Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

సౌహార్దమే పల్లవిగా...

మామల్లపురంగా పేరు మారిన చారిత్రక మహాబలిపురంలో పల్లవించిన దిల్లీ బీజింగుల స్నేహగీతి ద్వైపాక్షిక సంబంధాల్లో నవశకారంభానికి నాందీవాచకం పలికింది. సహస్రాబ్దాల సంస్కృతీ వారసత్వాన్ని స్మరించుకొంటూ, వర్తమానాన్ని సమీక్షిస్తూ, పరస్పర ప్రయోజనకర భవితకు మేలుబాటలు పరవడంలో షి జిన్‌పింగ్‌, నరేంద్ర మోదీల ఇష్టాగోష్ఠి పూర్తిగా ఫలవంతమైంది. 2017 ద్వితీయార్ధంలో దాదాపు రెండున్నర నెలలపాటు డోక్లాం సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రాందోళనకరంగా పరిణమించిన నేపథ్యంలో 2018 ఏప్రిల్‌లో జనచైనా అధినేత షి జిన్‌పింగ్‌ చొరవచూపి ప్రధాని మోదీతో సాగించిన ఊహాన్‌ ఇష్టాగోష్ఠి- వాతావరణాన్ని ఎంతగానో తేటపరచింది. మానవాళిలో మూడోవంతుకు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాలు రెండూ శాంతిసామరస్యాలతో సాగితే సుస్థిరతకు ప్రోది చేసినట్లవుతుందన్న శుభసంకల్పం అప్పుడు వెలుగు చూసిందే. ‘ఆసియా శతాబ్ది’ స్వప్నం సాకారమయ్యేలా భారత్‌ చైనాల ద్వైపాక్షిక సంబంధాల్ని సక్రమంగా నిర్వహించుకోవాలన్న నాటి దీక్షకు మామల్లపురం భేటీ కొనసాగింపే! ఒక విధంగా డోక్లాం వివాద సమయంతో పోలిస్తే దిల్లీ బీజింగుల మధ్య మనస్పర్థలు, పలు అంశాల్లో ప్రతికూలతలు మరింతగా చీకాకు పెడుతున్న వేళ ఇది. భౌగోళిక రాజకీయాలూ కొత్త సవాళ్లు రువ్వుతున్న సమయంలో భారత్‌ చైనా అగ్రనేతల మాటామంతీలో పరిణత దౌత్యం వేయి పూలై వికసించింది. ఏ అంశం మీదనైనా వైరుధ్యాలు వివాదాలుగా మారకుండా జాగ్రత్తగా కాచుకోవాలన్న లక్ష్యాన్ని పునరుద్ఘాటించి, అంతర్జాతీయ నిబంధనలకు లోబడి ప్రతి దేశమూ అభివృద్ధి చెందేలా శాంతియుత, సుభద్ర, సౌభాగ్య ప్రపంచ నిర్మాణమే ఉమ్మడి ధ్యేయంగా ముందడుగేయాలని అధినేతల భేటీ అభిప్రాయపడింది. సరిహద్దు వివాదాలు, ఉగ్రవాద దుశ్చర్యలు, ద్వైపాక్షిక వాణిజ్యావకాశాలు, అంతర్జాతీయ వాణిజ్యంలో సవాళ్ల వంటి కీలకాంశాలపై రెండు దేశాలూ ఏకగళంతో స్పందించడం శుభపరిణామం. ఆటవిడుపు భేటీల్లో నేతల అభిప్రాయాల కలబోత దిల్లీ బీజింగుల మధ్య దూరాన్ని తగ్గించగలిగితే- అది ప్రపంచానికే నవోదయం!

రెండు వేల రెండొందల సంవత్సరాలుగా లేదంటే 99.9 శాతం కాలమంతా ఇండియా, చైనాల మధ్య సౌహార్ద సంబంధాలే ఉన్నాయని చైనా ప్రధానిగా వెన్‌ జియబావో లోగడ ప్రకటించినా, ద్వైపాక్షికంగా చిటపటలు చెవినపడుతూనే ఉన్నాయి. షి జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనకు వారం రోజుల్లోపే పాక్‌ ప్రధాని బీజింగ్‌ సందర్శన, ఆ సందర్భంగా సంయుక్త ప్రకటన ఇండియాకు కలవరం కలిగించాయి. దానికి పెద్ద ప్రాధాన్యమేదీ లేదన్నట్లుగా చైనా అధ్యక్షుడి పర్యటనలో కశ్మీర్‌ ప్రస్తావనే లేకపోవడం, అంతకుమించి ఇరు దేశాలకూ టెర్రరిజం పెనుసవాలుగా మారిందంటూ ప్రపంచవ్యాప్తంగా ఆ పీడను తుదముట్టించేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లకు ఉమ్మడి సహకారం అందించాలనడం వీనులవిందుగా ఉంది. భారత్‌తో సంబంధాల బలోపేతానికి 2013 మార్చిలో- దేశాధ్యక్షత దఖలుపడిన కొత్తల్లోనే షి జిన్‌పింగ్‌ నయా పంచశీల ప్రతిపాదించారు. ద్వైపాక్షిక సంబంధాలను సరైన బాటలో నడిపించడానికి ఉభయ దేశాలూ వ్యూహాత్మక చర్చలు కొనసాగించాలన్నది అందులో మొదటిది. నిరుడు ఊహాన్‌, నేడు మామల్లపురం- వ్యూహాత్మక చర్చలకు వేదికలయ్యాయి. మౌలిక సదుపాయాలు, ఉమ్మడి పెట్టుబడులు, ఇతర రంగాల్లో ఉభయ తారక ఆర్థిక సహకారం రెండోది. భారత్‌ చైనాల మధ్య వాణిజ్యం 2018లో 9,554 కోట్ల డాలర్లకు, ఇండియాలో చైనా పెట్టుబడులు 475 కోట్ల డాలర్లకు చేరినా- వాణిజ్య అసమతూకం దిల్లీని ఇబ్బందులపాలు చేస్తోంది. వచ్చే 15 ఏళ్లలో చైనా 30 లక్షల కోట్ల డాలర్ల వస్తూత్పత్తుల్ని, 10 వేలకోట్ల డాలర్ల సేవల్ని దిగుమతి చేసుకోనుందంటూ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఇండియా ‘చౌక-సృజనాత్మకత’ల మేళవింపుతో ముందుకురావాలని చైనా కోరుతోంది. భారత్‌లో తయారీకి చైనా పెట్టుబడుల్ని ఆకర్షించి, ఆందోళనకర వాణిజ్యలోటు కట్టడికి ఇండియా వ్యూహాత్మకంగా ముందడుగేయాలి!

షి జిన్‌పింగ్‌ ప్రస్తావించిన నయా పంచశీలలో స్నేహ సాంస్కృతిక బంధాల పటిష్ఠీకరణా కీలకమైనది. శతాబ్దాల తరబడి భారత్‌ చైనాల మధ్య సాగిన నౌకావాణిజ్యంపై పరిశోధనలు జరపాలని, మహాబలిపురం ఫ్యూజియన్‌ ప్రావిన్సుల మధ్య సంబంధాల అధ్యయనానికి ఒక అకాడమీ ఏర్పాటు అవకాశాన్ని పరిశీలించాలనీ అధినేతలు నిర్ణయించడం- పటిష్ఠ గతం పునాదులపై సౌష్ఠవ భవిష్యత్తు నిర్మాణాన్ని లక్షిస్తోంది! వర్ధమాన దేశాల ప్రయోజనాల్ని, అంతర్జాతీయ సవాళ్లను కాచుకొనేలా ప్రపంచ వేదికలపై రెండు దేశాలూ మరింత సమన్వయంతో పని చెయ్యాలన్న మరో సూచనా ఉభయతారకమైనదే. అమెరికా అధ్యక్షుడి ఒంటెత్తు వాణిజ్య ఆంక్షల ‘ట్రంపరితనం’ చైనా భారత్‌ రెండింటినీ ఒక్కతీరుగా అవస్థల పాలు చేస్తున్నదే! ఆ తరహా వాణిజ్య ఆంక్షల పూనకాలతో పాటు, ఉగ్రవాద ప్రతీప శక్తుల పీచమణిచే కార్యాచరణపైనా చైనా తగు సమన్వయంతో ఇండియాతో కూడివస్తే అంతకన్నా కావాల్సిందేముంది? విభేదాలు, సమస్యల్ని తగువిధంగా పరిష్కరించుకోవాలంటూ షి జిన్‌పింగ్‌ ప్రస్తావించిన సరిహద్దు వివాదం అత్యంత సంక్లిష్టమైనది! ఏనాడో 2005లో ఉభయ పక్షాలూ ఆమోదించిన రాజకీయ ప్రాతిపదికలు, మార్గదర్శక సూత్రాల ఆధారంగా ఉభయులకూ సమ్మతమైన సహేతుక పరిష్కారాన్ని ప్రత్యేక ప్రతినిధుల బృందం అన్వేషించాలని అధినాయకుల భేటీ అభిలషించింది. ఈలోగా ప్రాదేశిక సమగ్రతల్ని ప్రశ్నించే పోకడల్ని పక్కనపెట్టి, ఉమ్మడి ప్రయోజనాలే పరమావధిగా దిల్లీ బీజింగుల వ్యూహాత్మక ప్రస్థానం అభివృద్ధికి కొత్త ఒరవడి దిద్దాలి. మామల్లపురంలో వెల్లివిరిసిన సౌహార్దం భారత్‌ చైనాల కలిమికి, ఆసియా బలిమికి చోదకశక్తి కావాలి!


Posted on 13-10-2019