Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

వ్యూహాత్మక సైనిక బంధం

* భారత్‌ - అమెరికా సంయుక్త విన్యాసాలు

హ్యూస్టన్‌లో ఇటీవల జరిగిన ‘హౌడీ-మోదీ’ కార్యక్రమంలో భారత్‌-అమెరికా త్రివిధ దళాలు ‘టైగర్‌ ట్రయాంప్‌’ పేరిట సంయుక్త యుద్ధవిన్యాసాలు చేస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. 50వేల మందితో కిక్కిరిసిన ఆ కార్యక్రమంలో భారత్‌తో వాణిజ్యానికి సంబంధించి ట్రంప్‌ కీలక ప్రకటన చేయవచ్చని అంతా భావించారు. అందుకు భిన్నంగా ఆయన సంయుక్త యుద్ధ విన్యాసాల గురించి మాట్లాడారు. మారుతున్న భౌగోళిక, రాజకీయ సమీకరణలకు ఇది అద్దం పడుతోంది. భారత్‌ సైనికపరంగా అమెరికాకు అత్యంత సన్నిహిత దేశంగా మారుతోందనే విషయాన్ని స్పష్టం చేస్తున్న పరిణామమిది.

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దూకుడును కట్టడి చేసేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలు మరో కీలక మలుపు తిరిగాయి. ఈ త్రివిధ దళాల యుద్ధ విన్యాసాలకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, కాకినాడ వేదికగా మారడం విశేషం. చైనా జలరవాణా మార్గాలను నియంత్రించే క్రమంలో ఈ రెండూ కీలకమైన ప్రాంతాలు. ఈ విన్యాసాలకు సంబంధించిన చర్చలు ‘హౌడీ-మోదీ’ కార్యక్రమానికి ముందే విశాఖలో పూర్తయిపోయాయి. ఆ తరవాత ట్రంప్‌ లాంఛనంగా ప్రకటించారు. తూర్పు లద్దాఖ్‌లోని పాన్‌గాంగ్‌ సమీపంలో భారత్‌-చైనా దళాల మధ్య ఉద్రిక్తతలపై వార్తలు వచ్చిన కొన్ని రోజుల్లోనే ఈ ప్రకటన వెలువడింది.

చైనాకు సంకేతాలు
సైనిక విన్యాసాలను వ్యూహకర్తలు ‘సైనిక దౌత్యం’గా అభివర్ణిస్తుంటారు. ‘మలబార్‌’ విన్యాసాలే ఇందుకు ఉదాహరణ. భారత్‌-అమెరికాలు 1992లో వీటిని ప్రారంభించాయి. భారత్‌ అణుపరీక్షలు నిర్వహించడంతో 1998లో ఇవి నిలిచిపోయాయి. 2002లో తిరిగి మలబార్‌ విన్యాసాలు మొదలయ్యాయి. ఈ విన్యాసాల్లో ఆస్ట్రేలియా తాత్కాలిక సభ్యదేశంగా కొనసాగింది. 2007లో ఆస్ట్రేలియా తమ నౌకలను ఈ విన్యాసాలకు పంపింది. చైనా బెదిరింపులతో ఆస్ట్రేలియా తమ నౌకలను అర్ధాంతరంగా వెనక్కి పిలిపించింది. ఆ ఘటనతో ‘డ్రాగన్‌’ తన బలాన్ని, పలుకుబడిని భారత్‌-అమెరికాలకు తెలియజేసినట్లయింది. అది ఇరు దేశాలకు ఒక రకంగా అవమానకర పరిస్థితి. తరవాత సంభవించిన పరిణామాల నేపథ్యంలో ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ఆక్రమణ స్వభావంపట్ల ఆస్ట్రేలియాకు స్పష్టత వచ్చింది. ఆ క్రమంలోనే జపాన్‌ సైతం ‘మలబార్‌’లో భాగస్వామి అయింది. తొలుత జపాన్‌ ఈ విన్యాసాలకు కొంత దూరం పాటించింది. అయితే చైనా వైఖరిలో మార్పు లేకపోవడంతో అది భారత్‌-అమెరికాతో జట్టుకట్టింది. తాజా మార్పులతో ప్రభావితమైన ఆస్ట్రేలియా ‘డ్రాగన్‌’ కట్టడికోసం ‘మలబార్‌’ విన్యాసాల్లో తిరిగి పాల్గొనేందుకు ప్రయత్నించినా భారత్‌ అంగీకరించడం లేదు. భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాలు చైనాకు అడ్డుకట్ట వేసేందుకు సమష్టిగా ముందుకు కదలాలన్న వ్యూహం అమలులో తడబాటుకు ‘ఆసీస్‌’ వైఖరే కారణం. ఆ క్రమంలోనే జపాన్‌, అమెరికా, భారత్‌ కలిసి ‘జై’పేరిట మరో బృందంగా ఏర్పడ్డాయి. ఈ దఫా ఆస్ట్రేలియా లేకుండానే ‘మలబార్‌’ విన్యాసాలు జరుగుతున్నాయి. అలాగని భారత్‌-ఆస్ట్రేలియాల మధ్య సైనిక సహకారం లేదని కాదు. 2018లో ఆస్ట్రేలియాలో జరిగిన ‘పిచ్‌ బ్లాక్‌’ వైమానిక విన్యాసాల్లో భారత్‌ పాల్గొంది. ‘ఆస్‌ ఇండెక్స్‌’ పేరిట ఇరు దేశాలు విడిగా యుద్ధవిన్యాసాలు నిర్వహిస్తున్నాయి. కేవలం రెండు దేశాలు చేతులు కలిపితే చైనాకు బలమైన సందేశం పంపించడం సాధ్యం కాదని- మిగిలిన శక్తులనూ సమీకరించి సమష్టిగానే ‘డ్రాగన్‌’ ఎదుర్కోవాలన్న విషయం ఆస్ట్రేలియాకు ఆలస్యంగా బోధపడింది.

ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో తటస్థ వైఖరి అవలంబించిన భారత్‌ ఆ సంధికాలంలో యుద్ధ విన్యాసాలకు దూరంగా ఉంది. 2000 తరవాత నెమ్మదిగా సైనిక విన్యాసాలు ఊపందుకున్నాయి. పర్వతాలపై యుద్ధం చేయడంలో భారత దళాలది అందెవేసిన చేయి. ఈ క్రమంలో భారత్‌తో సైనిక విన్యాసాలు చేసే దేశాలు ఈ నైపుణ్యాలు నేర్చుకొనేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. అదే సమయంలో భారత దళాలు వివిధ మిత్రదేశాల దళాల నుంచి ఆధునిక యుద్ధపరికరాల వాడకం గురించి తెలుసుకొంటున్నాయి. రక్షణ శాఖ లెక్కల ప్రకారం 2012-2016 మధ్యలో భారత్‌ 23 దేశాలతో 93 సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఆఫ్రికా ఖండంలోని పేద దేశాలకు సైనిక సహకారం అందించి పెద్దన్న పాత్ర పోషించింది.

స్నేహం దృఢతరం
అమెరికాకు ‘ప్రధాన రక్షణ భాగస్వామి’గా భారత్‌ను గుర్తించిన నాటి నుంచి పరిణామాలు వేగంగా మారుతూ వస్తున్నాయి. కీలక సాంకేతికతను భారత్‌కు విక్రయించడానికి ఉన్న అడ్డంకులను అమెరికా నెమ్మదిగా తొలగిస్తూ వస్తోంది. ఈ క్రమంలో భారత్‌ రవాణా సహకారానికి సంబంధించి అమెరికాతో ‘లెమోవా’, కమ్యూనికేషన్‌ సహకారానికి సంబంధించి ‘కోమ్‌కాసా’ ఒప్పందాలపై సంతకాలు చేసింది. అమెరికా తన పసిఫిక్‌ కమాండ్‌ పేరును ‘ఇండో-పసిఫిక్‌ కమాండ్‌’గా మార్చింది. ఈ చర్యలన్నీ ఆసియాలో భారత్‌ ప్రాధాన్యాన్ని పెంచే విధంగా ఉన్నాయి. ‘కోమ్‌కాసా’ కింద భారత్‌-అమెరికా మధ్య సైనిక సమాచార వ్యవస్థను ‘టైగర్‌ ట్రయాంప్‌’ విన్యాసాల్లో పరీక్షించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇరుదేశాల దళాల మధ్య సమన్వయం పెంచుతుంది. అంతర్జాతీయ వేదికలపై ఉభయ దేశాల దళాలు కలిసి పనిచేయాల్సిన సమయాల్లో ఇది అక్కరకొస్తుంది. అమెరికా నుంచి భారత్‌ కొనుగోలు చేసిన ఆయుధాలపై శిక్షణకు, సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడానికి త్రివిధ దళాల విన్యాసాలు అద్భుతమైన వేదికలు అవుతాయి.

ప్రచ్ఛన్న యుద్ధకాలం నుంచి భారత్‌-సోవియట్‌ యూనియన్‌ (ప్రస్తుత రష్యా) స్నేహం కొనసాగుతోంది. ఇప్పుడు అమెరికాతో భారత్‌ జట్టు కట్టడంతో రష్యా, పాకిస్థాన్‌ వైపు మొగ్గుతోందనేది అపోహ మాత్రమే. రష్యాకు ఆయుధ వ్యాపారం అతిపెద్ద ఆదాయ వనరు. భారత్‌ ఇప్పుడు రష్యాకు అత్యంత కీలకమైన వినియోగదారుగా మారింది. ఈ సమయంలో భారత్‌ను దూరం పెట్టి పాక్‌తో జట్టుకట్టడం ఆ దేశానికి ఆర్థికంగా నష్టాన్ని తెస్తుంది. అమెరికా-భారత్‌ త్రివిధ దళాలు 2003నుంచి ‘ఇందిర’ పేరిట యుద్ధవిన్యాసాలను నిర్వహిస్తున్నాయి. వచ్చే డిసెంబరులో వీటిని మరోమారు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. అమెరికా, రష్యాలతో త్రివిధ దళ విన్యాసాలు చేసే దేశం భారత్‌ ఒక్కటే కావడం విశేషం. ఇది భారతావని దౌత్య సమతుల్యతకు నిదర్శనం!

- పెద్దింటి ఫణికిరణ్‌
Posted on 30-09-2019