Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

ఇనుమడించిన ప్రతిష్ఠ

జపాన్‌లోని ఒసాకా వేదికగా సాగిన జి-20 శిఖరాగ్ర సదస్సులో భారత్‌ పోషించిన క్రియాశీల భూమిక ఎంతో విశిష్టమైనది. రెండు రోజులపాటు నాలుగు సెషన్లుగా జరిగిన శిఖరాగ్ర భేటీలో పాల్పంచుకుంటూనే తొమ్మిది మంది దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు, సమయం చూసుకొని సమితి, ప్రపంచబ్యాంకు పెద్దలతోపాటు మరో ఆరు దేశాల నాయకులతో మంతనాలు, మరో రెండు త్రైపాక్షిక చర్చలు, వాటితో పాటే ‘బ్రిక్స్‌’ దేశాల సదస్సు... ఇలా క్షణం తీరిక లేని అజెండాతో ఇండియా వాణిని ప్రతిధ్వనింపజేయడంలో ప్రధాని మోదీ కార్యకుశలత సంస్తుతిపాత్రమైనది. 2030 నాటికి సమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అజెండాను సాకారం చేసే దిశగా అంతర్జాతీయ సవాళ్లను సమర్థంగా కాచుకొంటూ ప్రగతిపథంలో ముందడుగేస్తామని జి-20 తీర్మానపాఠం ఎలుగెత్తుతోంది. అందుకు తగ్గట్లే ద్వైపాక్షిక వాణిజ్య స్పర్ధల్ని ఉపశమింపజేసేలా అమెరికా అధ్యక్షులవారి నోట మంచి మాటలు వెలువడ్డా, ‘క్షణ క్షణముల్‌ ట్రంప్‌ చిత్తముల్‌’ అన్నది అందరికీ తెలిసిందే! అమెరికా ట్రంపరితనానికి బెదిరి వెనక్కి తగ్గేది లేదన్నట్లుగా ఇండియా, చైనాలు స్థిరచిత్తం కనబరచడంతో- అద్భుత వాణిజ్య ఒప్పందాల్ని సిద్ధం చేస్తున్నామంటూ ట్రంప్‌ నాలుక మడతేయడాన్ని స్వాగతించాల్సిందే! అమెరికా చైనాల మధ్య సుంకాల పోరు ఇలాగే కొనసాగితే వచ్చేఏడాది ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో అర శాతం కోసుకుపోవడం ఖాయమని, ఆ మొత్తం దక్షిణాఫ్రికా ఆర్థిక వ్యవస్థ పరిమాణానికి సమానమని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్‌ఎఫ్‌)సంస్థ హెచ్చరించింది. వాణిజ్య స్పర్ధలు, ఉగ్రవాద విషముద్రలు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాతావరణ మార్పులు, మందగిస్తున్న పెట్టుబడులు, కోసుకుపోతున్న ఉపాధి అవకాశాలు- ఇలా ప్రపంచ దేశాల్ని రాపాడుతున్న పలు సమస్యల్లో మెజారిటీ అంశాలపై జి-20 తీర్మానించినా- వాస్తవ కార్యాచరణలో యథాపూర్వ మందగమన ధోరణి కొనసాగితే ప్రయోజనం ఏముంది?

రెండు దశాబ్దాల క్రితం ఆసియా ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పురోగామి దేశాల విత్తమంత్రుల వేదికగా 1999లో పురుడుపోసుకొన్న జి-20 లేమ్యాన్‌ బ్రదర్స్‌ కుప్పకూలి సృష్టించిన ఆర్థిక ప్రకంపనల దరిమిలా దేశాధినేతల సదస్సుగా రూపాంతరం చెందింది. అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి అత్యున్నత వేదికగా రూపుదాల్చిన జి-20 ప్రపంచ స్థూలోత్పత్తిలో 85 శాతం; అంతర్జాతీయ వాణిజ్య రాశిలో 80 శాతం వాటా కలిగి ఉంది. స్థూల ఆర్థికం, వాణిజ్యాలపైనే కాకుండా, ప్రపంచార్థిక గమనాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చేసే వాతావరణ మార్పులు, ఇంధనం, ఆరోగ్యం, వలసలు, ఉగ్రవాద నిర్మూలన వంటి కీలకాంశాలపైనా జి-20 దృష్టి సారిస్తోంది. భారత ప్రధానిగా మోదీ తొలిసారి హాజరైన 2014 నవంబరునాటి జి-20 ఆస్ట్రేలియా సదస్సు- 2018 నాటికి ఈ కూటమి జీడీపీని అదనంగా రెండు శాతం (రెండు లక్షల కోట్ల డాలర్లు) పెంచాలన్న సమున్నత లక్ష్యాన్ని ప్రకటించింది. అమెరికా జపాన్ల విరాళాలతో మొదలైన ‘హరిత పర్యావరణ నిధి’ని మరింతగా పరిపుష్టీకరించాలన్న నాటి శుభ సంకల్పాలకు అమెరికాలో శ్వేతసౌధాధిపత్యం చేతులు మారడంతో గండిపడింది. ఇప్పుడు కూడా చరిత్రాత్మక ప్యారిస్‌ ఒప్పందానికి తలొగ్గేది లేదని ట్రంప్‌ భీష్మించడంతో ‘జి-19’ దేశాలే పాత ఆదర్శాలకు కొత్త తాలింపు పెట్టాయి. ఉగ్రవాదంపై పోరుకు కూడి రావాలని ఏళ్ల తరబడి ఇండియా చెవినిల్లు కట్టుకుపోరినా లక్ష్యపెట్టని జి-20, ప్యారిస్‌ ఘోరకలితో బిత్తరపోయి 2015లో ఘనతర తీర్మానం చేసింది. కాగితాలపై మోగించే కదన కాహళితో ప్రయోజనం నాస్తి అన్న సదవగాహనతో మోదీ- ఉగ్రవాదంపై అంతర్జాతీయ సదస్సు కోసం బ్రిక్స్‌ దేశాధినేతల భేటీలో పిలుపిచ్చారు. తీర్మానాల్లో ఐకమత్యం, కార్యాచరణలో వైమనస్యం కొనసాగితే జి-20 ఏం ఉద్ధరించగలదు?

ఏకధ్రువ ప్రపంచం అన్న భావనకు కాలంచెల్లి, ఒంటెత్తు పెత్తందారీ ధోరణులు మలిగిపోయి సాంకేతికత, సుస్థిరాభివృద్ధి ఫలాలు సమాన ఫాయాలో అన్ని దేశాలకూ అందే ఆదర్శప్రాయ వ్యవస్థ సజావుగా పట్టాలకెక్కాలన్నది ఇండియా మానవీయ స్వప్నం. అన్ని అర్హతలున్నా సమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వ హోదాను తోసిపుచ్చుతున్న అగ్రరాజ్యాల కొద్దిబుద్ధులకు ఎదురీదుతూ వర్ధమాన దేశాల ప్రతినిధిగా భారత్‌ వాణి జి-20లోనూ పోనుపోను పదునెక్కుతోందన్నది ఎవరూ ‘వీటో’ చెయ్యలేని వాస్తవం! నిరుడు బ్యూనస్‌ ఎయిర్స్‌లో జపాన్‌, అమెరికా, ఇండియా(జై)ల త్రైపాక్షిక వేదికను, మరోవంక రష్యా ఇండియా చైనాల భాగస్వామ్యంతో ఇంకో చర్చా వేదికను జోడు గుర్రాలుగా కట్టి సాగడంతో భారత్‌ నిష్పాక్షికత, మోదీ కార్యకుశలత ప్రస్ఫుటమవుతున్నాయి. స్వేచ్ఛాయుత సుస్థిర వాణిజ్య వాతావరణం నెలకొల్పాలన్న జి-20 తాజా పిలుపు ఇండియా వాదనకు ప్రతిధ్వని! అవినీతి అక్రమాలకు పాల్పడి పన్నులు ఎగవేసి పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లకు ఏ దేశమూ వెన్నుదన్నుగా నిలిచి ఆశ్రయం ఇవ్వరాదన్న మోదీ, ఉమ్మడి వ్యూహ నిర్మాణానికి పిలుపిచ్చారు. అలాంటి నేరగాళ్లకు ఆశ్రయం కల్పించేది లేదన్న జి-20 డిజిటల్‌ ఆర్థికంపై వెలువరించిన ‘ఒసాకా డిక్లరేషన్‌’ భారత్‌ ప్రయోజనాలకు తగినట్లుగా లేదంటూ దాన్ని మోదీ నిష్కర్షగా తోసిపుచ్చారు! అంతర్జాలం ఉగ్రమూకల స్థావరంగా మారకుండా కాచుకోవడం, ప్రకృతి ఉత్పాతాల్ని ఎదుర్కోవడంలో జి-20 భాగస్వామ్యాలపై ఇండియా ప్రతిపాదనలు మార్గదర్శకంగా ఉన్నాయి. వాస్తవ కార్యాచరణలో ఆయా దేశాల సంకుచిత అజెండాలే ‘మూడడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కు’ చందంగా అఘోరించి జి-20 స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి!Posted on 01-07-2019