Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

యూరోకు గ్రీస్‌ గండం

విపణి ఆధారిత ఆర్థిక వ్యవస్థలో ప్రతి ఆర్థిక విజృంభణ చివరకు సంక్షోభంలో ముగుస్తుంది. ప్రతి సంక్షోభం క్రమేణా ఆర్థిక పునరుజ్జీవానికి దారితీస్తుంది. సంక్షోభ కాలంలో అభివృద్ధి మందగించి, నిరుద్యోగంతో తల్లడిల్లిపోయే ప్రజలు, తమకు అండగా నిలిచే నాయకులను, పార్టీలను ఆదరిస్తారు. గడచిన అయిదేళ్ల అష్టకష్టాల నుంచి తమను గట్టెక్కిస్తుందన్న నమ్మకంతో గ్రీకు ప్రజలు, అలెక్సిస్‌ సీప్రాస్‌ నాయకత్వంలోని వామపక్ష అతివాద పార్టీ సైరిజాకు పగ్గాలు అప్పగించారు. ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిన అతి పొదుపు చర్యలకు మంగళం పాడతానని వాగ్దానం చేసి సైరిజా అధికారంలోకి వచ్చింది. ఇది 18 దేశాల యూరోజోన్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తీసుకున్న అప్పులను గ్రీస్‌ ఎగవేస్తుందా, ఉమ్మడి కరెన్సీని చేపట్టిన యూరోజోన్‌నుంచి వైదొలగి మొత్తం ఐరోపా ఐక్యతకే గండి కొడుతుందా అన్న అనుమానాలు ముప్పిరిగొంటున్నాయి. ఈ పరిస్థితికి మూలాలు 2008 ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి.

ఆర్థిక రంగం అస్తవ్యస్తం

2000-2007 సంవత్సరాల మధ్య యూరోజోన్‌లోని 18 దేశాల్లో భారీ గృహనిర్మాణ, రుణ వితరణ బుడగలు మిథ్యా విజృంభణను సృష్టించాయి. ఆ సమయంలో జర్మనీ, నెదర్లాండ్స్‌, ఫిన్లాండ్‌ దేశాల్లోని బ్యాంకులు, దక్షిణ ఐరోపాలోని గ్రీస్‌, స్పెయిన్‌, ఇటలీ, పోర్చుగల్‌ దేశాలకు ఉమ్మడి కరెన్సీ యూరోలో కారుచౌక రేట్లకు రుణాలు ఇచ్చాయి. 2008లో బుడగ బద్దలై ప్రపంచం మాంద్యంలోకి జారిపోయింది. వస్తుసేవలకు గిరాకీ తగ్గి ఉత్పత్తి పడిపోయింది. ఫలితంగా పన్ను ఆదాయాలూ తగ్గిపోయి, దక్షిణ ఐరోపా దేశాలు బకాయిలను చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఇది చాలదన్నట్లు గ్రీస్‌లో ఎడాపెడా పన్నుల ఎగవేతకు తోడు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల వ్యయాలు అలవికానంతగా పెరిగిపోవడం తీవ్ర బడ్జెట్‌ లోట్లకు దారితీసింది. ఈ పరిణామాలు 2010కల్లా దేశాన్ని దివాలా అంచుకు నెట్టాయి. దాంతో గ్రీస్‌ను గట్టెక్కించడానికి యూరోపియన్‌ కేంద్రబ్యాంకు, యూరోపియన్‌ కమిషన్‌, అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్‌)ల త్రయం 20,600కోట్ల యూరోల రుణాలు అందజేసి, దానికి ప్రతిగా తీవ్ర పొదుపు చర్యల్ని విధించింది. ప్రభుత్వ నిర్వహణ వ్యయాన్ని, సంక్షేమ వ్యయాన్ని తగ్గించుకొని ఏటేటా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో నాలుగు శాతానికి సమానమైన బడ్జెట్‌ మిగులు సాధించాలని షరతులు పెట్టింది. వీటిని నెరవేర్చడానికి గ్రీస్‌ ప్రభుత్వం తన పౌరులకు చెల్లించే పింఛన్లలో 40శాతం కోతపెట్టింది. మధ్యతరగతిపై ఆస్తిపన్నులు పెంచింది. మౌలిక వసతులపై, పారిశ్రామికాభివృద్ధిపై కొత్త పెట్టుబడులు పెట్టడం మానేసింది. దీంతో గ్రీస్‌లో వస్తుసేవల ఉత్పత్తి 25శాతం మేర తగ్గి, ఆర్థిక మాంద్యం చుట్టుముట్టడంతో, నిరుద్యోగం 26శాతానికి పెరిగింది. యువతలో సగం మంది నిరుద్యోగులుగానే మిగిలారు. నిరుద్యోగ భృతిని కేవలం పన్నెండు నెలల వరకే పరిమితం చేస్తున్నారు. దీర్ఘకాలం నుంచి నిరుద్యోగులుగా ఉన్నవారికి ప్రభుత్వ వైద్యబీమాను నిరాకరిస్తున్నారు. ఇది చాలదన్నట్లు మందుల ధరలను 30శాతం పెంచారు. ఈ అతి పొదుపు చర్యలవల్ల గ్రీస్‌ ప్రభుత్వ రుణభారం ఏమైనా తగ్గిందా అంటే అదీ లేదు. 2009లో జీడీపీలో 127శాతంగా ఉన్న గ్రీస్‌ ప్రభుత్వ రుణభారం 2014 చివరికి 175శాతానికి 31,700కోట్ల యూరోలకు పెరిగిపోయింది. అప్పులపై వడ్డీ చెల్లించాలంటే పెట్టుబడి వ్యయంతో సహా అన్ని ఖర్చులూ తగ్గించుకొని 2022 సంవత్సరం వరకు ప్రతి ఏటా జీడీపీలో నాలుగు శాతానికి సమానమైన బడ్జెట్‌ మిగులు సాధించాల్సి ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెడితే కానీ ప్రజలకు ఉపాధి లభించదు. అయితే, గ్రీస్‌ మీద రుద్దిన అతి పొదుపు చర్యలవల్ల అభివృద్ధి, పెట్టుబడులు స్తంభించిపోయాయి. ప్రజల కడుపు మాడ్చి ఆదా చేసిన సొమ్మును రుణదాతలకు చెల్లించాల్సిన అగత్యం ఏర్పడింది.

సమాజంలో అసమానతలు పెరిగిపోయాయి. ప్రభుత్వ, వ్యక్తిగత, పెట్టుబడి వ్యయాలు తగ్గిపోయి వస్తుసేవలకు గిరాకీ తగ్గింది. దాంతో ధరలు పడిపోయి కొత్త పెట్టుబడులు రాని పరిస్థితి ఏర్పడింది. దీన్నే వ్యతిరిక్త ద్రవ్యోల్బణం అంటారు. దీన్ని అధిగమించడానికి యూరోపియన్‌ యూనియన్‌ దేశాల్లోని ప్రైవేటు బ్యాంకులకు సున్నా వడ్డీరేట్లకు వందల కోట్ల యూరోలు అందజేశారు. ఈ డబ్బంతా స్థిరాస్తి, స్టాక్‌ మార్కెట్‌ రంగాల్లోకి ప్రవహించి, అక్కడి ధరలను పెంచిందే తప్ప కొత్త ఫ్యాక్టరీలు, కొత్త ఉద్యోగాల సృష్టికి తోడ్పడలేదు. ఈ పూర్వరంగంలో ఐరోపా సమాజం విధించిన పొదుపు చర్యలకు మంగళం పాడి ప్రభుత్వ వ్యయాన్ని పెంచుతామనే హామీతో సైరిజా పార్టీ ఎన్నికల్లో పోటీచేసింది. పేదలకు ఉచిత విద్యుత్‌, ఆహార కూపన్లు ఇస్తామని, తగ్గించిన పెన్షన్లను సంక్షోభం ముందునాటి స్థాయికి చేర్చి, వేతనాలూ పెంచుతామని వాగ్దానం చేసింది. సంపన్నులపై ఎక్కువ పన్నులు విధించి, జనహిత కార్యక్రమాల మీద ఖర్చుచేస్తామని భరోసా ఇచ్చింది. ఉద్యోగాలు కోల్పోయిన 12వేలమందికి ఉపాధి కల్పిస్తామని, ప్రైవేటీకరణ నిలిపివేస్తామనీ ప్రకటించింది.

ఐరోపా దేశాల్లో గుబులు

గ్రీస్‌ తీసుకున్న రుణాల్లో అత్యధిక భాగం గత రెండేళ్లుగా పాత రుణాలపై అసలు, వడ్డీ చెల్లింపులకే సరిపోతోంది. ఈ పరిస్థితిలో గ్రీస్‌ ప్రభుత్వం దివాలా తీశానని ప్రకటించి అప్పులన్నీ ఎగవేయవచ్చు. ఉమ్మడి కరెన్సీ(యూరో) పాటింపు ఒప్పందం నుంచి వైదొలగి, అల్ప మారక విలువ కలిగిన సొంత కరెన్సీని చేపడితే, స్వదేశంలో తిరిగి అభివృద్ధి, తద్వారా ఉపాధి అవకాశాలు పెంచుకోవచ్చు. కానీ, గ్రీస్‌ యూరోను విడనాడినట్లయితే, సాటి రుణగ్రస్త దేశాలైన స్పెయిన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌ కూడా అదే బాట పట్టే అవకాశం ఉంది. అప్పుడు ఐరోపా సమాఖ్య భావనే కుప్పకూలుతుంది. దీన్ని నివారించడానికి ఐఎంఎఫ్‌, ఈసీబీ, యూరోపియన్‌ ప్రభుత్వాలు గ్రీస్‌కు ఇచ్చిన రుణాలపై వడ్డీని సున్న శాతానికో, 0.2 శాతానికో తగ్గించి, రుణ చెల్లింపు గడువును ముప్ఫై ఏళ్లనుంచి యాభై ఏళ్లకు పెంచడం ఒక పరిష్కార మార్గం. దీనివల్ల గ్రీస్‌, దాంతోపాటు ఇతర దక్షిణ ఐరోపా దేశాలు యూరో చట్రంలోనే ఒదిగి ఉంటాయి. యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ, 2008 ఆర్థిక సంక్షోభానికి రుణభారమే కారణమని భావిస్తూ, ఈయూ దేశాలు ఇక కొత్త అప్పులు చేయరాదని భీష్మించింది. గ్రీస్‌ అనుభవం ఈ విధానంలోని లోటుపాట్లను ఎత్తిచూపుతోంది. ఐరోపా ఇక తీవ్ర పొదుపు చర్యలకు స్వస్తి చెప్పి, రవాణా రంగ ఆధునికీకరణ వంటి మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో; పరిశ్రమలు, గృహాలను డిజిటల్‌ గూళ్లుగా మార్చే ప్రక్రియలో భారీ పెట్టుబడులు పెట్టాలి. ప్రభుత్వం తరఫున స్వల్ప వడ్డీరేట్లపై భారీ పెట్టుబడులు పెట్టినప్పుడు అభివృద్ధి పుంజుకొని, ఉపాధి అవకాశాలు విజృంభిస్తాయి. ప్రజల జీవితాలూ బాగుపడతాయి.

(రచయిత - కైజర్‌ అడపా)
Posted on 01-02-2015