Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

బ్రెక్సిట్‌ చిక్కుముడిలో బ్రిటన్‌

* వ్యూహం లేక సతమతం

పార్లమెంటరీ సంప్రదాయాలను తుంగలో తొక్కి పంతం నెగ్గించుకొనే అధినాయకులు వర్థమాన దేశాల్లో చాలా తరచుగా కనిపిస్తుంటారు. ఆధునిక ప్రజాస్వామ్యానికి పుట్టిల్లు అయిన బ్రిటన్‌లోనూ అలాంటి దుస్సంప్రదాయాలు పొడసూపడం పూర్తిగా అనూహ్యం. పారిశ్రామిక విప్లవాన్ని ప్రారంభించి ప్రపంచీకరణకు సారథిగా నిలచి ఆధునిక బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ వ్యాపారాలకు జన్మనిచ్చిన బ్రిటన్‌ నేడు కాలచక్రాన్ని వెనక్కు తిప్పాలని చూస్తోంది. వస్తుసేవలు, పెట్టుబడులు, శ్రామికులు, నిపుణులు స్వేచ్ఛగా రాకపోకలు సాగించడానికి ప్రపంచంలోనే అతిపెద్ద వేదిక అయిన ఐరోపా సమాఖ్య (ఈయూ) నుంచి నిష్క్రమిస్తానని (బ్రెక్సిట్‌) మంకుపట్టు పడుతోంది.

రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యం ఇప్పటికీ వెలుగులు చిమ్ముతోందన్న భ్రమతోనో లేదా ఐరోపాను కాదని పూర్తిగా అమెరికా ఒడిలోకి చేరిపోవాలనే ఆశతోనో బ్రెక్సిట్‌ చేపట్టినట్లుందే తప్ప, దీనివెనక దూరదృష్టికాని, పకడ్బందీ వ్యూహం కాని కనిపించడం లేదు. అసలు బ్రిటన్‌ పాలక పార్టీ కన్సర్వేటివ్‌ లలోనే బ్రెక్సిట్‌పై ఏకాభిప్రాయం లేదు. అక్టోబరు 31కల్లా ఎలాంటి ఒప్పందం లేకుండా ఈయూ నుంచి బ్రిటన్‌ను బయటకుతెచ్చేయాలనే ఆరాటంలో ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ చిరకాల పార్లమెంటరీ సంప్రదాయాలను కాలరాశారు. ఈ అడ్డగోలు పథకాన్ని వ్యతిరేకించిన సొంత పార్టీ ఎంపీలు 21మందికి ఉద్వాసన పలికి, బ్రెక్సిట్‌ను పార్లమెంటులో నెగ్గించుకోవడానికి కావలసిన మెజారిటీ లేకుండా చేసుకున్నారు. కూర్చున్న కొమ్మను నరుక్కోవడమంటే ఇదే. ప్రతిపక్షం లేబర్‌ పార్టీ ఎటూ ఒప్పంద రహిత (నో డీల్‌) బ్రెక్సిట్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తోంది. పాలక, ప్రతిపక్ష ప్రతిఘటన నుంచి తప్పించుకోవడానికి జాన్సన్‌ సెప్టెంబరు 9 నుంచి అక్టోబరు 14వరకు పార్లమెంటును ప్రోరోగ్‌ చేయడానికి రాణి ఎలిజబెత్‌ అనుమతి తీసుకున్నారు. తన బ్రెక్సిట్‌ పథకం రద్దుకు పార్లమెంటు చట్టం చేయకుండా నిరోధించడానికే జాన్సన్‌ ఈ పని చేశారని విమర్శలు హోరెత్తుతున్నాయి. అక్టోబరు 14న పార్లమెంటు మళ్ళీ సమావేశమయ్యాక జాన్సన్‌, పార్లమెంటు సభ్యులు తన బ్రెక్సిట్‌ పథకానికి శీఘ్రంగా ఆమోదం తెలపాలని కోరవచ్చు. కానీ, ఎప్పుడంటే అప్పుడు చేరడానికి, ఇష్టం లేకపోతే వెళ్లిపోవడానికి ఈయూ ధర్మసత్రం కాదు. అది ప్రవేశ, నిష్క్రమణలకు పకడ్బందీ నియమనిబంధనలను అమలు చేసే సువ్యవస్థిత సంఘం. బ్రిటిష్‌ రాజకీయ నాయకులు ఈ కఠిన వాస్తవాన్ని మరుగుపరచి ఈయూ నుంచి నిష్క్రమణ (బ్రెక్సిట్‌) నల్లేరు నడక అని, దానికి ఎలాంటి మూల్యం చెల్లించనక్కర్లేదని ప్రజలను నమ్మించారు. ఈ అబద్ధం ఇప్పుడు పటాపంచలవుతోంది.

బ్రిటన్‌లో 14,000 మందికి ప్రత్యక్షంగా, 1,10,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న పౌర విమాన తయారీ సంస్థ ఎయిర్‌ బస్‌ ఉదంతమే తీసుకుందాం. బ్రిటన్‌ కనుక ఈయూతో బలవంతంగా తెగతెంపులు చేసుకుంటే తాము కూడా బ్రిటన్‌కు నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకోవలసిరావచ్చని ఆ సంస్థ అధిపతి టామ్‌ ఎండర్స్‌ సూచించారు. ఎయిర్‌ బస్‌ ఈయూ దేశాలకు చెందిన బహుళజాతి సంస్థ. బ్రిటిష్‌ ఎగుమతుల్లో 40 శాతం ఈయూ దేశాలకే వెళ్ళడం చూస్తే, ప్రపంచం ఎంత పరస్పరాశ్రితంగా మారిందో అవగతమవుతుంది. ఇంటర్నెట్‌, బ్రాడ్‌ బ్యాండ్‌, మొబైల్‌ ఫోన్లు, క్లౌడ్‌, త్వరలో 5జీ నెట్‌ వర్క్‌లతో అనుసంధానమయ్యే నేటి ప్రపంచంలో ఏ దేశమూ ఏకాకిగా మనుగడ సాగించలేదు. అయినా సరే ఊరంతా ఒకదారి అయితే, ఉలిపి కట్టెది మరోదారి పోకడలు బ్రిటన్‌ పాలక పార్టీలో ప్రబలడం ఆశ్చర్యకరం. బహుశా ఈయూ నుంచి బ్రిటన్‌ బయటకువచ్చిన వెంటనే డొనాల్డ్‌ ట్రంప్‌తో అమిత లాభదాయక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవచ్చని బోరిస్‌ జాన్సన్‌ ఆశలు పెట్టుకున్నట్లుంది. కానీ, ట్రంప్‌కు తమ ప్రయోజనాలే తప్ప వేరెవరి ప్రయోజనాలూ పట్టవు. జాన్సన్‌ కాని, ట్రంప్‌ కాని గుర్తించాల్సిన వాస్తవాలేమిటంటే, నేడు ఏ దేశమూ ఒంటరిగా పురోగమించజాలదని! ప్రపంచీకరణ వల్ల సంపన్న దేశాల్లో ఆదాయ అసమానతలు పెచ్చరిల్లిన మాట నిజం. అక్కడ బడా కంపెనీలు, ధనికులు మరింత సంపన్నులవుతుంటే, పేద, మధ్యతరగతివారు ఎదుగూబొదుగూ లేకుండా ఉండిపోతున్నారు. ఇది వారిలో అసహనం, ఆవేశాలను రగిల్చి జనాకర్షక విధానాలతో దట్టించిన జాతీయవాదాన్ని రెచ్చగొడుతోంది. దాన్ని సొమ్ముచేసుకోవాలనే యావలో జాన్సన్‌ వంటివారు ఆవిర్భవించారు. బ్రిటన్‌ సమస్యలను తక్కిన ప్రపంచంతో నిమిత్తం లేకుండా ఒంటిచేత్తో పరిష్కరించుకోగలమన్న భ్రమను వ్యాపింపజేస్తున్నారు. ఇవాళ ఒక దేశ స్టాక్‌ మార్కెట్‌ ఉత్థానపతనాలు తక్షణం ఇతర దేశాల్లో ప్రతిఫలిస్తున్నాయి. ఈ పరస్పరాశ్రిత ప్రపంచంలో వాతావరణ మార్పులు, వ్యాపార విధానాలు, సాంకేతికతలు అంతర్జాతీయ సమస్యలుగా మారి అంతర్జాతీయ పరిష్కారాలను డిమాండ్‌ చేస్తున్నాయి. వీటిని ఏ ఒక్క దేశమూ తనకుతానుగా అధిగమించలేదు. బ్రిటన్‌ ఈ వాస్తవాన్ని గ్రహించి ఐరోపా సమాఖ్య (ఈయూ)లో భాగస్వామి కొనసాగాలని ఆలోచనాపరులు సలహా ఇస్తున్నారు.

దీన్ని పెడచెవిన పెట్టిన జాన్సన్‌ తన దుందుడుకు పంథాతో ఇంటా బయటా విశ్వసనీయత కోల్పోయారు. ఆయనకు సొంత పార్టీలోనే ధిక్కారం ఎదురవుతోంది. పార్లమెంటులో ఎటూ మెజారిటీ లేదు. జాన్సన్‌ పార్లమెంటు ఆధిక్యతను దెబ్బతీయాలని చూస్తున్నారని స్కాట్లాండ్‌ న్యాయమూర్తులు ఖండించారు. బ్రెక్సిట్‌ చిక్కుముడిని విప్పడంలో పార్లమెంటు, రాజకీయ నాయకులు విఫలమయ్యారని 81 శాతం బ్రిటిష్‌ ఓటర్లు భావిస్తున్నట్లు పలు సర్వేలు తెలిపాయి. పాలక కన్సర్వేటివ్‌, ప్రతిపక్ష లేబర్‌ పార్టీలు ఆచరణీయ బ్రెక్సిట్‌ విధానాన్ని రూపొందించలేకపోవడం దీనికి ప్రధాన కారణం. శతాబ్దాల నుంచి కొనసాగుతున్న ప్రజాస్వామ్య సంప్రదాయాలు, సంస్థలు క్రమంగా విశ్వసనీయత కోల్పోతే నిరంకుశ నేతలు చెలరేగిపోయే ప్రమాదం ఉంది. వ్యవస్థలకన్నా వ్యక్తులే గొప్ప అనే వాదం బలం పుంజుకోవచ్చు. జాన్సన్‌ ఒంటెత్తు పోకడలతో బ్రిటన్‌లో మధ్యంతర ఎన్నికలు జరిగినా ఆశ్చర్యం లేదు. ఎన్నికలే వస్తే బ్రిటిష్‌ ఓటర్లు తమ దేశాన్ని ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మగా నిలబెడతారా లేదా అని యావత్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది!


- ప్రసాద్‌
Posted on 18-09-2019