Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

ఆంక్షలు దాటి... ఆర్థిక శక్తిగా

* పుతిన్‌ సారథ్యంలో రష్యా పయనం

ప్రస్తుతం రష్యా ఆర్థికస్థితి ఎలా ఉంది? మూడు కారణాల వల్ల ఈ ప్రశ్నకు విశేష ప్రాముఖ్యం ఏర్పడింది. ఒకటి రష్యాలో బోల్షెవిక్‌ విప్లవం (1917) జరిగి 2017తో నూరేళ్లు పూర్తవడం. రెండు- సోవియట్‌ యూనియన్‌ పతనమై (1991) 25 ఏళ్లు దాటిపోవడం, మూడు- ఈ ఏడాది మార్చి 18న అధ్యక్ష ఎన్నికలు జరగనుండటం. ఈ ఎన్నికల్లో వ్లాదిమిర్‌ పుతిన్‌ నాలుగోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఖాయమే. ఈ నేపథ్యంలో నేడు రష్యా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలేమిటి, అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షలు రష్యాను ఆర్థికంగా దెబ్బతీశాయా అన్నది విశ్లేషించడం సముచితంగా ఉంటుంది.

పటిష్ఠ పునాదులు
1917 విప్లవం ద్వారా అధికారంలోకి వచ్చిన వెంటనే బోల్షెవిక్కులు మార్క్స్‌ భావజాలానికి అనుగుణంగా సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ స్థాపనకు పునాది వేశారు. వ్యవసాయ భూములు, పరిశ్రమలు, బ్యాంకులను జాతీయం చేశారు. వెంటనే అంతర్యుద్ధం విరుచుకుపడి ఆహార సంక్షోభానికి దారితీయడంతో దాని నుంచి గట్టెక్కడానికి బోల్షెవిక్‌ ప్రభుత్వం నూతన ఆర్థిక విధానాన్ని చేపట్టక తప్పలేదు. అది చక్కని ఫలితాలు ఇవ్వడం వల్ల 1929లో యావత్‌ ప్రపంచం ఆర్థికంగా కుంగుబాటుకు లోనైనా, సోవియట్‌ ఆర్థిక వ్యవస్థ చెక్కుచెదరలేదు. రెండో ప్రపంచయుద్ధం మొదలయ్యేటప్పటికి సోవియట్‌ పారిశ్రామికంగా పటిష్ఠమైన పునాది వేసుకుని ఉంది. యుద్ధానంతరం 1950 నుంచి 1975 వరకు ఏటా అయిదు శాతం ఆర్థికాభివృద్ధి రేటును అందుకునేది. ఆ తరవాత అమెరికా కూటమితో ప్రచ్చన్న యుద్ధం, అఫ్గాన్‌ యుద్ధం, స్వదేశంలో అవినీతి, ద్రవ్యోల్బణం, కార్ఖానాల్లో కార్మికుల గైరు హాజరీ పెరగడం, అధికారులు ఉత్పత్తిని, అభివృద్ధిని ఉన్నదానికన్నా ఎక్కువచేసి చూపడం వంటి కారణాల వల్ల సోవియట్‌ ఆర్థిక వ్యవస్థ క్రమంగా సంక్షోభంలోకి జారిపోయింది. 1985లో పగ్గాలు చేపట్టిన గొర్బచెవ్‌ పెరెస్త్రయికా (పునర్వ్యవస్థీకరణ) పేరిట సంస్కరణలు చేపట్టి ఆర్థిక రథాన్ని గాడిన పెట్టాలని చూసి విఫలమయ్యారు. సంస్కరణలు అరకొరగా ఉండటమేకాదు, అవి చాలా ఆలస్యంగా చేపట్టినవి కావడంతో 1991నాటికి సోవియట్‌ కుప్పకూలిపోయింది. ఆ సంవత్సరం ఆర్థికాభివృద్ధి రేటు మైనస్‌ 17 శాతానికి పడిపోయి, కరెన్సీ విలువ పతనమె, ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకుంది. 1998లో పాత అప్పులు తీర్చలేని దుస్థితి దాపురించింది. ఆపైన బోరిస్‌ ఎల్సిన్‌, పుతిన్‌లు చేపట్టిన సంస్కరణలవల్ల 1999 నుంచి పరిస్థితి కుదుటపడసాగింది. తదుపరి దశాబ్దంలో రష్యా మళ్ళీ అయిదు శాతానికి పైగా వృద్ధిరేటు అందుకొంది. 2008లో ప్రపంచమంతటా ఆర్థిక మాంద్యం నెలకొన్నా, అధిక చమురు ధరల పుణ్యమా అని రష్యా గట్టెక్కగలిగింది. ఇప్పుడు మళ్ళీ సంక్షోభం ముంగిట తారట్లాడుతోంది. దీనికి ప్రధాన కారణం- క్రిమియాను ఆక్రమించుకున్నందుకు రష్యాపై అమెరికా, ఐరోపా సమాఖ్య (ఈయూ) విధించిన ఆర్థిక ఆంక్షలే. ఇందుకు ప్రతిగా రష్యా సైతం అమెరికా, ఈయూలపై ఆంక్షలు విధించింది.

2016లో రష్యా 28,500 కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులు చేయగా, వాటిలో 55 శాతం ఒక్క ఐరోపా సమాఖ్య (ఈయూ) దేశాలకే జరిగాయి. తరవాతి స్థానాలను నెదర్లాండ్స్‌ (10.2 శాతం), చైనా (9.8), జర్మనీ (7.4), అమెరికా (3.3), బ్రిటన్‌ (2.5). ఉక్రెయిన్‌ (2.2 శాతం) ఆక్రమించాయి. రష్యా ప్రధానంగా చమురు, ఆయుధాలను ఎగుమతి చేస్తోంది. రష్యన్‌ చమురు, సహజ వాయువులు లేకుండా ఐరోపా దేశాలకు గడవదు కాబట్టి ఈ రెండింటి ఎగుమతిపై ఆంక్షలు విధించలేదు. ఉక్రెయిన్‌ చమురు అవసరాల్లో 98 శాతానికి రష్యన్‌ ఎగుమతులే ఆధారం. జర్మనీ (30 శాతం), ఫ్రాన్స్‌ (17 శాతం), ఇటలీ (28), బెల్జియం (30), బ్రిటన్‌ (13), గ్రీస్‌ (40 శాతం) చమురు అవసరాల కోసం రష్యాపై ఆధారపడుతున్నాయి. 2015లో పీపాకు 50 డాలర్లుగా ఉన్న చమురు ధర, నేడు 70 డాలర్లకు పెరిగింది. ఇది రష్యాకు ఆర్థికంగా ఎంతో వూరటనిస్తుంది. చమురు ఆదాయం పెరుగుతున్నకొద్దీ రష్యా ఆర్థిక పరిస్థితి కుదుటపడి విదేశ ద్రవ్యనిల్వలు ఇనుమడిస్తాయి. దాదాపుగా రష్యా ఆయుధ ఎగుమతులన్నీ ఐరోపాయేతర దేశాలకే జరుగుతాయి. కానీ బ్రిటన్‌, ఫ్రాన్స్‌లతో గతంలో కుదిరిన కొన్ని ఒప్పందాలకు మాత్రం విఘాతం కలుగుతోంది. చమురు అన్వేషణకు ఉపయోగించే యంత్రాలు, వ్యవసాయ పరికరాలు, మోటారు వాహనాలను రష్యా దిగుమతి చేసుకొంటుండగా చమురు అన్వేషణ యంత్రాలపై మాత్రమే ఆంక్షలు విధించారు. దీనికి ప్రతిగా మోటారు వాహనాలు, వ్యవసాయ యంత్రాలను కూడా ఈయూ దేశాల నుంచి దిగుమతి చేసుకోబోమని రష్యా ప్రకటించింది. దీనివల్ల ఇటలీ, పోలండ్‌ తదితర ఈయూ దేశాలు నష్టపోతున్నాయి. రష్యా, అమెరికాల మధ్య నేరుగా చెప్పుకోదగిన వ్యాపార సంబంధాలు లేవు కాబట్టి ఆంక్షల ప్రభావం అతి స్వల్పం. అదీ కాకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాటలకు చేతలకూ పొంతనే ఉండదు. రష్యాతో సమస్యలన్నింటినీ పరిష్కరించుకొంటానని ఎన్నడో ప్రకటించిన ట్రంప్‌ కనీసం ఆంక్షలనైనా ఎత్తివేయలేదు. రష్యాను మళ్ళీ జి-8 దేశాల బృందంలోకి చేర్చుకోవాలని జపాన్‌ అంటున్నా ఆ దిశగా అడుగు ముందుకు పడలేదు. రష్యా రాజకీయ వ్యవస్థ, దాని ఆర్థిక పునాదులు పటిష్ఠంగా ఉన్నాయి. తనను తాను మరింత పరిపుష్టం చేసుకోవాలంటే రష్యా డాలర్లు, యూరోల్లో కాకుండా సొంత కరెన్సీ రూబుళ్లలోనే వ్యాపారం నిర్వహించాలి. ఇతర దేశాల కరెన్సీలో తీసుకున్న రుణాలు, వాటిపై వడ్డీని తన కరెన్సీలో చెల్లించే విధంగా ఒప్పందాలు కుదుర్చుకోవాలి. ప్రధానంగా చమురు ఎగుమతులపైనే ఆధారపడకుండా వివిధ రకాల సరకులు, సేవలను ఎగుమతి చేయాలి. రష్యా ఐరోపా నుంచి తన దృష్టిని ఆసియావైపు మళ్లిస్తూ చైనా, భారత్‌, కొరియాలతో వ్యాపార సంబంధాలను విస్తరించుకొంటోంది. రష్యన్‌ ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగాన్ని పటిష్ఠపరచడానికి భారత్‌ ఎంతో తోడ్పడగలదు.

భవిష్యత్తు ఎలా ఉంటుంది?
చమురు ధరలు పడిపోయినా, అమెరికా, ఈయూలు ఆర్థిక ఆంక్షలు విధించినా రష్యా దెబ్బతినకుండా నిలదొక్కుకొందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) 2017 నివేదిక ధ్రువీకరించింది. 2018లో రష్యా వృద్ధిరేటు 1.4 శాతంగా ఉంటుందని అంచనా కట్టింది. 2014లో రష్యా కరెన్సీ విలువ తగ్గినా 2017లో తిరిగి కోలుకుంది. 2014లో ఒక డాలర్‌ ధర 80 రూబుళ్లు. 2017లో 56 రూబుళ్లకే ఒక డాలర్‌ లభించడమే దీనికి నిదర్శనం. రష్యా దగ్గర 45 వేలకోట్ల డాలర్ల విదేశ ద్రవ్య నిల్వలు ఉన్నాయి. కాబట్టి తన కరెన్సీ విలువ తగ్గకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడగలదు. ప్రస్తుతం రష్యాలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంది. ఈ మధ్య రష్యాకు మళ్ళీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) వస్తున్నాయి. 2016లో ఈ మార్గంలో 3,600 కోట్ల డాలర్లు ప్రవహించగా, ఒక్క భారతదేశమే 800 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. వ్యాపార సౌలభ్య సూచీలో 2012లో 118వ స్థానంలో ఉన్న రష్యా, 2017లో 35వ స్థానానికి ఎగబాకింది. ఎన్ని ఆంక్షలున్నా రష్యా ఈ విజయం సాధించడం ప్రశంసనీయం. భారత్‌-రష్యా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రస్తుత 700 కోట్ల డాలర్ల నుంచి 3,000 కోట్ల డాలర్లకు పెంచాలని మోదీ-పుతిన్‌లు నిశ్చయించారు. తన భూభాగంలో దూరప్రాచ్య ప్రాంతాలను అభివృద్ధి చేయడంపై ప్రస్తుతం రష్యా దృష్టి కేంద్రీకరించిన దృష్ట్యా, భారతీయ సంస్థలు రష్యాలో పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయం. అమెరికా, ఈయూలు విధించిన ఆర్థిక ఆంక్షలను ఖాతరు చేయకుండా రష్యా వృద్ధి పథంలో దూసుకెళ్తొంది. పుతిన్‌ పాలనలో రష్యా బలంగా సుస్థిరంగా నిలచింది. బలమైన రష్యా, ఐరోపాతోపాటు యావత్‌ ప్రపంచ సుస్థిరతకు తోడ్పడుతుంది. పటిష్ఠ రష్యా ప్రపంచ రాజకీయ యవనికపై భారత్‌కు బలీయ అండగా నిలుస్తుంది.

- ఎ.శ్రీహరి నాయుడు
(రచయిత- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ సంస్థలో ఆర్థికవేత్త)
Posted on 20-01-2018