Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

వినతులు వినవలె...

* బంగ్లా ప్రధాని భారత పర్యటన

భారత్‌కు చిరకాల మిత్రదేశం బంగ్లాదేశ్‌. వరసగా మూడోసారి దేశ ప్రధాని బాధ్యతలు చేపట్టిన తరవాత షేక్‌ హసీనా భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. సార్వత్రిక ఎన్నికల్లో కళ్లు చెదిరే విజయాలు సాధించి ప్రధానిగా నరేంద్ర మోదీ రెండో దఫా ప్రమాణ స్వీకారం చేసిన తరవాత ఇరువురు నేతలూ కలుసుకోవడం ఇదే మొదటిసారి. ప్రపంచ ఆర్థిక సదస్సుకు అనుబంధంగా దిల్లీలో నేడూ రేపు జరగనున్న భారత ఆర్థిక సదస్సులో బంగ్లా ప్రధాని హసీనా ప్రసంగించనున్నారు. 74వ ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ వేదికగా న్యూయార్క్‌లో ఇరువురు నేతలు కలుసుకున్నప్పుడు చర్చకు వచ్చిన అంశాలను ప్రస్తుత ద్వైపాక్షిక భేటీలో మరింత సవిస్తరంగా విశ్లేషించనున్నారు. జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)సహా నదీ జల ఒప్పందాలపై కొంతకాలంగా తాము వ్యక్తం చేస్తున్న ఆందోళనలకు ఈ సమావేశాల్లో సమాధానం రాబట్టాలని బంగ్లా నాయకత్వం భావిస్తోంది. ఎన్‌ఆర్‌సీ ద్వారా అక్రమ వలసదారులపై భారత్‌ తీసుకొనే చర్యలు తమ దేశంపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్నది బంగ్లాదేశ్‌ ఆందోళన. ఇరుదేశాల మధ్య ఉన్న సత్సంబంధాల దృష్ట్యా ఎన్‌ఆర్‌సీ నేపథ్యంలో తలెత్తే సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చునని, దానిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని న్యూయార్క్‌ సదస్సులో భారత ప్రధాని మోదీ, హసీనాకు హామీ ఇచ్చారని బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి అబ్దుల్‌ మొమెన్‌ ఇటీవల వెల్లడించారు.

బంగ్లాదేశీ వలసదారులను ఉద్దేశించి కొందరు ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు, హోం మంత్రి అమిత్‌ షా చేస్తున్న వ్యాఖ్యలు, ఉపయోగిస్తున్న పదజాలం ఎంతో అవమానకరంగా ఉంటున్నాయని తమ దేశీయులు భావిస్తున్నట్లు బంగ్లాదేశ్‌ ఉన్నతాధికారి ఒకరు ఇటీవల వ్యాఖ్యానించారు. ఎన్‌ఆర్‌సీ విషయంలో భయపడాల్సిన పని లేదని ఒకవైపు భారత ప్రధాని మోదీ భరోసా పలుకుతుంటే, మరొకవైపు ఇతర నాయకులు ప్రతికూలంగా మాట్లాడటం తమను గందరగోళంలో పడవేస్తున్నట్లు, ఎవరి ప్రకటనలు విశ్వసించాలో తెలియని పరిస్థితిలో తామున్నట్లు ఢాకా కేంద్రంగా పనిచేసే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాలసీ, అడ్వొకసీ, గవర్నెన్స్‌ ఛైర్మన్‌ సయ్యద్‌ మునిర్‌ ఖస్రూ వ్యాఖ్యానించడం బంగ్లా నాయకత్వ ఆలోచనలకు అద్దం పడుతోంది. ఈ ఏడాది ఆగస్టు 31న విడుదల చేసిన ఎన్‌ఆర్‌సీ తుది నివేదిక ప్రకారం అసోమ్‌లో 19 లక్షల మంది నిరాశ్రయులవుతారు. న్యూయార్క్‌ సమావేశానికి ముందు వరకూ ఎన్‌ఆర్‌సీ అన్నది పూర్తిగా భారత్‌ అంతర్గత వ్యవహారమని బంగ్లాదేశ్‌ అంగీకరించింది. ఎన్‌ఆర్‌సీ జాబితాలో లేనివారి పరిస్థితిపట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్‌లో బతకడానికి వీల్లేని స్థితిలో వారంతా బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తారన్నది ఢాకా నాయకత్వ భయాందోళన. అవన్నీ ఊహాపోహలని, ఎన్‌ఆర్‌సీ ప్రక్రియ ఇంకా ఒక కొలిక్కి రాలేదని, కాబట్టి తుది జాబితాలో పేర్లు లేనివారు ప్రభుత్వానికి అప్పీలు చేసుకొనేందుకు ఇప్పటికీ అవకాశం ఉంది. అందువల్ల జాతీయ పౌర జాబితాపై గందరగోళం పడాల్సిన అవసరమే లేదు. అయినప్పటికీ కొందరి వ్యాఖ్యలవల్ల అనవసర భయాలు పెరుగుతున్నాయన్నది బంగ్లాదేశ్‌లో భారత మాజీ రాయబారి పినాక్‌ చక్రవర్తి అభిప్రాయం.

జాతీయ పౌర పట్టికతోపాటు, తీస్తా సహా ఇరు దేశాలకు చెందిన 54 నదీ జలాల పంపిణీపైనా సందిగ్ధం కొనసాగుతోంది. గడచిన అయిదేళ్ల తమ జమానాలోనే ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకురావాలని ఇరు దేశాధినేతలూ భావించినప్పటికీ- వివిధ కారణాలవల్ల అది కుదరలేదు. తీస్తా ఒప్పందంపై ప్రధానిగా మన్మోహన్‌ సింగ్‌ 2011లోనే సంతకం పెట్టేందుకు సంసిద్ధమైనా- ఆఖరి నిమిషంలో పశ్చిమ్‌ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్డుపడటంతో అది మధ్యలోనే ఆగిపోయింది. ఇరువైపులా రాజకీయపరమైన భావోద్వేగాలతో ముడివడిన సమస్య ఇది. గడచిన కొన్నేళ్లుగా బంగ్లానుంచి భారత్‌లోకి జరుగుతున్న అక్రమ చొరబాట్లను, ఉగ్రవాద కార్యకలాపాలను హసీనా సమర్థంగా కట్టడి చేశారనడంలో సందేహం లేదు. ఫలితంగా భారత-బంగ్లా సరిహద్దుల్లో శాంతి నెలకొంది. ఈ పరిస్థితుల్లో అందుకు ప్రతిగా భారత్‌ సానుకూలంగా స్పందించి తీస్తా నదీ జలాల ఒప్పందంపై సంతకం చేయడంతోపాటు, జాతీయ పౌర పట్టికతో ముడివడిన సమస్యలనూ పరిష్కరించాలని బంగ్లాదేశ్‌ ఆశిస్తోంది. దిల్లీలో నేటినుంచి ప్రారంభం కానున్న ఆర్థిక సదస్సు ముఖ్యంగా దక్షిణాసియా, ‘ఆసియాన్‌’ దేశాల మధ్య సహకారం పెంచడమే లక్ష్యంగా జరగనుంది. హసీనా సారథ్యంలో బంగ్లాదేశ్‌ సుదృఢ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. భారత్‌నుంచి పెట్టుబడుల ప్రవాహం పెరగాలని ఆ దేశం ఆశిస్తోంది. ఇప్పటివరకూ బంగ్లాదేశ్‌లో భారత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమాణం 300 కోట్ల డాలర్లు. అక్కడ నెలకొల్పిన భారతీయ ‘సెజ్‌’లు పూర్తి స్థాయిలో పని ప్రారంభిస్తే ఈ పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడి హామీలు పొందడంతోపాటు- ఎన్‌ఆర్‌సీ, తీస్తా జలాలు వంటి కీలక అంశాలపై భారత్‌నుంచి స్పష్టమైన హామీలను ఆశించే హసీనా పర్యటన ప్రారంభమవుతోందన్నది కాదనలేని వాస్తవం.


- స్మితా శర్మ
(రచయిత్రి- ప్రముఖ పాత్రికేయురాలు)
Posted on 03-10-2019