Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

అగ్రదేశ హోదా అంతిమ లక్ష్యంగా...

* చైనా శాంతి మంత్రం కదన తంత్రం

అమెరికా-చైనాల మధ్య వాణిజ్య, సైనిక వైరం నానాటికీ ముదురుతోంది. దీనికి నిదర్శనలుగా మూడు తాజా పరిణామాలను ఉదహరించాలి. అవి- చైనా కరెన్సీ విలువను ఉద్దేశపూర్వకంగా తగ్గనిచ్చిందని అమెరికా మండిపడటం, రష్యాతో మధ్యశ్రేణి అణు క్షిపణుల (ఐఎన్‌ఎఫ్‌) ఒప్పందాన్ని అమెరికా రద్దు చేసుకోవడం, అమెరికా కవ్వింపులను సహించబోమని తన రక్షణ శ్వేతపత్రంలో చైనా హెచ్చరించడం! 1987లో రష్యాతో కుదుర్చుకున్న ఐఎన్‌ఎఫ్‌ ఒప్పందాన్ని అమెరికా ఇటీవల రద్దు చేయడం ఘర్షణ వాతావరణాన్ని ఎగదోసింది. ఐఎన్‌ఎఫ్‌ ఒప్పందం కింద అమెరికా, రష్యాలు 500 నుంచి 5000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై దాడి చేయగల మధ్యశ్రేణి క్షిపణులను పరిమితం చేసుకోవలసి ఉంది. కానీ, తాము ఇలా గిరి గీసుకొని కూర్చుంటే చైనా దూరశ్రేణి క్షిపణులను సమకూర్చుకుందని, రష్యా కూడా యథేచ్ఛగా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ అమెరికా ఐఎన్‌ఎఫ్‌ ఒడంబడిక నుంచి వైదొలగింది. ఆపై చైనా పొలిమేరల్లో అణు క్షిపణులను మోహరించడానికి సై అంటోంది. బహుశా పశ్చిమ పసిఫిక్‌ మహా సముద్రంలోని అమెరికా సైనిక స్థావరం గ్వామ్‌లో వీటిని మోహరించవచ్చు. ఇప్పటికే దక్షిణ కొరియాలో అమెరికా థాడ్‌ క్షిపణి వ్యవస్థను నియోగించడంతో ఉద్రిక్తతలు పెచ్చరిల్లాయని చైనా తప్పు పట్టింది.

ఏకధ్రువ ప్రపంచంవైపు పయనం
అమెరికా దూకుడును ఎదుర్కోవడానికి చైనా-రష్యాలు భుజం కలపడం ఖాయం. అమెరికా నేతృత్వంలోని ఏకధ్రువ ప్రపంచానికి కాలంచెల్లి బహుళధ్రువ ప్రపంచం ఏర్పడనుందని చైనా రక్షణ శ్వేతపత్రం చాటింది. అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాల దూకుడును దీటుగా ఎదుర్కొంటామని స్పష్టీకరిస్తూనే, భారత్‌ పట్ల సామరస్య ధోరణి ప్రదర్శించింది. 2017, 2018లలో అమెరికా విడుదల చేసిన వ్యూహ పత్రాలు చైనాను ప్రధాన ప్రత్యర్థిగా పరిగణించాయి. అంతకుముందు వరకు ఉగ్రవాదంపై పోరుకే ప్రాధాన్యమిచ్చిన అమెరికా- ఇక చైనా, రష్యాలతో పోటీకి, అవసరమైతే సంఘర్షణకు దిగాలని నిశ్చయించుకుంది. దీనికి ప్రతిగా చైనా ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధమని రక్షణ పత్రంలో హెచ్చరించింది. షాంఘై సహకార మండలి (ఎస్‌సీసీ) వంటి సంస్థల ద్వారా ఆసియా ఖండంలో శాంతిసౌభాగ్యాల స్థాపనకు చైనా కృషి చేస్తుంటే, అమెరికా దుందుడుకు పోకడలతో ఉద్రిక్తతలు సృష్టిస్తోందని నిరసించింది. తైవాన్‌, హాంకాంగ్‌లలో సమస్యలు సృష్టించడం, దక్షిణ కొరియాలో థాడ్‌ క్షిపణి వ్యవస్థల నియోగం, జపాన్‌, ఆస్ట్రేలియాలతో కలిసి సైనిక విన్యాసాలు నిర్వహించడం వంటివి అమెరికా దుడుకుతనానికి దృష్టాంతాలని పేర్కొంది. బయటి దేశాలు తరచూ చైనా గగన, సముద్ర తలాల్లోకి చొరబడి నిఘా వేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్‌, తుర్కిస్థాన్‌, టిబెట్‌లలోని వేర్పాటువాదులను జాతీయ భద్రతకు ప్రమాదకారులుగా వర్ణించింది.

గల్ఫ్‌ యుద్ధంలో అమెరికా సాంకేతిక పోరాట పటిమతో ఇరాక్‌ సైన్యాన్ని శీఘ్రంగా మట్టి కరిపించడంతో భావి యుద్ధాల్లో సైన్య సంఖ్యా బలంకన్నా సాంకేతిక సత్తాది పైచేయి కానుందని చైనా గ్రహించింది. అందుకే ప్రజా విమోచన సైన్యం (పీఎల్‌ఏ) సంఖ్యా బలంలో అయిదు లక్షలమందిని తగ్గించి సాంకేతిక పోరాట సత్తాను పెంచుకొంటోంది. ఇదంతా ఆత్మరక్షణ కోసం, ప్రపంచశాంతి సహకారాల పటిష్ఠత కోసమేనని అంటోంది. దీనికి భిన్నంగా అమెరికా అణు, అంతరిక్ష, సైబర్‌, క్షిపణి రంగాల్లో సమర సామర్థ్యాన్ని, రక్షణ వ్యయాన్ని పెంచుకొంటూ అంతర్జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తోందని చైనా ఆరోపించింది. వర్థమాన దేశాల బలం క్రమంగా పెరుగుతూ అంతర్జాతీయంగా వ్యూహపరమైన సమతుల్యత ఏర్పడుతుండగా, అమెరికా పెత్తందారీ పోకడలు, బలప్రదర్శన రాజకీయాలకు పాల్పడుతూ అంతర్జాతీయ సుస్థిరతకు భంగం కలిగిస్తోందని విమర్శించింది. కానీ, తాము దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ దీవులను నిర్మించి సైనికపరంగా ఆధిక్య సాధనకు పడుతున్న ఆరాటాన్ని రక్షణ పత్రం కప్పిపెట్టింది. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతానికి అమెరికాను దూరంచేసి, ఇక్కడి దేశాలను తన ఆర్థిక, భద్రతా ఛత్రం కిందకు తెచ్చుకోవడం చైనా వ్యూహంలా కనిపిస్తోంది. చైనా ఆశిస్తున్న ‘సుస్థిరత’ ఇదే. మరోవైపు దక్షిణాసియాను చాలావరకు ‘సుస్థిర’ ప్రాంతమని చైనా వర్ణించడం విశేషం. ఇక్కడ పదేపదే భారత్‌, పాకిస్థాన్‌లమధ్య సంఘర్షణలు ప్రజ్వరిల్లుతున్నా, ఇద్దరికీ సర్ది చెప్పవచ్చుననే ధీమాను చైనా రక్షణ పత్రం ప్రదర్శించింది.

భారత్‌కు ఆందోళనకర అంశాలు
చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌ 2013లో బెల్ట్‌-రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ) పేరిట భూతల, సముద్రతల సిల్క్‌ మార్గాల పునరుద్ధరణ చేపట్టి ఆసియా, ఆఫ్రికా దేశాల్లో వందల కోట్ల డాలర్ల పెట్టుబడులను గుమ్మరిస్తున్నారు. ఆ పెట్టుబడులకు భద్రత కల్పించడం చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ బాధ్యతల్లో ఒకటని రక్షణ పత్రం ఉద్ఘాటించింది. అందుకోసం చైనా దూరతీరాలకు పయనించగల నౌకా బలగాన్ని, విదేశాల్లో స్థావరాలను, రకరకాల సైనిక కార్యక్రమాలను నిర్వహించే సత్తాను సంతరించుకొంటోంది. ఆ మేరకు 2017లో జిబూటీలో నౌకా స్థావరం నెలకొల్పింది. సప్తసముద్రాల్లో, అంతరిక్షంలో, సైబర్‌ సీమలో ఎక్కడైనా సరే కార్యకలాపాలు నిర్వహించే సత్తాను సముపార్జించుకొని అమెరికాకు దీటైన అగ్రరాజ్యంగా ఎదగడం చైనా దీర్ఘకాలిక వ్యూహం. ఇది భారతదేశానికీ ఆందోళనకరమే. రక్షణపై చైనా ఇప్పటికే భారత్‌ కన్నా మూడు రెట్లు ఎక్కువ ఖర్చుచేస్తోంది. ఈ నిధుల్లో పెద్ద భాగాన్ని సైన్యం, వాయుసేనలపైకన్నా నౌకాదళం మీదే వ్యయీకరించడం పట్ల భారత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ కరం వీర్‌ సింగ్‌ కలవరం వ్యక్తంచేశారు. హిందూ మహాసముద్రంలో చైనా నౌకాదళ హడావుడి మరింత పెరగనుందని ఇది సూచిస్తోంది. సైనికులు, నావికులు, వాయుసేన సిబ్బందిపై రెండు దేశాలూ భారీగా ఖర్చు చేస్తున్నా, చైనా క్రమంగా సిబ్బంది బలగాన్ని తగ్గించుకొంటూ, సేనల ఆధునికీకరణపై ఖర్చు పెంచుతోంది. సరికొత్త ఆయుధాలను సమకూర్చుకోవడానికి భారత్‌ కన్నా నాలుగున్నర రెట్లు ఎక్కువ ఖర్చుచేస్తోంది. సిబ్బంది జీతభత్యాలు, పింఛన్లపై చైనాకన్నా భారత్‌ ఎక్కువ నిష్పత్తిలో ఖర్చు చేస్తున్నందువల్ల ఆధునికీకరణకు నిధులు చాలడం లేదు. 2010లో చైనా ఆధునిక ఆయుధాలసేకరణకు ఒక రూపాయి ఖర్చు చేస్తే, సిబ్బందిపై ఒక రూపాయి నాలుగు పైసలు పెట్టింది. ఏడేళ్లు తిరిగేసరికి సిబ్బందిపై వ్యయం 75 పైసలకు దిగింది. అదే భారతదేశం 2017లో సరికొత్త ఆయుధాలకన్నా సిబ్బందిపై 2.3 రెట్లు ఎక్కువ ఖర్చు చేసింది. 2010లో ఆధునిక ఆయుధాల సమీకరణ కోసం భారత్‌ కన్నా రెండు రెట్లు ఎక్కువ నిధులు వెచ్చించిన చైనా, 2017 వచ్చేసరికి నాలుగున్నర రెట్లు ఎక్కువ వ్యయీకరించింది. భావి యుద్ధాలకు అధునాతన ఆయుధాలే కీలకమని భారత్‌ కూడా గ్రహించకతప్పదు.

డోక్లామ్‌పై కప్పదాటు
చైనా రక్షణ శ్వేతపత్రంలో 16సార్లు భారత్‌ గురించి ప్రస్తావించినా, ఎక్కడా శత్రుభావం ప్రకటితం కాకపోవడం విశేషం. ముఖ్యంగా డోక్లాం గురించిన ప్రస్తావన ఆసక్తికరం. డాంగ్లాంగ్‌ (డోక్లాం) సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి అనువైన పరిస్థితులు కల్పించాల్సి ఉందని ఆ పత్రం పేర్కొంది. అంటే, 2017లో రెండు దేశాల సేనలు వెనక్కుతగ్గినా డోక్లాం ఇప్పటికీ అపరిష్కృతమేనన్న మాట. అవసరమైతే ఒక అడుగు వెనక్కువేసి, అవకాశం దొరికినప్పుడు రెండు అడుగులు ముందుకువేయడం చైనా నైజం. 2015లో చైనా అధినేత జిన్‌ పింగ్‌ దక్షిణ చైనా సముద్రంలోని కృత్రిమ దీవుల్లో సేనలు, నౌకలు, క్షిపణులను మోహరించబోమని హామీ ఇచ్చినా, తాజా రక్షణ పత్రం ఆ దీవుల రక్షణకు సైనికపరమైన ఏర్పాట్లు చేసుకునే హక్కు చైనాకు ఉందని ఉద్ఘాటించింది. ఇటీవలి సంవత్సరాల్లో భారత్‌-వియత్నామ్‌ల మధ్య రక్షణ బంధం బలపడినట్లు అనిపించినా, దక్షిణ చైనా సముద్ర వ్యవహారంలో తలదూర్చడానికి భారత్‌ సుముఖంగా లేదు. 2018 ఏప్రిల్‌లో వుహాన్‌లో జిన్‌ పింగ్‌- భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమైనప్పటి నుంచి భారత్‌ వైఖరిలో మార్పు వచ్చింది. పాకిస్థాన్‌కు చైనా సైనిక సాయం అందిస్తున్నందుకు ప్రతిగా వియత్నామ్‌కు భారత్‌ బ్రహ్మోస్‌ క్షిపణులు విక్రయించనుందని చాలాకాలంగా వార్తలు వినవస్తున్న సంగతి తెలిసిందే. కానీ, భారత్‌ ఇటీవల ఈ వార్తలను ఖండించింది. చైనా సంస్థలు పెద్దయెత్తున వియత్నామ్‌లో పెట్టుబడులు పెడుతున్న దృష్ట్యా ఆ దేశం బీజింగ్‌ను దూరం చేసుకోవాలనుకోవడం లేదు. భారత్‌కు ఈ ఏడాది అమెరికా తరవాత చైనాయే అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అందువల్ల భారత్‌, వియత్నామ్‌లు చైనా-అమెరికాలతో సంబంధాలను సమతుల్యపరచుకోవాలని అనుకొంటున్నాయి. భారతదేశ సముద్ర వ్యాపారంలో సగభాగం దక్షిణ చైనా సముద్రం గుండానే నడుస్తోంది కాబట్టి అక్కడ చైనాతో నేరుగా ఢీకొనే తలంపు దిల్లీకి లేదని అర్థమవుతోంది. ఆ పనిని అమెరికాకే వదలివేయాలని అనుకొంటోంది. అమెరికా-చైనాల మధ్య వైరం ముదురుతున్న తరుణంలో భారత్‌ దక్షిణచైనా సముద్రం జోలికి పోవడం లేదు. బహుశా దీన్ని దృష్టిలో ఉంచుకునే చైనా కశ్మీర్‌ విషయంలో సుతిమెత్తగా స్పందిస్తున్నట్లుంది. మొత్తం మీద అగ్రరాజ్యంగా ఎదగాలని తపిస్తూనే శాంతియుత వాతావరణంలో తన కల నెరవేర్చుకోవడమే చైనా వ్యూహం!


- కైజర్‌ అడపా
Posted on 12-08-2019