Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

అభివృద్ధి పథం ఆకర్షణీయం

* భారత్‌ ప్రగతి పట్ల మెర్కెల్‌ ఆసక్తి

* నేటి నుంచి భారత్‌లో జర్మనీ ఛాన్స్‌లర్‌ పర్యటన

ఐరోపా దేశాల వ్యాపార వైమనస్యాలు పదేపదే యుద్ధాలకు దారితీయడం జగమెరిగిన చరిత్ర. రెండో ప్రపంచ యుద్ధంలో అపార కష్టనష్టాలను చవిచూశాక శాంతియుత వాతావరణంలో మాత్రమే అందరూ సుఖసంపదలతో విలసిల్లగలుగుతారని ప్రపంచ దేశాలు గ్రహించాయి. రాజకీయ, వాణిజ్య స్పర్థలను చర్చలతో పరిష్కరించుకొంటూ కలిసికట్టుగా ముందుకుసాగడానికి ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్‌ఎఫ్‌), ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) వంటి బహుళపక్ష వేదికలను ఏర్పరచుకున్నాయి. అమెరికా ఈ నిర్మాణాత్మక ప్రక్రియకు మొదటి నుంచీ సారథ్యం వహించినా, డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడైనప్పటి నుంచి నాయకత్వ బాధ్యత నుంచి వైదొలగసాగింది. బ్రిటన్‌ కూడా అదే వరసలో ఐరోపా సమాఖ్య (ఈయూ) గడప బయటకు ఒక కాలు వేసింది. డబ్ల్యూటీఓ వంటి బహుళ పక్ష వేదికల వల్ల చైనా, భారత్‌ వంటి దేశాలే ఎక్కువ లబ్ధి పొందాయని ట్రంప్‌ వాదన. ఈయూలో చేరితే తమకు లాభంకన్నా నష్టమే ఎక్కువని బ్రిటన్‌ భావన. అందుకే రెండు దేశాలు బహుళపక్ష వ్యాపార ఒప్పందాలకు నీళ్లు వదలి వివిధ దేశాలతో నేరుగా ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాపార రథం పంథా మార్చనుంది. మున్ముందు అంతర్జాతీయ వాణిజ్యంలో ఐరోపా సమాఖ్య (ఈయూ), అమెరికా-బ్రిటన్‌, చైనాలు మూడు ధ్రువాలుగా ఆవిర్భవించనున్నాయి. ఈ మూడు ధ్రువాల నుంచి గరిష్ఠ ప్రయోజనాలను సాధించే వ్యూహాన్ని భారత్‌ అవశ్యం అనుసరించాలి.

జర్మనీ కేంద్రిత ఐరోపా
భారతదేశానికి ఈయూ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఈయూలో అత్యధిక వ్యాపారం జర్మనీతోనే జరుపుతోంది. అందుకే జర్మనీ ఛాన్స్‌లర్‌ ఆంగేలా మెర్కెల్‌ నేటి నుంచి మూడు రోజులపాటు భారత్‌లో జరపనున్న పర్యటనకు విశేష ప్రాముఖ్యం ఏర్పడింది. దిల్లీలో రెండు ప్రభుత్వాల మధ్య జరిగే అయిదో ద్వైవార్షిక సంప్రతింపుల్లో పాల్గొననున్న మెర్కెల్‌, భారతదేశ అభివృద్ధి జోరు పట్ల ముగ్ధురాలినయ్యానని ఉద్ఘాటించారు. ప్రపంచంలో అత్యధిక జీడీపీ వృద్ధి రేటును నమోదు చేస్తున్న భారత్‌లో సహజంగానే వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉంటాయని జర్మనీ భావిస్తోంది. ఐరోపాలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీలో 10,000కు పైగా విదేశీ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తూ 20 లక్షలమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అక్కడి మౌలిక వసతులు, పరిశోధన-అభివృద్ధి సౌకర్యాలు, నాలుగో పారిశ్రామిక విప్లవానికి సన్నద్ధ వాతావరణం ఇతర దేశాలను జర్మనీవైపు ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రగతి ధృతి తమను ఆకర్షిస్తోందని మెర్కెల్‌ ప్రకటించడం ఎంతో ఆసక్తికరం. తన పర్యటనలో భారతదేశంతో ఆర్థిక బంధాన్ని పటిష్ఠపరచుకొంటామని మెర్కెల్‌ ఉద్ఘాటించారు. స్మార్ట్‌ నగరాలు, పునరుత్పాదక ఇంధనాలు, ఎలక్ట్రిక్‌ వాహనాల అభివృద్ధిలో కలిసి పనిచేయదలచామని వివరించారు. వాతావరణ రక్షణ, సుస్థిరాభివృద్ధి, భద్రత వంటి అంశాల్లో సహకార వృద్ధికి చర్చలు జరుపుతామని తెలిపారు.

మరోవైపు ఐరోపా సమాఖ్య (ఈయూ) భారతదేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి 2007 నుంచే సంప్రతింపులు జరుపుతోంది. 2013 నుంచి 2019 ఆగస్టు వరకు తొమ్మిదిసార్లు చర్చలు జరిగాయి. వైన్‌, మోటారు వాహనాల ఉత్పత్తి, నిపుణుల వలసపై అంగీకారం కుదరక చర్చలు విఫలమవుతూ వస్తున్నాయి. ఐరోపాలో కార్లను ఉత్పత్తి చేసి ఎకాయెకి భారత విపణికి ఎగుమతి చేయడానికి అనుమతించాలని ఈయూ కోరుతుంటే, భారతదేశం వాటిని తమ దేశంలోనే తయారుచేసి విక్రయించాలని పట్టుబడుతోంది. అలా చేస్తే భారతీయులకు ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయి. ఫ్రాన్స్‌, ఇటలీ వంటి ఈయూ దేశాల నుంచి దిగుమతయ్యే వైన్‌ (ద్రాక్ష సారాయి)పై భారత్‌ ఎక్కువ పన్నులు విధిస్తోందని ఈయూ అభ్యంతరపెడుతుంటే, నిపుణులైన భారతీయ సిబ్బంది ఈయూ దేశాలకు వలస వెళ్లి పని చేసుకునే వెసులుబాటు ఉండాలని భారత్‌ కోరుతోంది. విదేశీయుల వలసలపై నిరసనలను ఎదుర్కొంటున్న ఐరోపా దేశాలు అందుకు సుముఖత కనబరచడం లేదు. ఈయూతో కుదుర్చుకునే ఎఫ్‌టీఏ పెట్టుబడుల వృద్ధి గురించి పట్టించుకోవాలని భారత్‌ కోరుతుంటే, ఈయూ సరుకుల ఎగుమతి దిగుమతుల గురించే మాట్లాడుతోంది. 2020లో బ్రసెల్స్‌లో జరిగే భారత్‌-ఈయూ శిఖరాగ్ర సభలో ఎఫ్‌టీఏపై స్పష్టత రావచ్చు. మరోవైపు చైనా, జపాన్‌, ఆస్ట్రేలియా, ఆసియాన్‌ దేశాలతో సమగ్ర ప్రాంతీయ ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (ఆర్‌సీఈపీ) కుదుర్చుకోవడానికీ భారత్‌ సంప్రతింపులు జరుపుతోంది. 16 దేశాలు సభ్యులుగా ఆవిర్భవించే ఆర్‌సీఈపీ పరిధిలోకి సగం ప్రపంచ జనాభా వస్తుంది. ఏతావతా ఇది ఎఫ్‌టీఏల సీజను అని స్పష్టమవుతోంది.

బ్రెక్సిట్‌ అనంతర పొత్తులు
ఈయూతో కాని, ఆర్‌సీఈపీ దేశాలతో కాని ఎఫ్‌టీఏ ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల భారతీయ పరిశ్రమలు, కార్మికులు దెబ్బతినరాదని భావిస్తూ దిల్లీ ఆచితూచి అడుగులు వేస్తోంది. తమ ఉత్పత్తులకు సంబంధించిన మేధా హక్కులను పరిరక్షించుకోవాలని ఆశిస్తున్న ఈయూ ఔషధ పేటెంట్ల విషయంలో నిక్కచ్చిగా ఉంది. ఐరోపా ఫార్మా కంపెనీలు తయారు చేసే మందులను భారతీయ సంస్థలు అనుకరించి తమ మార్కెట్‌ను దెబ్బతీస్తాయని భయపడుతోంది. ఇంకా ఒకసారి వాడిన కార్ల ఎగుమతులపైన, వ్యవసాయం, సేవా రంగాలపైన ఈయూ డిమాండ్లను భారత్‌ అంగీకరించడం లేదు. భారత్‌లో డేటా భద్రతను ఈయూ ధ్రువీకరించాలని దిల్లీ కోరుతోంది. కానీ, డేటా భద్రత, స్థానికంగా డేటా నిల్వ వంటి అంశాలపై బాగా పట్టింపు ఉన్న ఈయూతో ఒప్పందం కుదరడం అంత తేలిక కాదు. ఈయూకు జర్మనీ ఇరుసు వంటిదే కానీ, బ్రిటన్‌ నిష్క్రమణ తరవాత మిగిలే 27 దేశాలనూ ఒక్క తాటిపై నడిపించగలదా అన్నది చూడాల్సి ఉంది. 2018లో భారత్‌-ఈయూ వాణిజ్యం 9,100 కోట్ల యూరోలైతే, అందులో జర్మనీతో 1,820 కోట్లు, ఫ్రాన్స్‌తో 1,152 కోట్లు, బ్రిటన్‌తో 1,360 కోట్ల యూరోల వ్యాపారం జరిగింది. ఈయూలో ఈ మూడు దేశాలే ప్రధానమైనవి. భారత్‌కు బ్రిటన్‌తో కన్నా జర్మనీతోనే ఎక్కువ వ్యాపారం నడుస్తున్నా, దిల్లీ-లండన్‌ల మధ్య జరిగే ఎగుమతి దిగుమతులకన్నా ప్రవహించే పెట్టుబడులే ఎక్కువ. 2007 నుంచి ఒక్క టాటా గ్రూపే బ్రిటన్‌లో 5,000 కోట్ల పౌండ్ల పెట్టుబడులు పెట్టింది. టాటా గ్రూప్‌ బ్రిటన్‌లో జాగ్వార్‌ కార్లను, ఉక్కునూ ఉత్పత్తి చేస్తుంటే బ్రిటిష్‌ కంపెనీ జేసీబీ భారత్‌లోని ఫరీదాబాద్‌, జైపూర్‌, పుణేలలో మట్టి తవ్వకం యంత్రాలను తయారుచేస్తోంది. ఈయూ-భారత్‌ ఎఫ్‌టీఏ ఎంతకూ ముడివడటం లేదు కనుక, బ్రెక్సిట్‌ తరవాత భారత్‌తో సొంత ఒప్పందం కుదుర్చుకోవాలని లండన్‌ ఉవ్విళ్లూరుతోంది. రెండు దేశాల మధ్య టెక్‌ రంగంలో సహకారం వర్థిల్లే అవకాశాలు పుష్కలం.చివరకు భారత్‌-బ్రిటన్‌ వ్యాపార సంబంధాలు, భారత్‌-ఈయూ వ్యాపార బంధం మీదనే ఆధారపడి ఉంటాయి. బ్రిటన్‌ భారత్‌తోనే కాదు, ఈయూతో కూడా ప్రత్యేకంగా వ్యాపార ఒప్పందం కుదుర్చుకోక తప్పదు. కనుక ఈయూ ప్రమాణాలను అందరూ పాటించవలసిందే. ఉదాహరణకు భారతీయ సరకులు ఈయూ ప్రమాణాలకు తూగకపోతే, వాటిని బ్రిటన్‌ కూడా స్వీకరించకపోవచ్చు.

ఏతావతా 130 కోట్ల జనాభాతో ఎంతో ఆకర్షణీయ విపణిగా నిలుస్తున్న భారత్‌ను ఏ దేశమూ లేక కూటమీ అలక్ష్యం చేయజాలదు. ఓ తాజా అధ్యయనం ప్రకారం 2028 నాటికి బ్రిటన్‌, జర్మనీలలోని ప్రైవేటు వ్యక్తుల వద్దకన్నా భారత్‌లోని ప్రైవేటు వ్యక్తుల వద్దనే రెట్టింపు సంపద పోగుపడుతుంది. ఫైనాన్షియల్‌ సేవలు, సమాచార మాధ్యమాలు, ఐటీ, బిజినెస్‌ ప్రాసెస్‌ ఔట్‌ సోర్సింగ్‌, స్థిరాస్తి, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో భారత్‌ అధిక వృద్ధిరేట్లను నమోదు చేస్తుందని సదరు అధ్యయనం అంచనా వేసింది. ఈ ప్రగతి యజ్ఞంలో తామూ పాలుపంచుకోవాలని జర్మనీ ఛాన్స్‌లర్‌ ఆంగేలా మెర్కెల్‌ ఆశిస్తున్నారు. అందుకే ఏకంగా 12 జర్మన్‌ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో దిల్లీకి విచ్చేస్తున్నారు. కృత్రిమ మేధ నుంచి వ్యవసాయం వరకు సహకార వృద్ధికి భారత ప్రతినిధులతో సంప్రతింపులు జరుపుతారు. రెండు దేశాల మధ్య వివిధ రంగాల్లో 20 ఒప్పందాలు కుదరనున్నాయి. ప్రపంచంలో వ్యాపార సమీకరణలు మారిపోతున్న సందర్భంలో మెర్కెల్‌ భారత యాత్ర విశేష ప్రాముఖ్యం సంతరించుకొంది.

ఈయూతో వాణిజ్య అనుసంధానం
భారత్‌లో ఇప్పటికే 1,700కు పైగా జర్మన్‌ కంపెనీలు వ్యాపారం చేస్తూ దాదాపు నాలుగు లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నాయి. 2000 సంవత్సరం నుంచి భారతదేశంలో భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెడుతున్న దేశాల్లో జర్మనీది ఏడో స్థానం. 2000-2016 మధ్య జర్మనీ ఇక్కడ 900 కోట్ల యూరోల పెట్టుబడులు పెట్టింది. అందుకు దీటుగా జర్మనీలో భారత్‌ పెట్టుబడులు 650 కోట్ల యూరోలకు చేరాయి. జర్మనీలో ఐటీ, ఫార్మా, ఆటోమోటివ్‌, బయోటెక్‌ తదితర రంగాల్లో 200కు పైగా భారతీయ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. జర్మనీ జనాభా ఎనిమిది కోట్లయితే, ఈయూలోని 28 దేశాల్లో 50 కోట్ల జనాభా ఉంది. జర్మనీ ద్వారా ఈ దేశాల మార్కెట్లను అందుకునే వెసులుబాటు భారత్‌కు లభిస్తుంది.


- కైజర్‌ అడపా
Posted on 31-10-2019