Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

మాంద్యానికి మరింత ఆజ్యం

* జపాన్‌ - దక్షిణ కొరియాల వాణిజ్య పోరు

జపాన్‌తో పాటు దాని పొరుగు దేశం దక్షిణ కొరియాలో ప్రజల ఆయుష్షు పెరిగి వృద్ధుల సంఖ్య ఎక్కువైపోయింది. రెండు దేశాల్లో జననాలు దారుణంగా పడిపోయాయి. ఏ దేశ జనాభా అయినా స్థిరంగా ఉండాలంటే సంతాన సాఫల్య రేటు కనీసం 2.1 శాతం ఉండాలి. అప్పుడు మరణాలకన్నా జననాలు కాస్త ఎక్కువగా ఉండి జనాభాకు కొంత స్థిరత్వం ఏర్పడుతుంది. కానీ జపాన్‌లో సంతాన సాఫల్య రేటు 1.45 శాతం, దక్షిణ కొరియాలో మరీ తక్కువగా 1.05 శాతం ఉంది. దంపతులు పిల్లలు కనడానికి ఆసక్తి చూపకపోతే 2750 సంవత్సరానికల్లా దక్షిణ కొరియాలో మనుషులే ఉండక దేశం అంతరించిపోతుందని 2014లోనే ఓ ప్రభుత్వ అధ్యయనం హెచ్చరించింది. జపాన్‌లోనూ పరిస్థితి కాస్త అటూఇటూగా ఇలానే ఉంటుంది. ఈ పరిస్థితిని నివారించకపోతే రెండు దేశాలూ ఆర్థికంగా, సామాజికంగా, రక్షణపరంగా దెబ్బతింటాయి.

జపాన్‌, దక్షిణ కొరియా ఈ వాస్తవాన్ని గుర్తించి మేల్కొనకుండా పరస్పర వినాశకర ఆర్థిక యుద్ధానికి దిగాయి. తూర్పు ఆసియాలో అమెరికాకు కీలక మిత్రులైన ఈ రెండు దేశాల జగడం- అక్కడ చైనా ఆర్థికంగా, సాంకేతికంగా, రక్షణ పరంగా ప్రాబల్యం పెంచుకోవడానికి అవకాశం ఇస్తుంది. సందట్లో సడేమియాలా ఉత్తర కొరియా ఇప్పటికే అయిదుసార్లు క్షిపణి పరీక్షలు జరిపింది. వాటివల్ల తమకు ప్రమాదమేమీ లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సర్దిచెప్పుకోవడం జపాన్‌, దక్షిణ కొరియాలకు చిర్రెత్తించింది. దీంతో అమెరికాను నమ్ముకోవడంకన్నా సోదర దేశమైన ఉత్తర కొరియాతో చేతులు కలపడం మేలని దక్షిణ కొరియా భావిస్తోంది. ఉభయ కొరియాల మధ్య ఆర్థిక సహకారం బలపడితే జపాన్‌ ఆధిపత్యాన్ని ఎదుర్కోగలుగుతామని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ వ్యాఖ్యానించడం గమనార్హం.

పరిస్థితి ఇంతగా దిగజారడానికి 1910-’45 మధ్య కొరియా ద్వీపకల్పంపై జపాన్‌ వలస పాలనలోనే బీజం పడింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌ సైనికులకు ‘లైంగిక సేవలు’ అందించడానికి రెండు లక్షలమంది కొరియా మహిళలను సైనిక వ్యభిచార కూపాల్లోకి నెట్టారు. వేలమంది కొరియా పురుషులను నిర్బంధ కూలీలుగా ఉపయోగించుకున్నారు. నాటి జపాన్‌ దౌష్ట్యం ఇప్పటికీ కొరియన్లు మరచిపోలేదు. పాత గాయాలను మాన్పి, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచుకోవడానికి రెండు దేశాలు 1965లో కుదుర్చుకున్న ఒప్పందం కింద జపాన్‌ 50 కోట్ల డాలర్ల నిధిని ఏర్పాటుచేసింది. దాని నుంచి దక్షిణ కొరియాకు రుణాలు, గ్రాంట్లను ఇస్తోంది. సెక్స్‌ బానిసల వేదనకు శాశ్వత పరిష్కారం కోసం 2018లో సంయుక్త నిధి ప్రారంభించారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ దాన్ని రద్దు చేశారు. వలస పాలనలో బాధితులకు నష్టపరిహారం చెల్లించేందుకు కొన్ని జపాన్‌ సంస్థల ఆస్తులు జప్తుచేసుకోవాలని దక్షిణ కొరియా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అది 1965నాటి సయోధ్య ఒప్పందానికి విరుద్ధమంటూ జపాన్‌ తోసిపుచ్చడంతో అగ్గి రాజుకుంది. సైనిక గూఢచారి సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి రెండు దేశాల మధ్య 2016లో కుదిరిన ఒప్పందాన్ని దక్షిణ కొరియా రద్దు చేయగా, దానికి ప్రతిగా జపాన్‌ తన ప్రధాన వాణిజ్య భాగస్వాముల జాబితా నుంచి దక్షిణ కొరియాను తొలగించింది. దక్షిణ కొరియాకు స్మార్ట్‌ ఫోన్ల తయారీలో కీలకమైన ఫ్లోరినేటెడ్‌ పోల్యిమైడ్‌, రెసిస్ట్స్‌ హైడ్రొజన్‌ ఫ్లోరైడ్‌ అనే మూడు కీలక రసాయనాల ఎగుమతులను జపాన్‌ నిలిపేసింది. ప్రపంచంలో ఈ మూడు రసాయనాలు 70 నుంచి 90 శాతం వరకు జపాన్‌లోనే తయారవుతున్నాయి. కాబట్టి ప్రత్యామ్నాయాలను వెతుక్కోవడం దక్షిణ కొరియాకు చాలా కష్టసాధ్యం. అంతేకాకుండా జపాన్‌ నుంచి ఎగుమతయ్యే రోబోలు, ఇంటెగ్రేటెడ్‌ సర్క్యూట్లు, కంప్యూటర్లు, కెపాసిటర్లు, టెలికామ్‌ ట్రాన్స్‌మిషన్‌ సామగ్రి వంటి 800 హైటెక్‌ పరికరాలపైనా ఆంక్షలు విధించారు. వీటివల్ల ఎగుమతి ప్రక్రియ చాలా ఆలస్యమై దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్‌, సెమీ కండక్టర్‌ పరిశ్రమలు సంక్షోభంలోకి జారిపోనున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తిదారు అయిన సామ్‌సంగ్‌, ఎలక్ట్రానిక్‌ సంస్థ ఎస్‌.కె.హైనిక్స్‌ కూడా దెబ్బతినబోతున్నాయి. ప్రపంచ విపణికి 60 శాతానికిపైగా మెమరీ చిప్‌లను సరఫరా చేసేది- సామ్‌సంగ్‌, ఎస్‌.కె. సంస్థలే. అదేవిధంగా 90 శాతం స్మార్ట్‌ఫోన్‌ తెరలను దక్షిణ కొరియాయే సరఫరా చేస్తోంది. యాపిల్‌, హువావై వంటి అమెరికన్‌, చైనీస్‌ సంస్థలూ ఈ ఉత్పత్తుల కోసం దక్షిణ కొరియాపై ఆధారపడుతున్నాయి. జపాన్‌ ఆంక్షల వల్ల ఈ విడిభాగాల సరఫరా దెబ్బతిని స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరిగిపోతాయి. జపాన్‌ బదులు చైనా, అమెరికా, ఐరోపా సమాఖ్యల నుంచి విడిభాగాలను తెచ్చుకుందామన్నా అందుకు మూడు నాలుగేళ్లు పడుతుంది.

దక్షిణ కొరియా ఇప్పటికే చైనా, బెల్జియం దేశాల్లోని సరఫరాదారుల వైపు దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం 5జీ పరికరాల ఉత్పత్తిలో సామ్‌సంగ్‌ ప్రముఖ స్థానం ఆక్రమిస్తోంది. జపాన్‌ నుంచి వచ్చే ముడిసరకులు, విడిభాగాలు దీనికి చాలావరకు కారణం. జపాన్‌, దక్షిణ కొరియాలు కలహించడం మానకపోతే సెమీకండక్టర్లు, 5జీ సామగ్రి విపణిలో చైనా అగ్రగామిగా ఎదిగే అవకాశం ఉంది. ఇప్పటికే 5జీ, కృత్రిమమేధ వంటి రంగాల్లో అమెరికాను సవాలు చేసే స్థాయికి చైనా ఎదగడం వల్లనే ట్రంప్‌ వాణిజ్య యుద్ధానికి తెర లేపారు. తీరా ఇప్పుడు దక్షిణ కొరియా కూడా చైనా పరిధిలోకి వెళితే బీజింగ్‌ మరింత విజృంభించడం ఖాయం. విడిభాగాల ఉత్పత్తికి అనేక అమెరికన్‌ కంపెనీలు దక్షిణ కొరియా మీద ఆధారపడుతున్నందువల్ల ఇకపై అవి ప్రత్యామ్నాయ సరఫరాదారులను ఆశ్రయించాల్సి వస్తుంది. ఏతావతా అగ్నికి వాయువు తోడైనట్లు అమెరికా-చైనా వాణిజ్య యుద్ధానికి జపాన్‌-దక్షిణ కొరియా కలహం జత కలవడం అంతర్జాతీయ ఆర్థిక మాంద్యాన్ని వేగంగా ముందుకుతెస్తోంది. ఇది చాలదన్నట్లు జర్మనీలో మాంద్య భయాలు, బ్రెక్సిట్‌ తీసుకొస్తున్న అనిశ్చితులు మాంద్యం నుంచి బయటపడే దారులను మూసేస్తున్నాయి!


- ఆర్య
Posted on 07-09-2019