Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

అణువణువునా వంచన!

తన ఫర్మానాలను బేఖాతరు చేసి అణ్వస్త్రాల సముపార్జనకు ఉరకలెత్తేవాటిపై ధూర్త దేశాలన్న ముద్రవేసి, ఆంక్షల కొరడా ఝళిపించడం దశాబ్దాలుగా అగ్రరాజ్యం నిష్ఠగా చేస్తున్న పని. సమస్త భూమండలాన్నీ కొన్ని వేలసార్లు భస్మీపటలం చేయదగ్గ స్థాయిలో పేర్చిన అణ్వస్త్ర నిల్వల్ని క్రమేణా కరిగించి అణు నిరాయుధీకరణకు తోడ్పడాలన్న ఐక్యరాజ్య సమితి ఆకాంక్షల్ని తోసిపుచ్చి స్వీయ రాజకీయ అవసరాలే ప్రాతిపదికగా పావులు కదపడం అమెరికాకు అలవాటుగా మారింది. ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో ప్రపంచ దేశాల్ని నాటో, వార్సా కూటములుగా చీల్చిన అమెరికా, నాటి సోవియెట్‌ యూనియన్ల స్పర్థ- అణు క్షిపణుల దాడి భీతితో ఐరోపా దేశాలు బిక్కుబిక్కుమనే దుస్థితిని సంప్రాప్తింపజేసింది. ఆ భయాందోళనల్ని చెదరగొట్టే లక్ష్యంతోనే మధ్య దూర అణ్వస్త్ర దళాల (ఐఎన్‌ఎఫ్‌) ఒడంబడిక రూపుదాల్చింది. 1987లో అమెరికా అధ్యక్షుడిగా రొనాల్డ్‌ రీగన్‌, సోవియెట్‌ అధ్యక్షుడిగా మిఖాయిల్‌ గొర్బచెవ్‌ చేవ్రాలు చేసిన ఆ చారిత్రక ఒప్పందం- భూతలం నుంచి ప్రయోగిస్తే 500-5,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల్ని ఛేదించే బాలిస్టిక్‌, క్రూయిజ్‌ క్షిపణులన్నింటినీ 1991 మే ఆఖరునాటికి నిర్మూలించాలని నిర్దేశించింది. అణ్వస్త్రాలను మోసుకెళ్లే స్వల్ప మధ్య దూర శ్రేణుల్లో సోవియెట్‌ యూనియన్‌ 1,846, అమెరికా 846 క్షిపణుల్ని ధ్వంసం చేసిన అపురూప ఘట్టం ఆ ఒడంబడిక వల్లే ఆవిష్కృతమైంది. ఐఎన్‌ఎఫ్‌ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ రష్యా సరికొత్త క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసిందంటూ అమెరికా, నాటో కూటమి దేశాలు 2013 నుంచే ఆందోళన వ్యక్తంచేస్తూ వచ్చాయి. తన క్షిపణులు ఐఎన్‌ఎఫ్‌ నిబంధనలకు లోబడే ఉన్నాయన్న రష్యా బూకరింపుల్ని విశ్వసించేది లేదంటూ మూడు దశాబ్దాలకు పైగా అమలులో ఉన్న ఒప్పందాన్ని అమెరికా నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. మున్ముందు ఈ తరహా ఒప్పందంలో తప్పనిసరిగా చైనా సైతం భాగస్వామి కావాల్సి ఉంటుందన్న అగ్రరాజ్యం- ఆసియాలో క్షిపణుల మోహరింపునూ ప్రస్తావిస్తోంది. ప్రత్యక్ష ఆయుధ పోటీకి, ప్రచ్ఛన్నయుద్ధ ప్రమాదానికీ సంకేతమిది!

చారిత్రక ఒప్పందం సమాధి కావడానికి రష్యాయే కారణం అని అమెరికా విదేశాంగ మంత్రి సూత్రీకరించవచ్చుగాక, అణ్వస్త్ర పరిజ్ఞానానికి సానపట్టి సరికొత్త మారణాయుధాల తయారీలో అగ్ర దేశాలన్నీ తలమునకలయ్యాయన్నది నిజం. సంచార, సంప్రదాయ, భూతలంపై నుంచి ప్రయోగించే క్రూయిజ్‌, బాలిస్టిక్‌ క్షిపణి వ్యవస్థల నిర్మాణాన్ని ఇప్పటికే మొదలుపెట్టామన్న అమెరికా రక్షణమంత్రి వ్యాఖ్యలే అందుకు తార్కాణం. అమెరికా రూపొందించిన క్షిపణి విధ్వంసక రక్షణ ఛత్రానికి చిక్కకుండా లక్ష్యాన్ని ఛేదించగలిగే మారణాస్త్రాల్ని రూపొందించినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ నిరుడు మార్చి మొదటి వారంలో స్పష్టీకరించారు. సైనికంగా రష్యా బలపడటం ప్రపంచ శాంతికి భరోసా ఇస్తుందంటూ- అణుశక్తితో దూసుకుపోయే తమ అణ్వస్త్రం లాంటిది మరెక్కడా లేదని, మున్ముందు ఎవరైనా దాన్ని అభివృద్ధి చేసినా, అప్పటికి తాము మరో కొత్తదానితో సిద్ధంగా ఉంటామని ఘంటాకంఠంగా చాటారు! ప్రపంచవ్యాప్తంగా నేడు దాదాపు 14వేల అణ్వస్త్ర నిల్వలున్నాయని, వాటిలో 90శాతం అమెరికా, రష్యాల చెంతనే పోగుపడ్డాయని అధ్యయనాలు చాటుతున్నాయి. ఆయా దేశాల సైన్యం దగ్గర 9,500 అణ్వస్త్రాలుంటే, తక్కినవాటిని నిర్వీర్యం చేసే యత్నాలు సాగుతున్నాయి. చైనా చెంత 290 అణ్వస్త్రాలే ఉన్నట్లు నివేదికలు చాటుతున్నా, గత రెండు దశాబ్దాల్లో బీజింగ్‌ అణుపాటవం ఇంతలంతలైందన్న రక్షణ నిపుణుల అంచనాలు- కనిష్ఠంగా 1,500 వార్‌హెడ్ల ఉనికిని ప్రస్తావిస్తున్నాయి. కాబట్టే, 2017, 2018 నాటి జాతీయ భద్రత వ్యూహపత్రాల్లో అమెరికా తనకు ప్రధాన వ్యూహాత్మక పోటీదారుగా బీజింగునే పేర్కొంది. చైనా భాగస్వామిగా లేని ఐఎన్‌ఎఫ్‌ తన ముందరి కాళ్లకు బందాలు వేస్తుంటే, ఆధునిక క్షిపణి వ్యవస్థల నిర్మాణంలో బీజింగ్‌ దూసుకుపోతుండటం- అమెరికా తాజా నిర్ణయానికి ప్రేరణ అయింది!

అణ్వాయుధ భాండాగారానికి అదనపు హంగులద్దడం రక్షణ సమతూకం కోసం; స్వీయభద్రతకే అణ్వస్త్రం తప్ప ఎవరిపైనా వాటిని తొలిగా ప్రయోగించబోం- వంటి మాటల మేజువాణీ మాటున స్వీయాధిపత్య సాధనకే అగ్రదేశాలు పావులు కదుపుతున్నాయి. ‘అణు ఉత్పాతాన్ని నివారించడం మాత్రమే కాదు, అందరికీ సురక్షిత ప్రపంచాన్ని నిర్మించడమూ మీ విధి’ అని 2010లోనే సమితి ప్రధాన కార్యదర్శిగా బాన్‌ కీ మూన్‌ చేసిన హితబోధ ఏనాడో పరగడుపున పడిపోయింది. ఇప్పటికే ఉన్న అణ్వాయుధాల్ని క్రమేణా తగ్గించి రూపుమాపాలంటూ నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, అగ్రరాజ్యాధినేతగా పేర్కొన్న ఒబామా- అమెరికా అణ్వాయుధాగారం ఆధునికీకరణకు లక్ష కోట్ల డాలర్ల ప్రతిపాదనల్ని ఖరారు చేశారు! క్షిపణి ఒప్పందం నుంచి ఇప్పుడు వైదొలగిన ట్రంప్‌- భావి అవసరాలకు దీటైన వ్యవస్థ నిర్మించాలని 2017లోనే ఆదేశాలు జారీ చేశారు. ‘కొత్త శకంలో చైనా జాతీయ భద్రత’ పేరిట పదిరోజుల క్రితం బీజింగ్‌ వెలువరించిన శ్వేతపత్రం- మాస్కో బీజింగులపై గుడ్లురుముతున్న అమెరికాకు ధాటిగా సమాధానం ఇస్తోంది. క్షిపణి విధ్వంసక వ్యవస్థ ‘ధాడ్‌’ను దక్షిణ కొరియాలో మోహరించడం ద్వారా అమెరికా ప్రాంతీయ వ్యూహాత్మక సమతూకాన్ని దెబ్బతీసిందన్న చైనా- పోటీ వాతావరణంలో వెనక్కి తగ్గేది లేదంటోంది. హైపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణులు సహా అత్యాధునిక మారణ వ్యవస్థల నిర్మాణంలో చైనా తలమునకలై ఉన్న తరుణంలో- ఆసియాలో క్షిపణుల్ని మోహరించాలన్న అమెరికా ప్రతిపాదన, మరో ప్రచ్ఛన్న యుద్ధక్షేత్రానికి అక్షరాలా ఆవాహన పలుకుతోంది. అణ్వస్త్రాలకు సంబంధించి అమెరికా, చైనా, రష్యాల కపట నాటకాలు యావత్‌ ప్రపంచాన్నే పెను ప్రమాదపుటంచులకు నెట్టేస్తున్నాయి!


Posted on 05-08-2019