Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

బంగ్లాదేశ్‌లో గాడితప్పిన రాజకీయం

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో గడచిన కొన్ని రోజులుగా హింసాయుత సంఘటనలు సంభవిస్తున్నాయి. ప్రతిపక్షం బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) అధినేత బేగం ఖలీదా జియా ఢాకా దిగ్బంధనానికి పిలుపు ఇచ్చిన దరిమిలా అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గత ఏడాది జనవరి ఎన్నికల్లో కనీసం ఒక్క ఓటైనా బ్యాలట్‌ పెట్టెలో పడకముందే ప్రధానమంత్రి షేక్‌ హసీనా మెజారిటీ సాధించినట్లు ప్రకటించారని ఖలీదా ఆరోపణ. ఎన్నికల రిగ్గింగ్‌ను నిరసిస్తూ ఆమె ఢాకా దిగ్బంధానికి పిలుపు ఇచ్చారు. అయితే పరిస్థితి ఇంతవరకు వచ్చిందంటే, అది ఖలీదా స్వయంకృతమే. నిజానికి నిరుటి ఎన్నికల్లో ఆమె పార్టీ పోటీ చేయనే లేదు. ఎన్నికలు ఓ ప్రహసనంలా జరుగుతాయని, వాటిలో పోటీ చేయడం అనవసరమని ఆమె భావించారు. కానీ, ఆ ఎన్నికలు చాలావరకు స్వేచ్ఛగా, నిష్పాక్షిక వాతావరణంలో జరిగాయి. ఖలీదా ఎన్నికలకు దూరంగా ఉన్నా, జనరల్‌ హెచ్‌.ఎం.ఎర్షాద్‌ నాయకత్వంలోని జాతీయ పార్టీ ఎన్నికల్లో పోటీచేసి కొన్ని సీట్లు గెలిచింది కూడా. నేడు బంగ్లా పార్లమెంటులో జాతీయ పార్టీయే ప్రధాన ప్రతిపక్షం.

పెడసర ధోరణులు

ప్రధానమంత్రి షేక్‌ హసీనాలో నిరంకుశ పోకడలు ఉన్నమాట నిజమే కానీ, ఖలీదా ఎన్నికల్లో పోటీచేయకపోవడం వల్ల అధికారంపై హసీనా పట్టు మరింత బిగిసింది. షేక్‌ హసీనా ఏకవ్యక్తి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చెప్పవచ్చు. ఆమెకు చికాకు కలిగించే తీర్పులను వెలువరించడానికి న్యాయవ్యవస్థ సైతం జంకుతుంది. ఇక బంగ్లా ఉద్యోగి-అధికార గణం సంగతి చెప్పనవసరమే లేదు. బంగ్లా బ్యూరాక్రసీ హసీనాకు రబ్బరుస్టాంపుగా మారిపోయింది. ఒక రాత్రంతా పార్టీ కార్యాలయం నుంచి తనను కదలనివ్వలేదని బేగం ఖలీదా చేసిన ఆరోపణ నిజమే కావచ్చు. ఆమెను గట్టి బందోబస్తు మధ్య ఇంటికి తీసుకువెళ్లడానికి సిద్ధపడ్డామని పోలీసులు చెప్పారు కూడా. కానీ, ఖలీదా ఇంటికి కాకుండా వేరేచోటికి వెళ్దామనుకున్నట్లుంది. ఎన్నికల బహిష్కరణకు ఏడాది పూర్తయిన సందర్భంగా ఆమె ఏదైనా నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహించాలని ఆశించి ఉండవచ్చు. పోలీసులు ఆమె ప్రయత్నాన్ని వమ్ము చేశారు.

పాకిస్థాన్‌ సైన్యం అఘాయిత్యాలను ఎదిరించడానికి అశేష ప్రజానీకం చేసిన రక్తతర్పణంవల్ల బంగ్లాదేశ్‌ ఆవిర్భవించింది. ఎందరో త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం పొందిన బంగ్లాదేశ్‌ ఈపాటికి శాంతియుతంగా ప్రగతి పథంలో పురోగమించవలసింది. కానీ, అనేక ఇతర విముక్త దేశాల్లో మాదిరిగా బంగ్లాలో కూడా స్వాతంత్య్ర యోధులు సైతం ఎదుటివారిపై ఆధిక్యం సంపాదించడానికి అంతర్యుద్ధంలో మునిగిపోయారు. ఎవరికి వారు అధికారాన్ని గుప్పిట్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బంగ్లాదేశ్‌ ఆవిర్భవించినప్పుడు వెల్లివిరిసిన సామాజిక ఐక్యత ఈ అంతఃకలహాల వల్ల ప్రమాదంలో పడటం నిజంగా బాధాకరం. బంగ్లా సైన్యం గతంలో రాజ్యవ్యవస్థను తన చేతుల్లోకి తీసుకుని పరిపాలన సాగిద్దామనుకొంది. కానీ, బంగ్లాదేశీలు ఎంత అస్తవ్యస్తంగానైనా సరే తమను తాము పాలించుకోవాలనుకుంటారు. కనుక సైన్యం ప్రయత్నం విఫలమైంది. సైన్యం మళ్ళీ దేశ పాలనలో తలదూర్చి చేతుల్లు కాల్చుకోవాలనుకోవడంలేదు. మరోవైపు ఇద్దరు బేగంలు (హసీనా, ఖలీదా జియా) కీచులాడుకొంటూనే ఉన్నారు. ఎదుటివారిపై ఆధిక్యం సాధించడం కోసం దేశ ప్రయోజనాలకు భంగం కలిగించడానికి సైతం వెనకాడటంలేదు. మరోవైపు బంద్‌ కోసం, పని నిలుపుదల కోసం పార్టీలు ఇచ్చే పిలుపుల్ని బంగ్లా ప్రజలు పట్టించుకోవడంలేదు. హసీనా, ఖలీదాల మధ్య ఎంతకూతెగని ముఖాముఖీ సంఘర్షణ వల్ల మంచి ఏమైనా జరిగిందంటే, అది ఇదే. రాజకీయ అలజడి మధ్య కూడా బంగ్లాదేశ్‌ గడచిన రెండు దశాబ్దాలుగా ఏటా ఆరు శాతం వృద్ధిరేటు నమోదు చేస్తోంది. ఇప్పుడు బంగ్లాదేశీయులకు కావలసిందల్లా శాంతియుత పాలన. బంగ్లాదేశ్‌ విమోచనకు తోడ్పడిన భారతదేశం, ఈ విషయంలో ముఖ్యపాత్ర పోషించగలదు. కానీ, హసీనా లౌకికవాది కావడంవల్ల భారత్‌ మద్దతు ఆమెకే లభిస్తోంది. బేగం ఖలీదా జియా మతవాద సంస్థ అయిన జమాతే ఇస్లామీతో చేతులు కలిపారు. బంగ్లా స్వాతంత్య్ర పోరాటంలో విమోచనకారుల వ్యతిరేక శక్తులతో, చివరకు పాక్‌ సైన్యంతో కూడా చేతులు కలిపిన చరిత్ర జమాత్‌కు ఉంది. పాకిస్థాన్‌ ఇప్పటికీ బంగ్లాలో పట్టు సాధించాలని చూస్తున్నా, అది ప్రధానంగా ఉగ్రవాద శక్తుల మీద ఆధారపడుతున్నందువల్ల బంగ్లాదేశీల ఆదరణ సంపాదించలేకపోతోంది.

ఇస్లామిక్‌ భావజాలం మధ్య కూడా బంగ్లాదేశ్‌ లౌకిక, ప్రజాస్వామ్యరాజ్యంగా కొనసాగుతోంది. పాకిస్థాన్‌ ఏర్పాటుకు కారణభూతమైన ఇండియన్‌ ముస్లింలీగ్‌ మొదట తూర్పు బెంగాల్‌ (ప్రస్తుత బంగ్లాదేశ్‌)లోనే పుట్టినా, ఇక్కడి ప్రజల ఉదారవాద దృక్పథాన్ని రూపుమాపలేకపోయింది. ప్రస్తుతం బంగ్లా ప్రజలు మతంవైపు మొగ్గుతున్నా, అంతరంగంలో మాత్రం, వారు ఇప్పటికీ ఉదారవాదులే. బంగ్లాలో ఇప్పటికీ పది లక్షలమంది హిందువులు నివసిస్తున్నారు. ఇతరుల జోక్యం లేకుండా తమ మతధర్మాన్ని ఆచరిస్తున్నారు. బంగ్లాలో పాగా వేయడానికి పాకిస్థాన్‌ గట్టిగా ప్రయత్నిస్తున్నా, విమోచన ఉద్యమ సమయంలో అది ఇక్కడ సాగించిన హత్యాకాండ, అత్యాచారాలు, అఘాయిత్యాలను ప్రజలు ఇప్పటికీ మరవలేదు. ముఖ్యంగా ఈ దేశానికి మున్ముందు మార్గదర్శకత్వం చేసే నిపుణులు ఉండకూడదన్న దుష్టబుద్ధితో బంగ్లా ప్రతిభావంతులను పాక్‌ సైన్యం వూచకోత కోసింది. ఆనాటి దారుణాలను అమెరికన్‌ రచయిత గ్యారీ జి.బాస్‌ రచన 'ది బ్లడ్‌ టెలిగ్రాం- ఇండియాస్‌ సీక్రెట్‌ వార్‌ ఇన్‌ పాకిస్థాన్‌' కొత్త కోణంలో వెల్లడించింది. పాకిస్థాన్‌ సైన్యం సాగిస్తున్న మారణహోమాన్ని ఢాకాలోని అమెరికన్‌ దౌత్య కార్యాలయాధికారులు తీవ్రంగా నిరసించారు. తమ నిరసనను అప్పటి అమెరికన్‌ ప్రభుత్వానికి తెలియజేసినా నిక్సన్‌, కిసింజర్‌లు దాన్ని పట్టించుకోలేదు. అమెరికన్‌ దౌత్యాలయ అధికారులంతా ఈ సమస్యపై దాదాపు తిరుగుబాటు చేశారని ఆ పుస్తకం వెల్లడించింది.

కొత్త ఆరంభం కావాలిప్పుడు

పాకిస్థాన్‌ నుంచి వేరుపడినప్పటికీ బంగ్లాదేశ్‌ ఇప్పటికీ నిజంగా విముక్తమైనట్లు కాదు. కారణం- బంగ్లాదేశ్‌ ఇప్పటికీ విదేశీ ఆర్థిక సహాయంపై ఆధారపడి మనుగడ సాగించవలసి రావటమే. అమెరికా నాయకత్వంలోని కన్సార్టియం ఒకటి బంగ్లాకు విదేశ మారకద్రవ్యాన్ని అందిస్తోంది. బంగ్లా నాయకులు ఆంతరంగిక సమస్యలను పరిష్కరించుకోనంతవరకు వారు విదేశీ సహాయంపై ఆధారపడక తప్పదు. దీనికి విదేశాలు మూల్యం కోరతాయని గమనించకుండా బంగ్లా నేతలు నిత్యం కీచులాటల్లో మునిగితేలుతున్నారు. తమ విభేదాల పరిష్కారానికి విదేశాల సహాయాన్నీ కోరుతున్నారు. ఇది దీర్ఘకాలంలో బంగ్లాకు ఏమాత్రం క్షేమకరం కాదు. అయినా ఇద్దరు బేగంలు వ్యక్తిగత విద్వేషాలను పక్కనపెట్టడంలేదు. ఇద్దరు బేగంలు బంగ్లా రాజకీయాలను శాసిస్తున్నంత వరకు బంగ్లాదేశ్‌కు భవిష్యత్తు లేదు. దురదృష్టమేమంటే, వీరిద్దరికీ ప్రత్యామ్నాయం ఇప్పటికీ అవతరించకపోవడం. మతాన్ని, రాజకీయాలను కలగలిపి, కాలంచెల్లిన భావజాలాన్ని జనంనెత్తిన రుద్దచూసే మతవాద శక్తులు రాజకీయ ప్రత్యామ్నాయం కాలేవు. కనుక, బంగ్లాదేశ్‌కు ప్రజాస్వామ్యమే శరణ్యం. పాలక అవామీ లీగ్‌, ప్రతిపక్షం బీఎన్‌పీలు ఎంతసేపటికీ అధికార కైవసం మీదనే దృష్టిపెడుతూ ప్రజాస్వామ్య ప్రమాణాలను మంటగలుపుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చడం ప్రధానమంత్రి, అవామీ అధ్యక్షురాలు షేక్‌ హసీనా చేతిలోనే ఉంది. బీఎన్‌పీకి అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశమివ్వడం కోసం హసీనా మళ్ళీ ఎన్నికలు జరిపితే బాగానే ఉంటుంది. అది చెప్పినంత తేలిక కాదు. కానీ, బంగ్లాదేశ్‌ను గాడిన పెట్టడానికి అదొక్కటే మార్గం. దేశంలో సాధారణ పరిస్థితులు ఏర్పడనంత వరకు పేదరికాన్ని పారదోలడం సాధ్యంకాదు. దీనికోసం రాజకీయ రంగంలో కొత్త ఆరంభానికి నాంది పలకాలి.

(రచయిత - ఎస్‌.దీపాంకర్‌)
Posted on 13-01-2015