Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

అడకత్తెరలో పాకిస్థాన్‌

‘చెరపకురా చెడేవు’ అన్న నానుడి తెలుసో లేదోగాని, పొరుగున పాకిస్థాన్‌కు స్వానుభవ సత్యంగా అది నేడు రుజువవుతోంది. జ్ఞాతి వైరంతో దహించుకొనిపోతూ, ఉగ్రదాడులతో ఇండియాను దగ్ధభూమిగా మార్చాలనుకొంటున్న పాకిస్థాన్‌- అంతర్జాతీయ సమాజం ముందు ముద్దాయిగా బోనెక్కి భయానక ఆంక్షల ముప్పును ఎదుర్కొంటూ బిక్కచచ్చిపోతోంది. ఇప్పటికే మనీలాండరింగ్‌, ఉగ్రనిధుల సరఫరాలకు సంబంధించి, ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) నిశిత పరిశీలన అవసరమైన ‘గ్రే’ జాబితాకు ఎక్కి ఆర్థికంగా ఇక్కట్ల పాలవుతున్న ఇస్లామాబాద్‌ను ‘బ్లాక్‌లిస్ట్‌’లో పెట్టాల్సిందేనని ఎఫ్‌ఏటీఎఫ్‌ ప్రాంతీయ అనుబంధ సంస్థ ఆసియా పసిఫిక్‌ బృందం (ఏపీజీ) తాజాగా నిర్ణయించింది. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో జరిగిన ఏపీజీ సదస్సు- మనీలాండరింగ్‌, ఉగ్రనిధుల సరఫరా నిరోధానికి సంబంధించి అయిదేళ్లుగా పాకిస్థాన్‌ చేపట్టిన చర్యల్ని మదింపువేసి ఈ కీలక నిర్ణయం ప్రకటించింది. కళ్లు మూసుకొని పాలుతాగుతూ తననెవరూ చూడలేదనుకొనే జంగురుపిల్లి చందంగా భయానక ఉగ్రసంస్థలతో పాక్‌ ఎలా అంటకాగుతున్నదీ యావత్‌ ప్రపంచం గమనిస్తూనే ఉంది. పాకిస్థాన్‌ ఆగడాలు శ్రుతిమించిన నేపథ్యంలో దాని తీరుతెన్నుల్ని నిశితంగా పరిశీలించాల్సిందేనంటూ నిరుడు ఫిబ్రవరిలో అమెరికా, యూకే, ఫ్రాన్స్‌, జర్మనీలు ఎఫ్‌ఏటీఎఫ్‌ సదస్సులో తీర్మానం ప్రతిపాదించాయి. నిశిత పరిశీలన అవసరమైన దేశాల (గ్రే) జాబితాలో నిరుడు ఇస్లామాబాద్‌ను చేర్చిన ఎఫ్‌ఏటీఎఫ్‌- 27 అంశాల కార్యాచరణ ప్రణాళికకు పదిహేను నెలల్లోగా పూర్తిగా కట్టుబడాలని పాకిస్థాన్‌కు నిర్దేశించింది. ఆ గడువు వచ్చే అక్టోబరులో ముగిసిపోతున్న తరుణంలో- మొత్తం 40 ప్రాతిపదికల్లో 32 విషయాల్లో పాక్‌ విఫలమైందని ఏపీజీ నివేదిక నిర్ధారించింది. ఉగ్రవాదులకు నిధులు అందకుండా చూసే ప్రతిపాదనల అమలులోనూ పాక్‌ దారుణ వైఫల్యాన్ని కళ్లకు కట్టిన ఏపీజీ దాన్ని ‘బ్లాక్‌ లిస్ట్‌’లో పెట్టాలంటోంది. చైనా టర్కీ మలేసియాల దన్నుతో ఆ ముప్పును తప్పించుకోవాలనుకొంటున్న ఇస్లామాబాద్‌కు తాజా నిర్ధారణ- గొంతులో పచ్చి వెలక్కాయ లాంటిది!

‘ఉగ్రవాదంపై అంతర్జాతీయ పోరు’లో అమెరికాకు కీలక భాగస్వామిగా కుదురుకున్న పాకిస్థాన్‌- అగ్రరాజ్యం నుంచి ధారాళంగా అందుకొన్న ధనరాశుల్ని- ఇండియాపై కత్తిగట్టిన టెర్రరిస్టుల్ని అన్ని విధాలుగా మేపడానికే మళ్ళించి తరించిపోయింది. ఆ ముక్క పాక్‌ మాజీ అధ్యక్షుడు ముషారఫే చెప్పినా చెవిన పెట్టని అమెరికా పెద్దలకు- అల్‌ఖైదా పెద్ద దిక్కు ఒసామా బిన్‌ లాడెన్‌ పాక్‌ గడ్డమీదే తెగటారిపోయాక జ్ఞానోదయం అయింది. ఆ తరవాతే 2012 ఫిబ్రవరి నుంచి మూడేళ్లపాటు పాకిస్థాన్‌ ఎఫ్‌ఏటీఎఫ్‌ నిశిత పరిశీలన జాబితాలో కొనసాగి ఆర్థికంగా నానా అవస్థల పాలయ్యింది. అయినా కుక్క తోక వంకర చందంగా, జగమెరిగిన ఉగ్రమూకలపై ఈగైనా వాలకుండా కాచుకొంటూ, ఉత్తుత్తి కేసులు పెట్టి అంతర్జాతీయ సమాజం కళ్లు కప్పచూసిన పాక్‌ నయవంచక నవ్యచాలనకు తాజా ఏపీజీ నివేదిక గాలి తీసేసింది. జైషే మొహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌పై ఉగ్రముద్ర పడకుండా చైనా దన్నుతో చిరకాలం కాచుకొన్న పాకిస్థాన్‌కు మూడు నెలల క్రితం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐఎస్‌ఐఎస్‌, అల్‌ఖైదా, జమాతుద్‌ దవా, లష్కరే తొయిబా, జైషే మొహమ్మద్‌, హక్కానీ నెట్‌వర్క్‌, తాలిబన్‌ వంటి ఉగ్రతండాలు ఇప్పటికీ ఇష్టారాజ్యంగా నిధులు వసూలు చేసుకొంటూ, సభలూ ప్రదర్శనలూ నిర్వహిస్తున్నా- వాటిని అరికట్టే పటిష్ఠ యంత్రాంగం ఏ దశలోనూ ఏర్పాటు కాలేదన్న నివేదిక- పాకిస్థాన్‌ తగిలించుకొని ఊరేగుతున్న గోముఖ వ్యాఘ్రం ముసుగును తొలగించేసింది. మరో ఏడు వారాల్లో జరగనున్న ఎఫ్‌ఏటీఎఫ్‌ సదస్సు నాటికి క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పును పాకిస్థాన్‌ కళ్లకు కట్టకుంటే నిషేధిత (బ్లాక్‌లిస్ట్‌) దేశాల జాబితాలో చేరక తప్పని పొరుగుదేశం పరిస్థితి అక్షరాలా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లవుతుంది!

ఆర్థిక సహకారం అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) నిశిత పరిశీలన దేశాల జాబితాలో ఉన్నందుకే పాకిస్థాన్‌ ఏటా 1000 కోట్ల డాలర్లు నష్టపోతున్నట్లు పాక్‌ విదేశాంగ మంత్రి మొన్న ఏప్రిల్‌లో వాపోయారు. లోగడ నిషేధ దేశాల జాబితాలోకి ఎక్కిన సిరియా ఆర్థికంగా అతలాకుతలమై అంతర్యుద్ధం పాలబడి ఎంతగా అలమటించిపోయిందో అందరికీ తెలుసు! ఇప్పటికే ‘బ్లాక్‌లిస్ట్‌’లో ఉన్న ఉత్తర కొరియా, ఇరాన్లు అతికష్టం మీద నెట్టుకొస్తున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్‌ఎఫ్‌) నుంచి 600 కోట్ల డాలర్ల భూరి తోడ్పాటు పాకిస్థాన్‌కు కొంత సాంత్వన ఇచ్చేదే అయినా, దాని వెన్నంటి ఉన్న షరతులు దేశార్థిక వ్యవస్థకు అక్షరాలా గరళవైద్యం ప్రతిపాదిస్తున్నాయి. పట్టుమని నెలరోజుల అవసరాలు తీర్చేందుకే పరిమితమైన విదేశ మారక ద్రవ్య నిల్వలు, మొన్న ఫిబ్రవరి నుంచే 16 శాతం కుంగి ఒక్కో డాలరుకు 160 దగ్గర తారట్లాడుతున్న పాక్‌ రూపాయి మారకం రేటు, తొమ్మిది శాతానికి చేరిన ద్రవ్యోల్బణం, మందగించిన ప్రగతి- ఇస్లామాబాద్‌ ఏలికల్ని వెంటాడుతున్నాయి. కరెంటు ఖాతాలోటు 1249 కోట్ల డాలర్లకు చేరి ఉరుముతోంది. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్‌ నిషేధిత దేశాల జాబితాలో చేరితే- ఐఎమ్‌ఎఫ్‌ సాయమూ నిలిచిపోతుంది. చైనా తోడ్పాటు పైనా ఆశ వదులుకోవాల్సి వస్తుంది. అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థిక ఆంక్షలు పెరిగితే పాక్‌ భవిష్యత్తు కుడితిలో పడ్డ ఎలుక చందం అవుతుంది. ఇంతటి ముప్పు తప్పాలంటే, ఉగ్రవాదాన్ని సమూలచ్ఛేదం చేసేందుకు పాక్‌ నేతాగణం సిద్ధపడాలి. ఉగ్రవాదాన్నే సర్కారీ విధానంగా స్థిరీకరించిన సైన్యం అందుకు సమ్మతిస్తుందా? ఈ విపత్కర పరిస్థితుల్లోనైనా పాకిస్థాన్‌కు ప్రాప్తకాలజ్ఞత రహిస్తుందా?


Posted on 24-08-2019