Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

‘డ్రాగన్‌’తో కొత్త దోస్తీ

* భారత్‌-చైనా మధ్య అనధికార చర్చలు

* జాతీయ భద్రత మాజీ సలహాదారు శివశంకర్‌ మేనన్‌తో ఈటీవీ భారత్‌ ముఖాముఖీ

మన పొరుగు దేశమైన చైనాతో సత్సంబంధాలను స్థిరంగా కొనసాగిస్తూ ప్రయోజనాలు పొందాలని జాతీయ భద్రత మాజీ సలహాదారు శివశంకర్‌ మేనన్‌ స్పష్టం చేశారు. ఇరుదేశాలు పరస్పర ప్రయోజనాల్ని పొందేందుకు ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడటం అవసరమన్నారు. ‘ఈటీవీ భారత్‌’ సీనియర్‌ పాత్రికేయురాలు స్మితాశర్మతో ముఖాముఖీలో మేనన్‌ పలు అంశాలపై తన అభిప్రాయాల్ని వెలువరించారు. అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌ వైఖరిని ఎండగట్టడం ఎలాగున్నా, మోదీ సర్కారు దృష్టి మాత్రం ఆర్థిక వ్యవస్థ, వృద్ధిపైనే ఉండాలని సూచించారు. చైనా చేపడుతున్న బెల్ట్‌, రోడ్‌ కార్యక్రమాన్ని (బీఆర్‌ఐ) గుడ్డిగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదన్నారు. మన ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటే ఉపయోగించుకోవడమే మేలని సూచించారు. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సీఈపీ) కూటమిలో భారత్‌ చేరాలని అభిప్రాయపడ్డారు.

ఈటీవీ భారత్‌: భారత, చైనా రెండో అనధికారిక సమావేశాన్ని మీరెలా చూస్తారు?
శివశంకర్‌ మేనన్‌: పలు కారణాలతో కొంతకాలంగా మందగించిన సంబంధాలు మళ్ళీ మామూలు స్థితికి చేరాయనే సందేశాన్ని ఉభయ దేశాలు ప్రపంచానికి అందించదలచుకున్నాయి. పాకిస్థాన్‌తో సంబంధాలు, అధికరణ 370 రద్దుపై ప్రతిస్పందన, ‘భద్రతా మండలి’లో ఈ అంశాన్ని లేవనెత్తడం తదితర అంశాల్లో చైనా వైఖరి- ఇరుదేశాల సంబంధాల్లో కొన్ని సమస్యల్ని సృష్టించాయి. ఈ క్రమంలోనే రెండు దేశాలు తమ సంబంధాలు స్థిరంగా ఉన్నాయనే అంశాన్ని చాటిచెప్పాలని భావించాయి. దేశీయంగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమస్యలున్నాయి. చైనా సైతం తన ఆర్థిక వ్యవస్థ విషయంలో ఆందోళనగా ఉంది. టారిఫ్‌లు తదితర అంశాలపై అమెరికా ఒత్తిళ్లూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల అగ్రనేతలూ కలుసుకోవడం ఉభయ పక్షాల ప్రయోజనాలకూ ఉపయుక్తమేనని చెప్పవచ్చు. ఇరుపక్షాలూ ఆర్థిక సంబంధాలకు సముచిత స్థానం కల్పిస్తాయని భావిస్తున్నాను. రెండు దేశాల సంబంధాలపై సరిహద్దులు, రాజకీయ అంశాల ప్రభావం తక్కువే. జమ్మూకశ్మీర్‌ అంశం చర్చకైనా రాలేదని విదేశాంగ కార్యదర్శి గోఖలే సైతం చెప్పారు కదా. నమ్మడానికి ఇది కొంచెం కష్టమే అయినా, ఆ అంశాన్ని అధికారికంగా చర్చించి ఉండకపోవచ్చు.

ఈటీవీ భారత్‌: పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తమ దేశంలో చేపట్టిన పర్యటన గురించి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ భేటీలో ప్రస్తావించినట్లు విదేశాంగ కార్యదర్శి గోఖలే చెప్పారు కదా! కశ్మీర్‌ ప్రస్తావన లేకుండానే చర్చలు జరిగి ఉంటాయా?
శివశంకర్‌ మేనన్‌: భారత ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య వ్యక్తిగతంగా జరిగిన సంభాషణల్లో ఏం జరిగి ఉంటుందనేది మనకు తెలియదు. ఇద్దరూ కలిసి సుదీర్ఘ సమయం గడిపారు. పూర్తి వివరాలు తెలిసేవరకూ మనమేమీ చెప్పలేం. కాకపోతే, చర్చలు మాత్రం ఉపయుక్తమే.

ఈటీవీ భారత్‌: ప్రస్తుతం భారత్‌కు అతిముఖ్యమైన సవాలు ఉగ్రవాదమేనా?
శివశంకర్‌ మేనన్‌: ఇది నిజంగా ముఖ్యమైన సవాలే. చొరబాట్లు, ఉగ్ర ఘటనల్ని నియంత్రించడంలో గతంలోకన్నా మెరుగైన విజయం సాధించాం. ఈ విషయంలో మనమెంతో నేర్చుకున్నాం. వాజ్‌పేయీ హయాము నుంచి రెండు దశాబ్దాలుగా ఈ సమస్యను ఎదుర్కొనే విషయంలో స్థిరంగా బలమైన అడుగులు వేస్తున్నాం. అయితే, ప్రజల జీవనోపాధి, సంక్షేమం తదితర ఆర్థికాంశాలు కీలకం. ఆర్‌సీఈపీ కూటమిలో ఎలాంటి షరతులపై చేరాలన్న అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఇలాంటి అంశాలే భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ఉగ్రవాదం కాదు... ఉగ్రవాదులను వారి స్థాయికి మించి చూపించాల్సిన అవసరం లేదు.

ఈటీవీ భారత్‌: మోదీ-జిన్‌పింగ్‌ భేటీకి ముందు చైనాలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పర్యటిస్తుండగా కశ్మీర్‌పై చైనా ప్రకటన సానుకూలంగా వచ్చింది? ఈ విషయంలో చైనాను నమ్మొచ్చా?
శివశంకర్‌ మేనన్‌: అంతర్జాతీయ సంబంధాల్లో ఎవరూ ఎవర్నీ నమ్మడానికి లేదు. చైనాతోపాటు ఏ దేశమైనా తమకు ఏది లాభమనే దిశగానే ఆలోచిస్తాయి. ఎవరి ప్రయోజనాల మేరకు వాళ్లు పని చేస్తారు? అందరి అవసరాలూ ఒకేలా ఉంటాయనుకోను. పాక్‌లో జిన్‌పింగ్‌ పర్యటన తరవాత నుంచి ఆ దేశంలో చైనా ఎంతో ఖర్చు పెడుతోంది. ఇమ్రాన్‌ పర్యటన సందర్భంగా చైనా ప్రకటనలోని మర్మం ఏమిటనేది స్పష్టంగా తెలుస్తోంది. ఎవరు ఎవరి వైపు ఉన్నారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జమ్మూకశ్మీర్‌ విషయంలో ప్రస్తుతానికి ఏమీ జరగదు. మిగతా ప్రపంచాన్ని ఎలా నియంత్రించగలమనేదే సమస్య. అమెరికా వైఖరినే పరిశీలిస్తే, నిరుడు పాక్‌పై తీవ్రంగా విరుచుకుపడిన ట్రంప్‌, ఇప్పుడు ఇమ్రాన్‌తో శ్వేతసౌధంలో భేటీ అయ్యారు. పాక్‌తో అవసరం ఉండటం వల్లే పదేపదే మధ్యవర్తిత్వంపై ప్రకటనలు చేస్తున్నారు. పాక్‌ నుంచి ట్రంప్‌ ఏదో ఆశిస్తున్నందువల్లే ఇలాంటి ప్రకటనలు చేశారు. దీన్నిబట్టి చూస్తే- ఇతర దేశాలకు పాక్‌ అవసరం ఉన్నంతకాలం, దాన్ని ఏకాకిని చేయడం కష్టమే.

ఈటీవీ భారత్‌: పాకిస్థాన్‌ను చైనా ఆయుధంగా వాడుకుంటున్నప్పుడు టిబెట్‌, తైవాన్‌, హాంకాంగ్‌ సమస్యల నుంచి భారత్‌ ప్రయోజనాలు పొందలేదా? ఈ అంశాలను భారత్‌ తనకు అనుకూలంగా మార్చుకోలేదా?
శివశంకర్‌ మేనన్‌: ఇక్కడ ఎవరి ప్రయోజనం వారు పొందడం సాధ్యం కాదు. లక్ష్యం కచ్చితంగా ఫలితంగా మారాలి. ఒక వాదనలోనో, చర్చలోనో పైచేయి సాధించడమే మన ప్రయోజనం కాదు. కథనాలు రాసుకోవడానికి ఇది మీడియాకు అద్భుతంగానే ఉంటుంది. ఏ దేశంతో సంబంధమైనా మన అవసరాలు తీర్చేలా ఉండటమే భారత్‌ లక్ష్యం కావాలి. కేవలం ద్వైపాక్షిక సంబంధాలే దేశంలో మార్పులు తీసుకురాలేవు. పౌరుల సంక్షేమం, అభివృద్ధి లాంటివి అంతకన్నా ముఖ్యమైనవి. భారత్‌, చైనా సంబంధాలు బాగుంటే మంచిదే. లేకపోతే ఆర్థిక సంబంధాల కోసమైనా ప్రయత్నించవచ్చు. వాస్తవానికి అవే ఉపయోగపడతాయి. అందుకే మనకు ఏది ముఖ్యమో దానిపైనే దృష్టిపెట్టాలి.

ఈటీవీ భారత్‌: దక్షిణాసియా దేశాల్లో చైనా స్థావరాలను ఏర్పాటు చేసుకుంటుంటే భారత్‌ పరిస్థితి ఏమిటి? బీఆర్‌ఐపై మనదేశం సుస్థిర వైఖరిని కొనసాగించగలదా?
శివశంకర్‌ మేనన్‌: ఈ అంశాలపై మన వైఖరి ఏమిటనేది స్పష్టంగా తెలియదు. బీఆర్‌ఐలో భాగంగా ఆక్రమిత కశ్మీర్‌ ద్వారా నిర్మిస్తున్న సీపీఈసీని భారత్‌ వ్యతిరేకిస్తున్న సంగతి సుస్పష్టం. భారత ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారంపై ప్రభావం చూపడం వల్ల వీటిని నిర్ద్వంద్వంగా వ్యతిరేకించవచ్చు. అవసరమైనచోట బీఆర్‌ఐని ఆహ్వానిస్తూ, మనకు ప్రమాదం పొంచిఉన్నచోట వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. బీఆర్‌ఐలో వేరే ప్రయోజనాలూ ఉన్నాయి. కొలంబోలో చైనా నిర్మించిన నౌకాశ్రయంలో 83 శాతం భారత్‌ వ్యాపారమే జరుగుతుంది. దీనివల్ల చైనా, శ్రీలంక, భారత్‌లకు ఆర్థికంగా లాభదాయకం. వాణిజ్యపరమైన బీఆర్‌ఐ ప్రాజెక్టులను మాత్రమే అనుమతించి ప్రయోజనం పొందాలి. ఇకపోతే... ఉపఖండంలో అణు ఉద్రిక్తతల ముప్పు ఉంటుందనైతే భావించడం లేదు.

ఈటీవీ భారత్‌: ఆర్‌సీఈపీలో భారత్‌ చేరే అంశాన్ని ఎలా చూస్తారు?
శివశంకర్‌ మేనన్‌: చాలాకాలంగా చర్చలు జరుగుతున్నాయి. కోరుకున్నంత కాలం సాధ్యమైనంత స్థాయిలో సంప్రతింపులు జరపవచ్చు. ప్రారంభ సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే, ఏపీఈసీ నాటి పరిస్థితి పునరావృతం అవుతుంది. తనకు అవసరమైనప్పుడే చేరతానంటే ఎవరూ అంగీకరించరు. జపాన్‌, చైనాల మాదిరిగా ఆర్‌సీఈపీ, డబ్ల్యూటీవో అవకాశాలను సమర్థంగా వినియోగించుకోవాలి. బయటి నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లను సంస్కరణల దిశగా సాగేందుకు ఉపయోగించుకోవాలి.


Posted on 17-10-2019