Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

సంక్షోభం నుంచి సంక్షోభంలోకి...

'అఫ్గాన్‌లో మా పోరు ముగిసింది. పదమూడేళ్ల సుదీర్ఘ యుద్ధానికి బాధ్యతాయుతమైన ముగింపు లభించింది. 'సెప్టెంబరు 11' ఘటనకు కారణమైన అల్‌ఖైదాను ధ్వంసం చేశాం. ఉగ్రవాదుల వ్యూహాలను చిత్తు చేసి ఎంతోమంది అమెరికన్ల ప్రాణాలను కాపాడుకోగలిగాం'- అఫ్గానిస్థాన్‌లో యుద్ధ పరిసమాప్తిపై అమెరికా అధ్యక్షుడు ఒబామా మూడు రోజుల క్రితం చేసిన ప్రకటన అది.

'అమెరికా సారథ్యంలోని అంతర్జాతీయ భద్రత సహాయ దళం(ఐఎస్‌ఏఎఫ్‌) తోకముడిచింది. వారి దళాలను వైఫల్యం, నిస్పృహ వెన్నాడుతున్నాయి. ఏమీ సాధించకుండానే తమ పతాకను అవనతం చేసి, వారు వట్టిచేతులతో వెనక్కి వెళ్ళిపోతున్నారు'- యుద్ధం ముగిసిందంటూ అమెరికా, 'నాటో' సేనలు తెలిపిన వెంటనే తాలిబన్లు విడుదల చేసిన ప్రకటన ఇది.

ఒకవైపు అమెరికా, మరోవైపు తాలిబన్లు ఎవరికివారే విజయం తమదే అని ప్రకటించుకుంటున్న పరిస్థితుల్లో గెలుపు ఎవరిదన్న చర్చ పక్కన పెడితే, ఓడింది మాత్రం అఫ్గానీలే! సొంత ప్రణాళికలను అంతర్జాతీయ అవసరాలుగా చిత్రీకరించి అమెరికా నేతృత్వంలో అఫ్గాన్‌లో సాగిన యుద్ధం ఆ దేశం నెత్తిన మరింత అశాంతిని, సంక్షోభాన్నే మోపాయి. సుసంపన్నమైన చరిత్ర కలిగిన అఫ్గాన్‌ సమాజం నేడు సహజత్వం కోల్పోయి ఓ ప్లాస్టిక్‌ పువ్వులా మారిపోయింది. తిరుగుబాటుదారులకు, ప్రభుత్వ దళాలకు మధ్య జరుగుతున్న యుద్ధానల జ్వాలల్లో ఆ పువ్వు కరిగిపోతోంది. పదమూడేళ్ల పోరులో వేలమంది అమాయకులను బలితీసుకుని, అఫ్గాన్‌ను అగ్నిగుండంగా మిగిల్చి, మాదంటే మాది గెలుపంటూ పోటీపడి ప్రకటనలు ఇచ్చుకుంటున్న 'ఉన్మాదం'- నేడు మానవాళిని భయకంపితం చేస్తోంది.

సాధించింది శూన్యం

పాలకుండలో ఉప్పుగల్లు క్షీరాన్ని విరిచేస్తుంది. అదేవిధంగా వ్యక్తిగత అజెండాలతో అమెరికా చిమ్మిన విద్వేష విషం అఫ్గాన్‌ను అతలాకుతలం చేసింది. అంతర్జాతీయ సమాజానికి శత్రువుగా మారిన ఉగ్రవాదాన్ని, వారికి ఆశ్రయమిచ్చేవారిని వదిలేది లేదని హుంకరించి- అల్‌ఖైదాను తుదముట్టించే ఏకైక లక్ష్యంతో మిత్రదేశాల సేనలతో కలిసి అమెరికా 2001లో అఫ్గాన్‌పై విరుచుకుపడింది. అఫ్గాన్‌లో అల్‌ఖైదా అస్తిత్వాన్ని తుడిచిపెట్టాలన్న ప్రకటిత లక్ష్యాన్ని చేరుకోవడం ద్వారా అమెరికా- గెలిచినట్లే! కానీ, సగటు పౌరుల జీవనాన్ని కనీవినీ ఎరుగని స్థాయి అభద్రతలోకి, దేశాన్ని నిరంతర అంతర్యుద్ధంలోకి, ఆర్థికాన్ని కోలుకోలేని దురవస్థలోకి తోసేయడం ద్వారా అగ్రరాజ్యం నైతికంగా ఓడిపోయింది.

విరాటపర్వం చదివి, కప్పలకు పెళ్ళి చేస్తే వర్షం పడుతుందని భారత్‌లో విశ్వసిస్తారు. అఫ్గాన్‌లో దశాబ్దకాలంగా ప్రభుత్వ, తిరుగుబాటు దళాల మధ్య పోరులో జోరుగా కురుస్తున్న తుపాకీ గుళ్ల వర్షానికి మాత్రం- అమెరికా 'విద్వేష పర్వం' చదవడమే కారణం. దశాబ్దానికిపైగా సాగిన యుద్ధంలో లక్షకోట్ల డాలర్లను ఖర్చు చేసి, రెండు వేలమందికి పైగా సైనికులను కోల్పోయి అమెరికా చివరికి సాధించిందేమిటి? ఎంతోమంది ఉగ్రవాదులను తుదముట్టించారు, తాలిబన్లను అధికార పీఠంనుంచి కూలదోయగలిగారు... కానీ, అష్రఫ్‌ గనీ సారథ్యంలోని ప్రస్తుత అఫ్గాన్‌ ప్రభుత్వం కొంతకాలమైనా స్థిరంగా కొనసాగుతుందన్న భరోసా ఇవ్వగల స్థితిలో అమెరికా ఉందా? కాబూల్‌ను స్వాధీనం చేసుకొని తాలిబన్లు మళ్ళీ అధికారం చేజిక్కించుకోబోరని పదమూడేళ్ల పోరాటం తరవాతైనా అమెరికా నమ్మకంగా చెప్పగల పరిస్థితిలో ఉందా? ఉగ్రవాద వ్యతిరేక పోరులో లక్ష్యాలను భారీగా నిర్దేశించుకుని, వాటిని సాధించడమెలాగన్న విషయంలో స్పష్టతలేని వ్యూహాన్ని అనుసరించిన ఫలితమిది. కేవలం లాడెన్‌, జవహరి, సద్దాం వంటివారినే లక్ష్యాలుగా చేసుకొని సంకుచిత ప్రయోజనాల పరిధిలో అమెరికా సాగించిన యుద్ధం- అఫ్గాన్‌లో చిరశాంతిని పూయిస్తుందనుకోవడం భ్రమ. సెప్టెంబరులో అష్రఫ్‌ గనీ- అమెరికా, 'నాటో'లతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు సుమారు 13,500 అంతర్జాతీయ దళాలు అఫ్గాన్‌లో భిన్నమైన బాధ్యతలు నిర్వహించనున్నాయి. తిరుగుబాటుదారులతో ప్రత్యక్ష పోరు బాధ్యతను పూర్తిగా అఫ్గాన్‌ దళాలకు బదలాయించిన 'సంకీర్ణ' సేనలు- ఇకమీదట కేవలం శిక్షణ, సలహా, వ్యూహ రూపకల్పన వంటి కార్యకలాపాల్లో మాత్రమే పాల్పంచుకోనున్నాయి. తాలిబన్లు తిరిగి బలం పుంజుకొని కాబూల్‌పై పట్టుకోసం దాడుల ఉద్ధృతిని పెంచిన తరుణంలో- అఫ్గాన్‌ సేనలు బొటాబొటి సామర్థ్యంతో ఎంతకాలం ఎదురునిలవగలవన్నది అతిపెద్ద ప్రశ్నగా మిగిలింది. కేవలం 2014లోనే తాలిబన్‌ దాడుల్లో 3,200మంది అమాయక అఫ్గానీలు; 4,600మంది అఫ్గాన్‌ సైనికులు, పోలీసులు కన్నుమూశారు. 2001లో యుద్ధం మొదలైనప్పటి నుంచీ మొత్తం 3,500మంది విదేశీ సైనికులు అసువులు బాశారు. అఫ్గాన్‌పై దాడి ద్వారా బుష్‌ ప్రారంభించిన యుద్ధంలో గడచిన దశాబ్దకాలంలో వారానికి వందమంది ప్రాణాలు గాలిలో కలిసినట్లు అంచనా. తాలిబన్లపై యుద్ధం పేరిట అమాయక అఫ్గానీలను సంకీర్ణ సేనలు పెద్దయెత్తున పొట్టనపెట్టుకున్నాయన్న అభియోగం ఉంది. ముఖ్యంగా 2010-'11లో ఒక్కో అమెరికా సైనికుడు మరణించినప్పుడల్లా, బాంబుదాడులతో ఒక్కో గ్రామాన్ని ధ్వంసం చేశారన్న ఆరోపణలున్నాయి. దేశంనుంచి సాధ్యమైనంత సత్వరం సంకీర్ణ సేనలను వెళ్ళగొట్టాలన్న తిరుగుబాటుదారుల ప్రయత్నాలకు అఫ్గానీలనుంచి చెప్పుకోదగిన స్థాయిలో మద్దతు లభించడానికి అదే కారణం.

అభాసుపాలైన అగ్రరాజ్యం

అఫ్గాన్‌ను చీకటి గతంనుంచి విముక్తం చేసే క్రమంలో, అందరూ కలిసి రావాలని అమెరికన్‌ అధ్యక్షుడు ఇటీవల పిలుపిచ్చారు. ఆకాంక్ష అందంగానే ఉన్నప్పటికీ- ఆచరణ తీరుమీదే దాని సాఫల్యం ఆధారపడి ఉంటుంది. కాబూల్‌లోని 'నాటో' కార్యాలయంలో చడీచప్పుడు కాకుండా, ఎంపిక చేసిన అతికొద్దిమంది సమక్షంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పదమూడేళ్ల పోరాటానికి స్వస్తి పలుకుతున్నట్లు అమెరికా ప్రకటించింది. కార్యక్రమానికి సంబంధించిన సమాచారం ఏమాత్రం బయటికి పొక్కినా- తిరుగుబాటు దళాలు దాడులు చేస్తాయన్న భయంతో మొత్తం వ్యవహారాన్ని అమెరికా గుట్టుగా కానిచ్చేసింది. దశాబ్ద కాలానికిపైగా యుద్ధానంతరం సంకీర్ణ సేనలు ప్రదర్శించిన 'ధైర్యం'- అఫ్గాన్‌ ప్రభుత్వ స్త్థెర్యాన్ని ఎంతగా నీరుగారుస్తుందో చెప్పనవసరం లేదు. అఫ్గాన్‌లో సాగించిన పదమూడేళ్ల పోరాట ప్రస్థానంలో ఆ దేశంలో ఏ వర్గాన్ని, ఎవరితోనూ పడని పరిస్థితులను సృష్టించి; కొత్త సమస్యలకు అంటుకట్టి, ఇప్పుడు తీరిగ్గా శాంతివచనాలు పలుకుతూ పెట్టేబేడా సర్దుకుంటున్న అమెరికా- ప్రపంచ శ్రేయాన్నే పణంగా పెట్టింది. ఆర్థికం అతలాకుతలమై, కనీసావసరాలు తీరని పరిస్థితుల్లో, వ్యవస్థలన్నీ పట్టుతప్పి అఫ్గాన్‌ నేడు బతికి చెడిన గడ్డగా, పరాధీనగా మిగిలిందంటే అందుకు కారణం... అగ్రరాజ్యం ఆభిజాత్యం, అహంభావం. అఫ్గాన్‌లో ఉగ్రవాదంపై యుద్ధంపేరిట మరిన్ని 'కలుపు మొక్కలు' పెరగడానికి కారణమైన అమెరికా ఒకరకంగా అంతర్జాతీయ సమాజాన్నే అభద్రతలోకి నెట్టింది.

(రచయిత - ఉల్చాల హరిప్రసాదరెడ్డి)
Posted on 02-01-2015