Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

అగ్రరాజ్యం తుపాకి భాష

* పెచ్చరిల్లుతున్న విష సంస్కృతి

‘రాజకీయనేతలు బంగారు పూత పూసిన భవనాల్లో ఉంటారు. సెనేట్‌కు సభ్యులుగా ఎన్నికయ్యేందుకు అనేకమందికి జాతీయ రైఫిల్‌ సంఘం నిధులు సమకూర్చింది. కఠినమైన తుపాకీ నియంత్రణ చట్టాలు హింసను తగ్గించలేవని వారు ప్రకటించారు. మంచివాడి చేతిలో ఆయుధం, చెడ్డవాడి చేతిలోని మారణాయుధాన్ని నియంత్రించేందుకు ఉపయోగపడుతుందన్నది వారి వాదన. ఒకవేళ సాక్షాత్తు అధ్యక్షుడే ఇక్కడ పరామర్శకు వస్తే రైఫిల్‌ సంఘం నుంచి ఎంత సొమ్ము ముట్టిందని ప్రశ్నిస్తాను. ఆయుధాలు మారుతున్నాయి. చట్టాలు మాత్రం అలాగే ఉన్నాయి’ అంటూ కన్నీళ్లతో ఎమ్మా గొంజాలెజ్‌ చేసిన ప్రసంగం అమెరికానే కాదు- యావత్‌ ప్రపంచాన్నీ కదిలించింది. అమెరికన్‌ సమాజంలో పెరిగిపోతున్న తుపాకి సంస్కృతిని ప్రోత్సాహిస్తున్నవారిపై 18 ఏళ్ల విద్యార్థిని ఎమ్మా సంధించిన విమర్శనాస్త్రాలు అక్కడి సగటు పౌరుడి ఆవేదనను వెల్లడిస్తున్నాయి. ఫ్లోరిడాలోని పార్క్‌లాండ్‌ పాఠశాలకు చెందిన విద్యార్థి క్రూజ్‌ స్వయంచాలిత(ఆటొమేటిక్‌) ఆయుధాలతో 17మంది సహ విద్యార్థులను దారుణంగా హతమార్చడంతో ఆయుధ నియంత్రణ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. అమెరికన్‌ సమాజంలో ఆయుధ సంస్కృతి పెచ్చరిల్లుతోందంటూ అక్కడి మేధావులు, సామాజికవేత్తలు చేస్తున్న హెచ్చరికలు బధిర శంఖారావాలవుతున్నాయి.

విచ్చలవిడి అమ్మకాలు
అమెరికాలో విద్యార్థుల చేతుల్లో తుపాకులు ఉండటం సాధారణ విషయంగా మారింది. చిన్న విషయానికే వారు సహచరులపై కాల్పులకు తెగబడుతున్నారు. అక్కడ ప్రతి వందమందిలో 89మంది వద్ద తుపాకులు ఉన్నాయని సర్వేలో తేలడం విస్మయం కలిగించే అంశం. ఏటా కాల్పుల్లో వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారంటూ స్వచ్ఛంద సంస్థలూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హత్యలు, దాడులు, ప్రమాదాలు, ఆత్మహత్యల్లోనూ తుపాకులను విరివిగా ఉపయోగిస్తున్నారు. వీటి అమ్మకాలపై ఆంక్షలు పెద్దగా లేకపోవడంతో విచ్చలవిడిగా విక్రయాలు సాగుతున్నాయి. చేతి తుపాకుల నుంచి రైఫిళ్ల వరకు అన్నీ విపణుల్లో సులభంగా అందుబాటులో ఉంటున్నాయి. స్వీయ రక్షణ పేరిట సాధారణ పౌరులు వీటిని కొనుగోలు చేస్తుంటారు. అదే క్రమంలో మానసిక రోగుల చేతుల్లోకి తుపాకులు చేరుతుండటం సమస్యాత్మకవుతోంది. సామూహిక హత్యాకాండకు అక్కడే బీజాలు పడుతున్నాయంటూ అమెరికన్‌ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. నిరుడు లాస్‌వెగాస్‌లో స్టీఫెన్‌ పెడాక్‌ అనే వృద్ధుడు ఆటొమేటిక్‌ ఆయుధాలతో జరిపిన కాల్పుల్లో 50మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్యంలో సమాఖ్య విధానంవల్ల ప్రతి రాష్ట్రం విభిన్న ఆయుధ నియంత్రణ చట్టాలను అమలు చేస్తుండటంతో, నేరగాళ్లు సులువుగా మారణహోమానికి పాల్పడుతున్నారు.
తుపాకీ కలిగి ఉండటాన్ని అమెరికాలో పౌరులు గౌరవ చిహ్నంగా భావిస్తారు. సామాజిక, ఆర్థిక కోణాలూ ఇందులో ముడివడి ఉంటాయి. తొలినాళ్లలో అమెరికాకు వచ్చిన వలసవాదులు, ఆదివాసులు, జంతువుల దాడులను ఎదుర్కొనేందుకు తుపాకులు వినియోగించేవారు. క్రమేణా అది వారి జీవనంలో అంతర్భాగమైపోయింది. అమెరికా విప్లవంలోనూ తుపాకులు కీలకపాత్ర పోషించాయి. తుపాకుల వాడకంలో నైపుణ్యం కలిగిఉండటంతో అప్పట్లో సాధారణ ప్రజలే సుశిక్షితులైన బ్రిటిష్‌ సైనికులను దీటుగా ఎదుర్కొన్నారు. అనంతరం కాలంలో జరిగిన అంతర్యుద్ధ సమయంలోనూ వీటికి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. అమెరికా రాజ్యాంగంలోని రెండో సవరణ, పౌరులు ఆయుధాలు కలిగిఉండేందుకు అవకాశం కల్పిస్తోంది. స్వేచ్ఛాయుత సమాజం కావాలంటే పౌరులు ప్రజాసైన్యంగా ఉండటంతోపాటు ఆయుధాల వినియోగం వారికి తెలిసి ఉండాలని వివరిస్తోంది. పౌరులు ఆత్మరక్షణగా తుపాకులు కలిగిఉండవచ్చని ఈ సవరణ పేర్కొంటోంది. దుండగుల దాడి నుంచి కాపాడుకోవాలంటే ఆయుధాలు ఉండాలన్నది కొందరి వాదన. అమెరికాలో స్థిరపడిన ఇతర దేశాల ప్రజలకు, వారి సంతతికి కాల్పుల ఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. అమెరికాలో జాతీయ రైఫిల్‌ సంఘాన్ని (ఎన్‌ఆర్‌ఏ) ప్రభావవంతమైన సంస్థగా పరిగణిస్తారు. దీనికి భారీగా లాబీయింగ్‌ ఉండటంతో తుపాకుల అమ్మకాలపై నియంత్రణకు ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని విమర్శలు వస్తున్నాయి.
తుపాకుల వినియోగాన్ని అరికట్టేందుకు అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు రిపబ్లికన్లు, డెమొక్రాట్లు అనేక రకాల ప్రతిపాదనలు చేశారు. పాఠశాలల్లో ఎంపిక చేసిన అధ్యాపకులకు సైనిక శిక్షణ ఇవ్వడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో దుండగులను ఎదుర్కొనే అవకాశముందని ట్రంప్‌ సూచించారు. దీనిపై మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. అమెరికాలో జరుగుతున్న కాల్పుల ఘటనలను పరిశీలిస్తే అత్యాధునికమైన ఆయుధాలతో దాడులు చేస్తున్నట్లు బోధపడుతోంది. రైఫిల్స్‌ నుంచి ఏకకాలంలో వందలాది తూటాలు రావడంతో ప్రాణనష్టం కూడా అధికంగానే ఉంటోంది. ఆటొమేటిక్‌ తుపాకుల స్థానంలో హ్యాండ్‌గన్లను మాత్రమే విక్రయించాలని కొందరు సూచిస్తున్నారు. అయితే జాతీయ రైఫిల్‌ సంఘం దీనికి సుముఖంగా లేదు. ఎన్నికల్లో పోటీచేసేవారికి ఎన్‌ఆర్‌ఏ భారీగా విరాళాలు అందిస్తోంది. అందువల్ల ప్రజాప్రతినిధులు ఆంక్షల యత్నాలకు అడ్డు తగులుతున్నారు. తుపాకుల సంస్కృతిని నియంత్రించడంలో కొన్ని దేశాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. లైసెన్సులు లేని తుపాకులను స్వాధీనం చేస్తే ఎలాంటి శిక్షలుండవని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దాదాపు 57 వేల తుపాకులను ప్రజలు అధికారులకు అప్పగించారు. నార్వేలో సెమీ ఆటొమేటిక్‌ రైఫిల్స్‌ విక్రయంపై నిషేధం విధించాలని ప్రభుత్వం ప్రతిపాదనను సిద్ధం చేసింది. అమెరికాలోని వివిధ రాష్ట్రాల చట్ట నిబంధనలు లోపభూయిష్ఠంగా ఉండటంతో నేర స్వభావులు సైతం వాటిని అవలీలగా కొనుగోలు చేస్తున్నారని నిఘావర్గాలు విశ్లేషించాయి. కొనుగోలుదారులకు సంబంధించి సమగ్ర వివరాలు తెలుసుకొని విక్రయించాలని అవి కోరుతున్నాయి. కొన్ని ఆటొమేటిక్‌ రైఫిల్స్‌ ఏకంగా నిమిషానికి 800 రౌండ్లు కాల్చగలవు. ఇలాంటి రైఫిల్స్‌ను పౌరులు కొనుగోలు చేయకుండా ఆంక్షలు విధించినట్లు శ్వేతసౌధ వర్గాలు ప్రకటించాయి. 21 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారికి ఆయుధాలు విక్రయించబోమని ఇప్పటికే కొన్ని మార్ట్‌లు ప్రకటించాయి.

పెరుగుతున్న మద్దతు
పార్క్‌లాండ్‌ ఘటన అనంతరం అనేక సంస్థలు ఎన్‌ఆర్‌ఏతో సంబంధాలు తెంచుకున్నాయి. యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల తరహాలో ఆయుధాల విక్రయంపై అమెరికాలో నిషేధం విధించడం కష్టమని కొందరు న్యాయనిపుణులు భావిస్తున్నారు. అమెరికా రెండో రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి విరుద్ధంగా ఒకవేళ నిషేధానికి యత్నిస్తే న్యాయపరమైన ఇబ్బందులు తప్పవని వారు చెబుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఆయుధాల విక్రయాల్లో కఠినమైన నిబంధనలు పాటించడం, ఆటొమేటిక్‌ రైఫిల్స్‌ను నిషేధించడం తదితర చర్యలతో ఉపశమనం పొందవచ్చని సలహాలు ఇస్తున్నారు. పార్క్‌లాండ్‌ ఘటన అనంతరం స్పందించిన ఫ్లోరిడా గవర్నర్‌ తుపాకులను కొనుగోలు చేసేందుకు 21 సంవత్సరాలు నిండినవారు మాత్రమే అర్హులని చట్టాన్ని అమలులోకి తెచ్చారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఎన్‌ఆర్‌ఏ ఆ దేశ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఫ్లోరిడా ఘటన మరచిపోకముందే క్యాలిఫోర్నియాలో యాంట్‌విల్లేలోని వెటరన్స్‌ హోమ్‌లో ఒక సాయుధుడు ముగ్గురు మహిళలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆయుధాల విక్రయాలను నియంత్రించాలన్న డిమాండ్‌కు అమెరికన్‌ పౌరుల మద్దతు పెరుగుతోంది. భవిష్యత్తులో మరిన్ని దారుణ ఘటనలు సంభవించకముందే అమెరికా ప్రభుత్వం మేల్కొని తగు చర్యలు ప్రారంభించాలని అక్కడి సమాజం కోరుతోంది!

- సుందరీ ఆల్‌ఫ్రెడ్‌
Posted on 15-03-2018