Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

భద్రతామండలికి 70ఏళ్లు

ప్రపంచ దేశాల్లో శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా ఆవిర్భవించిన ఐక్యరాజ్యసమితి భద్రతామండలి నేడు 70వ వసంతంలోకి అడుగుపెడుతోంది. భద్రతామండలి తొలి సమావేశం 1946 జనవరి 17న బ్రిటన్‌ రాజధాని లండన్‌లో చర్చిహౌస్‌లో జరిగింది. దశాబ్దాల చరిత్రలో భద్రతామండలి ఆశించిన లక్ష్యాలను సాధించిందా, వివిధ దేశాల ఆకాంక్షలను నెరవేర్చిందా, అంతర్జాతీయ సంస్థగా తన ప్రత్యేకత చాటుకుందా అన్న ప్రశ్నలకు సరైన సమాధానం దొరకదు. మండలి స్వరూప స్వభావాలు నాటికి, నేటికీ మారకపోవడం ప్రధాన లోపం. తృతీయ ప్రపంచదేశాల వాణి వినిపించేందుకు సరైన అవకాశం లభించడం లేదన్న విమర్శ ఉంది. అయిదు శాశ్వత సభ్యత్వదేశాలైన అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనా చేతుల్లో మండలి పావుగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా మొత్తం ప్రపంచానికి ప్రాతినిధ్యం వహించేలా, సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా మండలి స్వరూప స్వభావాలు మారాలని, కేవలం కొన్ని దేశాల గుత్తాధిపత్యం ధోరణుల నుంచి బయటపడాలని అంతర్జాతీయ సమాజం ఆశిస్తోంది.

క్లిష్టసమయంలో క్రియారాహిత్యం

ఏడు దశాబ్దాల మండలి ప్రస్థానంలో సాధించిన విజయాలకన్నా వైఫల్యాలే ఎక్కువగా కనబడతాయి. అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో ఉత్పన్నమైన పరిస్థితులు, వివిధ దేశాల మధ్య ఏర్పడిన ఘర్షణల్లో మండలి స్వతంత్రంగా వ్యవహరించలేకపోయిందన్న అభిప్రాయం దౌత్యవర్గాల్లో ఉంది. ఆయా దేశాల పరిస్థితులకు అనుగుణంగా కాకుండా 'వీటో' అధికారాలుగల అయిదు శాశ్వత దేశాల మనోభీష్టానికి అనుగుణంగానే ముందుకు సాగిందన్న విమర్శలు బలంగా వినిపించాయి. కాంగోపై బెల్జియం దురాక్రమణ(1950), దక్షిణకొరియాపై ఉత్తర కొరియా దాడి (1950), గ్వాటెమలాపై అమెరికా దురాక్రమణ(1954), క్యూబాపై అమెరికా దాడి(1961), వియత్నాంపై అమెరికా సైనికచర్య(1965-73) తదితర సంఘటనల్లో భద్రతామండలి శాంతిప్రవచనాలు వల్లించడంతోనే సరిపెట్టింది తప్ప నిర్దిష్ట చర్యలు చేపట్టలేకపోయింది. ఇరాన్‌-ఇరాక్‌ యుద్ధంలో మండలి దాదాపుగా చేతులు ఎత్తేసింది. మొజాంబిక్‌పై దక్షిణాఫ్రికా దురాక్రమణ, గ్రెనెడాపై అమెరికా దురాక్రమణ, లిబియాపై అమెరికా దాడి, హంగరీ, సైప్రస్‌, పాలస్తీనా, కొసావో వివాదాల్లో కూడా మండలి దాదాపుగా మౌనాన్నే ఆశ్రయించింది. తాజాగా సిరియాలో అంతర్యుద్ధం, ఉక్రెయిన్‌ వివాదంలో ఖండనలకే పరిమితమైంది. ఇరాక్‌, అఫ్గానిస్థాన్‌ల్లో అమెరికా ఏకపక్ష జోక్యాన్ని మండలి అడ్డుకోలేకపోయింది. 'వీటో' అధికారంగల అయిదు దేశాలను కాదని అడుగు ముందుకేయడం అలవికాని పనిగా మారింది. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అమెరికా, అప్పటి సోవియట్‌ యూనియన్‌ మధ్య నలిగిపోయింది. సోవియట్‌ యూనియన్‌ పతనాంతరం ఏకైక అగ్రరాజ్యమైన అమెరికా చేతిలో బందీగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఏకంగా ఐరాస ప్రధాన కార్యదర్శులే అమెరికా అనుగ్రహం కోసం పరితపించాల్సిన పరిస్థితి తలెత్తింది. మండలి ఆమోదంతో నిమిత్తం లేకుండానే ఈ శతాబ్దం ఆరంభంలో అమెరికా తన మిత్రదేశాలతో కలిసి గల్ఫ్‌ యుద్ధాన్ని ఆరంభించింది. ఈ చర్యకు గల చట్టబద్ధతను ఆనాడు ఏ దేశామూ ప్రశ్నించలేకపోయింది. ఇరాక్‌పై అమెరికా దాడిని నాటి ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్‌ మొక్కుబడిగా ఖండించారే తప్ప, అమెరికా చర్య తప్పని చెప్పేంత సాహసం చేయలేకపోయారు.

ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అమెరికా, నాటి సోవియట్‌ యూనియన్ల మధ్య ఆధిపత్యపోరాటంలో మండలి నలిగిపోయింది. పరస్పరం పోటీగా 'వీటో' అధికారాలను ఉపయోగించడంతో మండలి ప్రేక్షకపాత్ర వహించాల్సి వచ్చింది. సోవియట్‌ యూనియన్‌ పతనానంతరం రష్యా ప్రాబల్యం తగ్గడంతో అమెరికాకు అడ్డే లేకుండాపోయింది. మొదటినుంచీ బ్రిటన్‌, ఫ్రాన్స్‌ అమెరికాకు వంతపాడటం తెలిసిందే. తన ప్రయోజనాలకు భంగం కలగనంతకాలం చైనా మౌనం వహించడంవల్ల అమెరికా చెలరేగిపోయింది. ఇటీవలి కాలంలో బ్రిటన్‌, ఫ్రాన్స్‌, రష్యా ప్రాభవం కనుమరుగవడం, ఆర్థికంగా బలహీనపడటం, అంతర్జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే స్థితిలో లేకపోవడంవల్ల వాషింగ్టన్‌ పాలకులు మరింత చెలరేగిపోతున్నారు.

20వ శతాబ్దంనాటి సంస్థను 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతూ, మండలిలో అన్ని దేశాలకు స్థానం కల్పించాలన్న డిమాండ్లు అంతర్జాతీయంగా జోరందుకుంటున్నాయి. నిరుడు సెప్టెంబర్లో జరిగిన ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇదే విషయాన్ని సూటిగా ప్రస్తావించారు. మారిన పరిస్థితుల్లో ప్రపంచ గమనాన్ని ఏ ఒక్క దేశమో లేదా కొన్ని దేశాల్లో నిర్దేశించలేవు. అంతర్జాతీయంగా ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అవసరం. నేటికీ రమారమి 250కోట్లమంది ప్రజలకు కనీస సౌకర్యాలు కొరవడ్డాయి. సుమారు 130కోట్లమందికి విద్యుత్‌ సౌకర్యం లేదు. 110కోట్లమంది ప్రజలకు తాగునీటి సౌకర్యం గగనంగా మారింది. ఈ పరిస్థితులను అధిగమించేంత శక్తి ఏ ఒక్క దేశానికి లేదు. సమష్టిగానే ఈ పరిస్థితులను ఎదుర్కోగలం.

ఐక్యరాజ్యసమితి 1945లో 51 దేశాలతో ఆవిర్భవించింది. 1960నాటికి సమితిలోని సభ్యదేశాల సంఖ్య 113కు చేరింది. ఇప్పుడు 193 దేశాలకు విస్తరించింది. అయిదు శాశ్వత సభ్యదేశాలతో 1946లో మండలి ప్రస్థానం మొదలవ్వగా నేటికి వాటిసంఖ్య, అధికార విధుల్లో ఇసుమంత మార్పు లేదు. తాత్కాలిక సభ్యత్వదేశాల సంఖ్యను కంటితుడుపుగా పెంచారు. ప్రస్తుత అయిదు శాశ్వత సభ్యత్వ దేశాల్లో మూడు ఐరోపా ఖండానికి చెందినవే కావడం గమనార్హం. అమెరికాను మినహాయిస్తే రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ ఐరోపాలోని పారిశ్రామిక దేశాలు. వీటిలో బ్రిటన్‌, ఫ్రాన్స్‌ పశ్చిమ ఐరోపా ప్రాంతంలోనివి. రష్యా తూర్పు ఐరోపా ప్రాంత దేశం. ఒక్క చైనా మాత్రమే ఆసియా దేశం. చిన్నదైన ఐరోపా ఖండం నుంచి మూడు దేశాలకు భద్రతా మండలిలో చోటుదక్కగా, అతిపెద్ద ఖండంగా గుర్తింపు పొందిన ఆసియా నుంచి ఒక్క చైనాకే ప్రాతినిధ్యం లభించింది. ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, అరబ్‌ దేశాలకు అసలు ప్రాతినిధ్యమే లేదు. ఇక మండలిలోని శాశ్వత సభ్యదేశాల్లో ఫ్రాన్స్‌, బ్రిటన్‌ ఆర్థిక, అంతర్గత సమస్యలతో సతమతమవుతున్నాయి. రష్యా కూడా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ పరిస్థితుల్లో తాజా శాశ్వత సభ్యత్వం కోసం జపాన్‌, జర్మనీ, భారత్‌, దక్షిణాఫ్రికా గట్టిగా పోటీపడుతున్నాయి. తమ వాదనలను అవి బలంగా వినిపిస్తున్నాయి. వీటి వాదనల్లో హేతుబద్ధత ఉందని అంతర్జాతీయ సమాజమూ అంగీకరిస్తోంది. తమ 'వీటో' అధికారాలను వదులుకునేందుకు, తమ సరసన ఈ దేశాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రస్తుత శాశ్వత సభ్య దేశాలు మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోతున్నాయి. తమ సభ్యత్వాన్ని వదులుకునేందుకు అవి సిద్ధంగా లేవు. వాస్తవానికి మండలిని విస్తరించాలన్న ప్రతిపాదన ఈనాటిది కాదు. వివిధదేశాల అభ్యర్థన మేరకు ఆరో దశకంలో తాత్కాలిక సభ్య దేశాల సంఖ్యను ఆరు నుంచి పదికి పెంచారు. 1992లో మళ్ళీ సంస్కరణల అంశం తెరపైకి వచ్చింది. అప్పట్లో దీనిపై ఒక కార్యనిర్వాహక బృందాన్ని ఏర్పాటుచేశారు. 1995లో ఐరాస స్వర్ణోత్సవాల్లోపు ఇది ఒక పరిష్కారాన్ని కనుగొంటుందని అప్పట్లో భావించారు. కానీ ఆ దిశగా అడుగు ముందుకుపడలేదు.

భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఆశిస్తున్నట్లు భారత్‌ 1994లో బహిరంగంగా ప్రకటించింది. నాటి భారత విదేశాంగమంత్రి ప్రణబ్‌ముఖర్జీ ఐరాస సర్వప్రతినిధిసభలో భారత అభిలాషను వ్యక్తం చేశారు. సరళీకృత ఆర్థిక, పారిశ్రామిక విధానాలను తెరపైకి తీసుకువచ్చిన పీవీ నరసింహారావు ప్రభుత్వం తన వాదనను సందర్భం వచ్చినప్పుడల్లా అంతర్జాతీయ వేదికల్లో విస్పష్టంగా వినిపించింది. శాశ్వత సభ్యత్వం పొందడానికి భారత్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి. చైనా తరవాత ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉంది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. భిన్న మతాలు, జాతులు, ప్రాంతాలు, సంస్కృతులతో బహుళత్వ విలువలకు మారుపేరుగా నిలుస్తోంది. సమాఖ్య భావన, స్వతంత్ర న్యాయవ్యవస్థ, మానవ హక్కులకు పెద్దపీట వేస్తోంది. ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. సరళీకృత ఆర్థిక, పారిశ్రామిక విధానాల అమలు కారణంగా ఆర్థిక వ్యవస్థ వేగవంతమైంది. విదేశీ పెట్టుబడిదారులకు స్వర్గధామంగా ఉంది. శాంతి, సుస్థిరతలు కలిగి ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద సైనిక వ్యవస్థల్లో ఒకటి. ఐరాసకు భారీయెత్తున విరాళాలు అందజేస్తోంది. ఐరాస శాంతిపరిరక్షక బృందానికి పెద్దయెత్తున సైనిక సాయం అందజేస్తోంది. ప్రస్తుతం ఎనిమిదివేల మందికి పైగా భారతీయ సైనికులు ఐరాస శాంతిదళంలో పనిచేస్తున్నారు. భారత్‌ సభ్యత్వానికి అయిదు శాశ్వత సభ్యత్వ దేశాలు మద్దతు కూడా ప్రకటించాయి. ఇటీవల భారత్‌లో పర్యటించిన ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్‌తో భేటీ సందర్భంగా విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ ఈ విషయాన్ని ప్రస్తావించారు. 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తరవాత 2011లో తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికైన భారత్‌, రెండేళ్లపాటు ఈ బాధ్యతలను సమర్థంగా నిర్వహించింది. ఐరాసకు చెందిన వివిధ కమిటీల్లో విజయాలు నమోదు చేసింది. 2013లో ఐరాస ఆడిటర్ల బోర్డుకు జరిగిన ఎన్నికల్లో భారత్‌కు చెందిన మాజీ కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ శశికాంత్‌ శర్మ ఘనవిజయం సాధించారు. మొత్తం 186 ఓట్లలో ఆయనకు 124 లభించడం విశేషం. 20 ఏళ్ల తరవాత భారత్‌ ఈ ప్రతిష్ఠాత్మక పదవి పొందింది. అంతర్జాతీయ న్యాయస్థానానికి సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ దల్వీర్‌ భండారీ 2013లో ఎన్నికయ్యారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొన్నప్పుడు, భారత్‌కు భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించకపోవడం అన్యాయమే. అదేసమయంలో జపాన్‌, జర్మనీ, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ కూడా గట్టి పోటీదారులే.

భిన్నాభిప్రాయాలు

మండలిని ఏ ప్రాతిపదికన విస్తరించాలన్న విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొత్తగా శాశ్వత సభ్యత్వం కల్పించే దేశాలకు కూడా 'వీటో' అధికారం కల్పించాలా లేక కొన్నింటికే కల్పించాలా అన్న విషయమై చర్చ జరుగుతోంది. తాత్కాలిక సభ్యదేశాల సంఖ్య పెంచాలన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. మొదటిదశలో జపాన్‌, జర్మనీలకు 'వీటో' అధికారం ఇస్తూ భారత్‌, దక్షిణాఫ్రికా వంటివాటికి తరవాత ఇవ్వాలన్న వాదనా ఉంది. రొటేషన్‌ ప్రాతిపదికగా 'వీటో' అధికారం సభ్యదేశాల మధ్య ఉండాలన్న అభిప్రాయమూ ఉంది. మండలిలో మార్పులు తీసుకురావడం అత్యంత సంక్లిష్ట ప్రక్రియ. అనుకున్నంత తేలిక కాదు. ఎలాంటి మార్పులు చేపట్టాలన్నా, అందుకు శాశ్వత సభ్యత్వ దేశాలు ఆమోదించాలి. లేదా, ఐరాస సర్వప్రతినిధి సభలో మూడింట రెండొంతుల సభ్యులు ఆమోదించాలి. సంస్కరణలకు శాశ్వత సభ్యత్వ దేశాలు సుముఖత వ్యక్తపరచినా- విస్తరణకు సమయం పడుతుంది. ఐరాస తరవాత అత్యంత కీలకమైన అంతర్జాతీయ సంస్థ భద్రతామండలి! అందువల్ల మారిన పరిస్థితులకు అనుగుణంగా దీన్ని సంస్కరించాలి. విశ్వవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. విస్తరించాలి. తృతీయ ప్రపంచదేశాలు తమ వాణిని వినిపించేందుకు బలమైన వేదికగా మలచాలి. ఆ దిశలో ముందడుగు వేయాల్సిన సమయమిదే!

(రచయిత - గోపరాజు మల్లపరాజు)
Posted on 17-01-2015