Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

శాంతి... భ్రాంతి!

* అఫ్గాన్‌ చర్చలు విఫలం

అమెరికా, అఫ్గానిస్థాన్‌లలో జరగనున్న ఎన్నికలు ట్రంప్‌-తాలిబన్‌ శాంతియత్నాలను భ్రాంతిలా మార్చేశాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020లో, అఫ్గాన్‌ అధ్యక్ష ఎన్నికలు ఈ నెల 28న జరగనున్నాయి. 2001 సెప్టెంబరు 11న అమెరికాపై జరిగిన దాడి... 9/11 దాడిగా చరిత్రపుటల్లో నిలిచిపోయింది. ఈ ఘటన జరిగి 18 ఏళ్లు అవుతున్నందున, ఈ సెప్టెంబరు 8న తాలిబన్లతో సమావేశమై అఫ్గాన్‌లో అంతర్యుద్ధానికి స్వస్తి పలకాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయించారు. అఫ్గాన్‌లో 2001 నుంచి కొనసాగుతున్న అంతర్యుద్ధంలో వందలాది అమెరికన్‌, నాటో సైనికులు, లక్షమంది అఫ్గాన్‌ పౌరులు మరణించారు. 9/11 దాడుల తరవాత అమెరికా కాబూల్‌లో తాలిబన్‌ ప్రభుత్వాన్ని కూలదోయడమే కాకుండా, ఆ దాడికి ప్రేరకుడైన ఒసామా బిన్‌ లాడెన్‌ను పాకిస్థాన్‌లో హతమార్చింది. కాబూల్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడేలా చర్యలు తీసుకుంది. వచ్చిన పని పూర్తయినందున అఫ్గానిస్థాన్‌తో పాటు వివిధ దేశాల్లో యుద్ధాలను కట్టిపెట్టి అమెరికన్‌ సైనికులను స్వదేశానికి తీసుకొస్తానని డోనాల్డ్‌ ట్రంప్‌ 2016 ఎన్నికల్లో వాగ్దానం చేశారు. 2020లో మళ్లీ గెలవాలన్న లక్ష్యంతో ఆ హామీని నెరవేర్చదలిచారు. గతంలో ఈజిప్ట్‌, ఇజ్రాయెల్‌ మధ్య సయోధ్య కుదిరిన క్యాంప్‌డేవిడ్‌లో ఈనెల 8న తాలిబన్లతో ఆంతరంగిక సమావేశం జరపదలిచారు. కానీ, అంతకుముందే అయిదో తేదీన కాబూల్‌లో తాలిబన్ల ఉగ్రదాడిలో అమెరికన్‌ సైనికుడు మరణించడంతో శాంతి యత్నాలను విరమిస్తున్నట్లు ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.

గడచిన ఏడాది కాలంగా అమెరికా ప్రత్యేక ప్రతినిధి జాల్మే ఖలీల్జాద్‌ సయోధ్యకు చర్చలు జరుపుదామని ప్రయత్నించగా తాలిబన్లు బెట్టు చేస్తూవచ్చారు. చర్చల సమయంలో కాల్పుల విరమణ పాటిస్తే శాంతి ఒప్పందం సాధ్యమవుతుందని అమెరికా నచ్చచెప్పినా, తాలిబన్లు పెడచెవిన పెట్టారు. అంతేకాదు అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ ప్రభుత్వానికి శాంతి చర్చలతో ప్రమేయం ఉండకూడదని షరతు పెట్టారు. అయినా తాలిబన్లతో విడిగా చర్చలు కొనసాగించాలని అమెరికా నిర్ణయించడాన్ని బట్టి, ట్రంప్‌ వచ్చేఏడాది ఎన్నికల్లో మళ్లీ గెలవడానికి దేనిని అయినా పణంగా పెడతారని అర్థమైంది. జాల్మే ఖలీల్జాద్‌ తాలిబన్లతో కలసి రూపొందించిన ఒప్పందం ముసాయిదా ప్రకారం అఫ్గాన్‌లోని స్థావరాలలో అయిదింటిని అమెరికన్‌ సైనికులు 135 రోజుల్లో ఖాళీ చేయాలి. ఈ సందర్భంగా వారిపై దాడులు చేయబోమని తాలిబన్లు ఉదారంగా హామీ ఇచ్చారు. వారు అమాయక పౌరులపైనా దాడులు చేయకూడదనీ, అల్‌ఖైదాతో తెగతెంపులు చేసుకోవాలని అమెరికా షరతు పెట్టింది. అది జరిగే పని కాదని అందరికీ తెలుసు! ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లో 14,000 మంది అమెరికన్‌ సైనికులు ఉండగా, 2020కల్లా వారి సంఖ్య 9,000కు తగ్గాలని ముసాయిదా పేర్కొన్నది. ఈ కొద్దిమంది సైనికులతో అమెరికన్‌ స్థావరాలనూ, రాయబార కార్యాలయాన్ని రక్షించడం, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడం సాధ్యం కాదు. అయినా సరే అమెరికా ఇందుకు ఒప్పుకొంది. ఇకనైనా అఫ్గాన్‌ నుంచి అమెరికన్‌ సైనికులను వెనక్కు తీసుకొస్తే 2020 ఎన్నికల్లో తన గెలుపు సులువు అవుతుందన్న అంచనాతో తాలిబన్లతో శాంతికి ట్రంప్‌ ముందుకు వచ్చారు. ఆయన ప్రయత్నాలకు అమెరికన్‌ ప్రభుత్వ వర్గాల్లోనే వ్యతిరేకత వ్యక్తమైంది. కాబూల్‌లో వేర్వేరు సమయాల్లో విధులు నిర్వహించిన తొమ్మిదిమంది అమెరికన్‌ దౌత్యవేత్తలు ఈమేరకు సంయుక్త ప్రకటన సైతం విడుదల చేశారు.

అమెరికా, అఫ్గాన్‌ ప్రభుత్వాలు, తాలిబన్ల మధ్య త్రైపాక్షిక సమావేశం జరగాలని ట్రంప్‌ ఆశించారు. కానీ, అఫ్గాన్‌ ప్రజా ప్రభుత్వాన్ని మన్నించే ఉద్దేశం తాలిబన్లకు లేదు. మొత్తం దేశాన్ని తమకు అప్పగించి అమెరికా బయటకు వెళ్లిపోవాలన్నది వారి కోరిక. అయినా సరే మొదట అమెరికా, తాలిబన్లతో సంధి కుదుర్చుకుంటే, ఆ తరవాత తాలిబన్లు-అఫ్గాన్‌ ప్రభుత్వం మధ్య రాజీ కుదర్చవచ్చని ట్రంప్‌ ఆశించారు. అందుకే త్రైపాక్షిక సమావేశం కాస్తా ద్వైపాక్షిక సమావేశంగా మారింది. అమెరికాతో 8వతేదీన సమావేశమయ్యాక, ఈనెల 23న నార్వే రాజధాని ఓస్లోలో ఘనీ సర్కారు ప్రతినిధులతో చర్చలు జరుపుతామని తాలిబన్లు ప్రకటించారు. అంతలో అయిదో తేదీన తాలిబన్‌ దాడితో మొత్తం సయోధ్య ప్రక్రియ పట్టాలు తప్పింది. దీనితో సెప్టెంబరు 28న అఫ్గాన్‌ అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాక ఏర్పడే కొత్త ప్రభుత్వాన్ని తాలిబన్లు ఆమోదించబోరని స్పష్టమవుతోంది.

ప్రస్తుతం కశ్మీర్‌లో పాకిస్థాన్‌ను తలదూర్చనివ్వకుండా జాగ్రత్త పడుతూ పరిస్థితిని పూర్తిగా అదుపులో ఉంచుకోవాలని ఆశిస్తున్న భారత్‌కు ట్రంప్‌ నిర్ణయం ఊరటనిచ్చింది. ఒకవైపు ట్రంప్‌ అఫ్గానిస్థాన్‌లో భారత్‌ పాత్ర మరింత పెరగాలని ఆశిస్తుంటే, భారత్‌ను అక్కడ అసలు వేలుపెట్టనివ్వరాదని పాకిస్థాన్‌ ఆరాటపడుతోంది. తన శిష్యులైన తాలిబన్లకూ, అమెరికాకూ మధ్యవర్తిగా వ్యవహరించి సయోధ్య కుదర్చడం ద్వారా, ఉగ్రవాద వత్తాసుదారుగా తనకు పడిన ముద్రను చెరిపేసుకోవాలని చూసింది. కానీ, తాలిబన్ల దుందుడుకుతనంతో చర్చలు భగ్నమవడంతో పాక్‌ హతాశురాలైంది. అమెరికా సేనలు ఉన్నంతకాలం అఫ్గాన్‌ ఉగ్రవాదులను కశ్మీర్‌లో దాడులకు పంపాలంటే పాక్‌ ఒకటికి రెండుసార్లు ఆలోచించవలసి వస్తుంది. ఇలా అఫ్గాన్‌ సమస్యలో అన్ని పక్షాలూ కూరుకుపోయిన సమయంలో భారత్‌ కశ్మీర్‌లో 370వ అధికరణ రద్దు ప్రక్రియను పూర్తిచేసింది. అఫ్గానిస్థాన్‌లో ఇకపై జరిగే పరిణామాలు కశ్మీర్‌ తోపాటు యావత్‌ దక్షిణాసియాను ప్రభావితం చేయనున్నాయి!


- వరప్రసాద్‌
Posted on 16-09-2019