Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

తీవ్ర సమస్యలపై తీరైన చర్చ!

* మహాబలిపురం సాగర తీరాన మోదీ-జిన్‌పింగ్‌ సమావేశం

* చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ భారత్‌ వస్తున్నారు.

* తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలోని మహాబలిపురంలో ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌ల అనధికారిక భేటీ జరగనుంది.

* మోదీ రెండోసారి ప్రధాని పదవి చేపట్టాక ఇరునేతల మధ్య ఇది మూడోభేటీ.

* కశ్మీర్‌ సమస్యను భారత్‌, పాక్‌లే పరిష్కరించుకోవాలంటూ జిన్‌పింగ్‌ పర్యటనకు ముందుగా చైనా ప్రకటించింది. ఇటీవల ఐరాసలో ప్రస్తావించిన అంశాల జోలికి వెళ్లలేదు.

* ఉగ్రవాదం, ఉగ్రశిక్షణ, ఉగ్రవాదులకు ఆర్థిక, ఇతరత్రా సహకారం ఇరునేతల మధ్య చర్చల్లో కీలక అంశాలుగా మారనున్నాయి. వాణిజ్యం, రక్షణ, సరిహద్దు సమస్యలపైనా చర్చించనున్నారు.

* అమెరికాతో దీర్ఘకాలంగా సాగుతున్న వాణిజ్య యుద్ధం వల్ల చైనా ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్న చైనా, భారత్‌ విపణిపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎంతటి సుదీర్ఘ ప్రయాణమైనా ఒక అడుగుతోనే ప్రారంభమవుతుందనేది ప్రాచీన చైనా నానుడి. ఇప్పటివరకు ఎన్ని అడుగులు పడినా భారత్‌, చైనాల మధ్య పరస్పర విశ్వాసం నెలకొనే విషయంలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ తాజా భారత పర్యటనలో ఈ దిశగా మరో ప్రయత్నం చేపట్టేందుకు ప్రధాని మోదీ సిద్ధమయ్యారు. నిరుడు వూహాన్‌లో జరిగిన భేటీ తరవాత ఇరునేతల మధ్య ఇది రెండో అనధికారిక సమావేశం. ఇద్దరు అగ్రనేతలు ఈ ఏడాది ఇప్పటికే రెండుసార్లు భేటీ అయ్యారు. బిష్కెక్‌లో నిర్వహించిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సమావేశంలో, ఒసాకాలో చేపట్టిన జీ20 సదస్సులో కలుసుకున్నారు. కీలకమైన అక్టోబర్‌ సమావేశానికి భారత్‌, చైనా సిద్ధమవుతున్న తరుణంలో భారత్‌కు సరికొత్త ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. చైనా టెలికం దిగ్గజం హువావై 5జీ ట్రయల్స్‌ చేపట్టేందుకు భద్రతా అనుమతులు ఇవ్వరాదంటూ ట్రంప్‌ ప్రభుత్వం మోదీ సర్కారుపై ఒత్తిడి తీసుకొస్తోంది. ద్వైపాక్షిక భేటీలో ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం(ఆర్‌సీఈపీ)పై సంప్రతింపులు, బంగ్లాదేశ్‌-చైనా-ఇండియా-మయన్మార్‌ (బీసీఐఎం) ఆర్థిక నడవా ఒప్పందం, జపాన్‌ పెట్టుబడుల దిశగా మనదేశం మొగ్గు... వంటివన్నీ ఇరునేతల మధ్య చర్చకు వచ్చే ముఖ్యమైన అంశాలుగా భావిస్తున్నారు.

కశ్మీరే కీలకం
అధికరణ 370 రద్దు తరవాత ఇరుదేశాల మధ్య విభేదాలు ఉచ్ఛస్థాయికి చేరినట్లే భావించాలి. ఈసారి చర్చల్లో జమ్మూకశ్మీర్‌ పునర్‌ వ్యవస్థీకరణే అంశమే కీలకంగా మారనుంది. ‘ఆసియాన్‌ శతాబ్దాన్ని సుసాధ్యం చేసేందుకు భారత్‌, చైనా కలిసి పని చేసే విషయంలో అవగాహనకు రావాల్సి ఉంది. సరిహద్దు అంశాలతోపాటు చైనాతో కొన్ని వివాదాలు ఉన్నాయి. వీటి పరిష్కారానికి కృషి చేస్తున్నాం’ అని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జయశంకర్‌ ఇటీవల మాస్కోలో నిర్వహించిన వల్డాయ్‌ క్లబ్‌ సమావేశంలో పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో అనధికారిక సమావేశానికి వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసికి బదులుగా తమిళనాడులోని తీర పట్టణాన్ని ఎంచుకోవడం మరో ఆసక్తికర అంశం. కశ్మీర్‌లో పరిస్థితుల కారణంగా భారత్‌, చైనాల మధ్య సంబంధాల్లో విభేదాలు తలెత్తితే చివరి నిమిషంలో కార్యక్రమాన్ని ఆపివేసే అవకాశాలున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కశ్మీర్‌పై ఆగస్టు అయిదున మోదీ సర్కారు తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంపై చైనా బహిరంగంగానే ప్రతికూల వైఖరి ప్రదర్శిస్తోంది. ఇరుదేశాల నేతల మధ్య జరిగే చర్చలపై ఈ అంశమే నీలినీడలు ప్రసరింపజేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే దేశంలో అంతర్గతంగా తీసుకున్న నిర్ణయం ప్రభావం పొరుగు దేశంతో సంబంధాలపై పడకుండా చూసేందుకు ప్రభుత్వపరంగా అవసరమైన ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలో విదేశీ వ్యవహారాల మంత్రి చైనా పర్యటన చేపట్టారు. భారత ప్రభుత్వానికి లద్దాఖ్‌పై పాలన పరమైన నియంత్రణ ఉండాలనేదే ఇటీవల తీసుకున్న శాసన పరమైన నిర్ణయ లక్ష్యమని జయశంకర్‌ పేర్కొన్నారు. దీనివల్ల చైనాతో సరిహద్దులు లేదా వాస్తవాధీన రేఖపై ఎలాంటి ప్రభావం ఉండబోదని చర్చల సందర్భంగా ఆయన మధ్యవర్తులకు స్పష్టీకరించారు. జయశంకర్‌ తమ దేశంలో పర్యటించి వివరణలు ఇచ్చినా, కశ్మీర్‌ విషయంలో చైనా తన వైఖరి మార్చుకోలేదు. భారత్‌ చర్య ఆమోదనీయం కాదని, ఏకపక్షంగా దేశీయ చట్టంలో మార్పులు చేసుకోవడం ద్వారా తమ భౌగోళిక సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించారని చైనా విదేశాంగ కార్యాలయం విమర్శించింది. తన సర్వకాల స్నేహితుడు పాకిస్థాన్‌ కోసం ఐరాస భద్రతా మండలిలో కశ్మీర్‌ అంశాన్ని చర్చకు ప్రతిపాదించింది. బహిరంగ చర్చ కాకుండా, అంతర్గత సంప్రతింపులకే అనుమతి లభించింది. ఇటీవల చైనా స్టేట్‌ కౌన్సిలర్‌, విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ భారత్‌ను విస్మరించి మరీ పాకిస్థాన్‌కు వెళ్లి అక్కడి రాజకీయ, సైనిక నేతలను కలిశారు. 22వ విడత భారత్‌, చైనా సరిహద్దుల ప్రత్యేక ప్రతినిధుల మధ్య చర్చల కోసం జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌తో మాట్లాడేందుకు భారత్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్రతినిధుల చర్చలపై తేదీల్ని ఇంకా ప్రకటించకపోయినా, వాయిదా వేసే ప్రసక్తే లేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

భారత్‌కు సంబంధించినంత వరకు వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద ప్రశాంతతను పరిరక్షించే అంశానికే చర్చల్లో అగ్రప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే, కాల్పుల విరమణ ఉల్లంఘన, నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ), అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌ను అంతర్జాతీయ స్థాయిలో ఎండగట్టాల్సి ఉంది. లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా నిర్ణయించడంపైనా, అక్సాయ్‌చిన్‌, పీవోకేలు భారత్‌లో అంతర్భాగమంటూ హోం మంత్రి అమిత్‌షా పార్లమెంటులో ప్రకటించడంపై చైనా కొంతమేర కినుకగా ఉంది. గత వారం తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలోని ప్యాంగాంగ్‌ త్సో సరస్సు ఒడ్డున భారత్‌, చైనా సైనికుల మధ్య రోజంతా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరుదేశాల సైనికాధికారుల మధ్య చర్చల అనంతరం పరిస్థితులు చల్లబడ్డాయి. గతంలో పరిస్థితులను బట్టి చూస్తే జిన్‌పింగ్‌ పర్యటన చేపట్టినంత మాత్రాన అతిక్రమణలు ఆగిపోతాయని విశ్వసించలేం. 2017 ఆగస్టులో ఇదే సరస్సు ప్రాంతంలో ఇరు దేశాల సైనికులు రాళ్లు రువ్వుకున్నారు. చైనా చొరబాటు యత్నాని తిప్పికొట్టినట్లు భారత్‌ ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాప్తించాయి. 73 రోజులపాటు డోక్లాం ప్రాంతంలో నెలకొన్న ప్రతిష్ఠంభన కారణంగానే ఉద్రిక్తతల్ని తగ్గించి, ద్వైపాక్షిక సంబంధాల్ని పునరుద్ధరించేందుకు వూహాన్‌ సదస్సు వేదికగా మారింది. అంతకుముందు 2014లో అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌ భారత్‌లో తొలిసారి పర్యటించడానికి ముందు, చుమర్‌ ప్రాంతంలోకి రహదారి నిర్మించేందుకు చైనా సైన్యం యత్నించింది. అప్పట్లో చైనా జలాంతర్గామి సుదూరంలోని శ్రీలంక జలాల్లో కనిపించడం పతాక శీర్షికలకు ఎక్కింది. అదేతరహాలో 2013 ఏప్రిల్‌లో అప్పటి చైనా ప్రధాని లీ కెక్వియాంగ్‌ భారత్‌ పర్యటన పూర్తి కాగానే చైనా సైన్యం లద్దాఖ్‌లోని డెప్సాంగ్‌ మైదాన ప్రాంతంలోకి చొరబడింది. అప్పుడు ఇరుదేశాల మధ్య పూర్తిస్థాయి ఘర్షణకు తెరలేచింది.

కాలానుగుణ వ్యూహాలు
వివాదాస్పద ప్రాంతాలతోపాటు, నాలుగు వేల కిలోమీటర్ల సరిహద్దుల వెంబడి ఏకకాలంలోగాని, తాను ఎంచుకున్న ప్రాంతాల్లోగాని భారత్‌పై ఒత్తిడి తీసుకొచ్చే సామర్థ్యం చైనాకు ఉందని తెలుస్తోంది. గతంలో జరిగిన అతిక్రమణల ఫలితంగా అర్థమవుతున్న విషయమిది. ఫలితంగా భారత్‌ తన ఇండో-పసిఫిక్‌ వ్యూహంలో భాగంగా అమెరికా, జపాన్‌ల వైపు సన్నిహితంగా కదులుతూ, చైనా దూకుడుకు పగ్గం వేస్తోంది. ఈ క్రమంలోనే ఇండో-పసిఫిక్‌ భావన అనేది చైనాను అదుపు చేసేందుకేనా అంటూ ఓ సమావేశంలో రష్యా పాత్రికేయులొకరు అడిగిన ప్రశ్నకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్‌ ఘాటుగా స్పందించారు. అదుపు చేసే చర్యలు మీ చరిత్రలోనే ఉన్నాయిగానీ, భారత్‌ చరిత్రలో లేవని స్పష్టం చేశారు. మీరింకా ప్రచ్ఛన్న యుద్ధం కాలంనాటి ఆలోచన తీరుతోనే ఉన్నారని, ఆ కాలం ముగిసిందని, ఇప్పుడు బహుళ ధ్రువ ప్రపంచంలో ఉన్నామంటూ విస్పష్టంగా వివరించారు. దూకుడు నియంత్రణ సిద్ధాంతం విషయంలో భారత్‌ నుంచి ఈ తరహా సందేశాలు వెలువడినా జిన్‌పింగ్‌ ‘చైనా కల’ వేరేగానే ఉందని మాత్రం చెప్పవచ్చు. భారత్‌ను దక్షిణాసియా ప్రాంతానికే పరిమితం చేసేందుకు పాకిస్థాన్‌ను ఒక పనిముట్టులా ఉపయోగించుకోవడమే జిన్‌పింగ్‌ చైనా కల అనేది సుస్పష్టం.

కశ్మీర్‌ అంశంపై నెలకొన్న అనుమానపు నీడల్ని దాటుకుంటూ, పాకిస్థాన్‌, సీమాంతర ఉగ్రవాదం అంశాలపై భిన్నాభిప్రాయాల్ని అధిగమిస్తూ భారత్‌, చైనా సంబంధాలు ఐక్యతారాగంతో ముందుకు సాగేలా చూడటం ఇప్పుడు ఇరుదేశాల ముందున్న అతిపెద్ద సవాలు. మోదీ, జిన్‌పింగ్‌ సమావేశాల నుంచి భారీ స్థాయి నిర్ణయాలు ఆశించే అవకాశం లేదని భావించవచ్చు. మున్ముందుగా ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా దిగజారకుండా చూసుకోవడానికే ఈ భేటీలో తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది!

పాక్‌ విషయంలో పెడసర ధోరణి
ఐక్యరాజ్య సమితిలో గత 45 ఏళ్ల కాలంలో భారత్‌కు వ్యతిరేకంగా చైనా పదిసార్లు ‘వీటో’ అధికారాన్ని వినియోగించుకుంది. 26/11 దాడులకు సూత్రధారిగా పేరొందిన జమాత్‌ ఉద్‌ దవా సంస్థను ఉగ్ర జాబితాలో చేర్చాలన్న భారత్‌ యత్నాల్ని మూడుసార్లు అడ్డుకుంది. లష్కరే తొయిబా, జైషే మొహమ్మద్‌ సంస్థలపై భద్రతామండలిలో ఆంక్షలు విధించకుండా నిలువరించింది. ఉగ్రవాది సయ్యద్‌ సలాహుద్దీన్‌ను మండలి ఉగ్రజాబితాలో చేర్చకుండా అడ్డుపడింది. ఎల్‌ఈటీ కమాండర్‌ జకీయుర్‌ రెహ్మాన్‌ లఖ్వీని జైలు నుంచి విడుదల చేసిన పాకిస్థాన్‌పై చర్యలు తీసుకోవాలన్న భారత్‌ తీర్మానానికి అడ్డుపడింది. పాక్‌కు మద్దతుగా చైనా పలుమార్లు భద్రతామండలి తీర్మానాన్ని ఉల్లంఘించింది.


- స్మితాశర్మ
(రచయిత్రి- ప్రముఖ పాత్రికేయురాలు)
Posted on 10-10-2019