్పాటైంది కాబట్టి దానికి బాగ్దాద్‌ ఒడంబడిక అనే పేరు వచ్చింది. అయితే 1958లో ఇరాక్‌లో సైనిక కుట్ర జరిగింది. ఫలితంగా కూటమినుంచి ఇరాక్‌ వైదొలగింది. దాంతో ఆ కూటమి పేరును ‘సెంటో’ (సెంట్రల్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌)గా మార్చి ప్రధాన కార్యాలయాన్ని అంకారాకు తరలించారు. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లోగాని, వివిధ దేశాల మధ్య వివాదాల్లోగాని జోక్యం చేసుకోరాదన్నది ‘సెంటో’ ఒడంబడికలోని కీలక నిబంధన. ఆ మేరకు ఆరు రోజులపాటు జరిగిన యోమ్‌ కిప్పుర్‌ యుద్ధం (ఈజిప్ట్‌, సిరియాల ఉమ్మడి సైన్యానికి, ఇజ్రాయెల్‌కు మధ్య సమరం)లో కూటమి జోక్యం చేసుకోలేదు. అదేవిధంగా 1965లో, 1971లో భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన యుద్ధాల్లోనూ ఆ కూటమి వేలు పెట్టలేదు. ‘సెంటో’ కేవలం సోవియెట్‌ యూనియన్‌ను నిరోధించడం కోసం ఏర్పాటైన కూటమి మాత్రమే గాని- భారత్‌కు వ్యతిరేకం కాదని అప్పట్లో దాని అధినేతలు స్పష్టం చేశారు. ఇరాన్‌లో తలెత్తిన ఇస్లామిక్‌ విప్లవం కారణంగా 1979లో ఆ కూటమి విచ్ఛిన్నమైంది.

‘ట్రంప్‌ వ్యాఖ్యలు సత్యదూరం. వాస్తవాలతో నిమిత్తం లేకుండా ఆయన ఓ కల్పిత గాథ వినిపించారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలోనూ, ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతలను పాదుకొల్పడంలోనూ పాకిస్థాన్‌ చేసిన త్యాగాలు అన్నీ ఇన్నీ కావు’- ట్రంప్‌ వ్యాఖ్యలకు ప్రతిగా పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి ఖ్వాజా ఎం.ఆసిఫ్‌ ట్విటర్‌లో వెలిబుచ్చిన ప్రతిస్పందన ఇది. తమ మిత్రదేశం పాక్‌పై అమెరికా అధినేత రుసరుసల నేపథ్యంలో చైనా నాయకత్వం వెంటనే రంగంలోకి దిగింది. ఉగ్రవాదాన్ని కట్టడి చేయడంలో నిరుపమాన కృషి చేసిందంటూ చైనా సర్కారు పాకిస్థాన్‌ను వెనకేసుకొచ్చింది. ‘అంతర్జాతీయంగా ఉగ్రవాద వ్యతిరేక సమరంతోపాటు, వివిధ దేశాల మధ్య పరస్పర సహకారం సాధించి శాంతి సుస్థిరతలను నెలకొల్పడంలో పాకిస్థాన్‌ కీలక పాత్ర పోషించాల్సి ఉంది’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెన్‌ ష్వాంగ్‌ వ్యాఖ్యానించారు. బీజింగ్‌నుంచి ఆ తరహా స్పందన వూహించిందే. చైనా పాకిస్థాన్‌ ఆర్థిక నడవా(సీపీఈసీ) రూపంలో బీజింగ్‌ నాయకత్వం 5,000 కోట్ల డాలర్ల భారీ మొత్తం ఖర్చు చేస్తోంది. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ మీదుగా తలపెట్టిన ఈ నడవా నిర్మాణాన్ని భారత్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. చైనా, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ల మధ్య కిందటివారం త్రైపాక్షిక సమావేశం జరిగింది. ఆ సందర్భంగా ‘ఆర్థిక నడవా’ను అఫ్గాన్‌ వరకూ విస్తరించాలన్న తన ఉద్దేశాలను చైనా స్పష్టీకరించింది. అఫ్గాన్‌తో భారత్‌కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం ఈ సందర్భంగా గమనార్హం. అయితే పాక్‌ను ఉద్దేశించి డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను అఫ్గానిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌ స్వాగతించారు. అమెరికా నేతృత్వంలో ప్రాంతీయ కూటమి ఏర్పాటై పాకిస్థాన్‌ను నియంత్రించాలని; తద్వారా అఫ్గాన్‌తోపాటు ఈ ప్రాంతంలో శాంతి స్థాపన దిశగా ముందడుగు వేయాలని కర్జాయ్‌ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో పాక్‌తో కలిసి జట్టుగా అఫ్గాన్‌ను మచ్చిక చేసుకోవడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తిగొలుపుతున్నాయి.

చైనాతో పాకిస్థాన్‌ అనుబంధం బహిరంగం! వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సీపీఈసీకి తెరచాపలెత్తడం ద్వారా భారీ పెట్టుబడులు గుమ్మరించేందుకు చైనాకు పాకిస్థాన్‌ ఎర్రతివాచీ పరచింది. ఆ రకంగా భౌగోళికంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న అరేబియా, హిందూ మహా సముద్ర ప్రాంతాలను అనాయాసంగా చేరుకునేందుకు చైనాకు పాకిస్థాన్‌ వీలు కల్పించింది. ఈ పరిణామం అమెరికాకు ఏ మాత్రం రుచించడం లేదు. ట్రంప్‌ తాజా వ్యాఖ్యలను ఈ నేపథ్యంలోనే అర్థం చేసుకోవాల్సి ఉంది. అమెరికా అధ్యక్షుడి మాటలను భారత్‌ ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్వాగతించింది. ‘ట్రంప్‌ తాజా నిర్ణయంతో భారత్‌ ఇంతకాలం అనుసరించిన విధానం హేతుబద్ధమేనని నిరూపితమైంది. ఉగ్రవాదాన్ని ఎగదోయడంలో పాకిస్థాన్‌ కీలక పాత్ర పోషిస్తోందని భారత్‌ మొదటినుంచీ చెబుతోంది. ఉగ్రవాదికి పాలుపోసి పెంచడం పెనుముప్పును కొనితెచ్చుకోవడమే. ఉగ్రవాదం పంజా విసిరితే ఏ దేశం, ఏ ప్రాంతమూ శాంతియుతంగా మనుగడ సాగించలేదు’ మోదీ మంత్రివర్గంలోని జితేంద్ర సింగ్‌ వ్యాఖ్యలివి. పరిస్థితుల్లో అమెరికా సాయం లేకుండా పాకిస్థాన్‌ ఏ మేరకు నిలదొక్కుకోగలదన్నది ఆసక్తికరం. అమెరికా ఇప్పటివరకూ చేసిన ఆర్థిక సాయాన్ని లెక్కగట్టి గుండుగుత్తగా ఆ మొత్తాన్ని దానికి తిరిగి ఇచ్చేస్తామని పాకిస్థాన్‌ చెబుతోంది. కానీ, అది సాధ్యమయ్యే పని కాదు. ట్రంప్‌ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కొత్త సమీకరణలకు తెరలేపే అవకాశం ఉంది. కాబట్టి, భారత్‌ ఆచితూచి అడుగులు వేయాల్సిన సందర్భమిది!

Posted on 04-01-2018