Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

భవిష్యత్తు అగమ్యగోచరం

* పాక్‌పై ఉరుముతున్న ఎఫ్‌ఏటీఎఫ్‌ సమీక్ష

పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ పరిస్థితి దయనీయంగా ఉంది. దేశ ఆర్థిక పరిస్థితి ఆయనకు కంటి మీద కునుకు పట్టనీయడం లేదు. ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలా అని తర్జనభర్జనలు పడుతున్నారు. ఎటుచూసినా ప్రతికూల పరిస్థితులే ఎదురవుతుండటంతో ఏం చేయాలో తోచక తల పట్టుకుంటున్నారు. గతంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్‌), అనుంగు మిత్రదేశం చైనా నుంచి ఎడాపెడా అప్పులు చేసిన ఆయనకు ఇప్పుడు దాదాపు అన్ని అవకాశాలూ మూసుకుపోయాయి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అంతర్జాతీయంగా ఎదురుకానున్న ఇబ్బందులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మనీలాండరింగ్‌, ఉగ్రమూకలకు నిధుల సరఫరాకు అడ్డుకట్ట వేయడంలో పాకిస్థాన్‌ తీసుకొంటున్న చర్యలపై ఆర్థిక చర్యల కార్యదళం (ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌- ఎఫ్‌ఏటీఎఫ్‌) తాజాగా పారిస్‌ నగరంలో సమీక్ష ప్రారంభించింది. ఇందులో ఏ మాత్రం వ్యతిరేక ఫలితం వచ్చినా పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ ఉత్తర కొరియా స్థాయికి దిగజారినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఇమ్రాన్‌ హయాములో ఏడాది వ్యవధిలోనే పాక్‌ దాదాపు ఏడున్నర లక్షల కోట్ల రూపాయల మేర అప్పు చేసింది. ఇందులో మూడోవంతుకు పైగా విదేశాల నుంచి తెచ్చిందే. ఆ దేశ చరిత్రలో ఇదో సరికొత్త రికార్డు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌ (ఎస్‌పీబీ) స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టింది. పరిస్థితి తీవ్రతను గమనించిన ఇమ్రాన్‌ ఖాన్‌ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల నుంచే తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పాత మిత్రులతో బంధాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు కొత్తవారిని కలుపుకొనేందుకు యత్నించారు. ఈ చర్యలు ఎంతవరకు సఫలీకృతమవుతాయన్నది ప్రశ్నార్థకమే!

ఉక్కిరి బిక్కిరి
ఇప్పటికే అనుమానాస్పద దేశాల జాబితా (గ్రే లిస్టు)లో ఉన్న పాకిస్థాన్‌- తనకు అప్పగించిన కార్యాచరణ ప్రణాళిక అమలులో దారుణంగా విఫలమైందని ఇటీవల ఎఫ్‌ఏటీఎఫ్‌ ఆసియా-పసిఫిక్‌ విభాగం పెదవి విరిచింది. ఈ మేరకు 228 పేజీల సమగ్ర నివేదిక తయారుచేసింది. పాక్‌కు సూచించిన 40 సిఫార్సుల్లో ఒకటి మాత్రమే పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చింది. మరో 35 వివిధ దశల్లో ఉన్నాయి. కీలకమైన మరో నాలుగు సిఫార్సుల అమలు ఊసేలేదని పేర్కొంది. కొన్ని ‘ఫర్వాలేదు’ అన్న స్థాయిలో ఉన్నాయని తెలిపింది. సెక్యూరిటీ అండ్‌ ఎక్స్ఛేంజి కమిషన్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌ (ఎస్‌ఈసీపీ), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌ (ఎస్‌బీపీ) సమస్య తీవ్రతను అర్థం చేసుకోలేదని ఎఫ్‌ఏటీఎఫ్‌ తప్పుపట్టింది. మరో పక్క పాక్‌ మాత్రం ఎస్‌ఈసీపీ మొత్తం 167 తనిఖీలు చేపట్టిందని, దీంతోపాటు దాదాపు 219 అనుమానాస్పద లావాదేవీలను పసిగట్టి చర్యలు తీసుకొందని పేర్కొంటూ నివేదికను సిద్ధం చేసుకొంది. ఆన్‌లైన్‌ లావాదేవీలను పసిగట్టేందుకు, చాలా సంస్థల్లో నిధుల అక్రమ మళ్లింపును అడ్డుకొనేందుకు ఎస్‌బీపీకి చెందిన ‘ది గో ఏఎమ్‌ఎల్‌’ (గో యాంటీ మనీ లాండరింగ్‌) పర్యవేక్షక సాఫ్ట్‌వేర్‌ను వినియోగించేలా చేశామని చెబుతోంది. కానీ ఇవన్నీ లష్కరే తొయిబా, ఫలాయీ ఇన్సానియత్‌, జమాత్‌ ఉద్‌ దవా తదితర ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలపై ఎంతమాత్రం ప్రభావాన్ని చూపలేదన్నది ఎఫ్‌ఏటీఎఫ్‌ వాదన.

గత ఏడాది అమెరికా, బ్రిటన్‌లు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నిలిచాయి. ఈసారి పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. అఫ్గానిస్థాన్లో తాలిబాన్లతో చర్చలు జరపడానికి పాకిస్థాన్‌ అవసరం అమెరికాకు ఎంతగానో ఉంది. అధ్యక్ష ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కారుపై ఒత్తిడి పెరిగిపోతోంది. ఇటీవల చర్చలు నిలిపేస్తున్నట్లు అమెరికా ప్రకటించినా పాకిస్థాన్‌ వేదికగా తాలిబన్లతో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చల్లో అమెరికా ప్రత్యేక ప్రతినిధి జల్మే ఖలీల్జాద్‌ పాల్గొన్నారు. ఫలితంగా బందీల పరస్పర అప్పగింత కింద ఇటీవల ముగ్గురు భారతీయులు, ఒక అమెరికన్‌, ఒక ఆస్ట్రేలియన్‌ విడుదలకు తాలిబన్లు అంగీకరించారు. ఇవన్నీ ట్రంప్‌ సర్కారుకు ఎన్నికల్లో ఉపయోగపడే అంశాలే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ను ఇబ్బంది పెట్టేలా మరింత దూకుడుగా అగ్రరాజ్యం వెళ్లకపోవచ్చు. ఎఫ్‌ఏటీఎఫ్‌లో కొత్తగా ఓటింగ్‌ హక్కు దక్కించుకొన్న అమెరికా మిత్ర దేశం సౌదీ అరేబియా సైతం పాక్‌ను వ్యతిరేకించకపోవచ్చు. ఇరు దేశాల మధ్య బలమైన సైనిక సంబంధాలు ఉన్నాయి. పాక్‌ సైనిక దళాల మాజీ ప్రధానాధికారి రహిల్‌ షరీఫ్‌ ప్రస్తుతం సౌదీలోని ఇస్లామిక్‌ సంకీర్ణ సేనలకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ సేనలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. హుతీ తిరుగుబాటుదారులపై పోరులో వీటి పాత్ర కీలకం. గతంలో సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ పాక్‌ పర్యటన సందర్భంగా రహిల్‌ షరీఫ్‌ ప్రముఖపాత్ర పోషించారు. ముస్లిం దేశాలకు నాయకత్వం వహించే విషయంలో టర్కీతో జరుగుతున్న ఆధిపత్య పోరులో వెనకబడతామనే భయంతో కూడా పాక్‌ను వ్యతిరేకించకుండా సౌదీ అరేబియా తటస్థ వైఖరి అవలంబించే అవకాశం ఉంది. మరోపక్క పాకిస్థాన్‌, టర్కీ, మలేసియా తమ అనుబంధాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లాయి. ‘ఇస్లామిక్‌ టీవీ’ని తీసుకురావాలని ఈ దేశాలు నిర్ణయించాయి. దీంతో ఈ రెండు దేశాలు పాక్‌కు మద్దతుగా నిలవనున్నాయనే విషయం దాదాపు ఖరారైపోయింది.

చైనా వ్యూహాలు
జకీర్‌ నాయక్‌ అంశం, అంతర్గత రాజకీయాలు, పామాయిల్‌పై భారత్‌ పన్ను పెంపు వంటి అంశాలు మలేసియాను పాక్‌ వైపు మళ్లించగా, అర్మేనియా మారణకాండ విషయంలో పాక్‌ మొదటి నుంచి మద్దతుగా నిలవడం ఆ దేశానికి టర్కీని దగ్గర చేసింది. ఇక అన్నివేళలా పాక్‌ మిత్రుడిగా పేరున్న చైనానే ఈసారి ఎఫ్‌ఏటీఎఫ్‌కు నాయకత్వం వహించడం బాగా కలిసొచ్చే అంశం. ఇరాన్‌ ‘బ్లాక్‌లిసు’్టలో ఉంటే అది చైనాపై ఆధారపడుతుంది. అప్పుడు డ్రాగన్‌కు తక్కువ ధరకే చమురు లభిస్తుంది. మరి పాక్‌ తనపై ఆధారపడితే ఏమి లభిస్తుంది. ఆ దేశానికి తాను ఇచ్చిన అప్పులూ తిరిగిరావు. అందుకే పాక్‌ను చైనా నిస్సందేహంగా రక్షిస్తుంది. మరోపక్క ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశానికి కొన్ని రోజుల ముందే చైనా సంస్థలకు గ్వదర్‌ ఓడరేవులో 23 ఏళ్లపాటు పన్ను రాయితీలను పాక్‌ ప్రకటించింది. భారత్‌ సైతం మలేసియా, టర్కీలపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆ దేశాల ఆర్థిక వనరులపై ఒత్తిడి తెస్తేగానీ వీటి తీరులో మార్పు రాదు. మలేసియా నుంచి ఈ ఏడాది భారత్‌ 35 లక్షల టన్నుల పామాయిల్‌ను దిగుమతి చేసుకొంది. ఈ లెక్కన ఆ దేశానికి భారత్‌ అతిపెద్ద పామాయిల్‌ ఖాతాదారు. మనం మలేసియా నుంచి పామాయిల్‌ దిగుమతుల్లో కోత విధించి ఇండొనేసియా వంటి దేశాలకు మళ్లాల్సి ఉంది. మరోపక్క ఇప్పటికే కుర్దులపై టర్కీ దాడిని భారత్‌ విమర్శించింది. ఇది టర్కీపై దౌత్యపరంగా ఒత్తిడిని పెంచుతుంది. దీంతోపాటు టర్కీకి చెందిన ఒక సంస్థకు హిందుస్థాన్‌ షిప్‌యార్డుతో కలిసి నౌకలను తయారు చేసే కాంట్రాక్టును అప్పగించే అంశాన్ని పునఃపరిశీలించాలి. ఈ చర్య ఆర్థికంగా టర్కీని ఇబ్బంది పెట్టడంతోపాటు భారత్‌కు భద్రతాపరంగానూ ఉపయోగపడుతుంది. ఎందుకంటే విశాఖలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డులో భారత్‌కు చెందిన కీలక నౌకలు ఉన్నాయి. వీటి సమాచారం టర్కీకి అక్కడి నుంచి పాక్‌కు చేరే ప్రమాదం తోసిపుచ్చలేనిది. ఎఫ్‌ఏటీఎఫ్‌ ఓటింగ్‌ విషయానికి వస్తే, భౌగోళిక రాజకీయాల్లో విషయ తీవ్రత ఆధారంగా ఏ దేశం ఓటు వేయదు. ఆయా దేశాల దౌత్య అవసరాల ఆధారంగానే ఓటింగ్‌ జరుగుతుంది. ఇప్పటికే ‘బ్లాక్‌ లిస్టు’లో ఉన్న ఇరాన్‌, ఉత్తర కొరియా పశ్చిమ దేశాలకు తలనొప్పిగా మారాయి. పాకిస్థాన్‌తో పోల్చుకుంటే ఉగ్రవాద చరిత్రలో ఉత్తర కొరియా పాత్ర తక్కువే. కానీ, అమెరికాతో విరోధం కారణంగానే ఉత్తర కొరియా ఇప్పటికీ ‘బ్లాక్‌లిస్టు’లో కొనసాగుతోంది. ఈ దేశాలతో పోలిస్తే పశ్చిమ దేశాలు పాకిస్థాన్‌పై ఆ స్థాయి వ్యతిరేకతతో లేవు. ఎఫ్‌ఏటీఎఫ్‌ 40 సిఫార్సులు సూచించింది. వాటిలోని 36 సిఫార్సుల్లో ఎంతో కొంత పురోగతి చూపడంతో మరికొంత సమయం ఇవ్వాలని పేర్కొంటూ మరోసారి పాకిస్థాన్‌ను గ్రే లిస్టులో కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. దీని నుంచి బయటపడాలంటే 15 మందికి పైగా సభ్యుల మద్దతు పాక్‌ కూడగట్టాలి. అమెరికా, ఐరోపా దేశాల ఆశీస్సులు లేకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్‌కు మద్దతు సాధన దాదాపు అసాధ్యం!

నిషేధిస్తే మరెన్నో కష్టాలు
ఎఫ్‌ఏటీఎఫ్‌ అనుమానాస్పద దేశాల జాబితా (గ్రే లిస్టు)లో ఉండటం ఇస్లామాబాద్‌కు కొత్తేమీ కాదు. 2008లో, 2012-15 మధ్యకాలంలోనూ పాక్‌ ఆ జాబితాలో ఉంది. ఆయా సందర్భాల్లో ఆర్థికంగా కుదేలైపోయింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. 2018లో మరోమారు ఈ జాబితాలో చేరడంతో ఏడాదిలో దాదాపు వెయ్యి కోట్ల డాలర్ల మేరకు నష్టం వాటిల్లిందని స్వయంగా ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషీ వెల్లడించడం గమనార్హం. నిషేధిత జాబితా (బ్లాక్‌ లిస్ట్‌)లో ప్రవేశిస్తే పాకిస్థాన్‌కు విదేశీ పెట్టుబడులు రావడం గగనంగా మారుతుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్‌) సంస్థ నుంచి వచ్చే రుణాలూ ఆగిపోయే ప్రమాదం ఉంది. కానీ, పాకిస్థాన్‌ను నిషేధిత జాబితాలో చేర్చడం చాలా కష్టమన్న అభిప్రాయం అంతర్జాతీయంగా దౌత్యవర్గాల్లో వ్యక్తమవుతోంది. గల్ఫ్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్‌ (జీసీసీ), ఐరోపా కమిషన్‌తోపాటు మొత్తం 39 సభ్యదేశాలు ఎఫ్‌ఏటీఎఫ్‌లో ఉన్నాయి. ఇందులో జరిగే ఓటింగులో సాధారణ మెజారిటీ ఆధారంగా నిర్ణయాలు తీసుకోరు. అన్ని దేశాలు దాదాపుగా ఏకతాటిపైకి రావాలనేది దీని ఉద్దేశం. తీర్మానానికి అనుకూలంగా మూడు దేశాలు లేకపోయినా ఆమోదం పొందదు. గతంలో చైనా తటస్థంగా ఉండగా టర్కీ, మలేసియా మద్దతుతో ఇస్లామాబాద్‌ ‘బ్లాక్‌లిస్టు’ గండం నుంచి బయటపడింది. ఇంతకుముందు పాకిస్థాన్‌తోపాటు ‘గ్రే లిస్టు’లో టర్కీ ఉండటం గమనార్హం.


- పెద్దింటి ఫణికిరణ్‌
Posted on 14-10-2019