Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

అండమాన్‌లో పారాహుషార్‌

* శత్రుదుర్భేద్యంగా రక్షణ వ్యవస్థ

మూడువైపులా సముద్రతీరం ఉన్నప్పటికీ దాయాది దేశం పాక్‌తో ఉన్న వైరం రీత్యా పశ్చిమ దిశలో సాగర పరిరక్షణకు భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. 2008లో పాక్‌ ఉగ్రవాదులు సముద్రమార్గం ద్వారానే వాణిజ్య రాజధాని ముంబయిలో మారణహోమం సృష్టించారు. దీంతో సుదీర్ఘంగా ఉన్న సముద్ర తీరం వెంబడి పటిష్ఠ రక్షణ ఏర్పాట్లు చేసింది. వీటితోపాటు అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ అంశాలు శరవేగంగా మారుతున్నాయి. హిందూ మహాసముద్రంలో తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు చైనా వ్యూహాలు రూపొందించడంతో- దిల్లీ కూడా తూర్పు, దక్షిణ సాగరతీరాలపై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. చైనా యుద్ధ, వాణిజ్యనౌకలకు హిందూ మహాసముద్రంతో పాటు బంగాళాఖాతం ప్రధాన రవాణామార్గాలుగా మారడంతో అండమాన్‌ దీవులను రక్షణాత్మకంగా తీర్చిదిద్దేందుకు ఇండియాలో సన్నాహాలు చేస్తోంది. తూర్పుతీరంలో బంగాళాఖాతానికి దక్షిణ భాగంలో ఉన్న అండమాన్‌ నికోబార్‌ దీవులు- రక్షణపరంగా భారత్‌ ఆధిపత్యం సాధించేందుకు అవకాశాలు కల్పిస్తున్నాయి. మలక్కా జలసంధికి సమీపంలో ఈ దీవులు ఉండటం అత్యంత వ్యూహాత్మకంగా కలిసివచ్చే అంశమని అంతర్జాతీయ రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇండొనేసియా, మలేసియాల మధ్య ఉన్న మలక్కా జలసంధి తూర్పు, పశ్చిమ ఆసియా దేశాల మధ్య కీలకమైన జలమార్గం. మధ్యప్రాచ్యం నుంచి చైనాకు చమురు రవాణా నౌకలు ఈ జలసంధి ద్వారానే రాకపోకలు కొనసాగిస్తుంటాయి. ఈ దీవుల ద్వారానే ఇండియాకు చెందిన ప్రత్యేక ఆర్థిక ప్రాంతం 30 శాతం ఉండటం గమనార్హం.

పెరుగుతున్న ప్రాధాన్యం
దాదాపు 550కు పైగా ద్వీపాల సమాహారమే అండమాన్‌ నికోబార్‌ దీవులు. ఉత్తరంలో మియన్మార్‌, దక్షిణాన ఇండొనేసియా వరకు ఈ ద్వీపాలు విస్తరించి ఉన్నాయి. బ్రిటిష్‌ హయాములో అనేకమంది స్వాతంత్య్రయోధులకు ద్వీపాంతర కారాగారశిక్షను ఇక్కడ అమలుచేశారు. భారత్‌కు దక్షిణ భాగంలో చివరి ప్రాంతమైన ఇందిరాపాయింట్‌ ఉన్న క్యాంప్‌బెల్‌ బే (గ్రేట్‌ నికోబార్‌ దీవి) ఇక్కడే ఉంది. అండమాన్‌, నికోబార్‌ దీవులను 10 డిగ్రీల ఛానెల్‌ వేరుచేస్తోంది. ఇందిరా పాయింట్‌కు సమీపంలోను ఆరు డిగ్రీల ఛానెల్‌ ఉంది. ఈ రెండు మార్గాల ద్వారానే తూర్పు ఆసియా దేశాలకు వెళ్లే అన్ని నౌకలు ప్రయాణించి మలక్కా జలసంధిని చేరుకోవాల్సి ఉంటుంది. దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం చలాయించేందుకు చైనా కుయుక్తులు పన్నుతోంది. ఇందుకు భిన్నంగా మన సార్వభౌమాధికార పరిధిలోనే అండమాన్‌ దీవులు ఉండటంతో హిందూమహాసముద్రం, బంగాళాఖాతం పరిధిలో భారత్‌ తిరుగులేని సైనికశక్తిగా ఆవిర్భవించేందుకు అవకాశాలు ఉన్నాయన్నది నిర్వివాదం. ఇండొ-పసిఫిక్‌ ప్రాంతంలో ఇండియానే కీలకశక్తిగా అమెరికా గుర్తించిన నేపథ్యంలో దీన్ని పూర్థిస్థాయి సైనిక స్థావరంగా తీర్చిదిద్దాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. 2001లో అప్పటి ప్రధాని వాజ్‌పేయీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు అండమాన్‌లో త్రివిధ దళాల సమీకృత కమాం డ్‌ను ఏర్పాటుచేసింది. అనంతరం యూపీఏ ప్రభుత్వం దీని పటిష్ఠతకు అంతగా శ్రద్ధ చూపలేదు. ‘తూర్పు వైపు చూపు’ విధానంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ‘తూర్పు దిశగా కార్యాచరణ’కు ప్రాధాన్యం ఇవ్వడంతో ఇక్కడ పూర్తిస్థాయిలో మౌలిక సౌకర్యాలు ఏర్పాటుచేస్తున్నారు. ప్రస్తుతం తూర్పు తీరంలో విశాఖలో తూర్పు నౌకాదళ కమాండ్‌ ఉంది. అండమాన్‌ దీవులను పూర్థిస్థాయిలో అభివృద్ధి చేస్తే మరో నౌకాదళ కేంద్రానికి అవకాశముంటుంది. రక్షణాత్మకంగా అనేక కీలకాంశాలు ఉండటంతో వీటిని ఎప్పటికీ మునగని యుద్ధనౌకగా కొందరు రక్షణ నిపుణులు అభివర్ణించడం విశేషం. దాదాపు 800 కి.మీ. పొడవునా విస్తరించిఉన్న అండమాన్‌ సముదాయం భారత్‌కు ఒక నిఘా హెచ్చరికల కేంద్రంగా పనిచేయడంతో పాటు రక్షణాత్మకంగా ప్రకృతిసిద్ధమైన కోటగా ఉంది. మలక్కా జలసంధి ద్వారా ఏటా 80 వేల నుంచి లక్ష వరకు రవాణానౌకలు తిరుగుతుంటాయి. ఇక్కడ ఎలాంటి అలజడి ఏర్పడినా తూర్పు ఆసియా దేశాలకు ముఖ్యంగా చైనాకు పశ్చిమాసియా నుంచి వచ్చే దిగుమతులపై ప్రభావం పడే అవకాశముంది. చైనా యుద్ధనౌకలు హిందూమహాసముద్రంలోకి ప్రవేశించాలంటే ఇదే కీలకమైన మార్గం. అయితే దక్షిణ చైనా సముద్రంలో చైనా పెత్తనాన్ని అంగీకరించని ఇండొనేసియా తదితర దేశాలు భారత్‌తో కలిసి సంయుక్తంగా నిఘా నిర్వహించేందుకు ఆసక్తి చూపు తున్నాయి. వీటితో పాటు శరణార్ధుల అక్రమ తరలింపు, మాదక ద్రవ్యాల సరఫరా, దొంగచాటుగా ఆయుధాల రవాణాకు ఈ దీవులను మాఫియా శక్తులు వినియోగిస్తున్నట్లు భారత నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ భద్రతను పూర్తిస్థాయిలో పెంచాల్సిన అవసరం ఉంది.

అత్యంత కీలకమైన ప్రాంతంలో ఈ ద్వీపాలు ఉండటంతో హిందూ మహాసముద్రంలో డ్రాగన్‌ చొరబాటును అడ్డుకునే సౌలభ్యముంది. ఇక్కడ 550కు పైగా దీవులు ఉన్నాయి. కేవలం 38 దీవుల్లోనే నివాసప్రాంతాలున్నాయి. జరవాస్‌, సెంటినలీస్‌ తదితర ఆటవిక తెగలకు చెందినవారు జనజీవన స్రవంతిలో కలిసేందుకు ఇష్టం పడటంలేదు. వీరి జీవనానికి ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా మౌలికసౌకర్యాలు ఏర్పాటు చేపట్టాలని పర్యావరణ సంఘాలు కోరుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా దీవుల మధ్య సరైన రవాణా సదుపాయాలు లేవు. జపాన్‌ ఆర్థికసాయంతో మౌలిక సదుపాయాలకు రూపకల్పన జరుగుతోంది. షిబ్‌పూర్‌, క్యాంప్‌బెల్‌ బే ప్రాంతాల్లో నావికాదళ కేంద్రాల్నీ విస్తరింపజేస్తున్నాయి. దిగ్లిపూర్‌ నుంచి రాజధాని పోర్ట్‌బ్లెయిర్‌ వరకు 240 కి.మీ. పొడవైన రైలుమార్గ నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయి. ఇతర దేశాల నౌకలు అక్రమంగా భారత సముద్రజలాల్లోకి ప్రవేశించకుండా ఉండేందుకు యుద్ధనౌకల నుంచి అణ్వాయుధాలు ప్రయోగించగలిగే క్షిపణుల సదుపాయం ఉండాలని రక్షణ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మౌలిక సౌకర్యాల విస్తరణ
పోర్ట్‌బ్లెయిర్‌లో త్రివిధ దళాల కమాండ్‌ ఉండటంతో అనేక ద్వీపాల్లో సాయుధ దళాలను, భారీ ఆయుధ సామగ్రిని మోహరించేందుకు చర్యలు చేపడుతున్నారు. అమెరికా, జపాన్‌ సహకారంతో సముద్రంలో ఎలాంటి ధ్వనినైనా పసిగట్టే ‘సెన్సర్ల’ను అమర్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిద్వారా అక్రమంగా ప్రవేశించే జలాంతర్గాములు, నౌకలను అడ్డుకోవచ్చు. దేశ ప్రధాన భూభాగానికి సుదూరంగా ఉండే దీవుల్లో అంతర్జాల సదుపాయం తక్కువగా ఉంది. డిజిటల్‌ అనుసంధానం కోసం చెన్నై నుంచి పోర్ట్‌బ్లెయిర్‌ వరకు సముద్రగర్భంలో ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్‌ నిర్మాణం ఈ ఏడాది పూర్తికానుంది. దీని ద్వారా బ్రాడ్‌బ్రాండ్‌ వినియోగం పెరగడంతో పాటు అంతర్జాలం ద్వారా ప్రభుత్వసేవలు త్వరితంగా నిర్వహించేందుకు వీలు కలుగుతుంది. కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ దీపావళి సందర్భంగా ఇక్కడ పర్యటించి రక్షణ అంశాలపై చర్చించారు. క్యాంప్‌బెల్‌ బేలోని ఐఎన్‌ఎస్‌ బాజ్‌లో రన్‌వేను విస్తరించనున్నారు. ఇక్కడ నుంచే మలక్కా జలసంధిలో నౌకల సంచారంపై నిఘాపెట్టవచ్చు. అమెరికా, జపాన్‌, ఇండొనేసియా తదితర దేశాల సహకారంతో ప్రారంభమైన పథకాలు పూర్తయితే ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అండమాన్‌ ద్వీపాలు పూర్తిస్థాయి సైనిక స్థావరంగా అవతరించి శత్రుదుర్భేద్యంగా మారనున్నాయి.

- కొలకలూరి శ్రీధర్‌
Posted on 07-01-2018