Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

రావణకాష్ఠంలా సిరియా

రెండు మారణకాండల మధ్య విరామమే శాంతిగా, ఆ పాటి ఉపశమనమూ భ్రాంతిగా అట్టుడుకుతున్న సిరియా ఎనిమిదేళ్లుగా నెత్తురోడుతున్న రణస్థలి. అక్కడ నిరంతరం మంటగలుస్తున్న మానవ హక్కుల పరిరక్షణ బాధ్యతను అగ్రరాజ్యం అమెరికా నెత్తికెత్తుకొన్నాక- పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందమైంది! నమ్మితి రామన్నా అంటే నట్టేట ముంచుతా లక్ష్మన్నా అన్నట్లుగా ఉత్తర సిరియా నుంచి అమెరికా బలగాల్ని ఉన్నట్లుండి ఉపసంహరిస్తూ అధ్యక్షుడు ట్రంప్‌ కొన్నాళ్ల క్రితం తీసుకొన్న నిర్ణయం కుర్దుల్ని నిస్సహాయ స్థితిలోకి నెట్టేసింది. అదనుకోసం కాచుకొన్న టర్కీ, కుర్దులపై భీకర దాడులకు తెగబడి భయవిహ్వల వాతావరణం సృష్టించడంతో- సరికొత్త రాజకీయ సమీకరణం ఆవిష్కృతమైంది. ఇటీవలి దాకా అమెరికా దన్నుతో ఎవరిమీద అయితే కుర్దులు పోరాడారో, నేడు తమ అస్తిత్వం కోసం ఆ సిరియా అధినేత అసద్‌తోనే ఒప్పందం కుదుర్చుకొని టర్కీ దాడులను కాచుకోవడానికి రంగం సిద్ధం చేసిన కుర్దుల తీరు నిశ్చేష్టపరుస్తోంది. నరమేధాన్ని ఆపకుంటే, ఆర్థిక ఆంక్షలు విధించి టర్కీ పనిపడతామని హుంకరించిన ట్రంప్‌- అంకారా (టర్కీ రాజధాని) ఆకాంక్షలకు తలొగ్గేలా నెరపిన తెరచాటు ‘రాజీ’కీయం తాత్కాలికంగా అయిదు రోజుల కాల్పుల విరమణకు బాటలుపరచింది. టర్కీ సరిహద్దుల నుంచి కుర్దు తీవ్రవాద దళాలను తొలగించడం, అసలే అంతంత మాత్రంగా ఉన్న తమ ఆర్థికంపై కఠిన ఆంక్షలు విధించరాదనడం కీలకాంశాలుగా అమెరికాతో అంకారా ఒప్పందం కుదిరింది. టర్కీ సరిహద్దుల నుంచి దక్షిణ సిరియా భూభాగంలో దాదాపు 20 మైళ్ల దాకా కుర్దుల సేన సిరియన్‌ ప్రజాస్వామ్య దళాల(ఎస్‌డీఎఫ్‌) ఆనుపానులుండరాదన్న స్వీయ అభిమతాన్ని అమెరికా మన్నించి అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తుండటంతో తాము దిగ్విజయం సాధించామని అంకారా ఆనందిస్తోంది. ఈ ఒప్పందం మానవాళికే మహోదయమని ట్రంప్‌ గొప్పలు చెప్పుకొంటున్నా- ఇస్లామిక్‌ స్టేట్‌ పునరుత్థానం రూపేణా పొంచిఉన్న ముప్పు నడినెత్తిన ఉరుముతోంది!

ఏడు దశాబ్దాల క్రితం ఫ్రాన్స్‌ నుంచి స్వాతంత్య్రం పొందిన సిరియా- కుర్దులు, అర్మీనియన్లు, అసిరియన్లు, క్రైస్తవులు, షియా, సున్నీ జాతుల సమాహారం. రెండున్నర నుంచి నాలుగు కోట్లమంది దాకా ఉండే కుర్దులకు గల విశిష్టత- ప్రత్యేకంగా ఓ దేశమంటూ లేని అతిపెద్ద జాతి కావడం! ఇరాన్‌, టర్కీ, ఇరాక్‌, సిరియా, అర్మీనియాల్లో ప్రధానంగా విస్తరించిన కుర్దుల్లో దాదాపు 17 లక్షలమంది ఉత్తర సిరియాలో ఉంటున్నారు. 2011లో అరబ్‌ వసంతం పేరిట పలు దేశాల్ని చుట్టబెట్టిన జనాందోళన సిరియాను గట్టిగా పట్టి కుదిపేయడమే అంతర్యుద్ధానికి, హింసాగ్నిగుండ ప్రజ్వలనానికి ఆరంభమైంది. అసద్‌ ప్రభుత్వం గద్దె దిగడమే ప్రధాన డిమాండుగా ఎలుగెత్తిన విపక్షంపైనా సిరియా సర్కారు ఉక్కుపాదం మోపడంతో- అరబ్‌ లీగ్‌, ఐరోపా, టర్కీ, అమెరికా, ఇజ్రాయెల్‌ వంటివి ప్రతిపక్షాలకు దన్నుగా నిలిచాయి. ఇరకాటంలో పడిన అసద్‌ ప్రభుత్వానికి ఇరాన్‌ సీనియర్‌ అధికారుల బుద్ధిబలం, వేలకొద్దీ హెజ్బొల్లా గెరిల్లాల భుజబలాలకు తోడు వైమానిక దాడులతో రష్యా అందించిన స్నేహహస్తం ఎంతగానో అక్కరకొచ్చాయి. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అఫ్గాన్‌ వేదికగా అమెరికా, సోవియెట్‌ యూనియన్లు ఆడిన రాజకీయ చదరంగం నాడు కాబూల్‌ను ఎంతగా కకావికలం చేసిందో, నేడు సిరియా పరిస్థితీ అంతే. తమ అంతర్గత వ్యవహారాల్లో పాశ్చాత్య దేశాలు జోక్యం చేసుకొంటే రసాయన ఆయుధాలు ప్రయోగిస్తామని హెచ్చరించిన అసద్‌ అన్నంత పనీ చేసి తన దేశ అభాగ్య పౌరుల్నే అమానుషంగా బలిగొన్నా, సమితి సహా ప్రపంచ దేశాలన్నీ ఆందోళన వ్యక్తీకరణకే పరిమితం కావడం- లజ్జాకర నిర్వాకానికి నిదర్శనమే! అధ్యక్షుడిగా ఒబామా చేసిన తప్పును తాను సరిదిద్దానంటూ ట్రంప్‌ వచ్చే ఎన్నికల దృష్ట్యా ఎన్ని పిల్లిమొగ్గలేసినా, సిరియా రణతంత్ర ఘోష ఇప్పుడప్పుడే సద్దుమణిగేది కాదు!

‘ఇరాన్‌ నుంచి దళాల ఉపసంహరణకు ఒబామా తీసుకొన్న నిర్ణయాన్ని మించి పెనువిపత్తును సృష్టించే వ్యూహం’గా తాజా ట్రంపరితనాన్ని రిపబ్లికన్‌ సెనెటర్‌ లిండ్సే గ్రాహమ్‌ విమర్శించడంలో అనౌచిత్యం ఏమీ లేదు. దీర్ఘకాలంలో ఎదురయ్యే సమస్యల్ని కానకుండా తాత్కాలిక ప్రయోజనకాంక్షతో అమెరికా తీసుకొంటున్న దుందుడుకు నిర్ణయాలవల్లే తీవ్ర సంక్షోభాలు తలెత్తుతున్నాయిప్పుడు! స్వతంత్ర కుర్దు రాజ్యం ఏర్పాటు లక్ష్యంగా ఏర్పాటైన పీకేకే 1984 నుంచి టర్కీలో సాగించిన సాయుధ పోరు 40వేల మందిని బలిగొంది. ఆ పీకేకే దన్నుతోనే సిరియాలో కుర్దుల పార్టీగా పీవైడీ బలపడటం, టర్కీ-సిరియా సరిహద్దుల్లో గట్టిగా పాగా వేసి చొచ్చుకుపోతున్న ఐఎస్‌ ఉగ్రవాదాన్ని నేలమట్టం చెయ్యడానికి అమెరికా కుర్దుల సేన ఎస్‌డీఎఫ్‌కు ఆయుధాలు అందించి మరీ తోడ్పడటం ఇటీవలి చరిత్రే! ఐఎస్‌ను చావుదెబ్బ తీసిన ఎస్‌డీఎఫ్‌ టర్కీ సరిహద్దుల్లో స్వయంపాలన మండళ్లను ఏర్పాటుచేసి అక్కడే వేలకొద్దీ ఐఎస్‌ ఉగ్రవాదుల్ని నిర్బంధించింది. కుర్దులతో అవసరం తీరిపోగా, ‘నాటో’ మిత్రదేశమైన టర్కీ ప్రయోజనాలకు అనుగుణంగా ట్రంప్‌ పావులు కదపడంతో- తన పక్కలో బల్లెంగా మారిన కుర్దు ‘ఉగ్రవాదులపై’ అంకారా బాంబుదాడులతో చెలరేగిపోయింది. తన సరిహద్దుకు ఆవల 50 మైళ్ల దాకా ఎస్‌డీఎఫ్‌ ఆనవాళ్లు లేని ‘బఫర్‌ జోన్‌’ ఉండాలని టర్కీ భావిస్తున్నా- నిర్బంధంలో ఉన్న ఐఎస్‌ భూతాన్ని కుర్దుసేన విడుదల చేసినా, కొత్తగా ఐఎస్‌ జవసత్వాలు పుంజుకొన్నా పరిస్థితేమిటి? అగ్రదేశాల హ్రస్వ దృష్టి రాజకీయాలతోనే ఎన్నో సంక్షోభాలు రావణకాష్ఠాలవుతున్నాయి!


Posted on 19-10-2019