Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

శిఖరాగ్రస్థాయికి స్నేహానుబంధం

* ‘హౌడీ మోదీ’ సమ్మోహనాస్త్రం

* హ్యూస్టన్‌లో ప్రధాని భారతీయ సమ్మేళనం

* హాజరుకానున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

* మరింత బలపడిన భారత్‌-అమెరికా బంధం

భారత, అమెరికా సంబంధాల్లో గుణాత్మక మార్పులు చోటుచేసుకుంటున్న తరుణమిది. అమెరికాలోని హ్యూస్టన్‌ నగరంలో యాభై వేలకుపైగా ప్రవాస భారతీయుల నడుమ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్న ప్రతిష్ఠాత్మక ‘హౌడీ మోదీ’ కార్యక్రమానికి తానూ హాజరవుతానంటూ అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా ముందుకు రావడం ఉద్విగ్నభరిత పరిణామం! అమెరికాలోని ఓ నగరంలో ప్రవాస భారతీయులతో ప్రధాని నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఆ దేశ అధ్యక్షుడు చొరవగా ముందుకు రావడం ఆషామాషీ విషయం కాదు. ‘హౌడీ మోదీ’ ర్యాలీలో పాలుపంచుకోవాలన్న నిర్ణయంతో చైనా, పాకిస్థాన్‌లకు ట్రంప్‌ బలమైన సందేశం పంపారు. హ్యూస్టన్‌ ర్యాలీకి అమెరికా అధినేత హాజరవుతున్నారంటూ శ్వేత సౌధ అధికార ప్రతినిధి నాలుగు రోజుల క్రితం వెలువరించిన విస్పష్ట ప్రకటన పాకిస్థాన్‌, చైనా దౌత్య వర్గాల్లో కలకలం సృష్టించింది. పాకిస్థాన్‌లోని కొన్ని టెలివిజన్‌ ఛానళ్లు ట్రంప్‌ చర్యను మరో గిమ్మిక్కుగా కొట్టిపారేశాయి. దీని ద్వారా భారత్‌, అమెరికా సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాయన్న సంకేతాన్ని ప్రపంచానికి అందించేందుకు అగ్రరాజ్యం ప్రయత్నిస్తోందని ఆ దేశంలోని మరికొన్ని ఛానళ్లు వ్యాఖ్యానించాయి. మరో దేశానికి చెందిన నాయకుడి కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు భాగస్వామిగా మారడమన్నది అగ్రరాజ్యం చరిత్రలోనే ఇది మొదటిసారి. దేశానికి ఒనగూరే లాభనష్టాలను క్షుణ్నంగా బేరీజు వేసుకున్న తరవాతే అగ్రరాజ్యాధినేత ‘హౌడీ మోదీ’ విషయంలో తుది నిర్ణయం తీసుకుని ఉంటారనడంలో సందేహం లేదు!

చైనా దూకుడుకు కళ్ళెం
అమెరికాలో వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తే అది పొరపాటే అవుతుంది. ‘హౌడీ మోదీ’ కార్యక్రమంలో పాలుపంచుకోవాలన్న నిర్ణయం వెనక నేపథ్యాన్ని తరచి చూడటం చాలా ముఖ్యం. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ గడచిన కొంతకాలంగా చైనా తన ప్రాబల్యాన్ని విస్తరించుకుంటోంది. ఆధిపత్యం పెంచుకొని దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో అమెరికా సహా ఇతర దేశాల న్యాయమైన హక్కులకూ ‘బీజింగ్‌’ నాయకత్వం సవాళ్లు విసరుతోంది. ఇప్పటికే ఆ ప్రాంతంలోని అత్యధిక భాగంలో నౌకా వాణిజ్యం నిర్వహిస్తూ చైనా తన ఆధిపత్యాన్ని ప్రకటించుకుంటోంది. ఫిలిప్పీన్స్‌, వియత్నాం వంటి చిన్న దేశాలకు చెందిన దీవులనూ హక్కుభుక్తం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలోని విస్తారమైన అంతర్జాతీయ సముద్ర రవాణా మార్గంపైనా అదుపు సాధించి, దాన్ని తన కనుసన్నల్లోకి తెచ్చుకోవాలని ‘బీజింగ్‌’ నాయకత్వం పరితపిస్తోంది. సముద్రతలంపై అదుపూ అజమాయిషీ సాధించాలన్న దాని ప్రయత్నాలు ఇలా ఉంటే- అమెరికా, చైనాల మధ్య కొంతకాలంగా తీవ్రమైన వాణిజ్య యుద్ధం జరుగుతుండటం ముఖ్యంగా గమనించాల్సిన మరో విషయం! అమెరికన్‌ కంపెనీల మేధాసంపత్తి హక్కులకు భంగం కలిగించి, వాటిని తస్కరించడం ద్వారా చైనా తమకు వందల కోట్ల డాలర్ల నష్టం చేకూరుస్తోందంటూ అగ్రరాజ్యాధినేత ‘బీజింగ్‌’ నాయకత్వంపై ఇటీవల బాహాటంగా ఆరోపణలు గుప్పించారు. అంతటితో సరిపెట్టకుండా మరో అడుగు ముందుకేసి చైనాలోని అమెరికన్‌ సంస్థలు అక్కడ తమ కార్యకలాపాలను నిలిపివేయడమో లేక వేరే దేశాలకు తరలిపోవడమో చేయాలంటూ ట్రంప్‌ పిలుపిచ్చారు.

జమ్మూ కశ్మీర్‌ విషయంలో పాకిస్థాన్‌కు బహిరంగ మద్దతు ప్రకటించడం ద్వారా చైనా ఇటీవల వ్యవహరించిన తీరు- ‘బీజింగ్‌’పట్ల భారత్‌ దృక్పథంలో మార్పునకు కారణమైంది. ఆ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధంపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘వాణిజ్య యుద్ధాన్ని అన్ని సందర్భాల్లోనూ తప్పు పట్టడానికి వీల్లేదు. ఒకవేళ అలాంటి ఘర్షణ దేశాల మధ్య వాణిజ్యపరమైన సమతౌల్యానికి కారణమైతే దాన్ని సానుకూల కోణంలోనే చూడాల్సి ఉంటుంది’ అన్న వ్యాఖ్యల ద్వారా జైశంకర్‌ చెప్పాల్సిన విషయాన్ని చైనాకు సూటిగా చెప్పేశారు. వాణిజ్యం సహా ఇతర అంశాల్లో పరస్పర సహకారంతో చైనాతో కలిసి ముందడుగు వేసే మార్గాలు అంతకంతకూ కుంచించుకు పోతున్నాయన్న స్పష్టమైన సందేశాన్ని ఆ వ్యాఖ్యల ద్వారా జైశంకర్‌ వినిపించారు. అంతమాత్రాన చైనా వ్యతిరేక సైనిక కూటమిలో చేరేందుకు భారత్‌ సంసిద్ధంగా ఉందని సంకేతాలిచ్చినట్లు కాదు. ‘హౌడీ మోదీ’ ర్యాలీలో పాల్గొనాలని నిర్ణయించడం ద్వారా- చైనా ఆర్థిక, సైనిక ప్రాబల్యాన్ని బలహీనపరచేందుకు తాము కృతనిశ్చయంతో ఉన్నామని, ఆ ప్రస్థానంలో భారత్‌ను బలమైన స్నేహితుడిగా పరిగణిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు అంతర్జాతీయ సమాజానికి తేల్చిచెప్పినట్లుగా భావించాల్సి ఉంటుంది.

ప్రపంచ రాజకీయ వేదికపై చైనా, పాకిస్థాన్‌లను కవల సోదరులుగా పరిగణిస్తారు. జమ్మూ కశ్మీర్‌ వ్యవహారంలో పాకిస్థాన్‌ వైఖరిని అడ్డగోలుగా సమర్థిస్తూ ‘సమితి’ భద్రతా మండలిలో చైనా ప్రవర్తించిన తీరు- భారత్‌, ‘బీజింగ్‌’ సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపింది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ-370, 35-ఏ నిబంధనలను నీరుగారుస్తూ భారత ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో- పాకిస్థాన్‌ నానా యాగీ చేసేందుకు ప్రయత్నించింది. అంతర్జాతీయ వేదికపై అన్ని దేశాలనూ కూడగట్టి భారత వ్యతిరేక ప్రకటనలు ఇప్పించాలని అది తెగ తాపత్రయపడింది. కానీ, భారత్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా చైనా, టర్కీ మినహా మరే దేశమూ స్పందించకపోవడం పాక్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. అధికరణ-370 రద్దు భారత అంతర్గత వ్యవహారమని వ్యాఖ్యానిస్తూ అమెరికా ఆచితూచి స్పందించింది. అవసరమైతే కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహిస్తామని పేర్కొంటూ పాక్‌ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ను అప్పటికప్పుడు అనునయించేందుకు అమెరికా ప్రయత్నించింది. అయితే ఆ విషయంలో కచ్చితంగా తన స్పందనను తెలియజేయడం ద్వారా ఆ చర్చ అంతకుమించి ముందుకు సాగకుండా భారత్‌ నీరుగార్చేసింది. భారత ప్రధానితో కలిసి ‘హౌడీ మోదీ’ ర్యాలీలో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాకిస్థాన్‌కు విస్పష్ట సంకేతాలు పంపించారు. ఈ చర్యతో కశ్మీర్‌పై భారత్‌కు వ్యతిరేకంగా తననుంచి మద్దతును ఆశించవద్దు అంటూ ట్రంప్‌ ఆ దేశానికి శషభిషలు లేకుండా తేల్చిచెప్పినట్లుగానే భావించవచ్చు. తద్వారా ఇకపై భారత్‌-అమెరికా సంబంధాల్లో పాకిస్థాన్‌ ఓ అప్రస్తుత అంశంగా మారే అవకాశాలు కొట్టిపారేయలేనివి. గడచిన నెల రోజులుగా పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ భారత్‌పై అణు దాడుల గురించి ఊకదంచుతున్నారు, అణ్వస్త్రాల పేరు చెప్పి పదేపదే బెదిరింపులకు దిగుతున్నారు! ఈ తరహా దుందుడుకు పోకడల ద్వారా ఒక దేశంగా పాకిస్థాన్‌ ఎంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందో అమెరికాకు తెలిసివచ్చింది.

ఉభయకుశలోపరి
పసిఫిక్‌, హిందూ సముద్ర ప్రాంతాల్లో కొంతకాలంగా చైనా నౌకాదళ కార్యకలాపాలు ముమ్మరించాయి. భారత్‌ సహా అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాలకు ఇది కలవరం కలిగించే సమస్యగా మారింది. అంతర్జాతీయ సముద్ర జలాల్లో బలాబలాలు తిరగబడే ప్రమాదం గుర్తించిన అమెరికా రక్షణ విభాగం సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. ఆసియా-పసిఫిక్‌ నావికా భద్రత వ్యవస్థ స్థానే ‘ఇండో-పసిఫిక్‌’ భావనను తెరమీదకు తీసుకువచ్చింది. ఈ కొత్త వ్యవస్థలో భారత్‌ పోషించాల్సిన పాత్ర మరింత విస్తారంగా ఉండబోతోంది. చైనా సైన్యం ప్రభావాన్ని కట్టడి చేసే క్రమంలో భారత నౌకాదళం బాధ్యత గతంలోకన్నా ఇనుమడించింది. అమెరికా, భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియాలు ఈ ప్రాంతంలో ఏటా కలిసికట్టుగా నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలనూ ఈ నేపథ్యంలోనే అర్థం చేసుకోవాల్సి ఉంది. అమెరికా దృష్టికోణం ఎలా ఉన్నా భారత్‌ విధానం మాత్రం మొదటినుంచీ ఒకటే! అగ్రరాజ్యంతో సంబంధాలు ఎంత బలంగా ముడివడినా ఆ ప్రభావం భారత్‌-చైనాల దౌత్య బాంధవ్యాన్ని దెబ్బతీయరాదన్నదే తొలినుంచీ ఇండియా ఆలోచన విధానం.

దౌత్య పరిణతి
అమెరికా వ్యూహకోణంలో అఫ్గానిస్థాన్‌లో చోటుచేసుకునే పరిణామాల నేపథ్యంలోనే పాకిస్థాన్‌తో అగ్రరాజ్యం అవసరాలు ముడివడి ఉన్నాయి. ఇటీవల అఫ్గాన్‌ తాలిబన్లతో అమెరికా జరిపిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఈ పరిస్థితుల్లో అఫ్గాన్‌ తాలిబన్లపై పాకిస్థాన్‌ తిరిగి సైనిక, దౌత్యపరమైన ఒత్తిడి పెంచాలని అమెరికా కోరుకుంటోంది. ఆ మేరకు ఇస్లామాబాద్‌ నాయకత్వంపై అమెరికా ఒత్తిడి తీసుకువస్తోంది. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఇకమీదట ఎట్టి పరిస్థితుల్లోనూ కశ్మీర్‌పై అమెరికా జోక్యం చేసుకోబోదన్న విషయం పాకిస్థాన్‌కు బాగా అర్థమైంది. కేవలం కంటితుడుపుగానే కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ గతంలో ట్రంప్‌ మాట్లాడారనీ పాక్‌కు తేటతెల్లమైంది. ‘హౌడీ మోదీ’ ర్యాలీలో అమెరికా అధ్యక్షుడు పాల్గొనడం చరిత్రాత్మక ఘటన! అంతర్జాతీయంగా భారతావని ప్రాబల్య విస్తరణకు, దౌత్య ధురీణతకు ఇదో మచ్చుతునక. భారత్‌-అమెరికా సంబంధాలు ‘పాక్‌ చట్రం’నుంచి పూర్తిగా బయటపడ్డాయని విస్పష్టంగా తేల్చిచెబుతున్న పరిణామం ఇది!


- సురేశ్‌ బాఫ్నా
(రచయిత- సీనియర్‌ పాత్రికేయులు)
Posted on 22-09-2019