Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

పీఠానికి పోటాపోటీ

* శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు

శ్రీలంకలో ఎన్నికల వేడి రాజుకుంది. నవంబరు 16న అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామన్న ఎన్నికల సంఘం ప్రకటనతో రాజకీయం ఊపందుకుంది. పార్టీలు వ్యూహరచనల్లో తలమునకలవుతున్నాయి. శ్రీలంక పొడుజన పెరమున తరఫున మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స సోదరుడైన గొటబయ రాజపక్స ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. ప్రస్తుత అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన మళ్లీ బరిలోకి దిగకపోవచ్చు! ప్రధాని రణిల్‌ విక్రమసింఘే, కేంద్రమంత్రి సజిత్‌ ప్రేమదాస, స్పీకర్‌ కరు జయసురియా అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తున్నారు. దీంతో యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ (యూఎన్‌పీ) అభ్యర్థి ఎంపికలో జాప్యం జరుగుతోంది.

మహింద రాజపక్స అధ్యక్షుడిగా ఉన్న 2005 నుంచి 2015 వరకు ఆయన సోదరులు బసిల్‌, గొటబయ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. రక్షణశాఖ కార్యదర్శిగా గొటబయ సారథ్యంలో సైన్యం లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ్‌ ఈలం (ఎల్‌టీటీఈ)పై విజయం సాధించింది. పోరులో భాగంగా సైన్యం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్టు అభియోగాలు వెల్లువెత్తినా సర్కారు పట్టించుకోలేదు. సుదీర్ఘకాలం సాగిన అంతర్యుద్ధానికి చరమగీతం పాడినా, తీవ్రమైన రాజ్యహింసతో రాజపక్స శకం మసకబారింది. గొటబయ నేతృత్వంలో జరిగిన హింసపై మైనార్టీలైన తమిళులు, ముస్లిముల్లో భయాందోళనలు ఇంకా తొలగిపోలేదు.

ఆదర్శ పాలన అందిస్తామన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన యూఎన్‌పీ సారథ్యంలోని కూటమి సిరిసేన, విక్రమసింఘేల మధ్య ఆధిపత్య పోరుతో అప్రతిష్టపాలయింది. ఆర్థిక, రాజకీయ సంస్కరణలను తీసుకువస్తామని హామీలిచ్చినా అవి పూర్తిస్థాయిలో ఆచరణకు నోచుకోకపోవడంతో ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. 2018 అక్టోబరులో ప్రధాని పదవి నుంచి రణిల్‌ విక్రమసింఘేను తొలగించి మహింద రాజపక్సను సిరిసేన నియమించడంతో అధికార కూటమి నిట్టనిలువునా చీలిపోయింది. న్యాయస్థానం జోక్యంతో విక్రమసింఘే తిరిగి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినా అధికార కూటమికి ఉన్న ప్రజాదరణ తగ్గిపోయింది.

గొటబయకు జాతీయవాదులు మద్దతుగా ఉన్నారు. తమిళ మైనార్టీలు ఆయనపై వ్యతిరేకతతో ఉండటం ఓటింగ్‌ సరళిపై ప్రభావం చూపించే అవకాశముంది. ఉదారవాదుల్లోనూ ఆయనంటే అయిష్టత ఉంది. గొటబయ రక్షణశాఖ కార్యదర్శిగా ఉన్న కాలంలో భద్రతాదళాలు చట్టాలను ఉల్లంఘించాయి. తమకు వ్యతిరేకంగా ఎవరు గళమెత్తినా నిర్దాక్షిణ్యంగా అణచివేసేవి. అసమ్మతి వ్యక్తం చేసిన వారిని కిడ్నాప్‌ చేసి చిత్రహింసలకు గురిచేసేవి. ఇప్పటికీ కిడ్నాప్‌నకు గురైన వేలాదిమంది జాడ తెలియలేదు. వీటి వెనక గొటబయ హస్తముందని మానవహక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయన్ను అధ్యక్షపదవికి నిలబెట్టడంపై ప్రజాస్వామ్య సంఘాలు భగ్గుమంటున్నాయి.

జాతుల సమస్య ఇంకా పరిష్కారం కాకపోవడంపై తమిళులు ఆవేదనలో ఉన్నారు. దీనికి సంబంధించి 1986లో అప్పటి భారత ప్రధాని రాజీవ్‌ గాంధీ, శ్రీలంక అధ్యక్షుడు జయవర్దనేల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు 13వ రాజ్యాంగ సవరణ తీసుకువచ్చారు. దీని ప్రకారం రాష్ట్రాలకు అధికారాలను బదిలీ చేయాల్సి ఉంది. ఇప్పటికీ ఆ హామీని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని తమిళులు ఆరోపిస్తున్నారు. తమిళులు అత్యధికంగా నివసిస్తున్న ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో అభివృద్ది అంతంత మాత్రమే. యుద్ధం ముగిసి దశాబ్దకాలం గడుస్తున్నా ఈ ప్రాంతాలు సైనికవర్గాల నిఘాలో ఉండటం గమనార్హం.

తాజాగా ఈస్టర్‌ సందర్భంగా జరిగిన బాంబు పేలుళ్లు దేశాన్ని కుదిపివేశాయి. తాము అధికారంలో ఉన్న సమయంలో తమిళ పులులను అణచివేసిన తీరును రాజపక్స ప్రచారంలో ప్రస్తావించే అవకాశముంది. ప్రత్యేకించి జాతీయ భద్రత అంశాన్ని ఆయన ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకోనున్నారు. అధికారంలో ఉన్న యూఎన్‌పీ ఎవర్ని అధ్యక్ష బరిలో నిలబెట్టవచ్చన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. పార్టీలో మెజార్టీ వర్గాలతో పాటు తమిళ ప్రొగ్రెసివ్‌ అలయన్స్‌ (టీపీఏ) సజిత్‌ ప్రేమదాస అభ్యర్థిత్వంపై మొగ్గుచూపుతున్నారు. కేంద్రమంత్రి అయిన సజిత్‌ ప్రేమదాసకు అన్ని వర్గాల్లో మద్దతు ఉంది. ఆయన తండ్రి రణసింఘే ప్రేమదాస 1989-93 మధ్య కాలంలో అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. అటు జాతీయవాదులతో పాటు తమిళులు, ముస్లిములు సజిత్‌ అభ్యర్థిత్వానికి సానుకూలంగా ఉన్నారు.

ఉగ్రవాదం, పెరుగుతున్న రుణభారం, చైనా ఆధిపత్యం, నిరుద్యోగం, జాతీయభద్రత... ఎన్నికల్లో ప్రధానాంశాలుగా మారనున్నాయి. తమిళుల ఓట్లు గెలుపోటములపై ప్రభావాన్ని చూపించగలవు. దీన్ని పసిగట్టిన రాజపక్స సోదరులు తమిళ నేత డగ్లస్‌ దేవానందను ప్రచారంలో దించేందుకు ప్రయత్నిస్తున్నారు. గొటబయ రాజపక్సకు అమెరికా పౌరసత్వం ఉంది. అయితే దాన్ని వదులుకున్నట్టు ఆయన ప్రకటించారు. రాజ్యాంగం ప్రకారం ఇతర దేశాల పౌరసత్వం ఉండేవారు ఎన్నికల్లో పోటీకి అనర్హులు. దీన్ని అధికార కూటమి తమకు అనుకూలంగా మలచుకునే అవకాశముంది.

హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మకంగా కీలక స్థానంలో ఉన్న లంకలో బీజింగ్‌ పాగా వేసింది. మహింద రాజపక్స హయాములో చైనా ఆర్థిక సాయంతో నిర్మితమైన హంబన్‌టోట నౌకాశ్రయాన్ని ఆ దేశ కంపెనీలు తమ వశం చేసుకున్నాయి. మౌలిక సౌకర్యాల అభివృద్ధి పేరుతో రుణాలు ఇవ్వడం, అనంతరం వాటిని స్వాధీనం చేసుకోవడం బీజింగ్‌ వ్యూహంలో భాగం. 2015లో యూఎన్‌పీ మద్దతుతో సిరిసేన అధికారంలోకి రావడంతో చైనా విస్తరణకు అడ్డుకట్ట పడింది. జాతుల ఘర్షణ అనంతరం తమిళుల పునరావాసానికి భారత్‌ ఆర్థికసాయంతో పాటు పలు మౌలిక సౌకర్యాలను కల్పించింది. అక్కడి ఎన్నికలను నూదిల్లీ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి!


- కొలకలూరి శ్రీధర్‌
Posted on 23-09-2019