Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

అమెరికాకు దీటుగా అజేయ శక్తిగా...

* ఆయుధ సామర్థ్యంలో చైనా దూకుడు

చైనాలో కమ్యూనిస్టు పాలన ప్రారంభమై 70 ఏళ్లయిన సందర్భంగా ఇటీవల ప్రజా విమోచన సైన్యం (పీఎల్‌ఏ) భారీ కవాతు చేసింది. తియానన్మెన్‌ స్క్వేర్‌లో వందలాది ట్యాంకులు, 15 వేలమంది సైనికులు కదం తొక్కారు. అన్నింటినీ మించి చైనా తయారుచేసిన అత్యాధునిక ఆయుధాలు ఈ కవాతులో ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా రెండు హైపర్‌ సోనిక్‌ క్షిపణుల గురించి ఇక్కడ చెప్పుకోవాలి. మొదటిదైన డీఎఫ్‌ 41 శబ్దవేగానికి 25 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లి 15 వేల కిలోమీటర్ల పరిధిలోని శత్రు లక్ష్యాలను నాశనం చేయగలదు. అంటే- దీన్ని ప్రయోగించిన అరగంటలోపే అమెరికాను చేరుకుని బాంబులను ప్రయోగించగలదు. రెండోదైన డీఎఫ్‌ 17 క్షిపణి శబ్దవేగానికి అయిదింతల వేగంతో పయనించే హైపర్‌ సోనిక్‌ గ్లైడ్‌ వాహనం. డీఎఫ్‌ 17 గాలిలో పయనించేటప్పుడు ఇష్టానుసారం దారి మార్చుకుంటూ ప్రత్యర్థులకు చిక్కకుండా ముప్పుతిప్పలు పెడుతుంది. దీని మార్గాన్ని పట్టుకోవడం కష్టం. అందువల్ల దాన్ని కూల్చివేయడమూ కష్టమే. డీఎఫ్‌ 17 వంటి క్షిపణిని ఎదుర్కోగల అస్త్రమేదీ తమ అమ్ములపొదిలో లేదని, అమెరికా త్రివిధ సాయుధ బలగాల కమాండ్‌ ఉపాధ్యక్షుడు జనరల్‌ జాన్‌ హైటెన్‌ వ్యాఖ్యానించారంటే ఆ దేశం ఆందోళనను అర్థం చేసుకోవచ్చు.

ఆధునిక యుద్ధాల్లో నెగ్గడానికి అస్త్రశస్త్రాలతోపాటు వాటి వినియోగంలో సైనిక బలగాలకు శిక్షణ ఇవ్వడమూ అవసరం. పోరాట నిర్వహణకు సంస్థాపరంగా సన్నద్ధత కావాలి. స్వదేశంలోనే శక్తిమంతమైన ఆయుధాలు తయారు చేసుకోవాలి. పౌర, సైనిక యంత్రాంగాల మధ్య సమన్వయం ఉండాలి. సిబ్బంది పట్ల సరైన విధానాలు అనుసరించాలి. ఈ విభాగాలన్నింటిలో చైనా ప్రజా విమోచన సైన్యం (పీఎల్‌ఏ) స్థిరంగా పురోగమిస్తోంది. పీఎల్‌ఏ ఆధునికీకరణకు 2015 నవంబరులోనే నిర్ణయం జరిగింది. పీఎల్‌ఏ బలగంలో మూడు లక్షల మందిని తగ్గించాలని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ సెప్టెంబరులో నిర్ణయించిన దరిమిలా ఆ మేరకు వడివడిగా చర్యలు తీసుకున్నారు. 2016 ఫిబ్రవరిలో ఏడు సైనిక మండలాలను అయిదు యుద్ధరంగ కమాండ్‌లుగా పునర్‌ వ్యవస్థీకరించారు. అంతకుముందు పీఎల్‌ఏలో నాలుగు సాధారణ విభాగాలు ఉండగా, వాటిని రద్దు చేసి నేరుగా కేంద్ర సైనిక కమిషన్‌ అదుపాజ్ఞల్లో పనిచేసే 15 కార్యనిర్వాహక విభాగాలను ఏర్పాటు చేశారు. త్రివిధ సాయుధ బలగాలు తిరుగులేని సమన్వయంతో అజేయ శక్తిగా పనిచేసేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. అంతరిక్షంలో, సైబర్‌ సీమలో పోరాడగలిగేలా, ఎలక్ట్రానిక్‌ యుద్ధంలో మేటిగా నిలిచేలా పీఎల్‌ఏను తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం ఈ చర్యలు ప్రారంభించింది.

రక్షణ ఉత్పత్తుల్లో స్వావలంబన
అయితే ఎన్నిచేసినా పీఎల్‌ఏకి పోరాట అనుభవం లేదు. జిన్‌పింగ్‌ మాటల్లో చెప్పాలంటే- అది ‘శాంతి జాడ్యం’తో బాధపడుతోంది. అలాంటప్పుడు అది 21వ శతాబ్ది యుద్ధాల్లో నెగ్గుకురాగలుగుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని అధిగమించడానికి పీఎల్‌ఏ గట్టిగానే సన్నాహాలు చేస్తోంది. శిక్షణ పద్ధతులు, ప్రమాణాలను ఆధునీకరిస్తోంది. రేపు యుద్ధమే వస్తే ఎలా ఎదుర్కోవాలో, సంయుక్తంగా ఎలా పోరాడాలో వివరిస్తూ పీఎల్‌ఏ గతేడాది ‘ఔట్‌ లైన్‌ ఆఫ్‌ ట్రైనింగ్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌’ పేరిట ఒక మార్గదర్శిని ప్రచురించింది. ప్రపంచంలో అత్యంత అధునాతన సేనలతో పోలిస్తే తమకున్న లోటుపాట్లేవో గుర్తించి, సరిదిద్దుకొనేందుకు దీన్ని ప్రచురించారు.

సైనికులను రేపటి యుద్ధాలకు సన్నద్ధుల్ని చేయడంతోపాటు వారికి అత్యాధునిక సాధన సంపత్తిని అందజేయాలని బీజింగ్‌ గుర్తించింది. వాటిని స్వదేశంలోనే తయారుచేసుకోవడానికి అద్భుతమైన రక్షణ పరిశ్రమలను అభివృద్ధిపరచింది. ఈ పోటీలో మెరుపు వేగంతో దూసుకుపోతోంది. డిఫెన్స్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ ఏటా ప్రపంచంలో 100 అగ్రశ్రేణి రక్షణ సంస్థల జాబితాను ప్రచురిస్తుంది. నిరుడు ఈ జాబితాలో ఒక్కటంటే ఒక్క చైనా సంస్థ లేదు. అలాంటిది 2019 వచ్చేసరికి జాబితాలో 15 అగ్రస్థానాలకుగాను ఆరింటిని చైనా సంస్థలే దక్కించుకున్నాయంటే దాని పట్టుదల, పరిశోధన పటిమ, మొక్కవోని దీక్ష అర్థమవుతుంది. ఇప్పటికే దాదాపు అన్ని రకాల ఆయుధాల తయారీలో స్వావలంబన సాధించింది. ప్రపంచంలోనే సాటిలేని క్షిపణులు, ట్యాంకులు, ఇతర భూతల పోరాట సాధనాలనూ తయారుచేస్తోంది. భారత్‌, జర్మనీ, స్పెయిన్‌, తైవాన్‌, బ్రిటన్‌ వద్ద ఉన్న మొత్తం నౌకలు, జలాంతర్గాములకు మించిన సంఖ్యలో యుద్ధనౌకలు, భూతల-సముద్రతల ఉభయచర నౌకలు, జలాంతర్గాములను 2014-18 మధ్యకాలంలో సముద్రంలో దింపింది. అంతర్జాతీయ వ్యూహ అధ్యయన సంస్థ (ఐఐఎస్‌ఎస్‌) నివేదిక ఈ దిగ్భ్రాంతకర వాస్తవాన్ని బయటపెట్టింది.

సాధారణంగా ఆధునిక శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం సైనిక, పౌర ప్రయోజనాలు రెండింటికీ ఉపయోగపడుతుంది. కేవలం యుద్ధం కోసం రూపొందిన సాంకేతికతలు ఇళ్లలోను, రహదారుల మీద వినియోగించే పలు ఉపకరణాల తయారీకి తోడ్పడుతున్నాయి. ప్రస్తుతం ప్రయోగశాలల్లో ఇలాంటి సాంకేతికతలు ఎన్నో రూపకల్పన దశలో ఉన్నాయి. వాటి తయారీకి రక్షణ, పౌర పరిశ్రమలు చేతులు కలపాలని చైనా లక్షిస్తోంది. అందుకోసం సమగ్ర పౌర-సైనిక సమన్వయ పథకం (సీఎమ్‌ఐ) చేపట్టింది. ఆధునిక పోరాట సామర్థ్యాలను సంపాదించడంలో పీఎల్‌ఏకి ఈ పథకం ఎంతగానో తోడ్పడుతోంది. రక్షణ పరిశోధనల్లో పాల్గొనవలసిందిగా పౌర పరిశ్రమలను కోరుతూ భారీ ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. సింగ్‌ హువా విశ్వవిద్యాలయం తదితర ఉన్నత విద్యాసంస్థలు చైనా కేంద్ర సైనిక కమిషన్‌, శాస్త్ర సాంకేతిక కమిషన్లతో కలిసి కృత్రిమ మేధ అభివృద్ధికి పరిశోధనలు చేస్తున్నాయి. అగ్రరాజ్యంగా ఎదగాలన్న చైనా ఆశయాన్ని నిజం చేయడానికి పీఎల్‌ఏ ప్రధాన సాధనంగా ఉపకరిస్తోంది. చైనా ఉద్దేశాలు, లక్ష్యాలు చివరకు ఎక్కడకు దారితీస్తాయో తెలియదు కానీ, అవి రెండు రకాల ప్రభావాలను మాత్రం తప్పక చూపిస్తాయి. మొదటగా అంతకంతకూ బలోపేతమవుతున్న చైనాకు అమెరికా నుంచి అనివార్యంగా సవాలు ఎదురవుతుంది. 2025కల్లా అమెరికాకు అతిపెద్ద ముప్పుగా చైనా ఆవిర్భవించనుందని, అమెరికా త్రివిధ సాయుధ దళాల సంయుక్త కమాండ్‌ అధ్యక్షుడు జనరల్‌ జనరల్‌ జోసెఫ్‌ డన్‌ఫోర్డ్‌ ప్రకటించారు. రెండు- అమెరికా-చైనా వైరం ప్రధానంగా ఆసియాలోనే ప్రజ్వలిస్తుంది. ఈ సందర్భంగా భారత్‌ తదితర ఆసియా దేశాలు ఏదో ఒక పక్షం ఎంచుకోక తప్పదని కొందరు నిపుణులు సూత్రీకరిస్తున్నారు.

సముద్ర గర్భం నుంచీ శత్రువులపై నిఘా
తియానన్మెన్‌ స్క్వేర్‌లో జరిగిన కవాతులో అత్యాధునిక మానవ రహిత ఆయుధ వ్యవస్థలూ పాల్గొన్నాయి. వాటిలో గాంగ్జి 11 స్టెల్త్‌ డ్రోన్‌ ఎంతో కీలకమైనది. ఇది రాడార్లకు చిక్కకుండా ప్రత్యర్థుల భూభాగం లోతట్టు వరకు చొచ్చుకెళ్లి దాడులు చేయగలదు. దీనితోపాటు కవాతులో పాల్గొన్న గూఢచారి డ్రోన్‌ డీఆర్‌-8 శబ్దవేగంకన్నా నాలుగు రెట్లు ఎక్కువ వేగంతో పయనిస్తుంది. గగనంలో ఎంతో ఎత్తులో పయనిస్తూ శత్రునౌకలు, బలగాల కదలికలను పసిగట్టే ఈ డ్రోన్‌ సముద్రంలో అమెరికా యుద్ధనౌకల సంచారంపై నిఘా వేయగలదు. గగనం నుంచే కాకుండా సముద్ర గర్భం నుంచి సైతం శత్రువులపై నిఘా వేసే సామర్థ్యాన్ని చైనా సంతరించుకొంది. హెచ్‌.ఎస్‌.యు.001 మానవ రహిత జలాంతర్గామి తూర్పు, దక్షిణ చైనా సముద్ర జలాల్లో సంచరిస్తూ ప్రత్యర్థుల నౌకాదళాల కదలికలను పసిగడుతుంది. కవాతులో ప్రదర్శించిన (డీఎఫ్‌ 17 క్షిపణి అత్యంత కీలకమైనది. 2035కల్లా చైనా పదాతి, వైమానిక, నౌకాదళాల ఆధునికీకరణ పూర్తి కానుందనడానికి ఈ అధునాతన ఆయుధాలే నిదర్శనం.

పెత్తందారీ పోకడలకు ప్రతిఘటన
‘ది ట్రాజెడీ ఆఫ్‌ గ్రేట్‌ పవర్‌ పాలిటిక్స్‌’ గ్రంథంలో రక్షణ నిపుణుడు జాన్‌ జె.మియర్‌ షీమర్‌ వ్యాఖ్యలను ఇక్కడ ప్రస్తావించాలి. చైనా దీర్ఘకాలంలో శాంతియుతంగానే ప్రగతి సాధించినా, కొన్ని అవాంఛనీయ ఘటనలు ఎదురుకావచ్చని ఆయన భావిస్తున్నారు. ‘చైనా ఆర్థికంగా విజృంభిస్తున్నకొద్దీ ఆసియాపై ఆధిక్యం సాధించడానికి ప్రయత్నిస్తుందని నా అంచనా. ఇవాళ పశ్చిమార్ధ గోళంలో అమెరికా చేస్తున్నది ఇదే. రేపు ఆసియాలో చైనా అలాంటి పంథాయే అనుసరించవచ్చు. అయితే ఆసియాపై చైనా ఆధిపత్యం సాధించకుండా అడ్డుకోవడానికి అమెరికా చేయవలసిందంతా చేస్తుంది. చైనా పొరుగున ఉన్న భారత్‌, జపాన్‌, సింగపూర్‌, దక్షిణ కొరియా, రష్యా, వియత్నామ్‌లు అమెరికాతో చేతులు కలిపి చైనా దూకుడుకు అడ్డుకట్ట వేస్తాయి. దీంతో భద్రతాపరంగా తీవ్రమైన పోటీ ఏర్పడి యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే చైనా విజృంభణ ప్రశాంతంగా జరగబోదు’ అని ఆయన అభిప్రాయపడ్డారు. మియర్‌ షీమర్‌ అంచనాను అక్షరలక్షలుగా పరిగణించలేం. కానీ, చైనా పెత్తందారీ పోకడలు ప్రదర్శిస్తే భారతదేశం వాటిని ప్రతిఘటించక మానదు. ఆసియాలో భారత్‌ సైతం ప్రాంతీయ శక్తిగా ఎదుగుతోందన్నది నిర్వివాదాంశం. ఒకవేళ చైనా దూకుడు కనబరిస్తే దెబ్బకు దెబ్బతీసే సత్తాను భారత్‌ సంతరించుకోవలసిందే. ఇప్పుడు భారత్‌ రకరకాల ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. మన ఆయుధాల్లో అత్యధికంగా స్వదేశంలోనే తయారుచేసుకోవాలన్న లక్ష్యం మందకొడిగా సాగుతోంది. సేనల ఆధునికీకరణకు సంబంధించిన సంస్కరణలు ఇప్పటికీ పట్టాలకెక్కలేదు. సాయుధ బలగాలను సర్వశక్తిమంతంగా తీర్చిదిద్దడానికి చైనా చేస్తున్న కృషి, సాధిస్తున్న విజయాల నుంచి భారత్‌ నేర్చుకోవలసింది ఎంతో ఉంది!


- లెఫ్టినెంట్‌ జనరల్‌ (విశ్రాంత) డీఎస్‌ హూడా
(రచయిత- పాకిస్థాన్‌పై 2016లో జరిగిన లక్షిత దాడులకు నాయకత్వం వహించారు)
Posted on 12-10-2019