Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

ప్రపంచ శాంతికి పట్టుగొమ్మ

* 75వ ఏట ఐక్యరాజ్య సమితి

శాంతి, సామరస్యం, భద్రత, స్థిరమైన అభివృద్థి, సామాజిక ప్రగతి, ప్రజల జీవనస్థాయిని మెరుగుపరచడం, మానవహక్కులు ప్రాతిపదికగా 51 దేశాలతో ఐరాస ఆవిర్భావం ఓ మహోజ్జ్వల ఘట్టం. 1945 అక్టోబరు 24న పురుడుపోసుకున్న ఈ సంస్థ నేడు 75వ వసంతంలోకి అడుగిడుతోంది. కుల, మత, ప్రాంత, జాతి, భాషా దుర్విచక్షణ అంతం కావాలన్నది ఐరాస ఆశయం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఐరాస ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. విజయాలను, వైఫల్యాలను చవిచూసింది. ప్రపంచదేశాల పార్లమెంట్‌గా పేరొందింది. మానవాళి వికాసమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. యావత్‌ ప్రపంచాన్ని సరిహద్దులు లేని ఒక దేశంగా ఐరాస పరిగణించడం మానవజాతి చరిత్రలో మహత్తర ఘట్టం. నిరక్షరాస్యత, ఆకలి, యుద్ధాలు, లింగవివక్ష, ప్రకృతి విధ్వంసంపై సమరాన్ని ప్రకటించిన ఐరాస అంతర్జాతీయ సమాజానికి ఆశాదీపం వంటిది. నానాజాతి సమితి 1919లో ఆవిర్భవించినప్పుడు అందులో 63 సభ్యదేశాలు ఉండేవి. నేడు ఐరాసలో 193 దేశాలు సభ్యత్వం కలిగిఉన్నాయి. 2011లో కొత్తగా ఏర్పడిన దక్షిణ సూడాన్‌కు సభ్యత్వం లభించింది.

కష్ట కాలంలో అండగా...
ఐరాస భద్రతా మండలి (సెక్యూరిటీ కౌన్సిల్‌)లో 15 దేశాలుంటాయి. వీటిలో అయిదు శాశ్వత సభ్యదేశాలు (అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనా). మిగతా పది దేశాలు రెండేళ్ల కాలపరిమితికి ఎన్నికవుతాయి. భద్రతా మండలిలో ప్రవేశించాలన్న భారత్‌ ఆశ ఇప్పట్లో తీరేలా లేదు. మండలి నిబంధనల్లో ఎటువంటి మార్పులు తేవాలన్నా శాశ్వత సభ్యదేశాల అనుమతి తప్పనిసరి. వీటికి గల ‘వీటో’ అధికారం కారణంగా కొన్ని ప్రతిపాదనలు ముందుకు కదలవు. శాశ్వత సభ్య దేశాలు పలు సందర్భాల్లో ‘వీటో’ అధికారాన్ని సొంత అవసరాలకు వాడుకున్నాయి. ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటీఓ), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ), అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్‌) వంటి 15 విభాగాలు పనిచేస్తున్నాయి. ఇవి వివిధ దేశాల మధ్య వారధిలా వ్యవహరిస్తాయి. అన్ని సంస్కృతులు, భాషలు, భౌగోళిక ప్రాంతాలకు సమప్రాధాన్యం ఇస్తాయి. దేశాల మధ్య స్పర్ధ, చారిత్రక సంఘటనల ప్రభావం వాటి మధ్య యుద్ధాలను ప్రేరేపించవచ్చు. జాతివైరాలు ఎలాగూ ఉంటాయి. ఘర్షణలు, మతయుద్ధాలు, ఉగ్రదాడులు జరుగుతూనే ఉంటాయి. వీటి నివారణకు ఐరాస కీలకపాత్ర పోషిస్తుంది. ఒకదేశం తన పౌరులకు రక్షణ కల్పించలేనప్పుడు ఐరాసనే దిక్కవుతోంది. యెమెన్‌లో నాలుగేళ్లక్రితం ప్రారంభమైన అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్‌ సహాయంతో హౌతి తిరుగుబాటుదారులు దేశ రాజధాని ‘సనా’ నగరంతో సహా చాలా ప్రాంతాన్ని చేజిక్కించుకున్నారు. దీన్ని వ్యతిరేకించే సౌదీ అరేబియా- యెమెన్‌పై వైమానిక దాడులు చేస్తుండటంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడతారని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు పది వేలమంది చనిపోయారు. లక్షలమంది నిరాశ్రయులయ్యారు. సిరియా నుంచి అమెరికా సైనికులను ఉపసంహరించుకోగానే, ఉత్తర సిరియాపై టర్కీ దాడిచేయడంతో ఈ ప్రాంతం నుంచి వేలమంది శరణార్థులు ఇతర ప్రాంతాలకు వచ్చారు. వారికి ఆసరా ఇచ్చేది ఐరాసనే. ఒకదేశం అంటూ లేని కుర్దులను సంహరించడం మానుకొని, సంరక్షించాలని ఐరాస చెప్పడం దాని బాధ్యతను సూచిస్తోంది. సిరియాను వదలి వెళ్లిన కాందిశీకులకు ఐరాస దిక్కయింది.

యుద్ధాలు, కరవుకాటకాలు, జాతుల వైరం, ప్రకృతి విపత్తుల సమయంలోనూ ఐరాస రంగంలోకి దిగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది నిరాశ్రయులకు ఐరాస ఆవాసం కల్పించింది. ఒక ప్రాంతం నుంచి బలవంతంగా తరిమివేసినవారిని, పౌరసత్వం లేనివారిని, నిర్వాసితులకు ఐరాస మరోదేశంలో ఆశ్రయం కల్పించేందుకు కృషి చేస్తుంది. లేదా వారిని వారి దేశానికే పంపే విధంగా, స్థానికులతో కలిసిపోయే విధంగా ప్రయత్నిస్తుంది. ఉత్తమమైన సేవలు అందించేందుకు 1954, 1981ల్లో యూఎన్‌హెచ్‌సీఆర్‌ (యునైటెడ్‌ నేషన్స్‌ హైకమిషన్‌ ఫర్‌ రెఫ్యూజీస్‌- ఐరాస శరణార్థుల సంస్థ)కు నోబెల్‌ బహుమతి లభించింది. రువాండా, వియత్నాం యుద్ధాలు, బంగ్లాదేశ్‌ ఆవిర్భావం, 1960 తరవాత వలస దేశాల తిరోగమనంతో అంతర్యుద్ధాలు వంటి సందర్భాల్లో శరణార్థుల సంఖ్య పెరిగింది. ఐరాస బడ్జెట్‌లో 66 శాతం ఆఫ్రికాలోనే ఖర్చవుతోంది. ఇథియోపియా, సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌, కాంగో, మియన్మార్‌లలో అంతర్యుద్ధాలతో కోట్లాది ప్రజలు నిరాశ్రయులైనప్పుడు రంగంలోకి దిగి ఆశ్రయం కల్పించింది. 80 దేశాల్లో ఎనిమిది కోట్లమందికి ఆహారం అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 45 శాతం ప్రజలను వ్యాధుల బారినుంచి కాపాడేందుకు టీకాలు ఇస్తోంది. ఆరున్నర కోట్ల మంది ప్రజలకు యుద్ధాలు, ప్రమాదాలు, కరవులు, నేరస్థులనుంచి రక్షణ కల్పిస్తోంది. పర్యావరణాన్ని, వాతావరణ మార్పులను ప్రభావితం చేస్తున్న అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. పర్యావరణంపై ప్రజల్లో అవగాహన పెరగడానికి ఐరాస చేపడుతున్న కార్యక్రమాలే ప్రధాన కారణం. శాంతి, అభ్యున్నతి కోరుకునే నాయకులు ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైనప్పుడే ఈ సంస్థ నిర్మాణాత్మక అభివృద్థి సాధించింది. ఐరాస ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన దాగ్‌ హమ్మర్స్‌ క్యోల్డ్‌ (స్వీడన్‌) గొప్ప ఆర్థికవేత్త, దౌత్యవేత్త. కాంగోలో సమస్యలను పరిష్కరించబోయి 1961లో ఆయన విమాన ప్రమాదంలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఐరాస ప్రపంచ ప్రభుత్వంలా పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన సేవలకు నోబెల్‌ శాంతి బహుమతి లభించింది.

ఏటా సెప్టెంబరు నెలలో పదిహేను రోజులపాటు ఐరాస సాధారణ సమావేశాలు జరుగుతాయి. మధ్యలో నాలుగు రోజులపాటు సభ్యదేశాల మధ్య చర్చలు సాగుతాయి. చర్చల ద్వారా చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. వీటిలో సాధారణంగా బ్రెజిల్‌ తొలుత మాట్లాడుతుంది. ఆతిథ్య దేశం అమెరికాది రెండో స్థానం. చర్చల్లో ఎవరెంతసేపు మాట్లాడాలన్న నిబంధన ఉన్నా దీన్ని కచ్చితంగా పాటించడం కష్టం. 1960లో అప్పటి క్యూబా అధ్యక్షుడు ఫిడెల్‌ కాస్ట్రో నాలుగున్నర గంటలపాటు సుదీర్ఘంగా ప్రసంగించారు.

ఆర్థిక ఇబ్బందులతో సతమతం
ఐక్యరాజ్య సమితి సచివాలయంలో 37 వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వందలాది ప్రచురణలను, కరపత్రాలను అత్యున్నత ప్రమాణాలతో ఐరాస ముద్రిస్తుంది. న్యూయార్క్‌ నగరంలోని ప్రధాన కార్యాలయంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కార్యాలయాలు నిర్వహిస్తోంది. ఐరాస 2019వ సంవత్సరానికి 285 కోట్ల డాలర్ల బడ్జెట్‌ అంచనా వేసింది. ప్రతి సభ్యదేశం జనాభా, ఆ దేశ స్థూలఉత్పత్తిని గణించి సభ్యత్వ రుసుమును లెక్కకడతారు. సభ్యదేశం గరిష్ఠంగా రెండు సంవత్సరాల్లో రుసుము చెల్లించాలి. లేకపోతే ఓటుహక్కు కోల్పోతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పుడు కొంత వెసులుబాటు ఉంటుంది. అంతర్యుద్ధంతో సతమతమవుతున్న సిరియా రుసుం చెల్లించలేదు. ఐరాసకు 2017లో 700 కోట్ల డాలర్లు విరాళాలుగా వచ్చాయి. చైనా ఎక్కువగా విరాళాలు ప్రకటిస్తూ తన పలుకుబడిని పెంచుకుంటోంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు ఇటీవల ఐరాస ప్రకటించింది. భారత్‌ సహా 129 దేశాలు తమవంతు సొమ్ము చెల్లించాయి. అమెరికా 38.10 కోట్ల డాలర్ల మేర బకాయీ పడింది. పలు దేశాల నుంచి 138.5 కోట్ల డాలర్లు వసూలు కావాల్సి ఉంది. అమెరికా, బ్రెజిల్‌, అర్జెంటీనా, మెక్సికో, ఇరాన్‌, ఇజ్రాయెల్‌, వెనెజువెలా ఇంకా కొంత మొత్తాలను చెల్లించాల్సి ఉంది.

ఐరాసకు లక్షా పదిహేడువేల సైనికులతో శాంతిసైన్యం ఉంది. దీనికి అనుబంధంగా మరో 20 వేలమంది పనిచేస్తున్నారు. ఈ సైన్యం ఇప్పటివరకు, నాలుగు ఖండాల్లో 15 కార్యక్రమాలను చేపట్టింది. ఎక్కడ అశాంతి నెలకొంటుందో అక్కడకు వెళ్తుంది. బడ్జెట్‌లో ఎక్కువ భాగాన్ని ఐరాస శాంతిసైన్యానికే ఖర్చు పెడుతోంది. యుద్ధబాధితులు, మానవ హక్కులు కోల్పోయినవారు, పేదరికంలో మగ్గుతున్నవారి అభ్యున్నతికి ఐరాస ప్రణాళికలు రచిస్తోంది. యుద్ధాలను నివారించడానికి ప్రధానంగా చర్చలు, దౌత్యమార్గాలను ఎంచుకుంటుంది. అవి విఫలమైనప్పుడే సైన్యాన్ని రంగంలోకి దించుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య పటిష్ఠతకు పాటుపడుతుంది. 69 దేశాల్లో ఎన్నికల నిర్వహణకు సహాయం చేస్తుంది. దేశాల మధ్య సరిహద్దులు అవి ఏర్పాటు చేసుకున్నవే. వసుధైక కుటుంబం అన్న భావనతో దేశాల మధ్య ఐకమత్యం ఏర్పడుతుంది. తద్వారా మానవాళికి మేలు కలుగుతుంది. ఒక దేశం తన పౌరులకు రక్షణ కల్పించలేనప్పుడు, వారి ప్రాథమిక అవసరాలు తీర్చలేనప్పుడు ఐరాస చొరవ తీసుకుంటుంది. విశ్వ మానవాళి మేలుకు, మెరుగైన భవిష్యత్తుకు ఈ సంస్థ పాటుపడుతుంది. ఐరాసను బలోపేతం చేయడం ద్వారానే ప్రపంచశాంతి, సౌభాగ్యం సాకారవుతుంది!

భారత్‌ కీలకపాత్ర
ప్రారంభం నుంచి ఐరాసలో భారత్‌ సభ్యదేశం. ఐరాస ఆశయాలను భారత్‌ సంపూర్ణంగా సమర్థిస్తోంది. అనేక అంతర్జాతీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. భారత్‌ తన వంతు సొమ్మును సకాలంలో చెల్లిస్తోంది. ఇప్పటివరకు రెండున్నర లక్షలమంది భారత సైనికులు 49 దేశాల్లో శాంతి సైనికులుగా పనిచేశారు. ఐరాస కార్యక్రమాల్లో పాల్గొంటున్న భారత సైనికుల ఖర్చు 3.8 కోట్ల డాలర్లు భారత్‌కు ఐరాస చెల్లించాల్సిఉంది. ఏటా జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలన్న భారత్‌ ప్రతిపాదనను ఐరాస అంగీకరించింది. అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తిగా భారత్‌కు చెందిన దల్వీర్‌ భండారి ఎన్నికయ్యారు. దేశ విభజన సందర్భంగా భారత్‌, పాకిస్థాన్‌ మధ్య సరిహద్దును నిర్ణయించడంలో ప్రధానభూమిక పోషించింది. దీన్నే కరాచీ ఒప్పందం అని పిలుస్తారు.

- డాక్టర్‌ పి.వి.రంగనాయకులు
(రచయిత- తిరుమల ఎస్వీ మ్యూజియం మాజీ సంచాలకులు)
Posted on 24-10-2019