Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

ఆధిపత్యం కోసం కొత్తకుంపట్లు

* మళ్ళీ భగ్గుమన్న సిరియా

ముక్కాలి పీట కూర్చోవడానికి బాగుంటుంది కాని, రాజకీయాలు మాత్రం మూడు కాళ్ల మీద నడవలేవు! సిరియా ప్రజలకు నరకం చూపిన ముక్కోణ సమరం ఎట్టకేలకు ముగిసినా, తాజాగా కొత్త త్రికోణ పోరు విరుచుకుపడి ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. ఇంతకుముందు ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌), అమెరికా, రష్యా అనుయాయ సేనల మధ్య నడచిన పోరాటంలో ఐసిస్‌ చిత్తయింది. ఆపైన రష్యా అండదండలున్న సిరియా ప్రభుత్వ సేనలు; అమెరికా, సౌదీల మద్దతు గల ప్రతిపక్ష సేనలూ ఒకరినొకరు చంపుకోవడం ఆపడంతో ప్రజలు హమ్మయ్య అని నిట్టూర్చారు. సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ సర్కారును కాపాడటానికి రంగంలోకి దిగిన రష్యా తన లక్ష్యం నెరవేరింది కాబట్టి అక్కడి నుంచి తన సేనలను వెనక్కు రప్పిస్తానని ప్రకటించింది. అంతలోనే సిరియా ప్రభుత్వం మళ్ళీ ప్రతిపక్ష సేనల మీద విరుచుకుపడగా, కొత్తగా కుర్దు దళాల పనిపట్టడానికి టర్కీ సైన్యం బరిలో దూకింది. అదలాఉంటే అమెరికా దాడిలో కొందరు రష్యన్లు మరణించగా, మృతులు తమ సైనికులు కారని, కిరాయి సైనికులని రష్యా వివరించింది. ఈలోపు ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య వైరాలు భగ్గుమన్నాయి. సిరియాలో శాంతి నెలకొంటుందని అందరూ ఆశపడుతున్న సమయంలో అన్ని పక్షాలూ పరస్పరం పీకలు నులుముకోవడం విడ్డూరం. 2011 మార్చి నుంచి 4.65 లక్షల మంది సిరియన్ల ఉసురు తీసి, దేశ జనాభాలో సగం (1.2 కోట్ల)మందిని రోడ్డుకు ఈడ్చిన అంతర్యుద్ధం ఇప్పుడు ఆధిపత్య సమరంగా మారింది.

నివురుగప్పిన నిప్పు
ఐసిస్‌ చిత్తు కావడంతో పశ్చిమాసియాపై, ముఖ్యంగా సిరియాపై ఆధిపత్యం కోసం సున్నీ సౌదీ అరేబియా, షియా ఇరాన్‌ల మధ్య పోటీ రాజుకొంది. ఇరాన్‌, రష్యాలు సిరియాలో బషర్‌ అల్‌ అసద్‌ సర్కారుకు అండనిస్తుంటే; సిరియా ప్రతిపక్ష సేనలకు సౌదీ, కుర్దులకు అమెరికా పెద్ద దిక్కుగా నిలుస్తోంది. ఐసిస్‌ రాజధాని నగరం రక్కాను గత అక్టోబరులో కైవసం చేసుకున్న సిరియా ప్రజాస్వామిక దళాలు (ఎస్‌డీఎఫ్‌) కుర్దులతో ఏర్పడ్డాయి. వాటికి పరమ గురువు అమెరికానే. మరోవైపు ప్రతిపక్ష సేనలతో కాల్పులు విరమించిన సిరియా ప్రభుత్వం గత డిసెంబరుకల్లా యూఫ్రటిస్‌ నది పడమర ప్రాంతాలను వశపరచుకుంది. కుర్దుల ఎస్‌డీఎఫ్‌ ఆ నదికి తూర్పు ప్రాంతాలను స్వాధీనపరచుకుంది. కుర్దుల జోరుతో టర్కీ బెదిరిపోయి ఉన్నట్టుండి దాడులకు దిగడం పరిస్థితిని కొత్త మలుపు తిప్పింది.
టర్కీ కూడా అమెరికా అనుయాయి అయినప్పటికీ, కుర్దుల స్వాతంత్య్ర పిపాస ఆ దేశానికి బెదురు పుట్టిస్తోంది. ఇరాన్‌, ఇరాక్‌, టర్కీ, సిరియాల్లో వ్యాపించిఉన్న కుర్దు ప్రాంతాలను కలిపి సొంతంగా కుర్దిస్థాన్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నది కుర్దుల చిరకాల స్వప్నం. అమెరికా మద్దతుతో తమ ఆశయం సాధించుకోవాలని ఆశించిన కుర్దులు, ఐసిస్‌పై పోరులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇరాన్‌లోని కుర్దు ప్రాంతాలకు స్వయంప్రతిపత్తి లేకపోయినా ఇరాక్‌లో ఆ హోదా ఉంది. సిరియాలో తమ ప్రాబల్య ప్రాంతాల్లో కుర్దులు సొంత ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు. దీంతో ప్రమాదం శంకించిన టర్కీ ఇప్పుడు కుర్దులపై నేరుగా దాడులకు దిగింది.
మరోవైపు సిరియా ప్రభుత్వ సేనలు కాల్పుల విరమణను ఉల్లంఘించి, ప్రతిపక్ష సేనల అధీనంలోని ఏకైక రాష్ట్రం ఇద్లిబ్‌లో కొన్ని ప్రాంతాలను ఈ జనవరిలో ఆక్రమించాయి. దేశ రాజధాని డమాస్కస్‌ శివార్లలోని ప్రతిపక్ష కంచుకోట తూర్పు ఘౌటామీద ఫిబ్రవరిలో దాడిచేశాయి. నిజానికి రష్యా మధ్యవర్తిత్వంతో కుదిరిన సయోధ్య ఒప్పందం ప్రకారం ఇద్లిబ్‌, తూర్పు ఘౌటాల్లో ప్రతిపక్ష అనుయాయులు స్వేచ్ఛగా జీవించాల్సింది. కానీ, ఐసిస్‌ ఓడిపోయిన దరిమిలా సిరియా భాగ్యవిధాతలుగా అవతరించాలని రకరకాల శక్తులు పోటీపడుతున్నందువల్ల పాత హామీలు నీటిమీద రాతలుగా తేలాయి. సిరియా సంక్షోభం సమసిపోయేంతవరకు తమ సేనలను అక్కడి కుర్దు ప్రాంతాల్లో నిలిపి ఉంచుతామని అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్‌ టిలర్‌సన్‌ ప్రకటించడంతో కోపోద్రిక్తమైన టర్కీ, కుర్దుల అదుపులోని ఆఫ్రిన్‌పై దాడికి దిగింది. అక్కడ అమెరికన్‌ సేనలు లేవు కాని, దగ్గర్లోని మన్‌బిజ్‌ పట్టణంలో అవి ఉన్నాయి. నాటో సైనిక కూటమిలో అమెరికా, టర్కీలు భాగస్వాములే అయినా, అవసరమైతే మన్‌బిజ్‌పైనా దాడిచేస్తామని టర్కీ ప్రకటించడం ప్రమాద సంకేతం.
ఐసిస్‌ ఖతమయ్యాక కూడా సిరియాలో అమెరికా తిష్ఠవేయడం రష్యాకూ గిట్టడంలేదు. బహుశా అమెరికన్లు ఎంతవరకు బరిలో నిలబడతారో పరీక్షించడం కోసం తూర్పు సిరియాలోని వారి స్థావరంపై సిరియా ప్రభుత్వసేనలు దాడికి దిగాయి. వీరిలో రష్యన్‌ కిరాయి సైనికులూ ఉన్నారు. దాడిని తిప్పికొట్టడానికి అమెరికా గగనతలం నుంచి క్షిపణులు, బాంబులు కురిపించగా కనీసం 300 మంది రష్యన్లు మరణించారు. ప్రైవేటు సంస్థ వాగ్నర్‌కు చెందిన ఈ కిరాయి సైనికులతో తమకు సంబంధంలేదని రష్యా ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవమేమిటంటే తన వ్యూహ ప్రయోజనాలను నెరవేర్చుకోవడంకోసం రష్యా ప్రైవేటు సేనలను పంపుతుందని క్రిమియాలో 2014లోనే రుజువైంది. సిరియాలో టార్టస్‌, ఖమైమిమ్‌లలోని శాశ్వత స్థావరాల్లో రష్యన్‌ సేనలు యథాప్రకారం కొనసాగుతాయని పుతిన్‌ సర్కారు ప్రకటించింది. ఈ నెల 18న అధ్యక్ష ఎన్నికలు జరగనున్న దృష్ట్యా సిరియాలో రష్యా ప్రాబల్యానికి ఢోకాలేదని ఓటర్లకు చాటడం పుతిన్‌ వ్యూహం.

ఐరాస తీర్మానానికి చుక్కెదురు
సిరియాపై పట్టుకోసం నడుస్తున్న సమరంలో ఇరాన్‌ తక్కువేమి తినలేదు. లెబనాన్‌లో తన అనుయాయులైన హెజ్బొల్లాకు సిరియా మీదుగా ఆయుధాలు పంపుతుంటే, హెజ్బొల్లా దళాలు ఇజ్రాయెల్‌ అధీనంలోని గోలన్‌ హైట్స్‌ ప్రాంతానికి దగ్గరగా జరుగుతున్నాయి. గత నెలలో తన గగనతలంలోకి ప్రవేశించిన ఇరానీ డ్రోన్‌ను ఇజ్రాయెల్‌ కూల్చివేసింది. దానికిముందు సిరియాలో ఇరానీల అధీనంలో ఉన్న ఒక స్థావరంపై బాంబులు కురిపించింది. ఒక ఇజ్రాయెలీ జెట్‌ ఫైటర్‌ను సిరియా దళాలు కూల్చివేసినందుకు ప్రతిగా ఎదురుదాడి జరిపింది. పశ్చిమాసియాలో ఇరాన్‌ ప్రాబల్యం ఎంత విస్తరిస్తుంటే ఇజ్రాయెల్‌ భయాలు అంతగా పెరిగిపోతున్నాయి. రెండు దేశాలూ బహిరంగంగా యుద్ధానికి దిగకపోవచ్చు కానీ, పరోక్ష సంఘర్షణలను మాత్రం ముమ్మరం చేయవచ్చు. ఈ అవాంఛనీయ పరిణామాలను నివారించడానికని సిరియాలో 30 రోజులపాటు అన్ని పక్షాలూ కాల్పులు విరమించాలంటూ గత నెల 24న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానించింది. సిరియా ప్రభుత్వం, ఇరాన్‌, టర్కీలు పోరు ఆపేదిలేదని ప్రకటించి ఆ తీర్మానాన్ని బుట్టదాఖలు చేశాయి. ఇక రష్యా శత్రులక్ష్యాలను గురితప్పకుండా ఛేదించే రాకెట్లను, ఇతర అధునాతన ఆయుధాలను సిరియాకు తరలించింది. అమెరికా స్టెల్త్‌ బాంబర్లను మోహరించినందుకు ప్రతిగా రష్యా అయిదోతరం సుఖోయ్‌ 57 ఫైటర్లను రంగంలోకి దించింది. ఈ సరికొత్త ఆయుధాలను యుద్ధరంగంలో పరీక్షించి చూస్తానంటోంది. అంతటితో ఆగక సిరియాలో ఇరాన్‌ కార్యకలాపాలను యథేచ్చగా సాగనిస్తోంది. రష్యా, సిరియా, ఇరాన్‌, హెజ్బొల్లాల దూకుడు తన అస్తిత్వానికే ఎసరు తెస్తాయని ఇజ్రాయెల్‌ ఆందోళన చెందుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌ అణు ఒప్పందాన్ని తుంగలో తొక్కుతానంటూ కత్తులు నూరుతున్నారు. పరిస్థితి చేయిదాటి పశ్చిమాసియాలో యుద్ధం విరుచుకుపడితే అందులో తామూ ఇరుక్కొంటామని ఐరోపా దేశాలు కలవరపడుతున్నాయి. సిరియాగడ్డపై ఎంతకూ తెగని విదేశీ శక్తుల వైరాలు, వ్యూహప్రతివ్యూహాలను చూసి, అసలు సిరియా ప్రజల అగచాట్లు ఎన్నటికైనా తీరుతాయా అని ప్రతి ఒక్కరూ మధనపడుతున్నారు.

- వర ప్రసాద్‌
Posted on 07-03-2018