Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

‘డ్రాగన్‌’పై హాంకాంగ్‌ నిప్పులు

* నేరస్తుల అప్పగింత బిల్లుపై నిరసనలు

చైనా ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ హాంకాంగ్‌లో అనేక వారాలపాటు శాంతియుతంగా కొనసాగిన ప్రదర్శనలు గడచిన కొన్ని రోజులుగా హింసాత్మకంగా మారడం ఆశ్చర్యం కలిగిస్తోంది. విద్యావంతులు, వ్యాపారవేత్తలు, యువకులు, వృద్ధులు, మహిళలు, పిల్లలు... ఒకరేమిటి వారూ వీరూ అన్న తేడా లేకుండా హాంకాంగ్‌ సమాజానికి చెందిన ప్రతి ఒక్కరూ చేతులు కలిపి చైనా సర్కారు తీసుకువచ్చిన ‘నేరస్తుల అప్పగింత’ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో తత్తరపడిన చైనా ప్రభుత్వం- చట్టసభలో ఆ బిల్లును ప్రవేశపెట్టబోమని స్పష్టం చేసింది. నేరం చేశారన్న కారణంతో న్యాయస్థానాల నుంచి ఎలాంటి అనుమతులూ తీసుకోకుండానే హాంకాంగ్‌ పౌరులను చైనాకు తరలించే వెసులుబాటు కల్పిస్తున్న ఆ బిల్లుపై మొదటినుంచీ వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. బ్రిటిష్‌ వలస కాలనీగా ఉన్న హాంకాంగ్‌ను 1997లో చైనాకు అప్పగించింది మొదలు అక్కడ ‘ఒకే దేశం- రెండు వ్యవస్థలు’ అన్న విధానం అమలవుతోంది. దాని ప్రకారం యాభయ్యేళ్లపాటు విదేశీ, రక్షణ వ్యవహారాలు వంటివి మినహా మిగిలిన అన్ని అంశాలపైనా హాంకాంగ్‌కే నిర్ణయాధికారం ఉంటుంది. యాభయ్యేళ్లపాటు స్వతంత్ర ప్రతిపత్తిగల ప్రాంతంగా కొనసాగుతుంది. ఆలోపే ఆధిపత్యం స్థిరపరచుకోవాలన్న ‘బీజింగ్‌’ తాపత్రయం కారణంగానే ‘నేరస్తుల అప్పగింత బిల్లు’ వంటివి పుట్టుకొస్తున్నాయి.

తాజాగా వేల సంఖ్యలో నిరసనకారులు అత్యంత రద్దీగా ఉండే హాంకాంగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ముట్టడించి లోపల బైఠాయించారు. దీంతో ఒక్క విమానం పైకి ఎగరడంగానీ, లోపలికి రావడంగానీ సాధ్యంకాని పరిస్థితి ఏర్పడింది. ప్రపంచానికే ఆర్థిక కేంద్రంగా అభివర్ణించే హాంకాంగ్‌లో తలెత్తిన ఈ ప్రతిష్ఠంభన రాజకీయ, సామాజిక సంక్షోభంతోపాటు అనేక ఆర్థిక సమస్యలకూ అంటుకడుతోంది. ప్రధాన షాపింగ్‌ కేంద్రాలు, రవాణా వ్యవస్థలన్నీ యువత ‘అధీనం’లో ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిరసనల్లో పాల్గొనేందుకు వీల్లేదని హాంకాంగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు తమ ఉద్యోగులకు గట్టి హెచ్చరికలు జారీ చేసినా ఫలితం కనిపించడం లేదు. నేరస్తుల అప్పగింత బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవడంతోపాటు, చైనా అండదండలతో ప్రజల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా ఎంపికైన హాంకాంగ్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) క్యారీలామ్‌ను ఆ పదవినుంచి వైదొలగాలని నిరసనకారులు డిమాండ్‌ చేస్తున్నారు. తమ డిమాండ్లకు చైనా నాయకత్వం అంగీకరించేదాకా ఆందోళన ఉపసంహరించుకునేది లేదని వారు తెగేసి చెబుతున్నారు.

నిత్యం వందల సంఖ్యలో వాణిజ్య నౌకల రాకపోకలతో హాంకాంగ్‌ నౌకాశ్రయం ప్రపంచంలోనే అత్యంత రద్దీ ప్రాంతంగా పేరు తెచ్చుకుంది. అంతర్జాతీయంగా హాంకాంగ్‌ డాలర్‌కు గుర్తింపు ఉంది. అక్కడి స్టాక్‌ ఎక్స్ఛేంజీలో కార్యకలాపాలు నిర్వహించేందుకు విఖ్యాత కంపెనీలన్నీ తహతహలాడుతుంటాయి. నిధుల సమీకరణ కోసం చైనాకు చెందిన అనేక కంపెనీలు హాంకాంగ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో తమ షేర్లను లావాదేవీల కోసం ఉంచాయి. ప్రస్తుత సంక్షోభం అక్కడ వాణిజ్య కార్యకలాపాలకు తీవ్ర అడ్డంకిగా తయారైంది. సమస్యను సాధ్యమైనంత సత్వరం సద్దుమణిగేలా చేయాలంటూ చైనా కంపెనీలూ ‘బీజింగ్‌’పై ఒత్తిడి తెస్తున్నాయి. ఇప్పటికే అమెరికాతో వాణిజ్య యుద్ధం పతాక స్థాయికి చేరడంతో చైనా అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. మరోవంక దిగ్గజ కంపెనీ ‘హువావై’పై అమెరికా ఆంక్షల వేటు కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో హాంకాంగ్‌ రూపంలో తలెత్తే మరో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చైనా ప్రభుత్వం అంత సుముఖంగా ఉండకపోవచ్చు. నిరసనల వెనక విదేశీ శక్తుల హస్తముందన్న అనుమానాలనూ అక్కడి నాయకత్వం వెలిబుచ్చింది. అవి అర్థరహిత అనుమానాలు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

‘శాంతికి విఘాతం కలుగకుండా, మానవీయ కోణంలో వ్యవహరించి చైనా ప్రభుత్వం సమస్యను పరిష్కరించుకోవాలి’ అంటూ తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించారు. హాంకాంగ్‌ సరిహద్దుల్లో సాయుధులైన చైనా సైనికులు పెద్దయెత్తున పాగా వేశారు. సరిహద్దులకు దగ్గర్లో ఉన్న షెంజెన్‌ నగరంలోని క్రీడా మైదానంలో ఎర్ర జెండాలు ప్రదర్శిస్తూ కవాతులు నిర్వహిస్తున్నారు. సైన్యాన్ని ప్రయోగించి నిరసనలు అణచివేయాలన్న చైనా సర్కారు ఉద్దేశాలను వెల్లడిస్తున్న పరిణామాలివి. 1989లో తియానన్మెన్‌ స్క్వేర్‌లో శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న ఆందోళనకారులపైకి యుద్ధట్యాంకులు ప్రయోగించి ‘బీజింగ్‌’ సర్కారు వారిపై ఉక్కుపాదం మోపింది. ఒకవేళ ఇప్పుడూ అదే తరహా వ్యూహంతో సమస్యను పరిష్కరించుకోవాలని చైనా ప్రయత్నిస్తే అది అతిపెద్ద పొరపాటే అవుతుంది. అంతర్జాతీయ వ్యాపార, వాణిజ్య వర్గాలన్నీ చైనాకు వ్యతిరేకంగా మారే అవకాశాలు కొట్టిపారేయలేనివి. అంతర్జాతీయ ఆర్థిక వేదికపై అది ఆ దేశానికి ఎదురుదెబ్బగా పరిణమిస్తుంది. అందుకు బదులు నిరసనకారులు చేస్తున్న డిమాండ్లను ఆమోదించడమే సబబు. ‘నేరస్తుల అప్పగింత బిల్లు’ను పూర్తిగా ఉపసంహరించుకుంటే చైనాకు వచ్చే ఇబ్బందేమీ లేదు. దానివల్ల హాంకాంగ్‌పై చైనా పట్టేమీ సడలే అవకాశం లేదు. మరోవంక సీఈఓ క్యారీలామ్‌ను తొలగించి- ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన మరో నాయకుడిని ఆ పీఠంపై కూర్బోబెట్టాలన్న డిమాండ్‌పట్ల సానుకూలంగా స్పందించినా కొంపలేమీ మునగవు. చైనా ప్రభుత్వానికీ, హాంకాంగ్‌ నిరసనకారులకూ మధ్య రెండున్నర నెలలుగా కొనసాగుతున్న పీటముడిపై సహేతుక నిర్ణయం తీసుకోకుండా నాన్చడం మంచిది కాదు. ఆందోళనల ఉద్ధృతి పెరిగే కొద్దీ శాంతియుత పరిష్కారానికి దారులు మూసుకుపోతాయి. చైనా తమ వ్యవహారాల్లో అనవసర జోక్యం చేసుకోబోదోన్న భరోసా కోసం హాంకాంగ్‌ ప్రజలు ఇప్పుడు ఎదురుచూస్తున్నారు.

- వీరేంద్రకపూర్‌
(రచయిత- ప్రముఖ పాత్రికేయులు)
Posted on 16-08-2019