Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

బ్రెక్సిట్‌పై మల్లగుల్లాలు

* బ్రిటన్‌ ఇరకాట స్థితి

ఐరోపా సమాఖ్య (ఈయూ) నుంచి ఎలా నిష్క్రమించాలనే అంశంపై బ్రిటన్‌కు ఇప్పటికీ స్పష్టత లేక అయోమయంలో కొట్టుకుపోతోంది. ఇటీవల ప్రధాన మంత్రి పదవి నుంచి థెరెసా మే వైదొలగి, బోరిస్‌ జాన్సన్‌ పగ్గాలు చేపట్టిన తరవాత కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈయూ నుంచి విడిపోవాలని మొదటి నుంచీ యాగీ చేసిన వ్యక్తి బోరిస్‌ జాన్సనే. అదే జరిగితే బ్రిటన్‌ జాతీయాదాయం అయిదు శాతం పడిపోతుందని, ఆహార ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందిపడతారని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయినా సరే అక్టోబరు 31 కల్లా ఈయూ నుంచి బ్రిటన్‌ను బయటకు తీసుకొస్తానని జాన్సన్‌ భరోసా ఇస్తున్నారు. కానీ, ఆయన పార్టీ అయిన పాలక కన్సర్వేటివ్‌ పార్టీకి పార్లమెంటు దిగువ సభలో పూర్తి మెజారిటీ లేకపోవడంతో జాన్సన్‌ మాట నెగ్గడం సందేహమే. ఉత్తర ఐర్లాండ్‌ పార్టీ డీయూపీని కలుపుకొని కన్సర్వేటివ్‌లకు కేవలం మూడు సీట్ల ఆధిక్యం ఉంది. ఈయూతో లాంఛనంగా విడాకుల ఒప్పందం కుదుర్చుకోకుండా విడిపోవాలన్న జాన్సన్‌ పంథాను 40 మంది కన్సర్వేటివ్‌ ఎంపీలు ప్రతిఘటిస్తున్నారు. వారిలో ఇద్దరు జాన్సన్‌ ప్రతిపాదిస్తున్న ఒప్పంద రహిత వియోగానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే- ప్రభుత్వం పడిపోతుంది. ఏదో ఒకవిధమైన బ్రెక్సిట్‌ ఒప్పందం కుదరకుండానే ఎన్నికలు వస్తే జాన్సన్‌ ఓడిపోవడం ఖాయం. ఈ సందర్భంగా ఈయూ నుంచి బ్రిటన్‌ నిష్కమ్రణ (బ్రెక్సిట్‌)కు మూడు మార్గాలు ఉన్నాయని గమనించాలి. అవి- కఠిన బ్రెక్సిట్‌, ఒప్పంద రహిత బ్రెక్సిట్‌, మృదువైన బ్రెక్సిట్‌. గత ప్రధాని థెరెసా మే ఈయూ ఒప్పందంలోని 50వ అధికరణ కింద బ్రెక్సిట్‌కు నోటిఫికేషన్‌ జారీ చేసినప్పటి నుంచి, నిష్క్రమణ ప్రక్రియ ఏ విధంగా సాగాలనేదానిపై తర్జనభర్జనలు ఊపందుకున్నాయి.

కఠిన బ్రెక్సిట్‌: దీనికింద ఈయూతో పూర్తిగా తెగతెంపులు చేసుకుని ఈయూ సభ్య దేశాలతో విడివిడిగా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంటుంది. చిక్కేమంటే ఈ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి చాలాకాలం పడుతుంది. ఆలోపు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిబంధనల ప్రకారం వ్యాపారం చేసుకోవలసి ఉంటుంది. ఈయూ సభ్యదేశంగా బ్రిటన్‌కు ఉండే ప్రత్యేక హక్కులు, సౌకర్యాలు డబ్ల్యూటీఓ పరిధిలో లభించవు. ప్రస్తుతం బ్రిటన్‌ మొత్తం ఎగుమతుల్లో 45 శాతం ఈయూకి వెళ్తుండగా, దిగుమతుల్లో 50 శాతం ఈయూ నుంచే వస్తున్నాయి. ఇప్పుడు హఠాత్తుగా ఈయూతో తెగతెంపులు చేసుకుంటే (కఠిన బ్రెక్సిట్‌) బ్రిటిష్‌ ప్రజలకు వివిధ వస్తువులు ఖరీదైపోతాయి. కంపెనీలకు వ్యాపార అవకాశాలు కుదించుకుపోతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని 21 నెలల్లో బ్రెక్సిట్‌ను పూర్తి చేస్తే ప్రత్యామ్నాయ వ్యాపార ఏర్పాట్లు, సర్దుబాట్లు చేసుకోగలుగుతామని థెరెసా మే ప్రతిపాదించారు. కానీ, బ్రిటిష్‌ పార్లమెంటు దాన్ని పదేపదే తోసిపుచ్చింది.

ఒప్పంద రహిత బ్రెక్సిట్‌: ఈయూ నుంచి ఎలా నిష్క్రమించాలనేదానిపై బ్రిటిష్‌ రాజకీయ నాయకుల్లో ఏకాభిప్రాయం కుదరకపోతే, ఈ ఏడాది అక్టోబరు 31న అసలు ఒప్పందమే లేకుండా బ్రెక్సిట్‌ జరిగిపోతుంది. ఈ ఒప్పంద రహిత నిష్క్రమణకన్నా కఠిన బ్రెక్సిటే కాస్త మేలు. ఎందుకంటే, నిష్క్రమణకు నిర్ణీత ప్రణాళిక, కొంత కాలవ్యవధి ఉంటాయి. ఈయూ సభ్య దేశాలతో వేర్వేరు వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కొంత వెసులుబాటు లభిస్తుంది. కొత్త ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రతిపాదిస్తున్న ఒప్పంద రహిత (నో డీల్‌) బ్రెక్సిట్‌కు అలా గుక్కతిప్పుకొనే వీలు ఉండదు. ఎగుమతులు, దిగుమతులపై సుంకాలు పెరిగిపోతాయి. పెట్టుబడుల ప్రవాహం దెబ్బతింటుంది. ఐరోపాలో ఫైనాన్స్‌, మీడియా, ఔషధ పరిశ్రమ, ఆటో రంగాల్లో బ్రిటన్‌ వ్యాపారం కుంటువడుతుంది. ఫలితంగా బ్రిటిష్‌ ఆర్థిక వ్యవస్థ ఒక్క ఏడాదిలోనే ఎనిమిది శాతం కుంచించుకుపోతుందని, ఇళ్ల ధరలు మూడోవంతు కోసుకుపోతాయని సాక్షాత్తూ బ్రిటిష్‌ రిజర్వు బ్యాంకు అయిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ హెచ్చరించింది.

మృదు బ్రెక్సిట్‌: అన్నింటికన్నా ఇదే మెరుగని ఆర్థికవేత్తలు, పాత్రికేయులు హితవు చెబుతున్నారు. దీనికింద ఈయూ ఉమ్మడి విపణితో బ్రిటన్‌ వ్యాపార సంబంధాలు ఏదోవిధంగా కొనసాగుతాయి. కానీ, అది జరగాలంటే ఈయూ, బ్రిటన్‌ల మధ్య ప్రజలు స్వేచ్ఛగా వలస రావడానికి, పోవడానికి వెసులుబాటు ఉండాలని, ఇంకా ఇతర ఉమ్మడి సూత్రాలను పాటించాలని ఈయూ పట్టుబడుతోంది. అసలు తూర్పు ఐరోపా దేశాల నుంచి జనం బ్రిటన్‌లోకి వచ్చిపడుతున్నారనే ఆక్రోశం బోరిస్‌ జాన్సన్‌ వంటివారి ఆవిర్భావానికి ఊపిరిపోసిందని మరచిపోకూడదు. జాన్సన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త వలస విధానాన్ని త్వరలో వెలువరిస్తానని ప్రకటించింది ఇందుకే!

పొరుగు దేశమైన ఐర్లండ్‌లో ఉత్తర భాగం బ్రిటన్‌ భూభాగం కిందకు వస్తే, మిగిలినది ప్రత్యేక దేశంగా ఉంది. రెండు దేశాలూ ఈయూలో సభ్యులుగా ఉన్నంతకాలం వస్తువులు, మనుషుల రాకపోకలకు అడ్డు ఉండేది కాదు. కానీ, ఈయూ నుంచి బ్రిటన్‌ వైదొలగిన మరుక్షణం చెక్‌పోస్టులు వస్తాయి, సుంకాలు పెరుగుతాయి. ఈయూ, ఐర్లండ్‌ల మధ్య సరకులతో తిరిగే లారీలు ఉత్తర ఐర్లండ్‌లో తనిఖీలను ఎదుర్కోవలసి ఉంటుంది. వీటిని నివారించడానికి థెరెసా మే ప్రభుత్వం, ఈయూల మధ్య ఒప్పందం కుదిరినా, ఇది దొడ్డిదారిన ఈయూకు ప్రవేశం కల్పించినట్లవుతుందని పాలక పార్టీ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. అదే చివరకు థెరెసా రాజీనామాకు దారితీసింది. బోరిస్‌ జాన్సన్‌ ఆధునిక సాంకేతికతతో తనిఖీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈయూ నుంచి వైదొలగడానికి 3,900 కోట్ల పౌండ్ల మూల్యం చెల్లించడానికి థెరెసా మే సర్కారు ఒప్పుకొన్నా, జాన్సన్‌ వర్గం దానికి ససేమిరా అంటోంది. ఈ విడాకుల బిల్లును ఎగవేస్తే బ్రిటన్‌ అంతర్జాతీయ ట్రైబ్యునల్‌లో కేసును ఎదుర్కోవలసి రావడమే కాకుండా ఈయూతో మున్ముందు ఎలాంటి ఒప్పందమూ కుదిరే అవకాశం లేకుండాపోతుంది. ఏతావతా జాన్సన్‌ ఈయూ నుంచి ఒప్పందం లేకుండా వైదొలగాలని నిశ్చయించుకుంటే, అందుకు సెప్టెంబరు మూడో తేదీన బ్రిటిష్‌ పార్లమెంటు ఆమోదం పొందాల్సి ఉంటుంది. పార్లమెంటులో పాలక కన్సర్వేటివ్‌లకు మెజారిటీ లేనందువల్ల జాన్సన్‌కు తన మాట నెగ్గించుకోవడం నల్లేరు మీద నడక కాబోదు.

- ఆర్య
Posted on 01-08-2019