Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

భారత్‌ను దాటి... బంగ్లా ధాటి

* అభివృద్ధి సూచీల్లో ముందంజ

దక్షిణాసియాలో భారత్‌కు ఏ రంగంలోనూ సరితూగే దేశం లేదని అందరం నమ్ముతాం. అగ్రదేశంగా ఎదగడానికి ఉరుకులు పరుగులు తీస్తోందని అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించడానికి అట్టేకాలం పట్టదన్నదీ నిజం. చైనా తరవాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగానూ గుర్తింపు తెచ్చుకుంది. బహుళపార్టీ ప్రజాస్వామ్యంతో క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించుకుంటూ అభివృద్ధిలో దూసుకుపోతున్న దేశంగా భారత్‌ను చాలామంది అభివర్ణిస్తారు. వలస పాలన నుంచి విముక్తి చెందిన ఏ దేశమూ భారత్‌లాంటి విజయాలను సాధించలేదన్నది సైతం నిజం. ఇక్కడే ఒక విచిత్రం ఉంది. భారత్‌ సహకారంతో ఒక దేశంగా రూపుదాల్చిన బంగ్లాదేశ్‌ కొన్ని విషయాల్లో గణనీయంగా ముందుకు దూసుకెళ్తోంది. అసోమ్‌లో చేపట్టిన జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) రూపకల్పన సందర్భంగా బంగ్లాదేశ్‌ పేరు మారుమోగింది. ఆ దేశం నుంచి పెద్దయెత్తున ముస్లిములు అక్రమంగా రాష్ట్రంలోకి ప్రవేశించారని, వారిని ఏరిపారేయడానికే జాబితా రూపొందుతోందని, అదే తరహా కసరత్తు పశ్చిమ్‌బంగలోనూ చేపడతామని పాలక పార్టీ పెద్దల నుంచి తరచూ ప్రకటనలు వస్తూనే ఉన్నాయి.

అంచనాలకు అతీతంగా...
వలసలనేవి సరైన జీవనోపాధి లేని ప్రాంతాల నుంచి అభివృద్ధి చెందిన ప్రాంతాలకు జరుగుతాయి. బంగ్లాదేశ్‌ ఒకప్పుడు చాలా బీదదేశం. రాజకీయంగానూ పలుసార్లు అస్థిరతకు లోనైంది. అందుకే లక్షల మంది భారత్‌కు తరలి వచ్చారు. అందులో హిందువులు, ముస్లిములూ ఉన్నారు. ఆర్థిక అవసరాలతోపాటు మతపరమైన సంఘర్షణలు తలెత్తినప్పుడల్లా వలసలు పెద్దయెత్తునే సాగాయి. దేశ విభజన నాటికి తూర్పు బెంగాల్‌లో కోటికి పైగా హిందువులు ఉన్నారు. దశలుదశలుగా వారు భారత్‌లోకి చొచ్చుకుని వస్తూనే ఉన్నారు. అందువల్లే అసోమ్‌ జాతీయ పౌర పట్టికలో చోటు సంపాదించుకోలేనివారిలో హిందువులే ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితి ఏమిటి? భారత్‌తో పోల్చుకుంటే తన దేశ జనాభాకు ఎటువంటి భరోసా ఇవ్వలేని దీనస్థితిలో ఉందా? అభివృద్ధి అనేది అతి తక్కువగా, అంటే జనాభా వృద్ధిరేటుకు కొంచెం అటుఇటుగా మాత్రమే ఉందా? పొట్ట చేతపట్టుకుని భారత్‌లోకి అక్రమంగా వలస వచ్చేవారి సంఖ్య ఇంకా గణనీయంగానే ఉందా అన్న ప్రశ్నలపై పెద్దయెత్తున చర్చలు జరుగుతున్నాయి. ఆసియా అభివృద్ధి బ్యాంకు, ప్రపంచబ్యాంకు అధ్యయనాలు బంగ్లాదేశ్‌ గురించి ఆశ్చర్యకరమైన విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి.

జర్మనీకి చెందిన మాక్స్‌ వెబర్‌ సుప్రసిద్ధ సామాజికవేత్త. రాజకీయ నాయకుల దగ్గర నుంచి కార్పొరేట్‌ ప్రపంచం వరకు ఆయన అభిప్రాయాలు, సిద్ధాంతాలపై చర్చలు జరుగుతూనే ఉంటాయి. నిజానికి సోషియాలజీలో వెబర్‌కు సరితూగగల స్థాయిని మరో సామాజిక శాస్త్రవేత్తకు విద్యా ప్రపంచం ఇప్పటికీ ఇవ్వలేదు. ఐరోపాలో కొన్ని దేశాలు అభివృద్ధి పథంలో ముందుండటానికి ‘ప్రొటెస్టంట్‌’ నైతిక దృక్పథం గణనీయమైన పాత్ర పోషించిందని, అందువల్లే క్యాపిటలిజం అక్కడ బలపడిందని వెబర్‌ సిద్ధాంతీకరించారు. కష్టపడి పనిచేసే తత్వాన్ని, ప్రయోగశీలతను, వ్యాపార రంగంలో క్రియశీలకంగా పాల్గొనడానికి ఆ నైతిక దృక్పథం దోహదం చేసిందన్నదేవెబర్‌ సిద్ధాంత సారం. వెబర్‌ ఆసియాలోని మతాలనూ లోతుగా అధ్యయనం చేశారు. ఇక్కడి మతాలు క్యాపిటలిజాన్ని ప్రోత్సహించే పాత్రను పోషించలేకపోయాయని, పైపెచ్చు అడ్డంకిగానూ ఉన్నాయని విమర్శించారు. వెబర్‌ అభిప్రాయాలతో ఏకీభవించే, విభేదించేవారిలో మహామహులున్నారు.

ముస్లిములు అధిక సంఖ్యలో ఉన్న దేశాల్లోని పరిస్థితి చూస్తే ఆ సమాజాల్లో మతం పాత్ర ఎంతో కీలకంగా ఉంది. అన్ని రంగాలపై మతాభిప్రాయాలు, వాటి మేరకు రూపొందిన నైతిక నియమాల ప్రభావం గణనీయంగా ఉంది. ముస్లిం మతానికి ఆధునికత అంతగా పొసగదన్న భావం 1990ల తరవాత ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. బంగ్లాదేశ్‌ అనుభవాలను చూస్తే అది నిజమని చెప్పలేం. విద్యారంగంలో ఆ దేశ మహిళలు దూసుకుపోతున్నారు. వయోజన మహిళల్లో అక్షరాస్యత 72.89 శాతం ఉంది. భారత్‌లో ఇది 69.30 శాతమే. బంగ్లా స్త్రీపురుషులతో పోలిస్తే, విద్యాపరంగా మన దగ్గర వ్యత్యాసం ఎక్కువగా ఉంది. అక్కడి పురుషులతో పోలిస్తే మహిళలు మూడు శాతమే వెనకబడి ఉన్నారు. అదే మన దేశంలో ఈ వ్యత్యాసం తొమ్మిది శాతం దాకా ఉంది. శ్రామికశక్తిలో బంగ్లా మహిళల వాటా 36.3 శాతం. భారత మహిళల వాటా 16.8 శాతమే. సంపదను సృష్టించే శ్రామిక రంగంలో పెద్దయెత్తున పాల్గొనడానికి బంగ్లా మహిళలకు మతం ఎలాంటి అడ్డంకి కాలేదు. ఇస్లాం అనగానే సంతానోత్పత్తిపై అడ్డంకులు ఉండవన్న భావన బలంగా ఉంది. జనాభా వృద్ధిరేటు బంగ్లాదేశ్‌లో 1.2 శాతమే. ఇది మన దేశానికి సరిసమానంగానే ఉంది. ఇంకా వేగంగానూ తగ్గే అవకాశం ఉంది. 2000 నుంచి 2018 వరకూ జనాభాను తగ్గించుకునే క్రమంలో భారత్‌తో పోల్చితే బంగ్లాదేశ్‌ ఏ విధంగానూ వెనకబడి లేదు. అయిదేళ్లలోపు మరణించే పిల్లలు ఆ దేశంలోనే తక్కువ. ప్రతి వెయ్యిమంది పిల్లల్లో భారత్‌లో 39 మంది చనిపోతుంటే బంగ్లాలో వారి సంఖ్య 32 మాత్రమే. ప్రజల ఆయుర్దాయంలోనూ ముందుంది. అక్కడ ఆయుర్దాయం 72 ఏళ్లుంటే భారత్‌లో 68 ఏళ్లే. నాణ్యమైన విద్య, ఆరోగ్యం, నైపుణ్య సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించే మానవాభివృద్ధి సూచీలో బంగ్లా 106వ స్థానంలో ఉంటే మనది వెనక 115 స్థానం. రోజుకు 1.90 డాలర్లలోపు ఆదాయం ఆర్జించేవారి సంఖ్య 2016లో బంగ్లాలో 14.8 శాతం. 2011లో భారత్‌లో వారి సంఖ్య 21.2 శాతం.

దీటైన పురోగతి
పారిశ్రామిక రంగంలో ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తే ఆర్థిక వ్యవస్థ పటిష్ఠ పునాదులపై ఉందని భావిస్తాం. స్థూల దేశీయోత్పత్తిలో పారిశ్రామిక రంగం వాటా భారత్‌లో 29.6 శాతం. బంగ్లాలో అది 30.2 శాతం. సేవారంగంలోనూ భారత్‌తో పోటీపడటమే కాదు బంగ్లాదేశ్‌ కొంచెం ముందుంది కూడా. భారత్‌లో సేవారంగం వాటా 54.3 శాతం ఉంటే, బంగ్లాలో అది 56 శాతం. వ్యవసాయం మీద ఆధారపడేవారి సంఖ్య కూడా తక్కువగానే ఉంది. భారత్‌లో 16.1 శాతం సేద్యంపై ఆధారపడగా, బంగ్లాలో అది 13.8గా నమోదైంది. స్థూల దేశీయోత్పత్తి 1995 నుంచి 2018 వరకూ సగటున 5.7 శాతం ఉంది. ఈ ఏడాది బంగ్లా ఎనిమిది శాతం వృద్ధిని సాధిస్తుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు అంచనా వేసింది. భారత్‌ 6.5 శాతానికి పరిమితం కావచ్చన్న అంచనాలున్నాయి.

భారత్‌తో దీటుగా బంగ్లా పురోగమిస్తుంటే పాకిస్థాన్‌ అభివృద్ధి అంతంత మాత్రంగా ఉంది. రెండుచోట్లా మతం ఒక్కటే. సన్నివేశాలు, రాజకీయాలు మాత్రమే భిన్నం. అందుకే మత దృక్పథంతో చూస్తే చాలా విషయాలు అర్థంకావు. పోనీ ప్రకృతి వనరుల పరంగా బంగ్లా ఘనంగా ఉందనీ చెప్పలేం. ఏటా దేశాన్ని వరదలు అల్లకల్లోలం చేస్తాయి. జనసాంద్రతా అధికమే. బంగ్లాలో చదరపు కిలోమీటరుకు 1,116 మంది నివసిస్తుంటే భారత్‌లో 413 మందే ఉన్నారు. అక్షరాస్యత, ఆరోగ్య కార్యక్రమాల్లో మహిళలకు క్రియాశీల భాగస్వామ్యం కల్పించడంలో బంగ్లా ముందడుగు వేసింది. మానవాభివృద్ధి సూచీల్లో దక్షిణాసియాలో అగ్రగామిగా ఉండటానికి భారత్‌ చేయాల్సింది చాలా ఉందని బంగ్లా అనుభవం నేర్పుతోంది. అమర్త్యసేన్‌, జీన్‌డ్రిజ్‌ 2013లోనే ఈ విషయాన్ని స్పష్టీకరించారు. భారత్‌, అమెరికాల్లో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయని అనేక విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ అవార్డు అందుకున్న జోసెఫ్‌ సిగ్లెట్స్‌ అసమానతలపై ఉద్గ్రంథాన్నే రాశారు. బహుశా సాపేక్షంగా తక్కువ అసమానతల వల్ల బంగ్లాలో ఎక్కువమందికి లాభం చేకూరిఉండొచ్చు... మనకూ ఆ దారి తప్పకపోవచ్చు!


- ఎన్‌. రాహుల్‌కుమార్‌
Posted on 15-10-2019