Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

ముదురుతున్న వాణిజ్య యుద్ధం

* మోహరిస్తున్న అమెరికా-చైనా

చైనా టెలికం దిగ్గజం హువావే కొద్దిరోజులుగా ఎందుకు గజగజలాడిపోతోంది? 170 దేశాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తూ ప్రపంచ మొబైల్‌ మార్కెట్లో 19 శాతం వాటా కలిగిన ఈ సంస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎందుకు గురిపెట్టారు? గూగుల్‌తో సహా మహామహా సంస్థలు హువావేతో తమ కార్యకలపాలను ఎందుకు తెగతెంపులు చేసుకుంటున్నాయి? అమెరికా-చైనాల వాణిజ్య యుద్ధం ఎటు దారి తీస్తుంది? పారిస్‌ వాతావరణ ఒప్పందం మొదలుకొని అనేక అంతర్జాతీయ ఒప్పందాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఎందుకు రుసరుసలాడుతున్నారు? ‘మాదేశమే మాకు ముఖ్యం. అవసరమైతే ఏ ఒప్పందాన్నయినా వదులుకుంటాం’ అనే శ్రుతిమించిన జాతీయవాదం దేశదేశాల్లో ఎందుకు బలపడుతోంది? ఎనిమిదో దశకం మొదలు అమెరికా ప్రవచిస్తున్న ప్రపంచీకరణకు ఇప్పుడు స్వయంగా తానే తిలోదకాలు ఇవ్వనుందా? ప్రపంచవ్యాప్తంగా మేధావుల్లో, దౌత్యవర్గాల్లో ఈ ప్రశ్నలపై వాడివేడిగా చర్చలు మొదలయ్యాయి.

శ్రుతిమించిన జాతీయవాదం
చరిత్ర చెప్పిన పాఠాలను మరచిపోతే ప్రపంచం మళ్లీ సంకుచిత కూటములుగా, శిబిరాలుగా మారిపోవడం ఖాయం! మొదటి ప్రపంచయుద్ధం (1914-1919) తలెత్తడానికి చరిత్రకారులు రెండు ప్రధాన కారణాలు చెబుతారు. అందులో ఒకటి అత్యంత కీలకమైన ఆర్థిక అంశానికి సంబంధించినది. 20వ శతాబ్దం ఆరంభం నాటికి బ్రిటన్‌, ఫ్రాన్స్‌లాంటి అగ్రగామి ఐరోపా దేశాలు ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని దాదాపు అన్ని దేశాలపై ప్రత్యక్ష, పరోక్ష ఆధిపత్యం కలిగి ఉన్నాయి. అమెరికా ఖండంలో అమెరికా ఆధిపత్యం బలంగా వేళ్లూనుకోవడం మొదలైంది. ముందుగా పారిశ్రామిక విప్లవాన్ని చవిచూసిన బ్రిటన్‌, ఫ్రాన్స్‌ అనంతరం ఆ విప్లవాన్ని అందుకున్న అమెరికా తమ పారిశ్రామిక ఉత్పత్తులకు అన్ని ఖండాల్లో మార్కెట్‌ను సుస్థిరం చేసుకున్నాయి. దేశదేశాల్లో ముడి వనరులపై ఆజమాయిషీ నెలకొల్పుకున్నాయి. ఈ ఆధిపత్యానికి తిరుగులేదనుకుంటున్న దశలో జర్మనీ నుంచి ప్రతిఘటన మొదలైంది. 1870 తరవాత జర్మనీలోనూ పారిశ్రామికీకరణ బాగా వేగం పుంజుకుంది. 1910నాటికి ప్రపంచ మార్కెట్లో తన వాటా పెంచుకోవడానికీ ముడిసరకులు పుష్కలంగా ఉన్న భూభాగాలపై ఆధిపత్యానికీ జర్మనీ ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టింది. వాటా కోసం బ్రిటన్‌, ఫ్రాన్స్‌ల ఆధిపత్యాన్ని సవాలు చేసింది. ఫలితమే మొదటి ప్రపంచయుద్ధం. స్థూలంగా చరిత్రకారులు మొదటి ప్రపంచయుద్ధానికి ఇచ్చే ఆర్థిక వివరణ ఇది. ఈ ఆర్థిక కోణానికి సమాంతరంగా పలు దేశాల్లో శ్రుతిమించిన జాతీయవాదమూ బలపడింది. ఈ రెండూ కలిసి రాజకీయ రంగంలో అనేక రూపాల్లో అగ్గి రాజేశాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయినా దానిపై రుద్దిన విపరీత యుద్ధవిరమణ షరతులను ఆసరాగా చేసుకుని తీవ్ర జాతీయవాదాన్ని రెచ్చగొట్టి హిట్లర్‌ రంగంపైకి వచ్చారు. మొదటి ప్రపంచయుద్ధానికి కారణమైన ఆర్థిక అజెండాకు జాత్యంహకార భావనలు జోడించి రెండో ప్రపంచయుద్ధాన్ని రగిల్చారు.

చరిత్రను వదిలేసి, వర్తమానానికి వస్తే ఆమెరికా-చైనా మధ్య నెలకొన్న ఘర్షణకూ ఆర్థిక కోణమే ప్రబలంగా కనపడుతుంది. దేశదేశాల్లో చైనా ఉత్పత్తులు వెల్లువెత్తుతున్నాయి. దాని ఉత్పత్తులపై ఆధారపడే దేశాల సంఖ్య అన్ని ఖండాల్లో పెరుగుతోంది. దక్షిణ చైనా సముద్రంపై తనదే హక్కు అని చైనా వాదించడం అందరికీ తెలిసిందే. అంతెందుకు అమెరికా మార్కెట్‌ చైనా వస్తువులతో మునిగిపోతోంది. సైనికపరంగా అమెరికాతో చైనా సరితూగే కాలం ఎంతోదూరం లేదు. సొంతంగా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిపరచుకొనే క్రమంలో శరవేగంగా అడుగులు వేస్తోంది. అమెరికా ఆధిపత్యం ఉన్న అన్ని రంగాల్లోనూ పోటీగా నిలుస్తోంది. ఎలక్ట్రానిక్స్‌ దగ్గరనుంచి అంతరిక్షం వరకూ ఎక్కడా చైనా వెనకడుగు వేయడం లేదు. అమెరికా ఖండంలోని ముడివనరులపైనా ‘బీజింగ్‌’ తన హస్తం విస్తరిస్తోంది. గడచిన వందేళ్లలో అమెరికా ఈ స్థాయి బహముఖ సవాళ్లను ఒక ఆసియా దేశం నుంచి ఎన్నడూ ఎదుర్కోలేదు.

చైనా ఈనాటి విస్తరణకు మరో కోణమూ ఉంది. గతంలో బ్రిటన్‌, ఫ్రాన్స్‌ తరహాలో చైనా ఏ దేశాన్ని బలప్రయోగంతో ఆక్రమించి ఆధిపత్యాన్ని సంపాదించలేదు. 1980లనుంచి ముఖ్యంగా అమెరికాలో రొనాల్‌ ్డరీగన్‌, బ్రిటన్‌లో మార్గరెట్‌ థాచర్‌ పెద్దయెత్తున ప్రపంచంలోని అనేకదేశాలతో ఆమోదింపజేసిన ‘గ్లోబలైజేషన్‌’ను అందిపుచ్చుకుని చైనా తన జైత్రయాత్రను మొదలుపెట్టింది. వాషింగ్టన్‌ సమ్మతి పేరుతో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచబ్యాంకు ‘గ్లోబలైజేషన్‌’కు మార్గసూచీని తయారుచేశాయి. దాని ఆధారంగానే ప్రపంచవాణిజ్య సంస్థ ఏర్పాటైంది. ఒక్క రాజకీయరంగంలో మినహా గ్లోబలైజేషన్‌ని చైనా అంత బలంగా, బహముఖంగా అమలుచేసిన దేశం మరొకటి లేదు. బహళ పార్టీ రాజకీయ వ్యవస్థతో కూడిన స్వేచ్ఛా సమాజంలోనే ఆర్థికాభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుందని ఆర్థిక వేత్తలు చెబుతారు. కానీ చైనా అభివృద్ధిని పరిశీలిస్తే దీన్ని నూటికి నూరుపాళ్లు నిజమనుకోలేం. రాజకీయ స్వేచ్ఛ లేకపోయినా ఆర్థిక అగ్రరాజ్యంగా ఎదగొచ్చని చైనా చరిత్ర చెబుతోంది. అయితే ఆర్థికరంగంలో పోటీని, స్వేచ్ఛను ప్రోత్సహిస్తూ రాజకీయ రంగంలో మాత్రం ఏకపార్టీ నియంతృత్వం కొనసాగించడం పెద్ద వైరుధ్యంగానే చెప్పుకోవాలి. ఈ వైరుధ్యం చైనాలో ఎప్పుడు తొలగుతుందో ఎవరూ చెప్పలేరు. ఒకవేళ తొలగితే మాత్రం దాని ప్రభావం మామూలుగా ఉండదు.

తొలగని ప్రతిష్ఠంభన
సైబర్‌ పరిజ్ఞానం చౌర్యం పేరుతో హువావేపై పెద్దయెత్తున మొదలైన ఆంక్షలు ఆ స్థాయిలో ఆ ఒక్క సంస్థకే పరిమితమవుతాయన్న పూచీ ఏమీ లేదు. హువావేపై ట్రంప్‌ వేసిన దెబ్బ మామూలుది కాదు. దీని ఫలితంగా ఆ సంస్థ ఆదాయంలో 30 బిలియన్‌ డాలర్ల వరకూ కోత పడుతుందనే అంచనాలున్నాయి. హవావే మొబైల్‌ అమ్మకాల్లో 40శాతం నుంచి 60శాతం తరుగుదల ఉండవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే చైనా దిగుమతులపై ట్రంప్‌ సుంకాలు బాగా పెంచారు. ఇటీవల జరిగిన జి-20 సదస్సు సందర్భంగా అమెరికా-చైనా అధినేతలు ట్రంప్‌, జిన్‌పింగ్‌ మధ్య చర్చలు జరిగినా ప్రతిష్ఠంభన తొలగిపోలేదు. ఒక్క అమెరికానే కాదు అనేక దేశాలు చైనా ఉత్పత్తులపై ఆధారపడుతున్నాయి. అందుకే అమెరికా-చైనా మధ్య విస్తృతం అవుతున్న వాణిజ్యయుద్ధం వాటికే పరిమితమవుతుందని చెప్పలేం. చైనాని అదుపులో పెట్టాలన్న ట్రంప్‌ వ్యూహం రాజకీయ ప్రేరేపితమైంది. ఈ విధానానికి అమెరికా కార్పొరెట్‌ ప్రపంచం మద్దతు పలుకుతుందా లేదా అన్నది చాలా కీలకం. ఇరు దేశాల మధ్య రాజుకున్న వాణిజ్య యుద్ధం ముగుస్తుందా, మరింత పెరుగుతుందా అన్నది అది వేసే అడుగులని బట్టి ఉంటుంది. గతంలో మాదిరిగా ఈసారి అధ్యక్ష ఎన్నికల్లోనూ ట్రంప్‌ మోతాదు మించిన జాతీయవాదంపై ఆధారపడతారనడంలో సందేహం లేదు. అమెరికా ప్రజలు జాతీయవాదానికి సానుకూలంగా స్పందిస్తే పరిస్థితిలో ఇప్పట్లో మార్పు రాకపోవచ్చు. మొదటి ప్రపంచ యుద్ధానికి వందేళ్లు ముగుస్తున్న దశలో పాతుకుపోయిన అగ్రరాజ్యం ఒకవైపు- దానికి అన్ని రకాలుగా సవాళ్లు విసురుతున్న నయా అగ్రరాజ్యం మరోవైపు మోహరించడం విచిత్రంగానే భావించాలి. పాత్రధారులు మారారు. విషయం మాత్రం పాతదే. చరిత్ర టక్కరితనం అంటే ఇదేనేమో!


- ఎన్‌.రాహుల్‌కుమార్‌
Posted on 12-07-2019