Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

పరుగులెత్తిన ప్రగతి రథం

* 70 ఏళ్ల జన చైనా ప్రస్థానం

చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చి నేటితో 70 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ రోజు కమ్యూనిస్టు చైనా ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తూ, అంతర్జాతీయ రాజకీయాల్లో అగ్రశక్తిగా ఆవిర్భవించాలని దృఢసంకల్పం ప్రదర్శిస్తోంది. ఈ విజయం తేలిగ్గా సంభవించినదేమీ కాదు. ఎన్నో విఫల ప్రయోగాలు, విధానాలను అధిగమించి సాధించిన సాఫల్యమిది. 1949లో అధికారం చేపట్టిన కమ్యూనిస్టు పార్టీ మావో జేడాంగ్‌ నాయకత్వంలో దారుణమైన పొరపాట్లు చేసింది. పెద్ద ముందడుగు (గ్రేట్‌ లీప్‌ ఫార్వార్డ్‌), సాంస్కృతిక విప్లవం చైనాను రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అతలాకుతలం చేశాయి. లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు.

ఆరంభంలో ఒడుదొడుకులు
1966నాటి సాంస్కృతిక విప్లవం సృష్టించిన రాజకీయ అనిశ్చితి 1976లో మావో మరణించేవరకు కొనసాగింది. 1977లో డెంగ్‌ జియావో పింగ్‌ అధికారం చేపట్టాక వ్యవసాయం, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతికతలు, రక్షణ దళాల ఆధునికీకరణను చేపట్టారు. 1978 నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను భారీగా ఆహ్వానించడానికి ప్రత్యేక పన్ను రాయితీలిచ్చి సముచిత చట్టాలు చేశారు. 1980లో షెన్‌ జెన్‌, ఝుహాయ్‌, షామెన్‌, షాంటోలలో నాలుగు ప్రత్యేక ఆర్థిక మండళ్ళను (సెజ్‌) నెలకొల్పారు. ప్రవాస చైనీయుల నుంచి పెద్దయెత్తున పెట్టుబడులను ఆహ్వానించారు. డెంగ్‌ చేపట్టిన విధానాలు కమ్యూనిస్టు సిద్ధాంతాలకు విరుద్ధమైనవి అయినా, ఆశించిన ఫలితాలు సాధించడంలో సఫలమయ్యాయి. ఆయన ప్రారంభించిన ఆర్థిక సంస్కరణల వల్ల మొదట్లో ద్రవ్యోల్బణం విజృంభించింది. తమ జీవన ప్రమాణాలు వేగంగా మెరుగుపడతాయని చైనీయులు పెట్టుకున్న ఆశలు నిజం కాకపోవడంతో విద్యార్థులు, సాధారణ ప్రజానీకం నిరసన ప్రదర్శనలకు దిగారు. వాటిని అణచివేయడానికి చైనా భద్రతా బలగాలను దించింది. ఈ విధంగా డెంగ్‌ అటు కమ్యూనిజం పట్ల కానీ, ఇటు ప్రజాస్వామ్యం పట్ల కానీ నిబద్ధత లేదని నిరూపించుకున్నారు. అభివృద్ధి సాధన ముందు అన్ని సిద్ధాంతాలు దిగదుడుపేనన్నారు. డెంగ్‌ నాయకత్వంలో కమ్యూనిస్టు పార్టీ అనుసరించిన స్వేచ్ఛావిపణి విధానాలు ఆశించిన విజయాలను కట్టబెట్టాయి. ఒకప్పుడు కేవలం 19.1 కోట్ల డాలర్లుగా ఉన్న స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2018కల్లా 13.6 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. 1981లో 85 శాతం ప్రజలు దుర్భర దారిద్య్రంలో ఉండగా 2017నాటికది 3.1 శాతానికి పడిపోయింది. అంటే కేవలం మూడున్నర దశాబ్దాల్లో 85 కోట్లమంది చైనీయులు పేదరికం ఊబి నుంచి బయటపడ్డారన్నమాట. చైనా తయారుచేసే వినియోగ వస్తువులకు నేడు ప్రపంచమంతటా విపరీతమైన గిరాకీ ఉంది. ఎవరిచేతిలో చూసినా చైనీస్‌ మొబైల్‌ ఫోన్లే. భారత్‌లో 2016లో 50 శాతం స్మార్ట్‌ఫోన్ల విపణిని చైనాకు చెందిన లెనోవో, ఒప్పో, ఒన్‌ ప్లస్‌, జియోనీ కంపెనీలే కైవసం చేసుకున్నాయి. 5జీ సాంకేతికతలో తనను మించిపోతుందేమోనని అమెరికా సైతం గాభరా పడుతోందంటే, చైనా తడాఖాను అర్థం చేసుకోవచ్చు. ప్రపంచమంతా సౌర విద్యుదుత్పాదనవైపు మొగ్గుతున్న ఈ రోజుల్లో అతిపెద్ద సౌర ఫలక ఎగుమతిదారుగా నిలుస్తోంది. ఇతర దేశాల్లో హైస్పీడ్‌ రైళ్ల కాంట్రాక్టులు సాధించడంలో జపాన్‌తో పోటీపడుతోంది. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టు కింద ఆసియా, ఆఫ్రికాలలో ఎన్నో మౌలిక వసతుల ప్రాజెక్టులు నిర్మిస్తోంది. స్వదేశంలో, విదేశాల్లో చురుకైన విధానాలు అనుసరించి అనితరసాధ్య విజయాలు సాధించింది. అంతర్జాతీయంగా సుస్థిర వాతావరణం ఉంటేనే ఆర్థికంగా అభివృద్ధి సాధించగలుగుతుందని నమ్మిన డెంగ్‌, ఇతర దేశాలకు కమ్యూనిజాన్ని ఎగుమతి చేసే కార్యక్రమానికి తెరదించారు. 1970లలో సోవియట్‌ యూనియన్‌కు ముకుతాడు వెయ్యడానికి అమెరికా, చైనాలు విదేశాంగ విధానపరంగా సమన్వయీకృతంగా అడుగులు వేశాయి. ఈ బంధం బలపడి 1984కల్లా చైనాకు అమెరికా ఆయుధాలు ఎగుమతి చేయసాగింది. కానీ, తరవాత సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలడంతో అమెరికా దృష్టి అంతా పశ్చిమాసియాపైకి మళ్లింది. దీనివల్ల చైనాకు పూర్తిగా ఆర్థికాభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించడానికి, క్రమంగా ప్రపంచంలో అగ్రగామిగా ఎదగడానికి పాటుపడే వెసులుబాటు లభించింది. రకరకాల ఉపాయాలతో ఆర్థికశక్తిగా ఎదిగిన తరవాత పలు విదేశీ భూభాగాలు తనవేనన్న పల్లవిని ఎత్తుకుంది. డోక్లాం, దక్షిణ చైనా సముద్రాలు ఇందుకు తాజా ఉదాహరణలు. చైనా ఆర్థికంగా వృద్ధి చెందాక కమ్యూనిజం నుంచి ఉదారవాద పాశ్చాత్య శైలి ప్రజాస్వామ్యానికి మారుతుందేమోనని అమెరికా పెట్టుకున్న ఆశ అడియాస అయింది. అమెరికాకే ఆర్థికంగా, సాంకేతికంగా, సైనికంగా సవాలు విసరే స్థాయికి చైనా చేరుకొంటోంది.

కాలానుగుణ వ్యూహాలు
చైనా ఆర్థిక నమూనా భారతదేశానికి నప్పదు. ఏకపార్టీ పాలనలో కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ చైనా విజయానికి కీలకం. ప్రజాస్వామ్య దేశాల్లో ఆ నమూనా పనిచేయదు. కమ్యూనిస్టు పార్టీ ఛత్రం కింద రాష్ట్రాలు, పురపాలక సంఘాలు వ్యాపారపరంగా, ఆర్థికపరంగా సొంత నిర్ణయాలతో ముందుకెళ్ళాయి. పార్టీ పంథాను, నాయకత్వాన్ని ధిక్కరించనంత కాలం రాష్ట్రాలకు, పురపాలికలకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని డెంగ్‌ సూత్రీకరించారు. పార్టీ చట్రంలోనే తగు కార్యనిర్వహణ స్వేచ్ఛ ఇచ్చి అభివృద్ధి సాధనకు బాట వేశారు. అందువల్ల ఏ రాష్ట్రమూ బీజింగ్‌ మాటను ధిక్కరించి ప్రత్యామ్నాయ విధానాలను అనుసరించిన దాఖలాయే లేదు. అందరూ ఒకే మాట ఒకే బాటగా సాగినందువల్ల నేడు చైనాలో ఉత్పత్తి సామర్థ్యం అవసరానికి మించి పోగుపడింది. రాష్ట్రాలు, కంపెనీలు తీవ్ర రుణభారాన్ని మోస్తున్నాయి. ఇటీవలి వరకు రెండంకెల అభివృద్ధి రేటు సాధించిన చైనా, మారిన పరిస్థితుల్లో అదే దూకుడు కనబరచలేకపోతోంది. ఇప్పుడు గేరు మార్చకతప్పదని గ్రహించి ఎగుమతి ఆధారిత అభివృద్ధి వ్యూహం నుంచి స్వదేశీ వినియోగ ఆధారిత వ్యూహంవైపు మరలుతోంది. దీనికితోడు బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టు కింద పలు వర్ధమాన దేశాల్లో పెట్టుబడులు పెడుతోంది. మేడిన్‌ చైనా విధానం ప్రకారం హైటెక్‌ ఉత్పత్తిని చేపట్టి విదేశీ కంపెనీలపై ఆంక్షలు పెడుతోంది. అమెరికన్‌ కంపెనీల మేధా హక్కులను చైనా కబళిస్తోందని ఆందోళన మిన్నంటింది. తనపై వ్యక్తమవుతున్న అనుమానాలను నివృత్తి చేసుకుంటూ బాధ్యతాయుతంగా మెలగుతూ అందర్నీ కలుపుకొనిపోయే వ్యూహాన్ని చైనా చేపట్టాలి. ప్రపంచ శాంతికి భంగం కలిగించని రీతిలో ఆర్థిక, సైనిక, రాజకీయ విధానాలను చేపట్టాలి.


Posted on 01-10-2019