Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

అఫ్గాన్‌ శాంతి భ్రాంతియేనా?

ఆంగ్లో-అఫ్గాన్‌ ఒప్పందం దరిమిలా 1919లో విదేశీ వ్యవహారాలనూ స్వయంగా నిభాయించుకోవడం మొదలుపెట్టిన అఫ్గానిస్థాన్‌ నిన్న (ఆగస్టు 19) స్వాతంత్య్ర శతవార్షికోత్సవ సంబరాల్లో మునిగితేలాల్సింది. ఉగ్రమూకల నర్తనశాలగా దశాబ్దాలుగా దుష్కీర్తి మూటగట్టుకొని నిరంతరం నెత్తురోడుతున్న కాబూల్‌ నేలపై మొన్న ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) జరిపిన మానవబాంబు దాడి- ఓ కల్యాణ మండపాన్నే పీనుగుల కుప్పగా మార్చేసింది. పశ్చిమ కాబూల్‌లో జరుగుతున్న పెళ్ళి వేడుక లక్ష్యంగా జరిగిన అమానుష దాడి 63మంది అభాగ్యుల ప్రాణాలు తోడేసి, మరో 182మందిని తీవ్ర క్షతగాత్రుల్ని చేసింది. నిన్నటికి నిన్న జలాలాబాద్‌లో పన్నెండు బాంబుపేలుళ్లు భయవిహ్వల వాతావరణాన్ని కళ్లకు కట్టాయి. మహిళలు పిల్లల్ని లక్షించిన దాడితో తమకే మాత్రం సంబంధం లేదని తాలిబాన్‌ చెబుతున్నా, ఉగ్రమూకలకు అండదండలందిస్తున్న తాలిబన్లే ఈ కిరాతకానికీ బాధ్యత వహించాలని అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ స్పష్టీకరిస్తున్నారు. ఇస్లామిక్‌ స్టేట్‌కు స్వర్గధామాలుగా ఉన్న ప్రాంతాలన్నింటినీ తుడిచి పెట్టేస్తామని అష్రాఫ్‌ ఘనీ ప్రతిన బూనుతున్నా- అది అంత సులభసాధ్యం కాదన్న సంగతి ఆయనకీ తెలుసు! తాలిబన్లతో శాంతి చర్చలను సత్వరం ముగించి 14వేల అమెరికన్‌ బలగాల్ని సాధ్యమైనంత తొందరగా అఫ్గానిస్థాన్‌ నుంచి ఉపసంహరించాలని అధ్యక్షుడు ట్రంప్‌ ఆరాటపడుతున్న తరుణమిది. శాంతి ప్రక్రియలో పురోగతి సంతృప్తికరంగా ఉందని ట్రంప్‌ ఒకవంక కితాబులిస్తుంటే, మరోవంక ఐఎస్‌ రక్తదాహంతో విరుచుకుపడుతోంది. తాలిబన్లను నమ్మడం అంటే గొర్రెపిల్లలకు తోడేళ్లను కాపలా పెట్టడమేనని, అఫ్గాన్‌ నుంచి సైనిక బలగాల ఉపసంహరణ తీవ్ర అనర్థదాయకమని మొత్తుకొన్న జేమ్స్‌ మ్యాటిస్‌ నిరుడు డిసెంబరులో అమెరికా రక్షణమంత్రి పదవికి రాజీనామా చెయాల్సివచ్చింది. అఫ్గాన్‌లో తామే రాజేసిన కుంపట్లను ఆర్పకుండా అమెరికా మూటాముల్లే సర్దుకోనుండటం- అఫ్గాన్‌తోపాటు ఉపఖండాన్నీ పెనుప్రమాదంలోకి నెట్టేస్తోంది!

స్వాతంత్య్రానంతరం నూరేళ్ల కాలంలో కడపటి నాలుగు దశాబ్దాలూ అఫ్గానిస్థాన్‌ సంక్షోభాగ్నిగుండమై సెగలు కక్కుతూనే ఉంది. ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో అమెరికా రష్యాల రాజకీయ చదరంగానికి వేదికగా, తరవాత ఛాందస తాలిబన్ల చెరలో చిక్కి ఉగ్రభుజంగాల రంగస్థలిగా భ్రష్టుపట్టిపోయింది. సెప్టెంబరు 11నాటి దాడుల దరిమిలా అల్‌ఖైదా తలకొట్టి మొలేయడమే లక్ష్యంగా అమెరికా ప్రారంభించిన ఉగ్రవాదంపై అంతర్జాతీయ పోరు- అఫ్గాన్‌ను ఛిన్నాభిన్నం చేసేసింది. నాటి సమర వ్యూహంలో భాగంగా- అల్‌ఖైదాను నెత్తికెక్కించుకొన్న తాలిబన్ల తాట తీసిన అగ్రరాజ్యం, నేడు అఫ్గాన్‌ ప్రభుత్వ ప్రమేయం లేకుండా తాలిబన్లతోనే శాంతిచర్చలకు సిద్ధపడటమే విడ్డూరం. అఫ్గాన్‌ జనాభాలో 52 శాతం నివసిస్తున్న 65 శాతం జిల్లాలు తాలిబన్ల గుప్పిట్లోనో, వారి ప్రాబల్య ప్రాంతాలుగానో ఉన్నవే. ఈ నెల తొలివారంలో పోలీసు ప్రధాన కార్యాలయం వెలుపల తాలిబన్‌ మూకల ఆత్మాహతి కారు బాంబుదాడి 14మందిని బలిగొని దాదాపు 150 మందిని గాయపరచిన దుర్ఘటన- జగమెరిగిన ఉగ్రశక్తిగా దాని రక్తపిపాస నైజాన్ని రుజువు చేసేదే! గత నెలలో ఉగ్రప్రకోపం ఏకంగా 1,500మంది పౌరుల ప్రాణాలతో మృత్యుక్రీడలాడింది. దశాబ్ద కాలంలో ఏకంగా 32 వేలమంది పౌరుల ప్రాణాల్ని హరించిన ఉగ్రవాదం సమసిపోయి సుభద్ర, సుస్థిర అఫ్గానిస్థాన్‌ కోసం సరికొత్త ప్రాంతీయ సహకార వ్యూహం ‘ఇస్తాంబుల్‌ ఒప్పందం’ పేరిట 2011 డిసెంబరులోనే సిద్ధమైనా బుసలుకొడుతున్న టెర్రరిజమే దాని సక్రమ అమలుకూ ప్రధాన అవరోధంగా మారుతోంది. ఉగ్రపడగ దించని తాలిబన్లతో అమెరికా శాంతిచర్చలు, తమ దేశ భవిష్యత్తును మరింతగా దిగలాగుతాయని అఫ్గాన్‌ సమాజమే ఆందోళన చెందుతోంది. ఏదో విధంగా అఫ్గాన్‌ నుంచి బయటపడి, అదే ఘనకార్యమంటూ వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గుకురావాలన్న ట్రంప్‌ వ్యూహం కాబూల్‌ను కష్టాల కాష్ఠంలోకి నెట్టేయనుంది!

దాదాపు లక్ష కోట్ల డాలర్ల వ్యయంచేసి, 2,400 మందికి పైగా సైనికుల్ని బలిపెట్టానని స్వీయ త్యాగాల చిట్టా విప్పే అగ్రరాజ్యం- అఫ్గాన్‌ పరిస్థితిని పెనం మీద నుంచి పొయ్యిలోకి నెట్టేసిందన్నది నిజం. వచ్చే నెలాఖరులో జరగనున్న అఫ్గాన్‌ అధ్యక్ష ఎన్నికల్ని బహిష్కరించాలని, ప్రచార ర్యాలీలపై ఉగ్రదాడులు జరిపే అవకాశం ఉన్నందున ప్రజలు వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించిన తాలిబన్‌తో అమెరికా ‘శాంతి చర్చలు’ జరపడం ఏమిటో ఎవరికీ కొరుకుడు పడని అంశం! ఉగ్రమూకలతో అన్ని సంబంధాలూ తెంచుకొని, వారికి అఫ్గాన్‌ గడ్డమీద ఎలాంటి ఆశ్రయమూ కల్పించబోమన్న తాలిబన్ల హామీ మేరకు తుది ఒడంబడిక కుదరనుందంటున్నారు. ఉగ్రసంస్థగా తాలిబాన్‌ అఫ్గాన్‌ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటమేచేస్తుంటే, దాన్ని పట్టించుకోకుండా అది వల్లించే ధర్మపన్నాలకు అమెరికా తలూపడం ఏమిటి? ఇరాక్‌ సిరియాల్లో పట్టుకోల్పోయిన ఐఎస్‌ 2014లోనే అఫ్గాన్‌లో కాలూని, దాదాపు నాలుగు వేల ఉగ్రబలగంతో రాజ్యాధికారాన్నే కైవసం చేసుకొనే ప్రణాళికలు అల్లుతోంది. తాలిబన్లతో అమెరికా కుదుర్చుకొనే ఒప్పందంతో ఐఎస్‌ ముప్పు ఎలా తప్పుతుంది? ఐఎస్‌కు సంఘీభావం చాటిన తాలిబన్‌- అఫ్గాన్‌ను తమకు వదిలేయాలంటూ ఇరాన్‌ తోడ్పాటు కోసమూ పావులు కదిపినట్లు లోగడే వార్తాకథనాలు వెలుగుచూశాయి. అఫ్గాన్‌ కేంద్రస్థలిగా ఇస్లామిక్‌ రాజ్య విస్తరణకు ఐఎస్‌, కాబూల్‌ను చేజిక్కించుకోవాలని తాలిబన్లు మోహరించిన వేళ- అమెరికా బాధ్యత దులపరించేసుకొని జారుకొంటే, ఆ దేశం పరిస్థితేమిటి? నూరేళ్ల స్వాతంత్య్రాన్ని ఉగ్రవ్యాఘ్రాలు నోట కరచుకుపోతే, అఫ్గాన్‌ భవిష్యత్తంతా చీకటి!


Posted on 20-08-2019