Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

అగ్రరాజ్యంతో బంధం బలోపేతం

* హ్యూస్టన్‌ సభతో కొత్త ఊపు

విదేశాంగ విధానాలెప్పుడూ కొన్ని పరిమితులు, అనూచానంగా స్థిరపడిన సంప్రదాయాల మేరకు అమలవుతుంటాయి. రెండు రోజుల క్రితం అమెరికాలోని హ్యూస్టన్‌ నగరంలో యాభై వేల మందికిపైగా ప్రవాస భారతీయులు సమక్షంలో జరిగిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమం మూస ధోరణులకు పూర్తి భిన్నంగా సాగింది. మరొక దేశాధినేత పాల్గొంటున్న సమావేశానికి అమెరికన్‌ అధ్యక్షుడు హాజరుకావడమన్నది చరిత్రలో మునుపెన్నడూ కనీవినీ ఎరుగని పరిణామం. అగ్రరాజ్యాధినేతతో వేదిక పంచుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- ‘అబ్‌ కీ బార్‌- ట్రంప్‌ సర్కార్‌’ అంటూ వచ్చే ఏడాది జరగనున్న అమెరికన్‌ అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కారుకే మరో అవకాశం ఇవ్వాలంటూ ప్రవాస భారతీయులకు నేరుగానే సందేశం ఇవ్వడం సంప్రదాయవాదులను ఆశ్చర్యపరచింది. ఇరు దేశాధినేతల వ్యవహార సరళి తెలిసినవారికి ఈ పరిణామం విస్మయం కలిగించదు. కొత్త లక్ష్యాలు సాధించే క్రమంలో పాత పద్ధతులకు తిలోదకాలు వదిలే విలక్షణ ధోరణి ఈ నాయకులది. రాజకీయాలను ట్రంప్‌ ఎప్పుడూ ఇచ్చిపుచ్చుకునే లావాదేవీగానే చూస్తారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోదీసైతం ట్రంప్‌తో అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నారు.

కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370ని రద్దు చేయడంపై అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌ నానా యాగీ చేస్తోంది. ప్రపంచ దేశాల్లో పాక్‌ వాదనకు ఎట్టిపరిస్థితుల్లోనూ మద్దతు దక్కకుండా చూడటమే ప్రస్తుతం మోదీ లక్ష్యం. మరీ ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సమావేశాల్లో పాక్‌ కుయుక్తులను ఎదుర్కోవడం భారత విదేశాంగ విధానకర్తల తక్షణ వ్యూహం. మరోవంక ట్రంప్‌ సైతం ఈ విషయంలో భారత్‌కు సంపూర్ణ మద్దతు అందించేందుకు సంసిద్ధంగా ఉన్నారు. పాకిస్థాన్‌ ద్వంద్వ పోకడలు అగ్రరాజ్యానికి ఒక్కటొక్కటిగా తేటపడుతున్నాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు పాకిస్థాన్‌కు దీర్ఘకాలంగా అమెరికా వందలకోట్ల డాలర్ల నిధులు అందజేస్తోంది. ఆ నిధులను అమెరికా శత్రువులకు పాలుపోసి పెంచేందుకే ఇస్లామాబాద్‌ నాయకత్వం వినియోగిస్తుండటం ట్రంప్‌ సర్కారుకు తీవ్ర ఆగ్రహం కలిగిస్తోంది. అఫ్గాన్‌ తాలిబన్లతో పాక్‌ నాయకత్వం అంటకాగడమే అందుకు ఉదాహరణ. మరోవంక చైనాతో పాకిస్థాన్‌ రాసుకుపూసుకు తిరగడమూ అమెరికన్‌ నాయకత్వానికి ఇచ్చగించని విషయం. అధ్యక్ష ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో, తన ప్రాభవం క్రమంగా కోసుకుపోతోందన్న వార్తల నేపథ్యంలో- దేశంలో పదిలక్షలకుపైగా ఉన్న సంపన్న భారతీయ అమెరికన్‌ ఓటు బ్యాంకును ఏదోవిధంగా ప్రసన్నం చేసుకోవడం డొనాల్డ్‌ ట్రంప్‌నకు అత్యవసరం మారింది. ట్రంప్‌ కోణంలోంచి పరికిస్తే ‘హౌడీ మోదీ’ కార్యక్రమానికి హాజరు కావడమన్నది ఎంతో అర్థవంతమైన చర్య అనే చెప్పాలి. అయితే అమెరికన్‌ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌నకు బాహాటంగా మద్దతు పలుకుతున్నట్లు మాట్లాడటం భారత ప్రధాని స్థాయిలో నరేంద్ర మోదీ చేయదగిన పనేనా అన్న విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మరోవంక మోదీ ప్రతి మాటనూ కరతాళ ధ్వనులు, కేరింతలతో స్వాగతిస్తున్న జనసందోహాన్ని తిలకిస్తూ; ఆయన ప్రసంగం పూర్తయ్యేవరకూ ట్రంప్‌ ఓపిగ్గా కూర్చోవడమూ విశేషమే. ప్రసంగానంతరం సభావేదిక చుట్టూ కలియదిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేద్దామన్న మోదీ మాటను ఆయన వెన్వెంటనే ఆమోదించి ఉత్సాహంగా తిరగడమూ అమితంగా ఆకర్షించిన విషయం.

పాకిస్థాన్‌ను ఉగ్రవాద కేంద్ర స్థానంగా సంబోధిస్తూ, ఉగ్రోన్మాదంపై రాజీలేని పోరు సాగిస్తామంటూ అమెరికన్‌ అధ్యక్షుడు సహా సభలో కొలువైన ఆ దేశ సీనియర్‌ సెనెటర్ల ఎదుట భారత ప్రధాని కుండబద్ధలు కొట్టారు. మోదీ ప్రసంగానికి ముందు మాట్లాడిన ట్రంప్‌ సైతం- అతివాద ఇస్లామిక్‌ ఉగ్రవాదంపై ఉమ్మడి సమరం సాగిస్తామని తేల్చిచెప్పారు. భారత, అమెరికా దేశాధినేతలు ఇరువురూ ఎవరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడారో, వారు చేసిన హెచ్చరికల తీవ్రత ఏపాటిదో పాకిస్థాన్‌కు అర్థం కాదనుకోలేం. సొంత దేశాన్ని సవ్యంగా నడుపుకోలేనివారు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం హాస్యాస్పదమని పాకిస్థాన్‌కు మోదీ పరోక్షంగా గట్టి చురకలు వేశారు. అమెరికాలో జరిగిన సెప్టెంబరు 11నాటి దాడులను, భారత్‌లో చోటుచేసుకున్న నవంబరు 26 ఉగ్రమూకల ఉన్మాదాన్ని ప్రస్తావించిన మోదీ- ఆ కిరాతకం వెనుక పాకిస్థాన్‌ పాత్రను దాదాపుగా వెల్లడించారు. పాకిస్థాన్‌తో అమెరికాకు ఇప్పటికీ స్నేహ సంబంధాలే ఉన్నాయన్న విషయం తెలిసి కూడా- చెప్పాలనుకున్న విషయాన్ని మోదీ నిష్కర్షగా వెల్లడించారు. భారత ప్రధాని ఈ స్థాయిలో చొరవ తీసుకొని మాట్లాడటానికి, కొంతకాలంగా అమెరికా వైఖరి మారుతుండటమూ కారణమే. పాకిస్థాన్‌ విశ్వసనీయతపై అమెరికన్‌ నాయకత్వంలో ఏనాడో మొలకెత్తిన అనుమానాలు అంతకంతకూ బలపడుతున్నాయి. ఆర్థికంగా, సైనికంగా అమెరికా ఆధిపత్యానికి చైనా సవాళ్లు విసురుతుండటం- మరోవంక పాకిస్థాన్‌ ఆ దేశంతో అత్యంత సన్నిహితంగా మెలగుతుండటం వంటివి అగ్రరాజ్యాన్ని భారత్‌వైపు మొగ్గేలా చేశాయి. యూపీఏ జమానాలో భారత విదేశాంగ విధానం ఇప్పుడున్నంత దుర్బేధ్యంగా లేదు. సైనిక శక్తిని బలోపేతంగా తీర్చిదిద్ది చైనాకు దీటుగా నిలబడటంతోపాటు- అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌, ఇండియాలతో కలిసి ‘చతుర్భుజి’గా ఏర్పడటంతో అంతర్జాతీయంగా మనదేశం స్థాయిని ఇనుమడింపజేసింది. హ్యూస్టన్‌ సదస్సు నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మద్దతు కొరవడి పాకిస్థాన్‌ మరింత ఒంటరిగా మారింది.


- వీరేంద్ర కపూర్‌
Posted on 25-09-2019