Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

సరిహద్దుల్లో శాంతి స్థాపన ఎలా?

* హద్దు మీరుతున్న పాకిస్థాన్‌

భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వద్ద ఈ నెల 20వ తేదీ అత్యంత రక్తం చిందిన రోజుల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ ఘటనలో సైనికులు, పౌరులూ తొమ్మిది మంది మరణించినట్లు ఖాయంగా తెలుస్తోంది. అంతకన్నా ఎక్కువ ప్రాణనష్టమే జరిగినట్లు ఇరుపక్షాలూ ప్రకటించాయి. పాకిస్థాన్‌ పోస్టులను, ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం భారీ స్థాయిలో దెబ్బతీసింది. మన సైనికులు జరిపిన కాల్పులలో ఆరు నుంచి పది మంది దాకా పాకిస్థాన్‌ సైనికులు చనిపోయారని మూడు ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయని భారత సైనికాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రకటించారు. అయితే, పాక్‌ సైనిక మీడియా విభాగం ఎప్పట్లాగే తనకు అలవాటైన రీతిలో భారత ప్రకటనల్ని కొట్టిపారేసింది. తామే తొమ్మిది మంది భారత సైనికుల్ని హతమార్చినట్లు పేర్కొంది.

కాల్పుల విరమణ ఉల్లంఘన ఘటనలు జరిగిన తరవాత ఇరుదేశాల మధ్య ఈ తరహా మాటల యుద్ధం ప్రతిసారీ మామూలే. ఆ వెంటనే, ఇరువైపుల నుంచి ‘ట్విటర్‌’ యుద్ధవీరులు రంగంలోకి దిగి ధ్వంసమైన సైనిక పోస్టుల నకిలీ వీడియోలను ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఈ తరహా ధోరణి ప్రస్తుతం నియంత్రణ రేఖ వద్ద జరుగుతున్న సంఘర్షణకు సంబంధించిన వాస్తవిక పరిస్థితిని మరుగున పడేసే ప్రమాదం ఉంది.

నియంత్రణ రేఖ వెంబడి ఇరుదేశాలు దశాబ్దానికిపైగా తీవ్రస్థాయిలో పరస్పరం కాల్పులకు పాల్పడిన తరవాత- పాకిస్థాన్‌ 2003లో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకారం తెలిపింది. తరవాత పదేళ్లపాటు ప్రశాంతత నెలకొంది. సరిహద్దు ప్రాంతాల్లో నివసించే పౌరులకూ ఉపశమనం దక్కింది. ఇక్కడ పౌరుల గురించి చెప్పుకోవడం ఎందుకంటే, అత్యంత తక్కువగా రక్షణ పొందేదీ, కాల్పుల విరమణ ఉల్లంఘన ఘటనల్లో ఎక్కువగా బాధితులయ్యేదివారే. 2018, మే నెలలో పాకిస్థాన్‌ గుళ్ల వర్షం నుంచి తప్పించుకునేందుకు అర్నియా సెక్టార్‌లో 76 వేలమందికిపైగా గ్రామీణులు తమ కొంపాగోడూ వదిలి వెళ్లిపోయారు. సరిహద్దుకు అవతలి వైపు కూడా ఇదే తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి.

కశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు మెరుగవడం, భారత్‌ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తారనే పేరున్న నవాజ్‌ షరీఫ్‌ ఎన్నికల్లో విజయం సాధించడం వంటి పరిణామాలతో పాకిస్థాన్‌ సైన్యం 2013లో అసౌకర్యానికి లోనైంది. ఇలాంటి పరిస్థితుల్లో సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడటంతోపాటు హీరానగర్‌, సాంబ, జంగ్లోట్‌ శిబిరాల్లో భద్రతా బలగాలపై దాడులకు తెగబడింది. ఈ క్రమంలో, 2014లో భారత్‌లో కొత్త ప్రభుత్వం పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదంపై దృఢమైన, రాజీలేని వైఖరిని ఎంచుకుంది. తదనంతర కాలంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. కాల్పుల విరమణ ఉల్లంఘనల సంఖ్య పెరిగింది. 2012లో 100 దాకా ఉన్న వీటి సంఖ్య 2018కి రెండు వేలకు చేరింది. గత ఏడాది సంఖ్యను 2019 తొలి పది నెలల్లోనే అధిగమించేశారు.

కాల్పుల విరమణ ఉల్లంఘనలు ఎందుకు జరుగుతాయనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ఉగ్రవాదులు చొరబడేలా చేయడానికి రక్షణ కల్పిస్తూ, పాక్‌ బలగాలు భారత పోస్టులపైకి కాల్పులకు దిగుతుంటాయనేది సాధారణంగా అందరూ అంగీకరించిన అభిప్రాయం. నియంత్రణ రేఖ వెంబడి చొరబాట్లకు జరిగిన ప్రయత్నాల కారణంగా ఈ అభిప్రాయం స్థిరపడింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజా వార్షిక నివేదిక ప్రకారం 2014 నుంచి 2018 మధ్య జమ్మూకశ్మీర్‌లోకి 1,461 ఉగ్రవాద చొరబాటు యత్నాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇక్కడ గమనించాల్సిందేమిటంటే, పరస్పర కాల్పులకు కేవలం చొరబాట్లే కారణం కాదు. నియంత్రణ రేఖకు ఇరువైపులా బలగాలు శత్రువులకు తమ బలాన్ని చూపించాలని భావిస్తుంటాయి. ఈ నెల 20న ఇద్దరు సైనికులు అమరులు కావడంతో భారత్‌ జరిపిన ప్రతిదాడి ఘటనే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఇలాంటి ‘కంటికి కన్ను’ ధోరణి తీవ్రస్థాయిలో రెచ్చగొట్టేదిగా కనిపిస్తుంది. కానీ, రక్షణాత్మక వైఖరి నియంత్రణ రేఖ వద్ద మోహరించిన బలగాల స్థైర్యాన్ని, స్ఫూర్తిని నెమ్మదిగా దూరం చేస్తుందన్న సంగతినీ గుర్తించాలి.

ప్రస్తుత హింసావలయం నుంచి బయటపడే మార్గం ఉందా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం సిద్ధాంత పరంగా తేలికే. ఆచరణలో మాత్రం కష్టమనే చెప్పాలి. బంతి కచ్చితంగా పాకిస్థాన్‌ సైన్యం కోర్టులోనే ఉంది. అది చొరబాట్లకు అడ్డుకట్ట వేయగలిగితే, నియంత్రణ రేఖ వెంబడి హింసాత్మక ఘటనలు వాటంతటవే తగ్గిపోతాయి. భారత సైన్యం నుంచి ప్రతి దాడి కాల్పులు సైతం అంతేస్థాయిలో తగ్గుతాయి. ప్రస్తుతానికి పాకిస్థాన్‌ సైన్యానికి ఇలాంటి ఉద్దేశం ఉన్నట్లు కనిపించడం లేదు. కనీసం ఇలాంటి ఆలోచనను పరిగణనలోకి తీసుకునే అవకాశాలు సైతం ఉన్నట్లు లేవు. అసలు... తమ వైపు చొరబాట్లు జరుగుతున్నట్లు అంగీకరించే పరిస్థితే లేనప్పుడు ఇలాంటివాటిని ఆశించలేం. భారత్‌, పాకిస్థాన్‌ సంబంధాలు మరింత అథమస్థాయికి చేరిన నేపథ్యంలో- విశ్వాస పునరుద్ధరణ చర్యల్ని పెంచే దిశగా వ్యవహరించడం, నియంత్రణ రేఖ వెంబడి ప్రశాంత పరిస్థితులను నెలకొల్పే దిశగా ముందడుగు వేయడానికి ఇరువైపులా అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. స్వల్పకాల వ్యవధిలో సరిహద్దుల వెంబడి వాతావరణంలో పెద్దగా మార్పులు వచ్చే అవకాశాలైతే లేవన్నది నమ్మక తప్పని చేదునిజం. ఇప్పుడు సరిహద్దుల్లో తుపాకులు మాత్రమే మాట్లాడే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇరువైపుల నుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలనైనా మానడం మంచిది!

- డీఎస్‌ హుడా
(రచయిత- విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌)
Posted on 25-10-2019