Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

శ్రీలంకలో ‘సోఫా’ చిచ్చు

* పట్టుకోసం అమెరికా యత్నం

శ్రీలంకలో ఈస్టర్‌ బాంబుదాడులను మరువక ముందే ఒక రాజకీయ దుమారం చెలరేగింది. అమెరికాతో ‘స్టేటస్‌ ఆఫ్‌ ఫోర్సెస్‌ అగ్రిమెంట్‌’ (సోఫా) కుదుర్చుకునే అంశంపై అధ్యక్షుడు సిరిసేన, ప్రధాని విక్రమ సింఘేకు మధ్య వివాదం రాజుకొంది. అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల దేశ సార్వభౌమత్వమే ప్రశ్నార్థకంగా మారుతుందన్నది ఆయన వాదన. పెద్దదేశాలు చిన్న దేశాల్లో తమ స్థావరాలు ఏర్పాటు చేసుకొనేటప్పుడు ఇటువంటి ఒప్పందాలు చేసుకొంటాయి. ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికా 115 దేశాలతో ఇలాంటి ఒప్పందాలు చేసుకొంది. ఆయా దేశాల్లో విధులు నిర్వహించే పరాయి దేశ దళాలకు వియన్నా ఒప్పందం కింద దౌత్యకార్యాలయ సిబ్బందికి లభించే రక్షణ లభిస్తుంది. అమెరికా దళాలు ఏదైనా నేరాలకు పాల్పడితే వారిని విచారించి, శిక్షించే అధికారం శ్రీలంకకు లేకుండా పోతుంది. రేడియో తరంగాల వినియోగంపై అమెరికా దళాలకు స్వేచ్ఛ లభిస్తుంది. ‘ఈ ఒప్పందం చేసుకోవడంకన్నా, రాజ్యాంగ సవరణ చేసి దేశాన్ని అమెరికాలో కొత్త రాష్ట్రంగా ప్రకటించడం ఉత్తమం’ అంటూ శ్రీలంక పార్లమెంట్‌లో జనత విముక్త పెరమున (జేవీపీ) ఎంపీ బిమల్‌ రత్ననాయకే మండిపడ్డారు. ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే సోఫా ఒప్పందం ఒక్కటే ఏ దేశం చేసుకోదు. ఇది దళాలకు దౌత్యపరమైన రక్షణ మాత్రమే ఇస్తుంది. సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకొనే సమయంలో దీంతోపాటు మరికొన్ని ఒప్పందాలను కలిపి చేసుకొంటాయి. అమెరికా కూడా అంతే. ఈ ఒప్పందానికి పునాదిగా ‘ది అక్విజిషన్‌ అండ్‌ క్రాస్‌ సర్వీసింగ్‌ అగ్రిమెంట్‌ (ఏసీఎస్‌ఏ)’ను చేసుకొంది. కాకపోతే ఈ ఒప్పందం 2007లో పదేళ్ల కాలపరిమితితో చేసుకొంది. అప్పట్లో అమెరికా తరపున రాబర్ట్‌ ఓబ్లేక్‌, శ్రీలంక రక్షణ శాఖ కార్యదర్శి గోథబయ రాజపక్సే సంతకాలు చేశారు. అమెరికా పౌరసత్వం ఉన్న గోథబయ శ్రీలంక తరపున ఒప్పందంపై సంతకం చేయడం విచిత్రం. ఆ ఒప్పంద ప్రతిని పార్లమెంట్‌కు సైతం ఇవ్వకుండా అత్యంత రహస్యంగా ఉంచారు. కనీసం సింహళ భాషలోకి తర్జుమా కూడా చేయలేదు. అప్పట్లో ఏ రాజకీయ పార్టీ చప్పుడు చేయలేదు. 2017లో మరోసారి ఈ ఒప్పందాన్ని ఎటువంటి కాలపరిమితి లేకుండా పునరుద్ధరించుకున్నప్పుడూ శ్రీలంక రాజకీయ నేతలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో అవసరమైనప్పుడు అమెరికా నావికాదళ నౌకలు శ్రీలంకలోని ఓడరేవులో నిలిపేందుకు అవకాశం ఏర్పడింది. దీన్ని మరో మెట్టు ముందుకు తీసుకెళ్తూ అమెరికా ఇప్పుడు ‘సోఫా’ ఒప్పందాన్ని తెరపైకి తెచ్చింది.

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో శ్రీలంక కీలకం కావడంతో చైనా, భారత్‌-అమెరికాలు అక్కడ పట్టు సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో శ్రీలంకలో నేతలు చైనా, అమెరికా వర్గాలుగా విడిపోయారు. 2015 ఎన్నికల్లో అమెరికా సిరిసేన-రణిల్‌ విక్రమ సింఘే వర్గానికి మద్దతుగా నిలిచింది. అధ్యక్షుడు సిరిసేన, ప్రధానిగా విక్రమ సింఘే మధ్య అధికారం కోసం కుమ్ములాట మొదలయ్యాక అమెరికా విక్రమే సింఘే పక్షాన నిలబడింది. దీంతో సిరిసేన చైనా వైపు మొగ్గి, విక్రమ సింఘేకు పోటీగా మహిందా రాజపక్సేతో జతకలిశారు. విక్రమసింఘేను గద్దె దింపడానికి తీవ్రంగా ప్రయత్నించి భంగపడ్డారు. ఈ రాజకీయ పరిణామాలు చోటుచేసుకొన్న ఏడాదిలోపే ఈస్టర్‌ బాంబుదాడులు జరిగాయి. దీనికి సంబంధించిన నిఘా సమాచారాన్ని ముందే లంకకు తెలియజేశామని భారత బృందాలు పేర్కొనడంతో అధ్యక్షుడు సిరిసేన గుండెల్లో రాయిపడ్డట్లయింది. ఎన్నికలవేళ ఈ విషయం తన పుట్టిముంచుతుందనే భయం ఆయనకు పట్టుకొంది. బాంబుదాడుల విచారణలో సాయం చేస్తామన్న అమెరికా భద్రతా బృందాలను వెనక్కి పంపేందుకు కూడా సిరిసేన వెనకాడలేదు. దాడులు ఉగ్రవాదుల పనికాదని, స్థానిక డ్రగ్‌ మాఫియా వ్యవహారమని ఆయనే తేల్చేశారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌ను కాదని చైనా సాయం కోరారు. దీనికి చైనా 1.4 కోట్ల డాలర్ల సాయంతోపాటు 80 లక్షల డాలర్ల విలువైన 100 జీపులనూ లంక భద్రతా బృందాలకు సమకూర్చింది. మరోవైపు అమెరికా కూడా శ్రీలంకలో సముద్ర గస్తీని మెరుగుపరచుకొనేందుకు 3.9 కోట్ల డాలర్ల సాయం అందజేసింది. ఇండో-పసిఫిక్‌ నడిబొడ్డున కీలకమైన ప్రాంతంలో ఉన్న శ్రీలంకలో గతంలో విజయవంతంగా అధికార మార్పిడిని ప్రభావితం చేసిన అమెరికా, ఈసారీ అధ్యక్ష ఎన్నికలపై గురిపెట్టిందనేది అధ్యక్షుడు సిరిసేన భయం. అందువల్ల అమెరికాకు వ్యతిరేకంగా బలమైన జాతీయ వాదాన్ని భుజాలకు ఎత్తుకొన్నారు. అమెరికాతో ‘సోఫా’ ఒప్పందాన్ని బూచిగా చూపిస్తూ తానే దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడగలననే నమ్మకం ప్రజల్లో కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రపంచ వాణిజ్య మార్గాలకు గుండెకాయ వంటి ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో పట్టునిలుపుకోవడం భారత్‌, అమెరికాలకు చాలా కీలకం. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉన్న డీగో గార్షియాలో అమెరికాకు భారీ నౌకాస్థావరం ఉంది. ఇటీవలి ఐరాస తీర్మానం ప్రకారం ఆ ప్రాంతం మారిషస్‌కు చెందినదిగా తేల్చారు. దీంతో ముందుజాగ్రత్తగా మరోస్థావరం కోసం అమెరికా అన్వేషణ జరిపి, శ్రీలంకలోని ట్రింకొమలీ ఓడరేవు అనువైనదిగా గుర్తించింది. శ్రీలంకతో సోఫా ఒప్పందం కుదిరితే విమాన వాహక నౌకలను ఇక్కడ నిలిపి, దళాలు కార్యకలాపాలు నిర్వహించే వీలు కలుగుతుంది. భారత్‌ కోణంలో చూస్తే హిందూ మహాసముద్రంలో చైనా తన ప్రాబల్యం పెంచుకోవడం పెద్ద తలనొప్పి వ్యవహారం. భారత్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీలంకలో చైనా బలపరచే వ్యక్తులు అధికారం చేపడితే మన దేశ వ్యూహాత్మక ప్రయోజనాలు దెబ్బతింటాయి. దీంతో జపాన్‌తో కలిసి చైనాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నా ఆర్థికంగా బలం చాలడంలేదు. ఈ నేపథ్యంలో వ్యూహాత్మక భాగస్వామి అయిన అమెరికా రంగప్రవేశం చేయడం మనకు మరింత బలాన్ని ఇస్తుంది. కాకపోతే, మనం అగ్రరాజ్యంగా ఎదగాల్సిన ప్రాంతంలో మిత్రదేశ ప్రాబల్యం పెరిగిపోతుంది!


- పెద్దింటి ఫణికిరణ్‌
Posted on 24-07-2019