Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

ఆందోళన పథంలో హాంకాంగ్‌

స్వేచ్ఛను శ్వాసించి, శాంతిని ప్రేమించి, అభివృద్ధిని కాంక్షించే హాంకాంగ్‌ ప్రపంచ మానవాభివృద్ధి సూచీల్లో ఏడో స్థానంలో సగర్వంగా శిరసెత్తుకు నిలుస్తోంది. నూట యాభై ఏళ్లపాటు బ్రిటన్‌ అజమాయిషీలో ఉన్న హాంకాంగ్‌ 1997లో జనచైనా ఆధిపత్యం కిందకు వచ్చాక- దాని ప్రత్యేక ప్రతిపత్తిని 2047దాకా మన్నిస్తామని ‘బేసిక్‌ లా’ పూర్వకంగా బీజింగ్‌ వాగ్దానం చేసింది. దాన్ని ఉల్లంఘించేలా హాంకాంగ్‌ వ్యవహారాల్లో చైనా మేర మీరిన జోక్యం 75 లక్షలమంది హాంకాంగ్‌ వాసుల్లో భవిష్యత్తుపట్ల భయాందోళనల్ని పెంచుతోంది. తాజాగా నేరగాళ్ల అప్పగింత చట్టానికి హాంకాంగ్‌ పాలకులు తలపెట్టిన సవరణలు ప్రజానీకంలో తీవ్ర అలజడి సృష్టించాయి. ‘చైనాకు అప్పగింత వద్దు; ప్రభుత్వమా... సిగ్గు సిగ్గు’ అన్న ప్లకార్డులు చేతపట్టి పదిలక్షలమంది యువజనం వీధుల్లోకి పోటెత్తడం, వారిని నిలువరించడానికి పోలీసులు బాష్పవాయు ప్రయోగాలకు పాల్పడటంతో హాంకాంగ్‌ అట్టుడికిపోయింది. నేరగాళ్ల అప్పగింతపై చట్ట సవరణల్ని భిన్న కోణాల్లో చర్చించి కాదనుకొంటే తిరస్కరించగల వీలున్నా ప్రజలు ఇలా వీధులకెక్కడం బేసబబు అంటూ హాంకాంగ్‌ పాలనాధికారిణి కన్నీటి పర్యంతమైనా- జనంలో గూడుకట్టుకొన్న ఆందోళన మరింత లోతైనది! హాంకాంగ్‌ మహా నేరగాళ్లకు ఆశ్రయంగా మారకుండా చూడటానికే ఈ సవరణలని దాని సమర్థకులు అంటున్నారు. ఈ చట్టాన్ని ఉపయోగించుకొని రాజకీయ ప్రత్యర్థుల్ని, ఇతరుల్ని చైనాకు రప్పించి, చట్టబద్ధ రక్షణలకు దిక్కులేకుండా చేసి శిక్షించడమే బీజింగ్‌ వ్యూహమని ప్రజలు భయపడుతున్నారు. మరో 28 ఏళ్లు స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో తమ బతుకు తాము బతకగల వీలున్నా గుత్తపెత్తందారీ ధోరణులతో బీజింగ్‌ ఇప్పుడే తమను పంజరంలో బంధించాలనుకొంటోందన్న హాంకాంగ్‌ వాసుల భయ సందేహాలు హేతుబద్ధమైనవే. 1997నాటి బ్రిటన్‌-చైనాల సంయుక్త ప్రకటనకు భంగకరంగా చట్టం కూర్పు ఉండరాదన్న బ్రిటన్‌ ప్రధాని హితోక్తి- చైనా పాలకశ్రేణి చెవికెక్కుతుందా, అంటే సందేహమే!

‘మన సామాజిక వ్యవస్థను, సిద్ధాంతాల్నీ ఇతరులపై రుద్దబోము... ఇతర దేశాలు అలా చేయాలనుకొన్నా సమ్మతించబో’ మని 1997లో డెంగ్‌ జియావో పింగ్‌ పదవీ వారసత్వ బాధ్యతలు స్వీకరిస్తూ చైనా అధ్యక్షుడిగా జియాంగ్‌ జెమిన్‌ స్పష్టీకరించారు. ఆ సంవత్సరమే హాంకాంగ్‌ చేతులు మారింది. ‘ఒకే దేశం- రెండు వ్యవస్థలు’గా హాంకాంగ్‌ ప్రత్యేక ప్రతిపత్తిని సమాదరిస్తామని చైనా నేతాగణం తొలినాళ్లలో ప్రకటించినా, 2003లో హాంకాంగ్‌లో ప్రవేశపెట్టిన ఒక బిల్లు- చైనాలో అసమ్మతివాదులను శిక్షించే దానికి నకలుగా ఉండటంతో తొలిసారిగా నిరసనలు పెల్లుబికాయి. జనాగ్రహానికి వెరచి నాడు ప్రభుత్వాలు వెనక్కి తగ్గాయి. హాంకాంగ్‌ పాలనాస్మృతి ప్రకారం అక్కడ పూర్తిస్థాయి ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నది లక్ష్యమైనా- 2017 దాకా పాలనాధికారి (చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌) ఎన్నికకు సార్వత్రిక ఓటింగ్‌ పద్ధతి అనుసరించరాదని 2007లో చైనా నిర్ణయించింది. 2017లో తమ నేతను హాంకాంగ్‌ వాసులు ఎన్నుకోవచ్చుగాని, ఆయా అభ్యర్థుల్ని తాము తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుందని 2014లో షరతు విధించింది. ‘కొరగాని ప్రజాస్వామ్యం’ అంటూ ప్రజలు పదివారాలపాటు తీవ్రాందోళనకు దిగడంతో ఆ సంస్కరణలు అటకెక్కాయి. అయితేనేం, హాంకాంగ్‌ చట్టసభలోని 70 మందిలో 43 మంది చైనా అనుకూలురినే ప్రతిష్ఠించిన బీజింగ్‌- తమ ప్రజాస్వామ్య కాంక్షలను స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అడ్డగోలుగా కాలరాస్తోందని జనవాహిని గట్టిగా విశ్వసిస్తోంది. 2014నాటి ఆందోళనల్లో పాల్పంచుకొన్నవారి అభ్యర్థిత్వాల్ని తోసిపుచ్చడం మొదలు చైనా నిరంకుశ పోకడలు శ్రుతిమించుతున్న నేపథ్యంలో- వ్యక్తి స్వేచ్ఛ, పౌర హక్కుల్ని పణం పెట్టలేమంటూ హాంకాంగ్‌ యువత నినదిస్తున్న తీరు, 1989నాటి తియనన్మెన్‌ స్క్వేర్‌ ఆందోళనల్ని స్ఫురణకు తెస్తోంది!

నవ చైనా నిర్మాతగా వాసికెక్కిన డెంగ్‌ జియావో పింగ్‌- 1989లో ప్రజాతంత్ర స్వేచ్ఛకోసం పరితపించిన వేలమంది యువజనాన్ని తియనన్మెన్‌ స్క్వేర్‌లో యుద్ధ ట్యాంకులతో తొక్కించిన భయానక ఘట్టం చైనా చరిత్రలో పెను చీకటి అధ్యాయం. దానికి సంబంధించిన వాస్తవాలేవీ బయటకు పొక్కకుండా చైనా పాలకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా నాటి దారుణం తాలూకు చిత్ర ప్రదర్శన హాంకాంగ్‌లో కొనసాగుతుండటం- షి జిన్‌పింగ్‌ ప్రభుతకు కంటగింపుగా మారిందన్నది వాస్తవం. మొన్న నాలుగో తేదీన తియనన్మెన్‌ స్క్వేర్‌ ఘటనకు మూడు దశాబ్దాలైన సందర్భాన్ని సంస్మరించుకొన్న హాంకాంగ్‌ తమ భవిష్యత్తరాలకూ అదే గతి పడుతుందేమోనని భీతిల్లుతోంది. చైనా ఆధిపత్యాన్ని తగ్గించేలా విదేశీ శక్తుల ప్రాపకంలో జరిగే ఆందోళనలకు హాంకాంగ్‌ వేదికైౖతే సహించేది లేదని షి జిన్‌పింగ్‌ రెండేళ్లనాడు హెచ్చరించడం గమనార్హం. బీజింగ్‌పట్ల విమర్శనాత్మకంగా ఉన్న పుస్తకాల్ని ప్రచురించి విక్రయించిన నేరానికి అయిదుగుర్ని చైనాకు తీసుకెళ్ళి నిర్బంధించడం- పరిస్థితులు చేయి దాటుతున్నాయన్న జనం భయాలకు ఆజ్యం పోసిందన్నది నిజం. హాంకాంగ్‌ ‘స్వేచ్ఛనూ’ తనదైన రీతిలో అదుపు చెయ్యకపోతే మరో తియనన్మెన్‌ స్క్వేర్‌ ప్రమాదం తప్పదేమోనన్నది బీజింగ్‌ బెదురు. స్వేచ్ఛాప్రియత్వ జాతి లక్షణాన్ని కాపాడుకోలేకపోతే భవిష్యత్తే అగమ్యగోచరమైపోతుందన్నది హాంకాంగ్‌వాసుల గోడు! మూడు దశాబ్దాలనాటి అణచివేతను చైనా పునరావృతం చేసే పరిస్థితులు నేడు లేకున్నా, బీజింగ్‌ కరకు ఊచల పంజరంనుంచి హాంకాంగ్‌ తప్పించుకోగలదా అన్నదే సందేహం. మానవ హక్కుల హననాలు, మరణ శిక్షలతో స్వేచ్ఛా పిపాసులను అదుపు చేయలేమన్న ప్రాప్తకాలజ్ఞత చైనాలో రహిస్తేనే- హాంకాంగ్‌ ఆందోళన చల్లారుతుందన్నది నిర్ద్వంద్వం!

Posted on 14-06-2019