Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

గల్ఫ్‌లో అమెరికా దూకుడు

* ఇరాన్‌పై కయ్యానికి కాలు దువ్వుతున్న అగ్రరాజ్యం

పశ్చిమాసియా పరిణామాలు ప్రపంచ దేశాలపై ఎనలేని ప్రభావం కనబరుస్తాయి. తాజాగా హోర్ముజ్‌ జలసంధి వద్ద రెండు చమురు నౌకలపై దాడి ఘటన అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. దానిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఇరాన్‌ అధినేత హసన్‌ రౌహానీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు ఇరాన్‌దే బాధ్యతని అమెరికా ఆరోపిస్తుండగా, ఉద్దేశపూర్వకంగానే తమపై నిందలు మోపుతున్నారని ఆ దేశం పేర్కొంటోంది. వీరి మాటల యుద్ధం ఎలా ఉన్నప్పటికీ నౌకలపై దాడులతో చమురు దిగుమతి దేశాలు ఆందోళన చెందుతున్నాయి. దీనివల్ల మున్ముందు ముడిచమురు రవాణాకు ఆటంకం కలిగి ధరలు పెరుగుతాయన్న భయాలు విస్తరిస్తున్నాయి. గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌ ప్రాంతంలో హోర్ముజ్‌ జలసంధి వద్ద నార్వే, జపాన్‌కు చెందిన రెండు నౌకలు దాడులకు గురయ్యాయి. ఇరాన్‌ దక్షిణ తీరానికి 25 నాటికల్‌ మైళ్ల దూరంలో సింధుశాఖను దాటిన తరవాత ఆసియా దిశగా ప్రయాణిస్తున్న ఆ నౌకల్లో పేలుళ్లు సంభవించాయి. దాంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దాడి ఎలా జరిగింది, బాధ్యులు ఎవరన్నది ఇంకా ధ్రువీకరణ కాలేదు. ఇందుకు ఇరానే కారణమని, అది ఉగ్రవాద దేశమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆరోపిస్తున్నారు. హోర్ముజ్‌ జలసంధిని మూసేస్తామని ఇరాన్‌ తరచూ పేర్కొంటున్న నేపథ్యంలో, దాడులు దాని పనేనన్నది ఆయన వాదన. బ్రిటన్‌ తప్ప ఏ ఇతర దేశమూ ఆయనకు మద్దతుగా నిలవలేదు. యథాప్రకారం ఇరుపక్షాలూ సంయమనం పాటించాలన్న పిలుపుతో ఐరాస సరిపెట్టుకుంది. ఐరోపా సమాఖ్య (ఈయూ) స్పందన సైతం ఇదే విధంగా ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలను ఉపశమింపజేయడమే లక్ష్యంగా జపాన్‌ ప్రధాని షింజో అబే ఇరాన్‌ను సందర్శించారు. ఆయన దౌత్యమూ ఫలించలేదు.

ధరలకు రెక్కలు
నౌకలపై దాడుల ఘటన చమురు దిగుమతి దేశాలపై ప్రభావం చూపనుంది. ఇప్పటికే ఆయా దేశాల్లో చమురు ధరలు మండిపోతున్నాయి. మున్ముందు దిగుమతులు తగ్గి అవి మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నాయి. భారత్‌పైనా ఈ ప్రభావం పడనుంది. దేశీయ చమురు అవసరాలకు భారత్‌ ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ దిగుమతులు హోర్ముజ్‌ జలసంధి ద్వారానే జరుగుతున్నాయి. హోర్ముజ్‌ కాకుండా ఇతర మార్గాల ద్వారా దిగుమతి చేసుకున్నట్లయితే రవాణా భారం తడిసి మోపెడవుతుంది. ఈ భారాన్ని వినియోగదారులపై మోపాల్సి ఉంటుంది. దీనివల్ల నిత్యావసర ధరలకు రెక్కలొస్తాయి. ద్రవ్యోల్బణం, కరెంటు ఖాతా లోటు పెరుగుతుంది. రూపాయి విలువ క్షీణిస్తుంది. వృద్ధిరేటు పతనమవుతుంది. అంతిమంగా ఆర్థికవ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మరో కీలక ఆసియా దేశం జపాన్‌ కూడా ఈ జలసంధి ద్వారానే ముడిచమురు దిగుమతి చేసుకుంటోంది. అమెరికా, చైనా, భారత్‌ తరవాత చమురు వినియోగం జపాన్‌లోనే అత్యధికం. పశ్చిమాసియాలో అత్యధిక జనాభాగల ఇరాన్‌- అత్యంత ప్రాచీన నాగరికత గల దేశం. భారత్‌-ఇరాన్‌ల మధ్య దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయినప్పటికీ ఇరాన్‌ నుంచి ఎవరూ చమురు దిగుమతి చేసుకోరాదని ఈ ఏడాది ఏప్రిల్‌లో ట్రంప్‌ జారీ చేసిన ఆదేశాలను భారత్‌ కొన్ని కారణాలవల్ల అంగీకరించింది. భారత్‌ తన అవసరాల్లో 10 శాతం చమురును ఇరాన్‌ నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇందుకు డాలర్ల రూపంలో కాకుండా రూపాయల్లో డబ్బు చెల్లిస్తోంది. రెండు నెలలపాటు అరువు సౌకర్యాన్నీ వినియోగించుకుంటోంది. ఇతర దేశాలు ఈ వెసులుబాట్లు ఇవ్వవు. సన్నిహిత మిత్రదేశం కావడంతో ఇరాన్‌ ఉదారంగా వ్యవహరిస్తోంది. భారత్‌కు చమురు ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఇరాన్‌ మూడో స్థానంలో ఉంది. ఇరాక్‌, సౌదీ అరేబియా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో చైనాది ప్రథమస్థానం.

అమెరికా ఆంక్షలు, బెదిరింపుల నేపథ్యంలో హోర్ముజ్‌ జలసంధిని మూసేస్తామని ఇరాన్‌ హెచ్చరిస్తోంది. టెహరాన్‌ నాయకత్వం అన్నంత పనీ చేస్తే సమస్య మరింత తీవ్రమవుతుంది. అంతర్జాతీయంగా చమురు రవాణాలో ఈ జలసంధి పాత్ర అత్యంత కీలకం. ప్రపంచవ్యాప్తంగా అయిదోవంతు చమురు రవాణా ఈ మార్గం ద్వారానే జరుగుతోంది. అందువల్లే ఈ మార్గంలో చమురు నౌకలపై దాడులు ఆయా దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇది సురక్షిత మార్గం కాదని భావిస్తున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నాయి. నౌకలపై దాడితో అంతర్జాతీయ విపణిలో చమురు ధరలకు రెక్కలొచ్చాయి. దాడి జరిగిన వెంటనే బ్యారెల్‌ ముడిచమురు ధర 61.16 డాలర్లకు ఎగబాకడం గమనార్హం. హోర్ముజ్‌ను మూసివేయడమంటే ఓ రకంగా ఆసియా, పసిఫిక్‌ దేశాలకు ఊపిరాడకుండా చేయడమే. ఈ జలసంధి ప్రపంచానికి జీవనాడి వంటిది. జలసంధి రక్షణ బాధ్యత ఇప్పుడు ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కార్పస్‌ (ఐఆర్‌జీసీ) నావికా విభాగం పర్యవేక్షణలో ఉంది. హోర్ముజ్‌ వద్ద ఐఆర్‌జీసీ, ఇరాన్‌ సైన్యం భారీ సంఖ్యలో చిన్న బోట్లు వినియోగిస్తున్నాయి. దాంతోపాటు అధునాతన ఆయుధ సామగ్రిని, నౌకలను ధ్వంసం చేయగల క్షిపణులను హోర్ముజ్‌ పరిసరాల్లో మోహరించారు. గల్ఫ్‌ దేశాలకు ఈ మార్గం నుంచే నిత్యావసరాలు వెళ్లాలి. ఇక్కడ ఉద్రిక్తతలు చెలరేగితే ప్రపంచ ఆర్థికవ్యవస్థ అతలాకుతలం కావడం ఖాయం. హోర్ముజ్‌ జలసంధి ఇరాన్‌-ఒమన్‌ మధ్య ఉంది. ఈ మార్గం చాలా ఇరుకుగా ఉంటుంది. 2018లో రోజుకు 1.74 కోట్ల బ్యారెళ్ళ చమురు రవాణా జరిగినట్లు అంచనా. ఒపెక్‌ (ఓపీఈసీ- చమురు ఎగుమతి దేశాల సంస్థ) సభ్యదేశాలైన సౌదీ అరేబియా, ఇరాన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, కువైట్‌, ఇరాక్‌ ఈ జలసంధి ద్వారానే చమురును ఎగుమతి చేస్తుంటాయి. ప్రపంచంలో అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ (లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌) ఎగుమతిదారైన కతార్‌ దాదాపు ఉత్పత్తి అంతటినీ ఈ మార్గం ద్వారానే రవాణా చేస్తోంది.

సరికొత్త వైరం
షేల్‌ గ్యాస్‌ ఉత్పత్తి నేపథ్యంలో అమెరికా చమురు దిగుమతి అవసరాలు తగ్గుముఖం పట్టాయి. అది ఇతర దేశాలపై ఆధారపడటమూ తగ్గింది. ప్రస్తుతం అమెరికా ప్రదర్శిస్తున్న దూకుడును ఈ కోణంలోనే అర్థం చేసుకోవాలి. పర్షియన్‌ గల్ఫ్‌లో ఉద్రిక్తతలు తమ ఆర్థికవ్యవస్థపై పెద్దగా ప్రభావం కనబరచవన్నది అమెరికా నమ్మకం. అయితే పశ్చిమాసియాలో తన మిత్రదేశాల ప్రయోజనాల పరిరక్షణను ముఖ్య లక్ష్యంగా భావిస్తోంది. అమెరికాకు అనుంగు మిత్రదేశమైన సౌదీ అరేబియా-ఇరాన్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. సున్నీ దేశమైన సౌదీ, షియా దేశమైన ఇరాన్‌ మధ్య వైరం ఈనాటిది కాదు. దీంతో ఈ ప్రాంతంలో ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని ‘వాషింగ్టన్‌’ పని చేస్తోంది. ఇరాక్‌, అఫ్గానిస్థాన్‌, సిరియా తరవాత ఇప్పుడు ఇరాన్‌పై అమెరికా దృష్టి సారించింది. గతంలో తనను ఎదిరించిన ఆ దేశాధినేత అహమ్మద్‌ నెజాదీ, ప్రస్తుత అధినేత రౌహానీ అంటే అమెరికాకు చెప్పలేనంత ఆగ్రహం. అందుకే ఏ చిన్న అవకాశం వచ్చినా చెలరేగిపోతుంటుంది. నౌకలపై దాడి ఘటనకు బాధ్యులెవరో తేలేదాకా సంయమనమే అజెండాగా వ్యవహరించాలన్న హితోక్తులను ప్రస్తుత పరిస్థితుల్లో ఏ దేశమైనా ఆలకిస్తుందా అన్నది సందేహమే!

- గోపరాజు మల్లపరాజు
Posted on 18-06-2019