Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

మిగిలింది భంగపాటే!

* కశ్మీర్‌పై పాకిస్థాన్‌ దుష్ప్రచారం

కశ్మీర్‌పై పాకిస్థాన్‌ విష ప్రచారాన్ని అంతర్జాతీయ సమాజం ఎంతమాత్రం విశ్వసించలేదు. అది ద్వైపాక్షిక సమస్య తప్ప మరొకటి కానేకాదని తేల్చిచెప్పింది. అరబ్‌ దేశాలు సైతం పాకిస్థాన్‌కు దన్నుగా నిలవలేకపోవడం గమనార్హం. చైనా తప్ప ఏ ఒక్క దేశమూ ఇస్లామాబాద్‌కు బాసటగా నిలబడలేదు. అంతర్జాతీయంగా నానా యాగీ చేసినా ఫలితం దక్కకపోవడంతో పాకిస్థాన్‌ ఉక్రోషంతో ఊగిపోతోంది. అదేపనిగా ‘గోబెల్స్‌’ ప్రచారం చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆక్రోశిస్తోంది. ప్రవాస పాకిస్థానీయులు కశ్మీర్‌పై విపరీత దుష్ప్రచారం చేశారు. ఇంగ్లాండ్‌లో ఉన్న ప్రవాస పాకిస్థానీయులు ఈ విషయంలో ముందున్నారు. అమెరికాలోని హ్యూస్టన్‌లో గల ప్రవాస పాకిస్థానీయులు సైతం భారత వ్యతిరేక ప్రచారంలో చురుకైన పాత్ర పోషించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉదారవాద ప్రసార మాధ్యమాలు కశ్మీర్‌కు విపరీత ప్రచారం కల్పించాయి. అమెరికాలో ప్రసిద్ధి చెందిన న్యూయార్క్‌ టైమ్స్‌, వాషింగ్టన్‌ పోస్ట్‌, బ్రిటన్‌లోని బీబీసీ, గార్డియన్‌ లాంటి మాధ్యమాలు కశ్మీర్‌కు సంబంధించి పూర్తిగా భారత వ్యతిరేక, పాకిస్థాన్‌ అనుకూల వైఖరి తీసుకున్నాయి. అదే వైఖరి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే), బలూచిస్థాన్‌లలో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలపై ప్రదర్శించలేదు. ఈ విషయంపై ఆయా దేశాల్లోని ప్రవాస భారతీయులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

ఎడతెగని యత్నాలు
కశ్మీర్‌కు సంబంధించి ఆగస్టు అయిదున భారత్‌ తీసుకున్న నిర్ణయాలను అందివచ్చిన అవకాశంగా పాకిస్థాన్‌ భావించి పెద్దయెత్తున విష ప్రచారం ప్రారంభించింది. కశ్మీర్‌లో జరగరానిదేదో జరిగిపోయిందని, యావత్‌ ప్రపంచం భారత చర్యలను ఖండించాలని అదే పనిగా పిలుపిచ్చింది. 370, 35ఏ అధికరణలను రద్దు చేయడం ఐక్యరాజ్య సమితి తీర్మానాలకు విరుద్ధమని ప్రకటించింది. పట్టువదలని విక్రమార్కుడిలా ఆగస్టు అయిదు నుంచి పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌ భారత్‌పై విషం చిమ్మారు. ముందుగా జమ్మూకశ్మీర్‌లో ప్రజల్ని రెచ్చగొట్టి అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నించారు. ఈ విషయాన్ని భారత్‌ ముందుగానే ఊహించి తాత్కాలికంగా ప్రజల కదలికలు, సమాచార సాధనలపై నిర్బంధం విధించడంతో ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. ప్రపంచవ్యాప్తంగా భారత వ్యతిరేక అభిప్రాయాన్ని కూడగట్టడానికి ఇమ్రాన్‌ ప్రయత్నించారు. చైనా దన్నుతో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చర్చకు యత్నించి భంగపడటం తెలిసిందే. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలోనూ అలాంటి ప్రయత్నమే చేసి విఫలమయ్యారు. గత నెల 27న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో సైతం కశ్మీర్‌ అంశాన్ని ఇమ్రాన్‌ఖాన్‌ లేవనెత్తారు. ముందుగా 17 నిమిషాలపాటు ప్రసంగించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. విశ్వకల్యాణానికి అవసరమైన సూచనలు చేశారు. నిర్ణీత సమయంకన్నా ఎక్కువసేపు ప్రసంగించిన ఇమ్రాన్‌ఖాన్‌ కశ్మీర్‌పై సహజ ధోరణిలో విషం చిమ్మారు. మోదీది అహంకారమన్నారు. అదేపనిగా వ్యక్తిగత విమర్శలు గుప్పించారు. కశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేయకపోతే రక్తపాతమంటూ ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. అణుయుద్ధ బూచిని చూపిస్తూ వివిధ వేదికలపై ఆయన వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు అంతర్జాతీయ సమాజానికి పాక్‌ను దూరం చేస్తున్నాయి.

ఇటీవల ఐరోపా పార్లమెంటులోనూ పాక్‌కు చుక్కెదురైంది. చైనా తప్ప ఏ దేశమూ మద్దతు ఇవ్వకపోవడంతో ఇమ్రాన్‌ఖాన్‌లో అసహనం పెరుగుతోంది. ఇస్లామిక్‌ దేశాల్ని మతపరంగా రెచ్చగొట్టి లబ్ధి పొందాలనే ప్రయత్నమూ విఫలమైంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, సౌదీ అరేబియా, బహ్రెయిన్‌ లాంటి దేశాలు, భారత్‌ పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌- సమస్యను ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలని స్పష్టీకరించడంతో పాక్‌ హతాశురాలైంది. ఇస్లాం దేశాల్లో ఏ ఒక్కటీ ఇస్లామాబాద్‌ వాదనను భుజానికి ఎత్తుకోలేదు. మొత్తానికి పాక్‌కు తీవ్ర ఆశాభంగం ఎదురైంది. దిక్కుతోచని స్థితిలో భారతీయ ముస్లిములు భారత ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని ఇమ్రాన్‌ పిలుపిచ్చారు. ఇదీ బెడిసికొట్టిందని తెలియడంతో అణ్వాయుధాలు ప్రయోగించాల్సి వస్తుందంటూ హుంకరిస్తున్నారు. కశ్మీర్లో నిర్బంధ విధానం అమలులో ఉన్నందువల్ల తక్కిన భారతదేశంలోని ముస్లిములు కశ్మీర్‌ విషయంలో తనకు మద్దతివ్వాలని పిలుపిచ్చి భంగపడ్డారు. దీనికి భారత్‌లో అతి పురాతనమైన, అతి పెద్దదైన ముస్లిం మతసంస్థ నుంచి దీటైన సమాధానం వచ్చింది. జమాత్‌ ఉలేమా ఇ హింద్‌ భారతదేశంలో ఉన్న అన్ని ముస్లిం మతసంస్థల్లో పురాతనమైనది. 1819 అక్టోబరు 29న ప్రారంభమైన ఈ సంస్థ ఈ నెలలో నూరేళ్ల పండగ జరుపుకోనుంది. దేశంలోని అన్ని ముస్లిం మతసంస్థలోకెల్లా ఎక్కువ సభ్యత్వం కలిగిన అతి పెద్దసంస్థగా దీనికి గుర్తింపు ఉంది. ఇటీవల దిల్లీలో జరిగిన సంస్థ సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్‌కి అది గట్టి సమాధానం ఇచ్చింది. కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని, దాన్ని అడ్డంపెట్టుకొని పాకిస్థాన్‌ తన పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తోందని ఘాటుగా పేర్కొంది. అధికరణ 370పై తమకు సొంత అభిప్రాయం ఉన్నా దాన్ని వ్యక్తీకరించి పాక్‌కు లాభం చేకూర్చడం ఇష్టంలేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించింది. అదే సమయంలో కశ్మీరీల హక్కులపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ సంస్థ ప్రధాన కార్యదర్శి మదానీ పత్రికలకు తమ వైఖరిని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఎంతో పరిణతితో వ్యవహరించారు. ఇమ్రాన్‌ఖాన్‌కి ఇది పెద్ద చెంపపెట్టు.

అపూర్వ మద్దతు
ఖిలాఫత్‌ ఉద్యమంలో కాంగ్రెస్‌తో కలిసి జమాత్‌ ఉలేమా ఇ హింద్‌ పనిచేసింది. 1942 క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొంది. దేశ విభజనను పూర్తిగా వ్యతిరేకించింది. మదర్సాల్లో ఆధునిక విద్యను ప్రవేశపెట్టాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానాన్ని సమర్థించింది. అంతమాత్రాన ప్రతి విషయంలో ప్రభుత్వాన్ని జమాత్‌ ఉలేమా ఇ హింద్‌ వెనకేసుకు రాలేదు. ఎన్నో విషయాల్లో ప్రభుత్వంతో విభేదించింది. బాబ్రీమసీదు- రామజన్మభూమి విషయంలో ముస్లిముల తరఫున నిలబడింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ముస్లిముల తరఫున ప్రధాన కక్షిదారుగా వ్యవహరిస్తోంది. అంతిమంగా సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఉంటామని ఆ సంస్థ స్పష్టం చేసింది. అదే సమయంలో ముస్లిముల సామాజిక దుర్విచక్షణపై ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించింది. కశ్మీర్‌ విషయంలో ఇమ్రాన్‌ఖాన్‌ హిందువులు, ముస్లిములమధ్య ఎంతగా చిచ్చుపెట్టాలని చూసినా దేశభద్రత విషయంలో అందరూ ఒక్కటిగా నిలబడ్డారన్న విషయం రుజువైంది. చివరికి ఈ విషయంలోనూ పాక్‌ పాచిక పారలేదు.

కశ్మీర్‌ సమస్యపై మోదీ నిర్ణయాలను యావత్‌ దేశం ముక్తకంఠంతో సమర్థించింది. ఏడు దశాబ్దాల సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నాన్ని హర్షించింది. అయితే ప్రధాన స్రవంతిలో ఉన్న పార్టీల నాయకులను నిర్బంధంలో ఉంచడం హర్షణీయం కాదు. కశ్మీర్‌ ప్రత్యేకవాదుల్ని, ప్రధాన స్రవంతిలోని పార్టీల నాయకుల్ని ఒకే గాటన కట్టడమూ సబబు కాదు. వారిని విడుదల చేయాలి. లేనట్లయితే మానవ హక్కుల ఉల్లంఘన సమస్య అంటూ పాక్‌ ప్రపంచ దేశాల్లో దుష్ప్రచారం చేసే ప్రమాదం ఉంది. కొద్దిరోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాను ప్రజా భద్రతా చట్టం కింద అరెస్ట్‌ చేశారు. ఇటువంటి నిర్ణయాల ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించిన జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లో యుద్ధప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. అదే సమయంలో కశ్మీరీల హృదయాలను చూరగొనడం అన్నింటికన్నా అత్యంత కీలకం!

గురివెంద పోకడ
ప్రస్తుత గిల్గిట్‌-బాల్టిస్థాన్‌ ప్రాంతంలో 1927లో అక్కడి జాతుల రక్షణ కోసం కశ్మీర్‌ మహారాజు తెచ్చిన స్థానిక జాతుల రక్షణ చట్టాన్ని 1984లో రద్దుచేసి పంజాబీలను, పష్తూన్లను ఈ ప్రాంతానికి తరలించి మెజారిటీగా ఉన్న షియాలను మైనారిటీలుగా మార్చి, వారి స్థానిక సంస్కృతిని దెబ్బతీసినప్పుడు పాకిస్థాన్‌కు కశ్మీరీల హక్కులు గుర్తుకు రాలేదు. జమ్మూకశ్మీరును భారత్‌ రెండు ప్రాంతాలుగా విభజించిందని గగ్గోలు పెట్టే పాకిస్థాన్‌, ఆ పని తన అధీనంలో ఉన్న ఆక్రమిత కశ్మీర్‌లో 1949లోనే కరాచీ రహస్య ఒప్పందం ద్వారా చేసిందని మరచిపోవడం గురివెంద గింజ సామెతను గుర్తు చేస్తుంది. ఆజాద్‌ కశ్మీర్‌ నుంచి ప్రస్తుత గిల్గిట్‌-బాల్టిస్థాన్‌ ప్రాంతాన్ని విడదీసి 2009 వరకు ఎటువంటి హక్కులూ లేకుండా పాలన సాగించిన సంగతిని చరిత్ర మరచిపోలేదు. వాస్తవానికి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లో మానవ హక్కుల ఉల్లంఘన గురించి ప్రపంచానికి తెలియజెప్పడంలో భారత్‌ వెనకబడింది. కశ్మీర్లో ఉన్మాదాన్ని రెచ్చగొట్టకుండా ఉండేందుకు ఇటీవల భారత్‌ తీసుకున్న చర్యలపై పాకిస్థాన్‌ ప్రచారం చేసినదానిలో నూరోవంతైనా ఇన్నేళ్లలో పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లో మానవహక్కుల ఉల్లంఘన గురించి భారత్‌ ప్రపంచానికి తెలియజెప్పలేకపోయింది. దీన్ని అంతర్జాతీయ సమస్యగా మార్చడం ఇష్టంలేదనే కారణంతో పాకిస్థాన్‌ 1949 నుంచి తన అధీనంలోని కశ్మీర్లో తీసుకున్న నిర్బంధ చర్యల గురించి భారత్‌ మౌనంగా ఉండటం ఓ విధంగా ప్రస్తుతం ఇస్లామాబాద్‌ ఈ పద్ధతిలో రెచ్చిపోవడానికి ఊతమిచ్చింది.


Posted on 02-10-2019