Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

టెర్రరిస్థాన్‌పై ద్విముఖ పోరు!

కశ్మీర్‌ కోసం వందేళ్ల యుద్ధానికైనా సిద్ధమన్నది పాకిస్థాన్‌ స్వయం ప్రవచిత సార్వకాలిక అజెండా! సీమాంతర ఉగ్రవాదాన్ని ఉసిగొలిపి లోయలో కన్నీటి కాష్ఠాల్ని ఎగదోయడం, కశ్మీర్‌ సమస్యను అంతర్జాతీయం చేసేందుకు అన్ని విధాలుగా బరితెగించడం- దశాబ్దాలుగా ఆ దేశం అనుసరిస్తున్న పంథా! కీలక సరిహద్దు రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న అధికరణను ఏడువారాల క్రితం మోదీ ప్రభుత్వం తోసిపుచ్చడంతో పాకిస్థాన్‌ నేతాగణాలకు ఆగ్రహావేశాలతోపాటు ఉగ్ర ప్రకోపాలూ ఎగదన్నుకొస్తున్నాయి. సంప్రదాయ యుద్ధంలో ఓటమి తప్పనప్పుడు, మరణానికైనా తెగించి పోరాడే దేశం అణ్వస్త్ర రాజ్యమైతే దాని పర్యవసానాలు దారుణంగా ఉంటాయంటూ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌- ప్రపంచ దేశాల్లో అణు యుద్ధ భీతిని రగిలించే ప్రయత్నం చేశారు. ప్రస్తుత సమితి సమావేశాల సందర్భంగా దాదాపు ప్రతి వేదిక మీదా కశ్మీర్‌ ప్రస్తావనతో అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టుకోవడానికి సాగించిన యత్నాలేవీ ఫలించనే లేదు. ఉభయ దేశాల మధ్య మధ్యవర్తిత్వానికి అధ్యక్షుడు ట్రంప్‌ సంసిద్ధత చాటినంతసేపు పట్టలేదు- శ్వేతసౌధం మాట మారిపోవడానికి! మోదీపై తాను ఆశించిన అంతర్జాతీయ ఒత్తిడేదీ లేకపోవడం నిరుత్సాహపరుస్తోందన్న ఇమ్రాన్‌ నోట- ఉగ్రవాదానికి పాకిస్థాన్‌ నారూనీరూ పోయడంపై చారిత్రక సత్యాలు తన్నుకొచ్చాయి. అఫ్గానిస్థాన్‌లో యుద్ధంకోసం అల్‌ఖైదాతోపాటు, ఇతర ఉగ్రవాద బృందాలకు పాక్‌ సైన్యం, ఐఎస్‌ఐ శిక్షణ ఇచ్చాయని ఇమ్రాన్‌ చేసిన ప్రకటన చాటుతోంది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసి నాటి సోవియట్‌ సేనలు నిష్క్రమిస్తున్న దశలో పురుడుపోసుకున్న అల్‌ఖైదా- పాక్‌ ప్రాపకంలోనే ఎదిగి అమెరికాపై సెప్టెంబరు 11దాడులకు తెగబడేంతగా బలపడింది. ఆ తరవాతా, ఉగ్రవాదంపై అంతర్జాతీయ పోరులో అమెరికా భాగస్వామిగా కుదురుకొని అప్పనంగా వచ్చిన నిధులతో భారత్‌లో వేర్పాటువాద కుంపట్లు ఎగదోసిన ఘనత తనదేనని లోగడ ముషారఫ్‌ సైతం చీకటి చరిత్రను ఏకరువు పెట్టారు. ఉపఖండంలో ఉగ్రదేశంగా తమ పాదముద్రల ఉనికిని ఘనంగా చాటుకొంటూ పాక్‌ ఏలికలు కశ్మీర్‌పై కార్చేవన్నీ మొసలి కన్నీళ్లేనని అంతర్జాతీయ సమాజం గుర్తిస్తోందిప్పుడు!

పదిహేనేళ్లుగా పాకిస్థాన్‌ గడ్డమీద 40దాకా వివిధ ఉగ్రవాద బృందాలు పనిచేస్తున్నాయని, వాటిలో 30-40 వేలమంది సుశిక్షిత సాయుధ ఉగ్రవాదులున్నారని మొన్న జులై చివరివారంలో ఇమ్రాన్‌ఖానే వెల్లడించారు. అఫ్గాన్‌, కశ్మీరుల్లో పోరాటానికి వారిని సుశిక్షితులుగా తయారు చేశామన్న పాక్‌ ప్రధాని, ఆ నిజాన్ని అమెరికాకు చెప్పకుండా గత పాలకులు తప్పుచేశారని రెండు నెలలనాడు స్పష్టీకరించారు. తనదాకా వస్తేగాని ఉగ్రసెగ తీవ్రత గుర్తెరగని అగ్రరాజ్యానికి తెలియదేమోగాని- హక్కాని నెట్‌వర్క్‌, జెయిషె మొహమ్మద్‌, లష్కరే తొయిబాల వంటి కర్కశ మూకలు నడయాడే నేలగా పాకిస్థాన్‌ భ్రష్ట చరిత్ర ఇండియాకు కొట్టిన పిండి! అంతెందుకు? అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన జైషే మొహమ్మద్‌ అధిపతి మసూద్‌ అజర్‌ను పక్షం రోజులనాడు రహస్యంగా జైలునుంచి పాకిస్థాన్‌ విడుదల చేసింది. పుల్వామా ఘోరకలికి ప్రతీకారంగా భారత వాయుసేన ధ్వంసం చేసిన బాలాకోట్‌ శిక్షణ స్థావరాన్ని తిరిగి తెరవడంతోపాటు, ఎకాయెకి 500మంది ఉగ్రవాదుల్ని సరిహద్దులు దాటించి భీకర దాడులకు పాల్పడే కుహకాల్ని రచించింది. గత పక్షం రోజుల్లోనే దేశంలోకి చొరబడిన 45మంది ఉగ్రవాదులు భారత ప్రధానిని, రక్షణ సంస్థలను లక్ష్యం చేసుకొని ఆత్మాహుతి దాడులు సహా అన్నింటికీ సిద్ధంగా ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాక్‌నుంచి ఎదురవుతున్న ఉగ్రవాద ముప్పును ప్రధాని మోదీ సమర్థంగా కాచుకోగలరంటూ వెన్నుతట్టిన అధ్యక్షుడు ట్రంప్‌, టెర్రరిజం పంథాను వీడితేనే ఇస్లామాబాద్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతామన్న భారత్‌ వైఖరిలోని హేతుబద్ధతను విస్మరిస్తున్నారు. అనుచిత ఒత్తిళ్లకు తెగబడకుండా ప్రపంచదేశాలకు సర్దిచెప్పగలిగిన మోదీ ప్రభుత్వం- పాక్‌నుంచి ఉరుముతున్న ఉగ్రభూతాన్ని ఏమాత్రం ఉపేక్షించే వీల్లేదు!

పాకిస్థాన్‌తో మాట్లాడటానికి ఎలాంటి ఇబ్బందీ లేదని, టెర్రరిస్థాన్‌తో మాత్రం చర్చలు సాధ్యం కావనీ విదేశాంగమంత్రి జయశంకర్‌ ఇండియా వాణిని తన గళంలో ప్రతిధ్వనించారు. మరోవంక ప్రధాని మోదీ- ఉగ్రవాదంలో మంచీ చెడుల్ని ఎంచబోవడమే అసంబద్ధమంటూ, టెర్రరిజంపై పోరులో సహకారాన్ని సంస్థాగతం చెయ్యాలని సూచించారు. ఉగ్రవాద దమన రీతినే విదేశాంగ నీతిగా మలచుకొన్న పాకిస్థాన్‌ మెడలు వంచాలంటే, అంతర్జాతీయంగా దాన్ని ఏకాకిని చెయ్యాలన్న వ్యూహంతో పావులు కదుపుతోంది మోదీ సర్కారు! సమితి భద్రతా మండలి ద్వారా ఆంక్షలు, ఆర్థిక కార్యాచరణ దళం (ఎఫ్‌ఏటీఎఫ్‌) ద్వారా గట్టి బిగింపులే ప్రస్తుతానికి ఉగ్రవాదంపై అంతర్జాతీయ పోరుకు ప్రధాన అస్త్రాలుగా ఉన్న తరుణంలో ఆయా వ్యవస్థల్ని ‘రాజకీయం’ చేయరాదనడం ద్వారా చైనా అనుచిత ధోరణుల్ని ప్రధాని తప్పుపట్టడం సరైనదే. టెర్రరిస్థాన్‌పై ద్విముఖ పోరులో అంతర్జాతీయంగా లభిస్తున్న దన్ను ఆశావహంగా ఉన్నా ఎప్పుడు ఎక్కడ ఏ తీరుగా ఉగ్రదాడులు జరగబోతున్నాయన్న ఆందోళనే కలచి వేస్తోంది. చైనా తయారీ అధునాతన డ్రోన్ల సాయంతో 80 కిలోల మారణాయుధాల్ని, ఉపగ్రహ సమాచార పరికరాల్ని సరిహద్దు రాష్ట్రమైన పంజాబులో పాకిస్థాన్‌ జారవిడవడం సంచలనం సృష్టిస్తోంది. గ్లోబల్‌ పొజిషనింగ్‌ వ్యవస్థ కలిగిన డ్రోన్ల ద్వారా జారవిడిచిన సామగ్రి అంతా కశ్మీరీ ఉగ్రవాద ప్రజ్వలనానికి ఉద్దేశించిందేనని పంజాబ్‌ ప్రభుత్వం చెబుతోంది. ప్రచ్ఛన్న యుద్ధంలో ఇది మలి అంచెలా ఉంది! ఉగ్రవాదంపై మద్దతు కూడగట్టడంలో రచ్చగెలిచిన మోదీ ప్రభుత్వం- ముంగిట్లో కొచ్చిన ముప్పునూ సమర్థంగా తిప్పికొట్టే వ్యూహంతో ముందడుగేయాలి!

Posted on 26-09-2019