Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

పాకిస్థాన్‌లో అమానుష కాండ

* ఉద్యమకారులపై ఉక్కుపాదం

కశ్మీర్‌లో భారత్‌ మానవ హక్కులను ఉల్లంఘిస్తోందంటూ పాకిస్థాన్‌ వివిధ అంతర్జాతీయ వేదికలపై యాగీ చేస్తున్నా దాని గోడు పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. పాకిస్థాన్‌ కపట నాటకాలు, రెండు నాల్కల ధోరణి జగమంతటికీ ఎరుకే. తూర్పు పాకిస్థాన్‌లో పాక్‌ సైన్యం సాగించిన అపార జనహత్య, అమానుష కాండల వల్లనే పాక్‌ నుంచి ఆ ప్రాంతం విడిపోయి బంగ్లాదేశ్‌గా అవతరించింది. ఈ వాస్తవాన్ని విస్మరించి భారత ప్రభుత్వం కశ్మీర్‌ను ఈ భూగోళం మీద అతి పెద్ద జైలులా మార్చేసిందని పాక్‌ విదేశాంగ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషీ ఇటీవల జెనీవాలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సభలో పేర్కొనడం చోద్యమే. ఉగ్రవాదుల కేంద్రంగా తమ దేశం ఇప్పటికే చెడ్డపేరు మూటగట్టుకుందనే సంగతిని ఖురేషీ మరచిపోయారు.

కశ్మీర్‌ భారతదేశ ఆంతరంగిక సమస్య అని అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌ సహా అనేక దేశాలు ఖండితంగా చెప్పేశాయి. సౌదీ అరేబియా, అబూధాబీ, జోర్డాన్‌ పాలకులు సైతం ఈ విషయంలో పాకిస్థాన్‌ మొర ఆలకించలేదు. బయటివాళ్లు పాక్‌ను పట్టించుకోకపోవడం ఒక ఎత్తయితే, సొంత దేశీయాంగ మంత్రి బ్రిగేడియర్‌ ఐజాజ్‌ అహ్మద్‌ షా ప్రపంచం ముందు పాక్‌ పరువు తీయడం మరొక ఎత్తు. ఆయన గతంలో గూఢచారి విభాగ అధిపతిగా పనిచేశారు. ఇమ్రాన్‌ ఖాన్‌, బెనజీర్‌ భుట్టో, పర్వేజ్‌ ముషారఫ్‌ వంటి నాయకులే ప్రపంచంలో పాకిస్థాన్‌ పరువు ప్రతిష్ఠలను మంటగలిపారని ఐజాజ్‌ దుయ్యబట్టారు. ఇవాళ పాకిస్థాన్‌ మాటలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదనీ, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆత్మశోధన చేసుకోవాలనడం గమనార్హం!

అణచివేతలో అందెవేసిన చేయి
మానవ హక్కుల ఉల్లంఘనలో పాకిస్థాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉంది. పూర్వ తూర్పు పాకిస్థాన్‌ లోని బెంగాలీ ప్రజలు స్వయం నిర్ణయాధికార సాధనకు పట్టుపట్టగా, పాక్‌ సైన్యం భారీ మారణహోమం సాగించింది. తొమ్మిది నెలలపాటు నడచిన బంగ్లాదేశ్‌ విమోచన యుద్ధంలో పాక్‌ సైనికులు, జమాతే ఇస్లామీ వంటి జిహాదీ శక్తులతో కలసి సొంత ప్రజలను ఊచకోత కోశారు. ఎందరో మహిళలపై అత్యాచారాలు జరిపారు. ఆ సమయంలో దాదాపు కోటిమంది బెంగాలీ హిందువులు తూర్పు పాకిస్థాన్‌ను వదలి భారత్‌లో ఆశ్రయం పొందారు. తూర్పు పాకిస్థాన్‌లో మూడు కోట్లమంది పౌరులు- ఇళ్లూ ఊళ్లూ వదలి వేరే చోట తలదాచుకోవలసి వచ్చిందని అప్పట్లో అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు వెల్లడించాయి. పాకిస్థాన్‌ మతిలేని ఆగడాల వల్లనే తూర్పు పాకిస్థాన్‌ విడిపోయి బంగ్లాదేశ్‌ అవతరించింది. ఇంత జరిగినా పాకిస్థాన్‌ వైఖరిలో మార్పు రాకపోవడం గమనార్హం!

ఇప్పుడు తన సొంత గడ్డ మీదే బలూచీలు, పష్తూన్లు, సింధీల వంటి మైనారిటీ వర్గాల హక్కులను కాలరాస్తోంది. పాకిస్థాన్‌ సమాజం, సైన్యం, రాజకీయాలను శాసిస్తున్న పంజాబీలు ఇష్టారాజ్యంగా మైనారిటీల అణచివేతను సాగిస్తున్నారు. వారి దాష్టీకానికి గురవుతున్న హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, షియాలు, అహ్మదియాల హక్కుల గురించి ప్రశ్నించేవారే లేరు. భారత్‌ మాదిరిగా మైనారిటీలపై అధికార గణాంకాలను ప్రచురించే అలవాటు పాకిస్థాన్‌ కు లేనే లేదు.

పాకిస్థాన్‌ సైన్యం 1948 నుంచే బలూచిస్థాన్‌లో రక్తాన్ని పారిస్తోంది. అప్పట్లో కలాట్‌ సంస్థానంగా ఉన్న బలూచిస్థాన్‌కు పాక్‌ జాతిపిత మహమ్మదాలీ జిన్నాయే న్యాయ సలహాదారుగా ఉండేవారు. దేశ విభజన అనంతరం కలాట్‌ సంస్థానం పాకిస్థాన్‌లో కలవడానికి ఇష్టపడకపోవడంతో జిన్నా 1948 మార్చిలో సైన్యంతో దండయాత్ర జరిపించారు. అప్పటి నుంచి ఏదో ఒక రూపంలో బలూచిస్థాన్‌లో స్వాతంత్య్ర పోరాటం కొనసాగుతూనే ఉంది. జిన్నా నుంచి భుట్టో వరకు, జియా ఉల్‌ హక్‌ నుంచి జనరల్‌ ముషారఫ్‌, ఇమ్రాన్‌ఖాన్‌ వరకు బలూచీలను దారుణంగా అణచివేస్తూనే ఉన్నారు. బలూచిస్థాన్‌లో మేధావులు, న్యాయవాదులు, రాజకీయ నాయకులను సైన్యం ఊచకొత కోస్తున్నా, మూడు ప్రధాన బలూచీ తెగలైన మర్రీ, మెంగల్‌, బుగ్తీలు ఉద్యమ వేడిని తగ్గనివ్వడం లేదు. బుగ్తీ తెగ అధిపతి, బలూచీ ఉద్యమ నాయకుడైన అక్బర్‌ బుగ్తిని సైన్యం 2006లో హతమార్చినప్పటి నుంచి ఆందోళన ఉద్ధృతమైంది. రెండుమూడేళ్ల క్రితం సైన్యం, ఐఎస్‌ఐ, జిహాదీ గ్రూపులు క్వెట్టా నగరంలోని ఒక ఆస్పత్రిలో దాదాపు 50మంది బలూచీ న్యాయవాదులను హతమార్చాయి. ఇన్ని అఘాయిత్యాలు చేస్తూ కూడా కశ్మీర్‌లో మానవ హక్కుల గురించి పాక్‌ ధర్మపన్నాలు వల్లించడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుంది. పాక్‌ కపట నాటకాన్ని నిరసిస్తూ బలూచీ ఉద్యమకారులు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ఎదుట ప్రదర్శన జరిపారు. కశ్మీర్‌పై జెనీవా ఐరాస మానవ హక్కుల సదస్సులో పాకిస్థాన్‌ నిరసన వ్యక్తం చేసిన సమయంలోనే బలూచీలు ఈ ప్రదర్శన జరపడంతో ఇస్లామాబాద్‌కు తలకొట్టేసినట్లైంది. ఇస్లామిక్‌ రాజ్యమైన పాక్‌- మతం ముందు జాతి, భాష, రాజకీయ పరమైన వైవిధ్యాలు తలవంచాలంటుంది. దేశంలోని ఏ మైనారిటీ వర్గమైనా రాజకీయ హక్కులను డిమాండు చేస్తే, దాన్ని ఇస్లాం వ్యతిరేకతగా పరిగణిస్తుంది. ఈ మంకుపట్టు వల్లనే దేశంలో వివిధ ఉద్యమాలు తలెత్తాయి.

పష్తూన్‌ జాతీయవాద గర్జన
బలూచిస్థాన్‌కు తోడు కేంద్ర పాలిత గిరిజన ప్రాంతాల (ఫాటా) లోనూ, ఖైబర్‌ పఖ్తూన్‌ ఖ్వా (కేపీ) ప్రావిన్స్‌లోనూ మైనారిటీలు సొంత అస్తిత్వం కోసం పోరాడుతున్నారు. కేపీలో 4.9 కోట్లమంది, ఫాటాలో 45 లక్షలమంది పష్తూన్‌ తెగవారు నివసిస్తున్నారు. పేదరికానికి మారు పేరుగా నిలిచే ఫాటాలో హక్కానీ నెట్‌ వర్క్‌ (అఫ్గాన్‌ తాలిబన్‌), తెహ్రీకే తాలిబన్‌, హిజ్బే ఇస్లామీ వంటి అల్‌ ఖైదా అనుకూల ఉగ్రవాద సంస్థలు తిష్ఠ వేశాయి. అమెరికాపై ఉగ్రవాద దాడి (9/11)కి ప్రతిగా పాక్‌ -అఫ్గాన్‌ సరిహద్దులోని వజీరిస్థాన్‌లోఈ ఉగ్రవాద గ్రూపులపై అమెరికా ముమ్మరంగా దాడులు జరిపింది. వజీరిస్థాన్‌ కేపీలో అంతర్భాగమే. పాక్‌ సేనలు అమెరికా దాడుల్లో పాలు పంచుకోగా అఫ్గాన్‌ తాలిబన్లు దాన్ని ప్రతిఘటించేవారు. 2002 నుంచి ఈ అంతర్యుద్ధంలో సుమారు 50వేల మంది మరణించారు. ఫాటా, కేపీ రాష్ట్రాల్లో దాదాపు 50 లక్షల మంది ఇళ్లూవాకిళ్లూ వదలి వేరే చోట తలదాచుకుంటున్నారు. పాక్‌, అఫ్గానిస్థాన్‌ల్లో విస్తరించిన పష్తూన్లు చేపట్టిన వేర్పాటువాద ఉద్యమం పాకిస్థాన్‌కు మరో పిడుగుపాటు. ఇక్కడ తాలిబన్లు పట్టు బిగించడం కోసం 2002 నుంచి కనీసం వెయ్యి మంది సంప్రదాయ పష్తూన్‌ తెగ పెద్దలను హతమార్చారు. హతుల సంఖ్య రెండు వేల వరకు ఉంటుందని కొన్ని వర్గాల అంచనా. తాలిబన్లకు వత్తాసు ఇస్తున్నారన్న అనుమానంతో దాదాపు ఎనిమిది వేల మంది పష్తూన్లను పాక్‌ సైన్యం నిర్బంధంలోకి తీసుకుని హతమార్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెషావర్‌లో గోనె సంచుల్లో మృతదేహాలు కనిపించడం సర్వసాధారణమైపోయింది. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలైనా దేశంలోని 60 శాతం భూభాగంపై పాక్‌ ప్రభుత్వానికి కానీ, సైన్యానికి కానీ పూర్తి అదుపు లేదు. ఫాటా, కేపీ రాష్ట్రాల్లో సేనలకూ, స్థానికులకూ మధ్య నడుస్తున్న పోరాటం పాక్‌కే కాకుండా అఫ్గానిస్థాన్‌, ఇరాన్‌, భారతదేశాలకూ అస్థిరతను పాకిస్తోంది.

మైనారిటీలలో తీవ్ర అభద్రత
పాకిస్థాన్‌లో మతపరమైన, భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. హిందూ, సిక్కు, క్రైస్తవ బాలికలు, యువతులను అపహరించుకుపోయి ఇస్లాం మతంలోకి మార్చే ఘటనలు పెచ్చరిల్లుతున్నాయి. మైనారిటీ వర్గాలను బెదిరించి డబ్బు గుంజడమూ ఎక్కువైపోయింది. విద్య, ఉపాధి పరంగానూ మైనారిటీలు తీవ్ర దుర్విచక్షణను ఎదుర్కొంటున్నారు. వారి ప్రార్థన స్థలాలు తరచూ దాడులకు గురవుతున్నాయి. ఫాటా, ఖైబర్‌-ఫఖ్తూన్‌ క్వా ప్రావిన్స్‌లలో మైనారిటీ వర్గాలపై మతం పేరిట తాలిబన్లు సాగిస్తున్న దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కావు. ఫాటాలో సిక్కుల మీద జిజియా పన్ను విధిస్తున్నారు. ప్రపంచ దేశాలకు కంటి తుడుపు కోసం మైనారిటీల హక్కుల రక్షణకు ఏవో చట్టాలు చేసినట్లు పాకిస్థాన్‌ నటిస్తోంది. మొత్తం మీద దేశంలో జరుగుతున్న అవాంఛనీయ ఘటనలను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గమనిస్తోంది. సాయుధ సంఘర్షణకు గురవుతున్న ప్రాంతాల్లో మతపరమైన మైనారిటీ వర్గాలకు భద్రత కల్పించాలని మండలి ఉద్ఘాటిస్తోంది. ఈ అంశంపై ఇటీవల పోలండ్‌ లో జరిగిన భద్రతా మండలి సమావేశం మతపరమైన మైనారిటీల మీద జరుగుతున్న దాడులను ఖండించింది. మతపరమైన స్వేచ్ఛను కాపాడటం ద్వారా శాంతిసుస్థిరతలు నెలకొల్పాలని హితవు చెప్పింది. తమ దేశంలో తాలిబన్లను ప్రోత్సహిస్తూ అక్కడ శాంతికి భంగం కలిగిస్తోందని అఫ్గాన్‌ ప్రభుత్వం పాకిస్థాన్‌పై రుసరుసలాడుతోంది. కశ్మీర్‌లోనూ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న దేశంగా ఇస్లామాబాద్‌ను ప్రపంచమంతా అనుమానాస్పదంగా చూస్తోంది. అందుకే జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేయాలన్న భారత్‌ నిర్ణయంపై పాక్‌ ఎంతగా గగ్గోలు పెడుతున్నా అంతర్జాతీయ సమాజం పట్టించుకోవడంలేదు!


- నీరజ్‌ కుమార్‌
Posted on 24-09-2019