Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

అమెరికా నయవంచన

* కుర్దులపై టర్కీ దండయాత్ర

కుర్దులను అధ్యక్షుడు ట్రంప్‌ నట్టేట ముంచడం అమెరికన్లను తలవంచుకునేట్లు చేసిందని విఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్‌ గ్రహీత పాల్‌ క్రుగ్మన్‌ వాపోయారు. ఈశాన్య సిరియా నుంచి అమెరికన్‌ సేనలను ట్రంప్‌ ఉపసంహరించిన వెంటనే, అక్కడ కుర్దులపై టర్కీ సైన్యం విరుచుకుపడటం చూసి ఆయన అలా స్పందించారు. అసలు అమెరికా నమ్మదగిన మిత్రుడేనా అని ప్రపంచమంతా అనుమానంగా చూస్తోంది. 2001లో న్యూయార్క్‌పై అల్‌ఖైదా దాడితో అఫ్గానిస్థాన్‌, పశ్చిమాసియాల్లో జోక్యం చేసుకున్న అమెరికాకు తరవాత ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా (ఐసిస్‌) నుంచి సవాలు ఎదురైంది. సిరియా, ఇరాక్‌లలో ఐసిస్‌ను చిత్తు చేయడానికి అమెరికాకు కుర్దులు తోడ్పడ్డారు. నేడు అవసరం తీరిపోగానే అమెరికా తమను వెన్నుపోటు పొడిచిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాసియాలో తలదూర్చడం వల్ల ఆర్థికంగా దెబ్బతిన్నామని, వేలాది సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఇక నుంచి ఈ బాధ్యతల నుంచి తప్పుకొంటామని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. ఆ మేరకు ఈశాన్య సిరియాలో మిగిలిన అమెరికన్‌ సైనికులను ఉపసంహరించినా, వెంటనే సౌదీ అరేబియాకు 1,800 మందిని పంపి తన విధానాన్ని తానే ట్రంప్‌ భంగపరచుకున్నారు.

అసలు భయం
సిరియా సంక్షోభంతో తన భూభాగంలోకి తరలివచ్చిన శరణార్థుల భారాన్ని మోయలేక టర్కీ సతమతమవుతోంది. టర్కీ, సిరియా, ఇరాక్‌లలో విస్తరించి ఉన్న కుర్దు ప్రాంతాలతో స్వతంత్ర దేశంగా ఏర్పరచాలన్న డిమాండ్‌ తనకు ఎసరు తెస్తుందని టర్కీ ఆందోళన చెందుతోంది. ఇరాక్‌లో కుర్దు స్వయంపాలిత ప్రాంతం ఏర్పాటుకు అమెరికా సహకరించినందున తన భూభాగంలోనూ అలాంటిదేదో జరుగుతుందేమోనని అది భయపడుతోంది. అందుకే అమెరికా సేనలు నిష్క్రమించిన వెంటనే ఈశాన్య సిరియాలో కుర్దు ప్రాంతాలపై దాడులు ప్రారంభించింది. దీనిపై ట్రంప్‌ మొదట మండిపడినా, కుర్దు ప్రాంతాలపై దాడులను నిలిపేయడానికి టర్కీ అంగీకరించడంతో మెత్తబడ్డారు. కాల్పుల విరమణకు ప్రతిగా టర్కీపై అమెరికా ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయనుంది. ఆ దేశం కోరుకున్నట్లు తన సరిహద్దుల నుంచి కుర్దులు తరలిపోతారు. ఆ విధంగా కుర్దులు మరోసారి మోసపోతారు.

మొదటి ప్రపంచ యుద్ధంలో ఆట్టొమన్‌ సామ్రాజ్యం ఓడిపోగానే బ్రిటన్‌, ఫ్రాన్స్‌ దాన్ని టర్కీ, లెబనాన్‌గా విభజించాయి. ఈ క్రమంలో మూడుకోట్ల కుర్దులు చెల్లాచెదరై టర్కీ, ఇరాన్‌, ఇరాక్‌, సిరియా, ఆర్మేనియాలలో పరాయివాళ్లుగా జీవిస్తున్నారు. ఆగ్నేయ టర్కీలోని కుర్దులు పీకేకే అనే పార్టీ ఛత్రం కింద తమ హక్కుల కోసం పోరాడుతుండగా, ఉత్తర సిరియాలోని కుర్దుల పార్టీ ఎస్‌డీఎఫ్‌ దానికి సహాయం అందిస్తోంది. ఈ రెండూ తన సమగ్రతను దెబ్బతీస్తాయని టర్కీ ఆందోళన చెందుతోంది. సిరియాలో తాను ఏర్పాటు చేయదలచిన సురక్షిత మండలం నుంచి కుర్దులను వెళ్లగొట్టి సిరియన్‌ అరబ్‌ శరణార్థులతో నింపేయాలని ఆ దేశం యోచిస్తోంది.

మరోపక్క ట్రంప్‌ తాజా చర్యలు టర్కీకి అనుకూలిస్తున్నాయి. 2011నాటి సిరియా సంక్షోభం నుంచి దాదాపు 36 లక్షల శరణార్థులు టర్కీకి వచ్చారు. వీరి సంక్షేమానికి ఇంతవరకు 400 కోట్ల డాలర్లు వెచ్చించింది. శరణార్థుల మూలంగా ఆర్థిక, సామాజిక ఒత్తిళ్లు పెరిగిపోతున్నందున సరిహద్దుకు ఆవల సిరియాలో 30 కిలోమీటర్ల దూరం వరకు సురక్షిత మండలాన్ని ఏర్పరచి, శరణార్థులను అక్కడికి పంపాలని టర్కీ నిర్ణయించింది. అమెరికా సైనికులు ఉపసంహరించుకున్న వెంటనే టర్కీ తాననుకున్న సురక్షిత మండలం నుంచి కుర్దులను వెళ్లగొట్టడానికి దాడులు ప్రారంభించింది. కుర్దులు అమెరికా ఒత్తిడితో కాల్పుల విరమణకు అంగీకరించినా, అది ఈశాన్య సిరియాలో రస్‌ అల్‌ ఐన్‌, తాల్‌ అబైయద్‌ పట్టణాలమధ్య ప్రాంతానికి మాత్రమే వర్తిస్తుందన్నారు.

అమెరికా వైదొలగిన దరిమిలా టర్కీ దూకుడును తట్టుకోవడానికి కుర్దులు సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌తో చేతులు కలపక తప్పలేదు. టర్కీ సేనలు ఈశాన్య సిరియాలోకి చొరబడగానే అసద్‌ అక్కడికి తన సేనలను పంపారు. గతంలో అమెరికా సాయంతో ఐసిస్‌ను పారదోలి కుర్దులు స్వాధీనపరచుకున్న ప్రాంతమది. టర్కీ దాడుల నేపథ్యంలో ఇప్పుడక్కడకు సిరియా సేనల రాకను కుర్దులు స్వాగతించారు. టర్కీకి కోరినది కట్టబెట్టిన ట్రంప్‌ సిరియాలో పట్టులేకుండా చేసుకోవడంతో ఇప్పుడక్కడ రష్యా, ఇరాన్‌లకు ఎదురు లేకుండా పోయింది. టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్‌ తాజాగా రష్యాకు దగ్గరవుతున్నారు. కుర్దులతో కాల్పుల విరమణ ముగియగానే, ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో సమావేశం కానున్నారు. ఈలోపు ఈశాన్య సిరియాలో అమెరికన్‌ సైనికులు ఖాళీ చేసిన స్థావరాలకు రష్యన్‌ సైనికులు చేరుకుని మకాం పెట్టారు. టర్కీ, సిరియా సేనల మధ్య ఘర్షణ జరగకుండా వారు చూస్తున్నారు. ఈ రెండు దేశాలకు రష్యా మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నందున ఇకపై అమెరికా, ఐరోపాలకు సిరియాలో ఎలాంటి పాత్ర ఉండదు. నాటో భాగస్వామి అయిన టర్కీ ఇటీవల అమెరికా అభ్యంతరాలను తోసిరాజని రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణులను కొనుగోలు చేసింది. ఇప్పుడు సిరియాలోకి టర్కీ సేనలను పంపినా రష్యా అడ్డుచెప్పకపోవడం వల్ల రెండు దేశాల మధ్య మైత్రీ బంధం బలపడనుంది.

పడగ విప్పనున్న ఐసిస్‌
ఇరాక్‌, సిరియాలలో ఐసిస్‌ను అమెరికన్లు, కుర్దులు దెబ్బ తీసినా అది పూర్తిగా అంతరించలేదు. ఈ రెండు దేశాల్లో ఇప్పటికీ 15,000 నుంచి 30,000 మంది వరకు ఐసిస్‌ ఉగ్రవాదులు ఉన్నట్లు అంచనా. ఈశాన్య సిరియాలో కుర్దులు బంధించిన ఉగ్రవాదులు మరో 11,000 మంది వరకు ఉండవచ్చు. టర్కీ దాడితో కుర్దులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసినందున ఐసిస్‌ ఖైదీలు మళ్ళీ కదన రంగంలోకి దూకడం ఖాయం. సిరియా-ఇరాక్‌లలో కార్యకలాపాలు సాగిస్తున్న సున్నీ ఉగ్రవాద బృందాలలో ఐసిస్‌, అల్‌ఖైదా ప్రముఖమైనవి. ఈ రెండింటికీ కలిపి 50,000 మంది ఉగ్రవాదులు ఉన్నారు. అమెరికా నిష్క్రమణతో వీరు చెలరేగిపోవడం ఖాయం. వీరిని ఎదుర్కోవడానికి ఇరాన్‌ మద్దతు గల షియా సాయుధ బృందాలు బరిలో దిగనున్నాయి. ఇంతకాలం అమెరికా ఉనికి వల్ల ఇవి బాహాటంగా కార్యకలాపాలు సాగించడానికి సందేహించేవి. ట్రంప్‌ పుణ్యమా అని ఇప్పుడు అమెరికా సేనల అడ్డు తొలగిపోయింది. సౌదీ అరేబియాలోని చమురుశుద్ధి కర్మాగారాలపై ఇరాన్‌ అనుకూల శక్తులు డ్రోన్‌ దాడులు జరిపినా ట్రంప్‌ హెచ్చరికలకే పరిమితమయ్యారు. అందువల్ల సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) తదితర అరబ్‌ దేశాలు అమెరికాను నమ్ముకొని తప్పు చేశామా అన్న ఆలోచనలో ఉన్నాయి. ట్రంప్‌ బెదరించినా ఇరాన్‌ లెక్కచేయకుండా ముందుకుసాగుతున్న దృష్ట్యా యూఏఈ ఇకపై ఉద్రిక్తతలు తగ్గించుకుందామని ఇరాన్‌కు సంకేతాలు పంపింది. పశ్చిమాసియాలో తమకు ముప్పు వస్తే అమెరికా ఆదుకుంటుందనే ఆశతో ఆ దేశం నుంచి ఆయుధాలు కొంటూవచ్చిన సౌదీ తదితర సున్నీ అరబ్‌ దేశాలు ఇకపై సైనిక, ఆర్థికపరంగా ప్రత్యామ్నాయాలను చూసుకోవలసి రావచ్చు. అవి ఇప్పటికే రష్యా, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, భారత్‌లతో మైత్రిని బలపరచుకునే పనిలో పడ్డాయి. సౌదీ, యూఏఈ భారత్‌తో ఆర్థిక ఒప్పందాలు కుదుర్చుకుని ఉన్నాయి. సిరియాలోకి సేనలు పంపినందుకు టర్కీని విమర్శించడం ద్వారా సిరియా మన్ననలు భారత్‌ పొందింది. కశ్మీర్‌ సమస్యపై పాకిస్థాన్‌ను టర్కీ సమర్థించినందుకు ప్రతిగా భారత్‌ ఈ పని చేసింది. మున్ముందు రష్యా-ఇరాన్‌-సిరియా కూటమి ప్రాబల్యం విస్తరిస్తే, అది భారత్‌కు ఎంతో లాభం!

- వరప్రసాద్‌
Posted on 22-10-2019