Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

ఆచితూచి వేయాలి అడుగు!

* ‘ఆర్‌సీఈపీ’లో భారత్‌ భాగస్వామ్యం

స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలు రెండువైపులా పదునున్న కత్తిలాంటివి. దేశ ఆర్థిక వ్యవస్థలను నిలబెట్టేవి కొన్ని... నిలువునా కూల్చేసేవి మరికొన్ని! పది దేశాల ‘ఆసియాన్‌’ కూటమితోపాటు- దానితో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలున్న ఇండియా, చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, జపాన్‌, దక్షిణ కొరియాలతో కూడిన 16 దేశాల ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యా(ఆర్‌సీఈపీ)న్ని పట్టాలకెక్కించేందుకు గడచిన ఆరేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పదహారు భాగస్వామ్య దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్యపరమైన అడ్డంకులు తొలగించి స్వేచ్చావాణిజ్య వాతావరణం నెలకొల్పే క్రమంలో కొన్ని సంవత్సరాలుగా అనేక అడ్డంకులు తలెత్తుతున్నాయి.

సమాన లబ్ధిపై సందేహాలు
పదహారు దేశాల మధ్య బృహత్తర, స్వేచ్ఛా, ఆర్థిక, వాణిజ్య భాగస్వామ్యంవల్ల ఏ దేశానికి ఎంత మేలు ఒనగూడుతుందన్న విషయంలో వివిధ అనుమానాలున్నాయి. భాగస్వామ్య పక్షాలన్నింటికీ దీనివల్ల సమానంగా లబ్ధి చేకూరుతుందా అన్న విషయంలో ఇప్పటికీ భారత్‌కు కొన్ని అనుమానాలున్నాయి. ‘ఆర్‌సీఈపీ’ ఏర్పాటుపై కొన్ని రోజుల క్రితం భాగస్వామ్య పక్షాల మధ్య చర్చలు జరిగాయి. దేశాల మధ్య అనుమానాలు పూర్తిగా నివృత్తి అయ్యి, ముఖ్యంగా అత్యంత కీలక భాగస్వామిగా ఉన్న భారత్‌ ఆమోదం లభిస్తే ‘ఆర్‌సీఈపీ’ అతిత్వరలోనే సాకారం కావచ్చు. మార్కెట్లతో అనుసంధానం, న్యాయమైన వాణిజ్య విధానాలకు సంబంధించి చైనా తరచూ అనుసరిస్తున్న మొండివైఖరి భారత్‌కు చికాకు కలిగిస్తోంది. ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ ధరలకే వస్తువులను తయారు చేసి వాటిని గుండుగుత్తగా ప్రపంచ విపణిలో గుమ్మరించే విద్యలో చైనా మొదటినుంచి ఆరితేరిపోయింది. చైనా దూకుడు, ఆధిపత్య వైఖరి వివిధ దేశాలకు వాణిజ్యపరంగా ఇబ్బందికరమైన వాతావరణం సృష్టిస్తోంది. స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న, కనిష్ఠ సుంకాలు వసూలు చేస్తున్న దేశాలను ఉపయోగించుకుని చైనా తన ఉత్పత్తులను వాటంగా ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఈ సమస్యను భారత్‌ గుర్తించింది. అందుకే ‘ఉత్పత్తుల మూలస్థానం’ అన్న నిబంధనను తీసుకురావాలని లేదా అంతర్జాతీయ వాణిజ్య ఎక్స్‌ఛేంజీలలో ఉత్పత్తులను నిర్దిష్ట విభాగాలుగా వర్గీకరించాలని భారత్‌ డిమాండ్‌ చేస్తోంది. ఇలా చేయడం ద్వారా తక్కువ సుంకాలు ఉన్న దేశాల గుండా ఆయా ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో ప్రవేశించినప్పటికీ వాటి మూలస్థానంపై స్పష్టత ఉంటుంది. కాబట్టి సహేతుక ప్రాతిపదికన సుంకాలు విధించేందుకు అవకాశాలు ఉంటాయి. భారీయెత్తున వస్తువులు తయారుచేసి ఆయా దేశాల విపణుల్లోకి అకస్మాత్తుగా జొరబడటమన్నది చైనా ఉత్పత్తి రంగానికి మేలు చేయవచ్చు. కానీ, అలాంటి దేశంతో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం భారత పారిశ్రామిక రంగానికి గొడ్డలిపెట్టుగా మారుతుంది. స్వేచ్ఛావాణిజ్యానికి అంగీకరిస్తే దిగుమతులపై సుంకాలు విధించే అవకాశాలు మూసుకుపోతాయి. భారతీయ విపణులను అడ్డూ ఆపూ లేకుండా చైనా ఉత్పత్తులు ఆక్రమిస్తాయి. దానివల్ల భారత పారిశ్రామిక రంగంపై కోలుకోలేని దెబ్బ పడుతుంది. సృజనాత్మక బాటలో, సాంకేతిక విజ్ఞానాన్ని కొత్తపుంతలు తొక్కించి ఉత్పత్తి రంగానికి ఊపునిచ్చే క్రమంలో భారత్‌ ఇప్పటికే బాగా వెనకబడి ఉంది. అందువల్లే చైనా సహా అనేక దేశాలు మన బలహీనతను అవకాశంగా మలచుకుంటున్నాయి. ‘భారత్‌లో తయారీ’ వంటివి పూర్తిగా ఆచరణలోకి రాకుండా కేవలం నినాదాల స్థాయిలోనే మిగిలిపోతున్నాయి.

చైనా విషయాన్ని పక్కనపెడితే ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య కూటమిలోని ఇతర దేశాలతో ప్రస్థానమైనా భారత్‌కు మేలు చేస్తుందా అంటే అదీ అనుమానమే! ఎందుకంటే ఆర్‌సీఈపీలోని అన్ని దేశాలూ భారత మార్కెట్‌పైనే ఆశలు పెట్టుకున్నాయి. తమ ఉత్పత్తులను విస్తారమైన భారత మార్కెట్లలో విక్రయించి సొమ్ము చేసుకోవడమేగాని- భారతీయ ఉత్పత్తులను తమ మార్కెట్లలోకి ఆహ్వానించే ఉద్దేశం ఏ దేశానికీ లేదు. ఈ నేపథ్యంలో భారతీయ విధాన కర్తలు ఆచరణాత్మక దృక్పథంతో ముందడుగు వేయాలి. లాభనష్టాల పక్కా లెక్కలపైనే అంతర్జాతీయ వాణిజ్యం జరుగుతుందిగాని- ఔదార్యం, సేవాదృక్పథం అన్న పదాలకు అక్కడ స్థానం లేదు. నాణ్యమైన, సృజనాత్మకమైన ఉత్పత్తులకే ప్రపంచ విపణి గౌరవమిస్తుంది. దేశాల మధ్య సుహృద్భావాలు, సత్సంబంధాలు వంటివాటికి వాణిజ్య బంధంలో చోటులేదు. 2018లోనూ అంతకుముందు సంవత్సరాల్లోనూ భారత వాణిజ్యం ఆరు ‘ఆసియాన్‌’ దేశాలతో 2,300 కోట్ల డాలర్ల లోటు బాటలో సాగింది. మొత్తంగా ఆర్‌సీఈపీ దేశాలతో భారత్‌కు 8,700 కోట్ల డాలర్ల లోటు ఉంది. ‘ఆసియాన్‌’ దేశాల్లో భారత్‌కు ఇండొనేసియాతో అతిపెద్ద వాణిజ్య లోటు (1,120 కోట్ల డాలర్లు) ఉండగా, మలేసియా (390 కోట్ల డాలర్లు), సింగపూర్‌ (380 కోట్ల డాలర్లు), థాయ్‌లాండ్‌ (320 కోట్ల డాలర్లు), వియత్నామ్‌ల(60 కోట్ల డాలర్లు)తోనూ భారత వాణిజ్యం ప్రతికూల మార్గంలోనే కొనసాగుతోంది. చైనాతో ఇండియాకు అతిపెద్ద వాణిజ్య లోటు (5,700 కోట్ల డాలర్లు) ఉంది. ఇది మొత్తంగా ప్రపంచ దేశాలతో భారత్‌ వాణిజ్య లోటు (18,500 కోట్ల డాలర్లు)లో 31 శాతానికి సమానం. భారత్‌నుంచి చైనాకు ఎగుమతుల విలువ 1,650 కోట్ల డాలర్లు. మొత్తంగా భారత్‌ ఎగుమతుల్లో (32,400 కోట్ల డాలర్లు) ఇది అయిదు శాతానికి సమానం. చైనానుంచి భారత్‌ చేసుకుంటున్న దిగుమతుల విలువ 7,380 కోట్ల డాలర్లు. ఆర్‌సీఈపీ దేశాలకు భారత్‌ చేస్తున్న ఎగుమతుల విలువ 6,613 కోట్ల డాలర్లు. ఇది మొత్తంగా భారత్‌ చేస్తున్న ప్రపంచ ఎగుమతుల్లో 20.4శాతానికి సమానం. ఈ దేశాలనుంచి భారత్‌ చేసుకుంటున్న దిగుమతుల విలువ మాత్రం 17,461 కోట్ల డాలర్లు కావడం గమనార్హం. భారత మొత్తం దిగుమతుల్లో ఇది 34.4శాతానికి సమానం. ఆర్‌సీఈపీ దేశాలతో భారత్‌కు 10,900 కోట్ల డాలర్ల వాణిజ్య లోటు ఉంది. ఈ పరిస్థితుల్లో ఆర్‌సీఈపీ బృహత్‌ కూటమిలో భాగస్వామి కావడంవల్ల భారత్‌కు ఏమైనా ఉపయోగముందా అన్నది తర్కించుకోక తప్పని ప్రశ్న.

ఆదాయానికి గండి
ఆర్‌సీఈపీ దేశాలు కూటమికి ఆవల ఉన్న దేశాలనుంచి దిగుమతులను తగ్గించుకుని భారత ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తే ఈ సమస్య కొంతవరకు పరిష్కారమవుతుంది. మరోవంక సృజనాత్మకంగా, నాణ్యమైన ఉత్పత్తుల తయారీకి భారత్‌ ప్రాధాన్యం పెంచాలి. తద్వారా భారత ఎగుమతుల పరిమాణం ఇనుమడిస్తుంది. ఆర్‌సీఈపీలో చేరడంవల్ల ఆయా దేశాల ఉత్పత్తుల మధ్య స్వేచ్ఛా ప్రసారం పెరిగి భారత కస్టమ్స్‌ ఆదాయానికి గండిపడవచ్చు. దీనివల్ల ఇప్పటికే ఉన్న వాణిజ్య లోటు మరింత పెచ్చరిల్లే ప్రమాదమూ కొట్టిపారేయలేనిది. దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యంవల్ల పెట్టుబడులు విస్తరించడంతోపాటు భారత్‌లోని నైపుణ్య మానవ వనరులకు ఆయా దేశాల్లో ప్రాధాన్యం లభించే అవకాశాలూ ఉన్నాయి. కాబట్టి, ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యంపై లాభనష్టాలను సహేతుకంగా అంచనా వేసుకున్న తరవాతే భారత్‌ ఒక నిర్ణయానికి రావాలి!


- సత్యపాల్‌ మేనన్‌
Posted on 20-08-2019