Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

ఉగ్రవాద పురిటిగడ్డ

* పట్టుకోసం అమెరికా యత్నం

పొరుగుదేశం పాకిస్థాన్‌ అక్షరాలా ఉగ్రవాదుల పుట్ట. అది ఇప్పటికీ బుసలు కొడుతున్న 30వేల నుంచి 40 వేల విషనాగులకు నెలవన్నది అమెరికా పర్యటనలో ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ నోట దూసుకొచ్చిన మాట! మిలిటెంట్‌ సంస్థల్ని నియంత్రించి వాటిని నిరాయుధీకరిస్తున్న తొలి పాక్‌ సర్కారు తమదేనని చాటుకున్న ఖాన్‌, గడచిన పదిహేనేళ్లలో తమ గడ్డపై 40దాకా ఉగ్రముఠాలు కార్యకలాపాలు నిర్వహించాయన్న యథార్థాన్నీ బహిరంగంగా అంగీకరించారు. ఇన్నేళ్లూ లష్కరే తొయిబా, జైషే మహ్మద్‌, తాలిబన్‌ వంటి కిరాతక ముష్కర సంస్థలకు అన్నీ తానై ఇస్లామాబాద్‌ అండదండలందిస్తోందన్న ఆరోపణల్ని పాక్‌ నేతాగణం ఎప్పటికప్పుడు కొట్టిపారేసింది. ఆ అడ్డగోలు వాదనలకు నేడాదేశ ప్రధానే గాలి తీసేసినట్లయింది! తమ భూభాగంలో ఉగ్రశిబిరాల ఉనికి ప్రసక్తే లేదని పాక్‌ సైన్యం మూడు నెలలక్రితం ఖండించింది. నిషేధిత సంస్థల వివరాలు పొందుపరచిన పాక్‌ ఉగ్రవాద వ్యతిరేక చట్టంలోని నాలుగో షెడ్యూల్‌ నిర్ధారణ ప్రకారం, అక్కడి క్రియాశీలక మిలిటెంట్ల సంఖ్య ఎనిమిది వేలు. ఆ రెంటినీ వట్టి దబాయింపులుగా ఇమ్రాన్‌ ప్రకటన ధ్రువీకరిస్తోంది! అయిదేళ్లక్రితం పాకిస్థానీ తాలిబన్లు ఆర్మీ పబ్లిక్‌ స్కూలుకు చెందిన 150మంది విద్యార్థుల్ని పొట్టన పెట్టుకున్నప్పుడు దేశంలో మరే ఉగ్రసంస్థనూ పనిచేయనివ్వరాదంటూ అన్ని రాజకీయ పక్షాలూ జాతీయ కార్యాచరణ ప్రణాళికకు కట్టుబాటు చాటాయని ఇమ్రాన్‌ చెబుతున్నారు. ఆయన గుట్టువిప్పిన లెక్కలపై విపక్షం ఘాటు స్పందన పార్టీల్లో ఏకీభావం ఎండమావేనంటోంది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాక్‌ను వేదిక కానివ్వబోమని గత నవంబరులో ఉద్ఘాటించిన ఇమ్రాన్‌- పుల్వామా ఉగ్రదాడిపై ప్లేటు ఫిరాయించారు. ఆ దాడికి పాల్పడింది తామేనని జైషే మహ్మద్‌ ప్రకటించినా, అది భారత్‌లోని ఉగ్రసంస్థల పనేనన్న ఇమ్రాన్‌ విడ్డూరభాష్యం- వక్రబుద్ధి ఇంకా మారనేలేదని స్పష్టీకరిస్తోంది.

‘అది పాకిస్థాన్‌ కాదు... టెర్రరిస్థాన్‌!’ అని 2017 సెప్టెంబరులో ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ వేదికగా ఇండియా, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ నిప్పులు చెరిగాయి. అది పచ్చి నిజమని నిగ్గుతేల్చిన ఉదంతాలు లెక్కకు మిక్కిలిగా పోగుపడ్డాయి. తాలిబన్‌ సృష్టికర్తలం తామేనని దశాబ్దం క్రితం అధ్యక్ష హోదాలో జర్దారీ నోరు జారారు. వాస్తవానికి తాలిబన్లకు శిక్షణ కార్యక్రమాలు జుల్ఫికర్‌ అలీ భుట్టో జమానాలోనే ఆరంభమైనట్లు నేటికి రెండు దశాబ్దాల క్రితం జనరల్‌ నస్రుల్లా బాబర్‌ అనే మాజీ మంత్రి వెల్లడించారు. ప్రత్యక్ష పోరాటం ద్వారా కశ్మీరును కొల్లగొట్టడం అసంభవమని బోధపడిన దరిమిలా ‘ఆపరేషన్‌ తొపాక్‌’ పేరిట జనరల్‌ జియా ఉల్‌ హక్‌ రూపుదిద్దిన ప్రచ్ఛన్న యుద్ధ వ్యూహం పోనుపోను చిలవలు పలవలు వేసుకుపోయింది. దాదాపు మూడు దశాబ్దాలుగా సుందర కశ్మీరాన నరికిన కొద్దీ రావణాసురుడి తలల్లా మొలుచుకొస్తున్న ఉగ్రభూతం, భారత్‌కు కంటికి కునుకు లేకుండా చేస్తోంది. పాక్‌ ఆసరాపై భరోసాతో కండకావరం పెచ్చుమీరి సలావుద్దీన్‌ వంటి ఉగ్రవాదులు భారత సైనిక బలగాల కబ్రస్థాన్‌ (శ్మశానం)గా కశ్మీరును మారుస్తామని హుంకరిస్తున్నారు. వేర్పాటువాదులు, ఉగ్రవాదులు, కశ్మీర్‌కోసం వెయ్యేళ్ల యుద్ధానికైనా సిద్ధమనే పాక్‌ ఏలికలు సరిహద్దు రాష్ట్రంలో సంక్షోభాగ్నుల్ని ప్రజ్వరిల్లజేసి ప్రపంచ దేశాల ఎదుట భారత్‌ను ముద్దాయిగా నిలబెట్టడానికి ఎన్నెన్ని పన్నాగాలు పన్నారో లెక్కలేదు. అమెరికానుంచి అందిన నిధుల్ని దారి మళ్ళించి ఉగ్రశక్తుల్ని అల్లారుముద్దుగా సాకినట్లు గతంలో ముషారఫ్‌ ఘనంగా వెల్లడించడం తెలిసిందే. అల్‌ఖైదా అగ్రనేతలు పాక్‌లోనే పట్టుబడినా ఏళ్ల తరబడి కళ్లు మూసుకున్న అమెరికా- తమ సొమ్మే ముష్కరులకు కోరలు తొడిగిందని తేటతెల్లమయ్యాక నాలుక్కరుచుకుంది. అప్పటికే పాక్‌ గడ్డమీద ఉగ్రవాద విషవృక్షం వేళ్లు తన్నుకుంది!

పాక్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ ముద్రాంకిత ఉగ్ర ముఠాల ఉమ్మడి లక్ష్యం- భారత్‌ను దగ్ధభూమిగా మార్చడం. పార్లమెంటుపై దాడి, ముంబయి ముట్టడి నుంచి పఠాన్‌ కోట్‌, ఉడీ, పుల్వామా దాడుల వరకు ప్రతి అమానుష దారుణం వెనకా ప్రధాన సూత్రధారి ఇస్లామాబాదేనన్నది బహిరంగ రహస్యం. శిక్షణ, ఆయుధాలు సమకూర్చి ఉగ్రవాదుల్ని ఇండియాపైకి ఉసిగొల్పడంలో జైషే మహ్మద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ వంటివి రాటుతేలిపోయాయి. ఎక్కడ ఏ ఘోరం చోటు చేసుకున్నా అసలు దోషుల ఆనవాళ్లను సాక్ష్యాధారాలతో సహా భారత్‌ బయటపెట్టినా నేర నిరూపణకు అవేమీ సరిపోవని, అసలు ఆ పేరుగల వ్యక్తులే తమ దేశంలో లేరని ఇన్నేళ్లూ పాకిస్థాన్‌ అడ్డంగా దబాయించింది. ఏ కారణంగానైనా ఉగ్రవాద జాబితాకెక్కిన సంస్థలు పేరు మార్చుకుని దర్జాగా చలాయించుకుంటున్నా, అదంతా అసత్య ప్రచారమేనని ఎన్నోమార్లు బుకాయించింది. అటువంటిచోట, తమ ఒత్తిడివల్లే జమాత్‌ ఉద్‌ దవా అధినేత హఫీజ్‌ సయీద్‌ అరెస్టయినట్లు అమెరికా చాటుకుంటోంది. శ్వేత సౌధాధిపతి కరుణా కటాక్షాల కోసమే పాక్‌ ప్రధాని బాణీ మార్చారన్నది విశ్లేషకుల అంచనా. ఏది ఏమైనా, ముసుగులు తొలగిన ముఠాల్ని చక్రబంధంలో ఇరికించాల్సిందే. ఉగ్రవాద సంస్థల ఆస్తులు స్తంభింపజేయాలని, టెర్రరిస్టులకు ఎవరూ ఆశ్రయం ఇవ్వరాదని ఐరాస భద్రతామండలి పద్దెనిమిదేళ్లనాడే తీర్మానించింది. అమాయక జనహననానికి, ప్రజాస్వామ్య సంస్థల విధ్వంసానికి జైషే మహ్మద్‌ వంటి ఉగ్ర సంస్థలు నిరంతర పథక రచనలో, కార్యాచరణలో తలమునకలవుతున్నాయి. వాటి జీవనాడుల్ని, మూలాల్ని నిర్జీవం చేసేందుకు- ప్రపంచ దేశాలు ఏకతాటిపైకి రావాల్సిన తరుణమిది. దశాబ్దాలుగా ఉగ్రవాద పురిటిగడ్డగా కొనసాగిన పాకిస్థాన్‌ నెత్తుటి బాట, భాష విడనాడితేనే తప్ప మనుగడ లేదని గుర్తించేలా చేయాల్సిన బృహత్తర బాధ్యత అంతర్జాతీయ సమాజం భుజస్కంధాలపై ఉంది!


Posted on 26-07-2019