Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

ఆటగాళ్లు అయిదు కోట్లు!

* ప్రపంచకప్‌ సాధనే లక్ష్యంగా చైనా ఫుట్‌బాల్‌ యజ్ఞం

ప్రపంచ దేశాలపై తన క్రీడాధిపత్యాన్ని ప్రదర్శించడానికి జనచైనా మరో అస్త్రానికి సానపడుతోంది. ఆటల్లో రారాజుగా పేరొందిన ఫుట్‌బాల్‌లో అగ్రగామి దేశాలపై చైనా సంధించబోతున్న సమ్మోహన క్రీడాస్త్రమిది. ప్రపంచకప్పు సాధనే లక్ష్యంగా చేపడుతున్న బృహత్తర కార్యక్రమం వల్ల ఫుట్‌బాల్‌ జగతి దృష్టంతా చైనా వైపు కేంద్రీకృతమవుతోంది. ఐరోపా దేశాల ప్రాబల్యంగల ఈ ఆటలో తనదైన ముద్ర వేయడానికి మూడేళ్ల క్రితమే ఈ ప్రణాళిక అమలుకు తెరతీసిన చైనా ఆ దిశగా దూసుకెళ్తోంది. ఫలితంగా సాకర్‌ దిగ్గజాలు, పెట్టుబడిదారులు చైనా వైపు పరుగులిడుతున్నారు. చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ స్వయంగా ఫుట్‌బాల్‌ క్రీడాభిమాని! ఆయనే ముందుండి ఈ మహాయజ్ఞాన్ని నడిపిస్తుండటం అసలు విశేషం!

సాంస్కృతిక పునరుజ్జీవం
దక్షిణ అమెరికా, ఐరోపా ఖండ దేశాల్లో ఫుట్‌బాల్‌కు ఆదరణ అపరిమితం. అటువంటి పరాయి క్రీడను చైనీయులు ఎలా స్వీకరిస్తారన్న సందేహాలు కలగడం సహజం. అందుకే మున్ముందుగా ఆట చరిత్రను చైనా తవ్వితీసింది. క్రీస్తుపూర్వం నాలుగు శతాబ్దాల ముందే ‘కుజు’ పేరిట ఈ ఆట చైనాలో ఉండేదన్న అంశానికి విస్తృత ప్రాచుర్యం కల్పించింది. ప్రజల్లో సాంస్కృతిక భావనలను రగిలించింది. ఫుట్‌బాల్‌కు ప్రాధాన్యం- దేశ సాంస్కృతిక వైభవానికి పునరుజ్జీవం కల్పించే విధాన నిర్ణయంగా చైనా ప్రభుత్వం ప్రకటించింది. ‘ప్రపంచకప్పు పుట్‌బాల్‌లో పాల్గొను... నిర్వహించు... సాధించు’ అంటూ తన మూడు స్వప్నాలను జిన్‌పింగ్‌ ప్రజల ముందు ఆవిష్కరించారు. ఈ క్రీడాయజ్ఞానికి 2016లోనే చైనా శ్రీకారం చుట్టింది. 2020 నాటికి 20వేల ఫుట్‌బాల్‌ పాఠశాలలు, 70 వేల మైదానాల ఏర్పాటు అందులో తొలి అంచె. 2030నాటికి పాఠశాలల సంఖ్యను 50 వేలకు పెంచడం, పురుషుల జట్టును ఆసియాలో ఉత్తమ జట్టుగా తీర్చిదిద్దడం, మహిళల జట్టును ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం రెండో దశ. 2050నాటికి ప్రపంచ ఫుట్‌బాల్‌ ర్యాంకింగ్సులో ‘టాప్‌- 20’కి చేరడం, ప్రపంచ కప్పు సాధించడం మూడోదైన అంతిమ లక్ష్యం. ప్రజల నుంచి ఆటకు అమిత ఆదరణ లభిస్తుండటంతో చైనా ప్రభుత్వం లక్ష్యసాధనను ‘ఫాస్ట్‌ట్రాక్‌’పై పెట్టింది. అయిదేళ్లు ముందుగానే అంటే 2025నాటికే 50వేల పాఠశాలల ఏర్పాటు దిశగా సాగిపోతోంది. కఠిన శిక్షణలా కాకుండా వినోద, విజ్ఞాన ప్రధానంగానే ఈ పాఠశాలల్లో చిన్నారులకు ఆటను నేర్పిస్తున్నారు.

కమ్యూనిస్టు దేశంగా అంతర్జాతీయ రాజకీయ జీవన స్రవంతికి దూరంగా మెలగిన చైనా ఒక దశలో తన వైఖరి మార్చుకొంది. 1979లో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ)లో సభ్యత్వం పొంది క్రీడారంగ ప్రవేశం చేసింది. 1988 సియోల్‌ ఒలింపిక్స్‌లో చేదు అనుభవం ఎదురుకావడంతో పాలకులు మేలుకొన్నారు. ‘యావత్‌ దేశం... క్రీడల కోసం’ అంటూ ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపారు. దరిమిలా 2004, 2012, 2016 ఒలింపిక్స్‌ పతకాల పట్టికలో అమెరికా తరవాత రెండు మూడు స్థానాల్లో ఒకదాన్ని సొంతం చేసుకుంటూవచ్చింది. 2008లో ఒలింపిక్స్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడమే కాదు, 48 స్వర్ణాలతో మొత్తం వంద పతకాలు గెలుచుకుని అగ్రస్థానంలో నిలిచి క్రీడాయవనికపై తన సత్తా చాటింది. అప్పటి నుంచే ప్రపంచ దేశాలు చైనాను ప్రత్యేకంగా చూడటం మొదలుపెట్టాయి. అయినా ఫుట్‌బాల్‌పై చైనా మోజు పెంచుకోవడానికి గల కారణం ఆసక్తికరం.

2002లో పొరుగు దేశాలు దక్షిణకొరియా, జపాన్‌ దేశాల్లో జరిగిన ప్రపంచకప్పు ఫుట్‌బాల్‌ పోటీలకు అర్హత సాధించిన చైనా- కోస్టారికా, బ్రెజిల్‌, టర్కీ దేశాలపై ఆడిన మూడు మ్యాచుల్లో ఓటమిపాలైంది. ప్రత్యర్థులకు తొమ్మిది గోల్సు సమర్పించుకున్న చైనా, తాను ఒక్క గోలైనా వేయలేకపోయింది. ఆపై ప్రపంచకప్పులో ఆడే అర్హత మరెప్పుడూ చైనాకు దక్కలేదు. అయినా ఇతర క్రీడల్లో రాణిస్తుండటంతో ఆ లోపం మరుగున పడింది. 2013లో థాయ్‌లాండ్‌తో జరిగిన ఓ పోటీలో చైనా జట్టుకు 5-1 గోల్సు తేడాతో ఎదురైన ఘోర పరాజయం చైనా పాలకులను ఉలిక్కిపడేలా చేసింది. అప్పటి నుంచి ఫుట్‌బాల్‌లో సంస్కరణలపై ఆలోచనలు మొదలయ్యాయి. ప్రస్తుతం ‘ఫిఫా’ ప్రపంచ ర్యాంకింగుల్లో చైనా 73వ స్థానంలో ఉంది.

రష్యాలో 2018లో జరిగిన ప్రపంచకప్‌ పోటీల్లో చైనా జట్టు పాల్గొనకపోయినా లక్ష మంది క్రీడాభిమానులు అక్కడకు వెళ్లి మరీ పోటీలు తిలకించడం వారిలో ఉరుముతున్న ఉత్సాహానికి నిదర్శనం. అంతేకాదు, ఆ పోటీలను స్పాన్సర్‌ చేసినవాటిలో చైనా సంస్థలూ ఉండటం విశేషం. ఆటలంటేనే డబ్బులతో ముడివడిన వ్యవహారం. ఫుట్‌బాల్‌లో డబ్బు ప్రభావం మరీ ఎక్కువ. 2016 నుంచి అయిదేళ్లలో క్రీడల ద్వారా 46 వేలకోట్ల డాలర్లను ఆర్జించవచ్చని, 2025 నాటికి అది 81,300 కోట్ల డాలర్లకు పెరగవచ్చని చైనా అంచనా వేస్తోంది. లక్ష్యసాధనకు ప్రైవేటు రంగం నుంచి పెట్టుబడులు ప్రోత్సహిస్తోంది. ఆర్థికంగా బలోపేతమైన క్రమంలో చైనాలోనూ అపర కుబేరులు తయారయ్యారు. అందులో కొందరు ఐరోపాలోని ప్రసిద్ధ ఫుట్‌బాల్‌ క్లబ్బుల్లో పెట్టుబడులు గుమ్మరించారు. అన్యాపదేశంగా ఒత్తిళ్లు ప్రారంభం కావడంతో వారిప్పుడు స్వదేశంపై దృష్టి సారించారు. ఐరోపా క్లబ్బుల్లో పెట్టుబడులను తగ్గించుకుంటూ ఆ మొత్తాలను చైనాకు తరలిస్తున్నారు. ఇంగ్లాండులోని అస్టాన్‌ విల్లా క్లబ్బులో సహ యజమాని అయిన చైనా వాణిజ్యవేత్త టోని క్జియా తన వాటాలో అధిక భాగాన్ని ఉపసంహరించుకోవడం క్లబ్బు అభిమానులను ఆశ్చర్యపరచింది. ఇప్పుడాయన చైనా క్లబ్బులపై దృష్టి సారించారు. యూరోపియన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్బుల నుంచి చైనాకు పెట్టుబడులు తరలిపోతున్న వైనానికి ఇదో ఉదాహరణ మాత్రమే. ప్రఖ్యాత ఆటగాళ్లు, కోచ్‌లు సైతం చైనా బాటలో నడుస్తున్నారు. బ్రెజిల్‌ దిగ్గజ ఆటగాళ్లు రొనాల్డొ, రొనాల్డిన్హోలూ అదే దారిని అనుసరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వంద ఫుట్‌బాల్‌ పాఠశాలలను ఏర్పాటు చేయాలని రొనాల్డొ సంకల్పించాడు. వాటిలో 30 చైనాలోనే వస్తున్నాయి. రొనాల్డిన్హో ప్రారంభించిన బార్సిలోనా యాజమాన్యంలోని క్లబ్బులో వెయ్యిమంది విద్యార్థులు ఫుట్‌బాల్‌ మెలకువలు నేర్చుకుంటున్నారు. రియల్‌ మాడ్రిడ్‌ సైతం గువాన్గ్‌డాంగ్‌లో రెండు వేలమంది విద్యార్థులు గల అది పెద్ద అకాడమీని నెలకొల్పింది.

లక్ష్యంవైపు వడివడిగా
చైనా దేశవాళీ ఫుట్‌బాల్‌ లీగ్‌లో ప్రతి జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లకు ప్రవేశం ఉంది. వారి సంఖ్యను మూడుకు కుదించి ప్రతిభావంతులైన చైనా ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తున్నారు. ఐరోపా దేశాల నుంచి వస్తున్న ప్రముఖ కోచ్‌లు చైనా పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ఫుట్‌బాల్‌ శిక్షణలోని విజ్ఞానాన్ని, రకరకాల మెలకువలను బోధిస్తున్నారు. ప్రస్తుతం చైనావ్యాప్తంగా అయిదు కోట్ల మంది పిల్లలు, యువకులు ఫుట్‌బాల్‌ నేర్చుకుంటుండటం ఆ ఆటకు అక్కడి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి దృష్టాంతం! సంస్కరణల అమలులో చైనా ఇదే దూకుడు కొనసాగిస్తే ఫుట్‌బాల్‌ ప్రపంచకప్పు విజయాన్ని ఆ దేశం లక్ష్యానికన్నా బాగా ముందుగానే సొంతం చేసుకోవడం ఖాయం! క్రికెట్‌ ఆటకు భారత్‌ ఆర్థిక రాజధాని అయినట్లుగానే, ఫుట్‌బాల్‌ ఆర్థిక వ్యవహారాలకు సమీప భవిష్యత్తులో చైనా ప్రధాన కేంద్రమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక ఆటను ప్రోత్సహించాలంటే ప్రణాళికలు ఎంత పకడ్బందీగా రచించాలో చైనాను చూసి భారత్‌ నేర్వాలి. చైనాలో వ్యవస్థల ద్వారా వందలు, వేల సంఖ్యలో ఆటగాళ్లు ఉద్భవిస్తున్నారు. మనదేశంలో పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధం. తల్లిదండ్రులు, స్వీయ ప్రోత్సాహంతోనే మేరీకోమ్‌, సానియా మీర్జా, సైనా నెహ్వాల్‌, సింధు, హరికృష్ణ, హంపి లాంటి క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు. వ్యవస్థల ద్వారా పైకెగసిన ఆటగాళ్లు భారత్‌లో అతి అరుదు. క్రికెట్‌ మినహా ఇతర క్రీడలకు భారత్‌ ఇస్తున్న ప్రోత్సాహం- ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చందం. చైనాలో ఉన్నది, భారత్‌లో లేనిది మూలమూలకూ క్రీడాసంస్కృతి విస్తరణ. చైనా మాదిరిగా దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువకులను ఏదో ఒక ఆటలో రాణించేలా చేయడం ద్వారా మాత్రమే ఆ లోటును అధిగమించగలం!


- తమ్మా మల్లికార్జునరావు
Posted on 01-07-2019